2, అక్టోబర్ 2020, శుక్రవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఎనిమిదవ శ్లోక ఉపోద్ఘాతం - మూడవ భాగం


శ్రీవిద్యా సంప్రదాయంలో అన్నీ తానే అయిన ఆ తల్లికి ముఖ్యమైన రూపమొక్కటున్నది. ఆమె ఆబ్రహ్మకీటజనని. ఈ చరాచర సృష్టిజాలానికంతటికీ ఆమె తల్లి. మహాశక్తి అయినప్పటికీ, మనందరం ప్రేమతో, భక్తితో, గౌరవంగా తన ఒడిలో హత్తుకుపోవడానికి వీలుగా అమ్మలందరికన్నా అందమైన పరమ ప్రేమైక రూపమైన ఆకృతిని ధరించింది. సహస్రనామాల్లో మొదటి నామము *శ్రీమాత* . ఆమె మాయగా అవతరిస్తుంది. మనలను సృష్టిస్తుంది. రక్షిస్తుంది. జన్మలమధ్యలో మృత్యువు ప్రసాదించి విశ్రాంతి కలుగజేస్తుంది. తుదకు మాయను ఉపసంహరించి ముక్తిని ప్రసాదిస్తుంది. ఆమెకు బాల, కన్యాకుమారి వంటి అనేక రూపాలున్నాయి. దుష్టులను సంహరించేటప్పుడు దుర్గగా దర్శనమిస్తోంది. కానీ ముఖ్యంగా ఆమె శ్రీమాత. తల్లి ఉన్నప్పుడు తండ్రి ఒకరుండాలి కదా? లోకరీతికి భిన్నమైన దానిని మనమంగీకరించలేం. లోకధర్మాన్నాశ్రయించి అంతటి తల్లికి అంతటి మహోన్నతుడైన భర్తగా కామేశ్వరుని ధర్మపత్నిగా అభివర్ణిస్తున్నాం. శైవంలో శివుడు శక్తితో కూడిన వానిగా వర్ణించినట్లే శ్రీవిద్యాతంత్రంలో అంబిక తన భర్త అయిన కామేశ్వరునితో కూడి ఉన్నట్లు అభివర్ణించబడింది. పరిపూర్ణమైన అఖండమైన బ్రహ్మశక్తికి భర్త ఎవరు ? తాను తప్ప వేరొక స్థితిలేని అంబికకు భర్త ఎలా సాధ్యం ? శాంతుడు, నిర్మలుడు, నిష్క్రియుడు అయిన పరమశివుడే అట్టివాడు. శాంతుడైన ఆయన శక్తి ఆయన భార్య మూలంగా ప్రపంచీకరించబడింది. పంచకృత్యాలకు కారణమయింది.


తైత్తీరియ ఉపనిషత్తు *ఏకం అయిన పరబ్రహ్మ అనేకంగా అవుదామనుకొన్నది* అని చెబుతోంది. శాంతుడైన పరబ్రహ్మ క్రియాశీలుడైనపుదే అతడికి అట్టి కోరిక కలుగుతుంది. ఉపనిషత్తులో *అకామయత* అన్న పదం వాడబడింది. జ్ఞాన శక్తి అంతర్లీనంగా ఉన్న పరబ్రహ్మము తన శక్తిని ఆవిష్కరించి లోక లీల నడపాలనుకొన్నది. దీనిని ఇచ్ఛాశక్తి అంటారు. కోరిక యొక్క శక్తి. ఇక పంచకృత్యలీలలను నడిపేది క్రియాశక్తి. ప్రస్తుతంలో బ్రహ్మ తనంతటతానే బహిర్ముఖమైనపుడు దానికి కోరిక జనించింది. ఉపనిషత్తు దీనిని *కామం* అంటోంది. దీనికి కోరిక అని తప్పుతే వేరే లౌకికార్థమేదీ లేదు. పరిపూర్ణమైన బ్రహ్మనుండి, బ్రహ్మ శక్తినుండి మొట్టమొదటగా తనకన్న భిన్నమైనదేదో ఉన్నట్లు కోర్కె జనించింది. ఆ కామమే కోర్కె అతడి భార్య స్థానాన్ని ఆక్రమించింది. తల్లితండ్రుల కలయిక చేత పుత్రులుద్భవించినట్లు శాంతుడైన పరబ్రహ్మ ఇచ్ఛాశక్తితో కూడటంతో లోకలీల ఆరంభమైంది. పంచకృత్యములు కూడా దాని ఫలితమే. వారిరువురూ భార్యాభర్తలైనారు. అంబిక పరబ్రహ్మ కామాకృతి కాబట్టి ఆమె కామేశ్వరి అయింది.


కామేశ్వరి అన్నది బ్రహ్మ శక్తి మొదటి నామం. ఆ పరబ్రహ్మం తన కోర్కెను ఆవిష్కరించడం తప్పితే వేరే ఏమీ చేయలేదు. కోర్కె కలిగిన అతడు కామేశ్వరుడైనాడు. కామేశ్వరుని ఇచ్ఛను క్రియారూపంలోకి తెచ్చి పంచకృత్య లీలలను జరిపేది కామేశ్వరీ దేవి మాత్రమే. ఆమె విక్టోరియా, ఎలిజబెత్ ల వలె సార్వభౌమమున్న మహారాణి. అన్ని లోకాలకు, అన్ని జీవులకు, దేవతా గణాలకు ఆమె పాలకురాలు. మహారాజు భార్య అవడంచేత మహారాణిగా పిలవబడే రాణి వంటిది కాదీమె. స్వయంగా మహారాణి. లలితా సహస్రనామములలో శ్రీమాతా అన్న నామం తరువాత శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అన్న రెండు నామాలున్నాయి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: