Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 15 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా’
ఇది పదహారు అక్షరముల నామము. మధ్యలో ఆపకుండా పూర్తిగా చదవాలి. తలమీద పెట్టుకునే ఆభరణములు కొన్ని ఉంటాయి. పరిపాలన చేసే అమ్మవారు తలమీద కిరీటము పెట్టుకుంటుంది. పద్మరాగమణులతో ప్రకాశించే కిరీటము పెట్టుకున్నదానా అని అంటున్నారు. పరిపాలన అన్నమాటలో హద్దు నిర్ణయము ఉంటుంది. యజమాని చేత అధికారపు హద్దు చూడబడుతూ ఉంటుంది. ఆ హద్దుదాటితే శిక్షించగలిగిన అంతర్లీన అధికారము ఎక్కడ ఉన్నదో అది కిరీట ధారణ చెయ్యబడినది గుర్తు. కిరీటము పెట్టుకుని కేవలము అధికారము మాత్రమే ఇచ్చి, హద్దు దాటిన వారిని శిక్షించే అధికారము తన దగ్గర పెట్టుకుంటుంది. ప్రపంచ విషయములలో అందరినీ అమ్మవారు ఎలా చూస్తుంది? అంటే రుచిని ప్రధానముగా చెప్పగల నాలుక ఇచ్చింది. రుచిని చెప్పని నాలుకలు ఉండవు. మొదటి స్వరూపము పదార్థము రుచిని తెలుసుకోవడము.
రెండవస్వరూపము భగవంతుని నామములో ఉన్న గొప్పతనమును తెలుసుకోవడము. ఒక మధురపదార్థము తింటే తియ్యగా, ఆవకాయ తింటే కారముగా, నిమ్మకాయ తింటే పుల్లగా ఉన్నదని చెప్పకలిగినప్పుడు రామనామము పలికితే ఎంతోతృప్తిగా ఉంటుందని చెప్పకలిగితే – ‘శ్రీరామ నీనామమెంత రుచిరా’ అనగలుగుతారు. లోకములో అమ్మవారు ఈ రుచి చూడడమన్నది ఆరోగ్యమును జాగర్తగా ఉంచుకోవడానికి పెట్టింది. శరీరమును జాగర్తగా ఉంచుకోవడానికి రుచి తెలుసుకుని అనుభవించగల శక్తిని ఇచ్చింది. పరిధిని దాటి రుచితో తాదాత్మ్యత చెంది ఆరోగ్యమును విస్మరించి అన్నీ తినేస్తారు. విచ్చలవిడిగా ఇంకొకరికి పెట్టకుండా తినేసి అనారోగ్యము వస్తే వైద్యుడి సలహా మేరకు తినడము మానేస్తారు. వారు రుచిని గెలిచారని అనుకోకూడదు. జ్ఞాని వ్యాధితో మమైకము కాడు. అజ్ఞాని వ్యాధితో మమైకము అవుతారు. రసేంద్రియము శరీరపోషణకు ఉపకరణము - హద్దుమీరితే బాధకు కారణము. అధికారము ఇచ్చినవారే హద్దులు దాటినప్పుడు గమనిస్తూ ఉంటారు. అదీ కిరీటము అంటే. అమ్మవారి అనుగ్రహమును ఎంతవరకు వాడుకోవచ్చునో తెలుసుకుని వాడుకోవాలి. ప్రవర్తనకు ఒక నియతి ఉన్నది. అదుపుతప్పి వాడుకుంటే ఉత్తరక్షణములో శిక్షించగలదు. ‘కనత్కోటీరమండితా’ – కిరీటము పెట్టుకున్న ఆవిడ చిత్రముగా ఒక చోట కూర్చుని గుప్తముగా అన్నీ వ్రాస్తూనే ఉంటుంది. ఆవిడే చిత్రగుప్తుడు. మనసుతో ఏమి చేస్తున్నారో, ఎంత నిజాయితీగా ఉన్నారో కూడా తెలుసు.
అమ్మవారు కామము ఇచ్చింది. ధర్మపత్నితో ఉంటే దానిని దోషము అనరు. ‘ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతిచరామి’ అని అగ్నిసాక్షిగా చెప్పటము జరిగింది. వేరొకరియందు కామము ఉండకూడదు. కామమును, నాలుకను హద్దులో వాడుకోవాలి. హద్దు తెలుసుకుంటే ఉద్ధరింపబడతారు లేదా పతనమై పోతారు. ఏదో ఒకరోజు శరీరము జర్జరీభూతమై కాలములో పడిపోతుంది. ఆరోగ్యము భగవదుపాసనకు హేతువుగా శాస్త్రము నిర్ణయించింది తప్ప ఆరోగ్యస్థాయిలో కాదు. అమ్మవారి కిరీటమును బాగా చూడడము వస్తే హద్దు బాగా తెలుస్తుంది. హద్దు తెలుసుకోకుండా ఉన్న ఏ బలాన్ని అయినా దుర్వినియోగము చేస్తే చూసేదానివి అమ్మ చూస్తుంది అన్న భయమును పొందాలి.
అమ్మవారి కిరీటము పద్మరాగమణులతో చేయబడింది. రావణగంగన్న నదిలో సౌగందికములు, కురువిందములు, స్పటికములు అన్నవి దొరుకుతాయి. కురువిందము అనగా ఎర్రటి పద్మరాగమణి. దానిని స్పటికము దగ్గరగా పెట్టినట్లయితే మణికాంతితో స్పటికమును కప్పేస్తుంది. తెల్లనికాంతి ఎరుపుతో కలిసి ఎర్రగా ప్రకాశిస్తుంది. మణి పక్కకు తీస్తే మళ్ళీ తెల్లగా ప్రకాశిస్తుంది. పద్మరాగమణులకు, స్పటికములకు ఒక శక్తి ఉన్నది. ఎర్రగా ఉండే ఈ మణులు అమ్మవారి కిరీటములో ఉన్నాయని తెలుసుకుని మనసులో వాటి పేర్లను తలచుకుంటే ఉత్తరక్షణములో శుభములను, మంగళములను కలిగిస్తాయి. అమ్మవారి పట్లభక్తిని, హరిభక్తిని కలిగిస్తాయి. పురుషరూపములో ఉంటే నారాయణుడు. స్త్రీ రూపములో ఉంటే అమ్మవారు. ఇద్దరూ అలంకారప్రియులు.
సహస్రనామము చదివే భాగ్యము కలిగి కొంతకాలము చదవగా దాని వెనుక ఉన్న రహస్యమును తెలుసుకునే అవకాశమును కృప చేస్తుంది. కిరీటము ధరించిన ఆవిడ చూస్తున్నదని పరిధులు అర్థమవుతాయి. ఒకవిధమైన భయము ఏర్పడి ప్రవర్తన చక్కబడి జాగర్తగా ఉంటారు. భక్తితో పాటు ఆవిడ చెప్పిన మాట అతిక్రమించడమునకు భయము కలుగుతుంది.
‘కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా’ – అన్న నామము నోటితో పలకడము వలన పసుపు పచ్చని బంగారు కిరీటములో ఎర్రటిమణిని పెట్టుకుని ఉన్నదన్న భావనతో మనసులో చూడగలిగితే ఫలితము వస్తుందని అమ్మవారు ఆనాడు వశిన్యాదిదేవతలతో చెప్పించింది.
కిరీటము అధికారములో ఉన్న హద్దులను చెపుతుంది. అమ్మవారి కిరీటమునకు హద్దులు ఉంటాయా? అంతకన్నా గొప్ప కిరీటము ఉన్నదా? అంటే సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు కిరీటదర్శనము గురించి మహోత్కృష్టమైన ప్రయత్నమును చేస్తూ అద్భుతమైన శ్లోకము చెప్పారు.
కిరీటం వైరిఞ్చం పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్భారి మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనమ్
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే ||
అమ్మవారు సింహాసనము మీద కూర్చుని ఉండగా కొంతమంది సేవించడానికి వచ్చి ఆమె ఎదురుగా కూర్చోకుండా మంత్రి సామంతులు పక్కగా కూర్చున్నారు. ఆ సభలోకి ఎంతో మహాపురుషులు అయితే తప్ప వచ్చి ఫలానావారు వస్తున్నారని చెప్పకూడదు. అమ్మవారు సభ నడిపిస్తున్నది. ఆ సభలో లోకములన్నీ సృష్టి చేసే నాలుగుతలల మీద కిరీటములతో చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, దేవతల పరిపాలకుడు ఇంద్రుడు తలమీద కిరీటముతో ఉన్నారు. అంత గొప్పవాళ్ళు అయిన వాళ్ళే అమ్మవారి దగ్గర భయ భక్తులతో కింద కూర్చుని ఉంటే అంతకన్నా గొప్పవాళ్ళు ఉంటారని అనుకోకూడదు. అమ్మవారు సింహాసనము మీద కిరీటము పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు ఎవరు గొప్ప? అంటే కిరీటము బట్టి నిర్ణయము అవ్వాలి.
శ్రీమహారాజ్ఞి అయిన అమ్మవారు సభతీర్చి కూర్చుని ఉన్నసమయములో ఒక ప్రతీహారి వచ్చి ‘భవస్యాభ్యుత్థానే’ - (భవుడు అంటే లోకములన్నీ పోషించ కలిగినవాడు) పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడని చెప్పాడు. అమ్మవారు సింహాసనము మీద నుంచి లేచి గబగబా ఆయనకు ఎదురు వెళ్ళింది. ఈ హడావుడికి సభలోని వారు అమ్మ పాదములకు నమస్కరించడానికి కింద పడిపోయారు. ఆయనను ప్రవేశపెట్టమనకుండా తన పరివారముతో ఆయనకు ఎదురు వెళ్ళింది. అమ్మవారి చెలికత్తెలు ‘కిరీటం వైరిఞ్చం’ -- అమ్మా! ఇవి బ్రహ్మగారి కిరీటము జాగర్త కాళ్ళకు తగులుతుంది అన్నారు. అమ్మవారు మాత్రము కిందకి చూడకుండా వెళ్ళిపోతున్నది. ప్రస్తుతము వరకు అమ్మవారి కిరీటము పెద్దదని శంకరులు చెప్పకనే చెపుతున్నారు. ‘పరిహర పురః కైటభ భిదః’ – ‘అమ్మా! ఇది కైటభుడు అనే రాక్షసుని మర్దించిన మహావిష్ణువు కిరీటము అది చాలా కఠినముగా ఉంటుంది. (స్థితికారుడైన విష్ణువు ధర్మమునకు హాని కలిగితే ముందుగా యుద్ధమునకు వెళ్ళేది ఆయనే. ఆయన కిరీటము మీదకు బాణములు వేస్తారు. మిగిలిన కిరీటముల వలె ఉండదు) అది పల్లవమైన నీ పాదములకు తగులుతుందేమో జాగర్త అని చెపుతున్నారు ఆమె ఆగకుండా దానిని కూడా దాటి వెళ్ళిపోతున్నది. సఖులు నమస్కరిస్తున్న వాళ్ళను పక్కకు తప్పుకోమని చెపుతున్నారు. ‘కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్భారి మకుటమ్’ - ఇంద్రుడి దగ్గరకు వచ్చేసరికి - ‘ఇంద్రా! అమ్మవారు వెడుతున్నది నీ కిరీటము తియ్యి – అది అమ్మవారి పాదములకు తగులుతుందని ఆమెను దానిని దాటి నడవమన్నారు. ఆవిడ సభలోనుంచి హఠాత్తుగా వెడుతుంటే బ్రహ్మాది దేవతలయొక్క కిరీటములు నేలమీద పడి తల్లి పాదములకు ప్రణిపాతము చేస్తున్నాయి. మహారాజ్ఞి ఆజ్ఞల్ని అందరూ శిరసావహిస్తారు తప్ప ఆ కిరీటము వేరొకరి దగ్గర ఒంగేది కాదు. మరి ఎందుకు పరుగెడుతున్నది? అంటే వస్తున్నవాడు భర్త. ఆయన పరిపాలకుడా ! కాదా ! అన్న విషయము పక్కన పెడితే భార్యాభర్తల మధ్య భేదము ఉండదు. ఆవిడ మహాపతివ్రత. అంతస్థితిలో ఉన్నా భర్త వస్తున్నాడనేప్పటికి ఎదురువెళ్ళింది. అంత గొప్ప కిరీటము భర్త ముందు మాత్రమే ఒంగుతున్నది. మిగిలినవి అన్నీ ఆమె పాదముల ముందు ఒంగుతున్నాయి కాబట్టి ఆమె కిరీటమే పెద్దది. ఆ కిరీటములోని పద్మరాగమణులను గురించి నాలుగు మంచిమాటలు అనకలిగితే ఉత్తర క్షణములో భక్తి కలుగుతుంది. పైన ఒకడు చూసేవాడు ఉన్నాడని హద్దు తెలుసుకుని జీవించుట భక్తి. దానికి సాధనము కిరీట దర్శనము.
కిరీటములు చాలా రకములుగా ఉంటాయి. రామచంద్రమూర్త్రి పెట్టుకునే కిరీటము చాలా ఘనముగా ఉంటుంది. ఒక సార్వభౌముడు పెట్టుకునే కిరీటము ఎత్తుగా ఉండి దానిమీద పడగలు మొదలైనవి ఉంటాయి. అమ్మవారు పెట్టుకునే కిరీటము చాలా చమత్కారముగా ఉంటుంది. అమ్మవారి కిరీటమును ఆయన చూసారు కనక ఒక గుర్తు చెపుతున్నారు. ఎప్పుడు ఊహించినా అలాగే ఊహిస్తూ ఉండాలి. బాగా కిరీట ధ్యానము చెయ్య కలిగినవారికి సమీపములో నిలబడి దర్శనము ఇస్తుంది.
సమస్తవిశ్వములు ఆవహించి ఉన్న అమ్మవారికి కిరీటము ఎవరు తయారు చేస్తారు? దానికి మణులు ఎక్కడనుంచి వస్తాయి? ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు ఎర్రటిమణులు. ద్వాదశాదిత్యులు పన్నెండుమంది అమ్మవారి కిరీటములో మణులుగా ఉన్న వాళ్ళ పేర్లు తలచుకుంటే చక్కటి ఆరోగ్యము లభిస్తుంది. అమ్మవారి కిరీటమునకు ఉన్న చంద్రరేఖ గమ్మతుగా శుక్లపక్షములో ఉన్న తదియనాటి చంద్రరేఖ ఆకారములో ఉంటుంది. మిగిలిన వాటికి ఉండదు. అమ్మవారు నవ్వుతూ కూర్చుని ఉన్నది.
ఈ చంద్రబింబము దగ్గర నుంచి అమృతబిందువులు కిందకు పడుతుంటే ద్వాదశాదిత్యులలోనుంచి ఒక కిరణము ఆ బిందువులోకి వెళ్ళింది. వానపడుతున్నది సూర్య ప్రకాశము ఉన్నది. సూర్యకిరణము వానబిందువులోనుంచి వెళ్ళగానే ఆకాశములో ఇంద్రధనుస్సుగా వచ్చి ఏడురంగులుగా విడిపోతుంది. అలాగే చంద్రునినుంచి పడుతున్న సుధాబిందువు మీద సూర్యకిరణము పడగానే ఎటునుంచి పడినా చుట్టూ ఆదిత్యులు ఉన్నారు కాబట్టి అమ్మవారి కిరీటము మీద ఇంద్రధనుస్సు వస్తుంది. ఏడురంగుల కింద విడి ధ్యానములో ఆ ఇంద్రధనుస్సు కనపడాలి. ఈ చంద్రరేఖ, దానినుండి పడుతున్న సుధాబిందువు, సూర్యకిరణము అలా వెళ్ళడము, అందులోనుంచి ఇంద్రధనుస్సు పడడము జరిగింది అంటే బాగా ధ్యానము చేసినట్లు గుర్తు ఆ నామము పలికి ఇలా ధ్యానములో దృగ్గోచరమయిందో వారు ఆ క్షణములోనే సార్థకత పొందారు. ఒక కిరీటము ఎంతోస్థాయిలో ప్రయోజనమును తీసుకుని వచ్చింది.
ఇంకొక రహస్యము ఉన్నది. అమ్మవారి కిరీటము గురించి ఏమీ తెలియని వారికి కూడా దర్శనము అవుతుంది. కార్తీకమాసములో కృష్ణపక్షములో వచ్చే చతుర్దశినాడు అమ్మవారి కిరీటము ఆకాశములో కనపడుతుంది. ఆ చతుర్ధశిని రూపచతుర్దశి, కృష్ణచతుర్దశని పిలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పట్టుకోగలిగినవారు ధన్యులు. సూర్యచంద్రులు ఇద్దరూ ఒక రాశి చక్రములో ఎప్పుడూ అమావాస్యనాడు ఒక డిగ్రీ దగ్గరే ఉంటారు.
మూకశంకరులు అమ్మా! నువ్వు నల్లకలువలు చేసిన తపస్సుకి ఫలితమా! అన్నట్టు ఉన్నావని అన్నారు. కలువపువ్వులు చంద్రుడు ప్రకాశిస్తే తప్పవిచ్చుకోవు. కామాక్షి అమ్మవారి కిరీటము మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ కారణము చేత కలువలు ఎప్పుడు కామాక్షి దర్శనము కోసము తపస్సు చేస్తాయన్నారు. చంద్రకాంతికి విచ్చుకునే కలువపువ్వు సూర్యుడి కాంతికి ముడుచుకుంటుంది. అమ్మవారి కిరీటముమీద సూర్యుడు ఉన్నాడు. అమ్మ అనుగ్రహముతో సూర్యుని వలన ఇబ్బంది పొందవు. నీ కిరీటము ధ్యానము చేసిన పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తిని పొందింది. నువ్వు పర్వతరాజైన హిమవంతుడి ఇంటిలో పుట్టి, సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వము పొందిన మణిదీపానివి. సూర్య చంద్రులను కిరీటములో పెట్టుకుని ఉన్నకుమార్తెను చూసి ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నాడో అంటూ –
ధరణి మయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం
అంబుమయీం అంబా మనుకంపమాది మామిచ్ఛే ఆదిమ జననీ ||
అమ్మా! నీ తండ్రి ఒక పర్వతము. ఈ భూమి అంతా నువ్వే తల్లీ. నువ్వే అన్నీ నువ్వే అయి ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వమును పొంది కిరీటమును పెట్టుకున్నావు అన్నారు. అమ్మవారి కిరీటమును చూసి ఎందరో మహానుభావులు బహువిధములుగా కీర్తన చేసారు.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి