15, ఆగస్టు 2024, గురువారం

ముసలితనం

 *ఏది ముసలితనం? ఎవరు వృద్ధులు?*

🌟🥰🌷 🌷🪷🌷 🌷🥰🌟


*వార్ధక్యం వయసా నాస్తి* *మనసా నైవ తద్భవేత్‌* *సంతతోద్యమ శీలస్య* *నాస్తి వార్ధక్య పీడనమ్‌*


*ముసలితనం వయసులో లేదు, వయస్సుతో రాదు. మనస్సులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం.*


*ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారం తో వచ్చేది శారీరకం, దుఃఖం వల్ల వచ్చేది భావజం.


 వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.*


 *70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. 


శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా... బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు.*


*" కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది " 


మానసిక వృద్ధాప్యం అంటే... ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు.*


*‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు.*


*నిత్యవ్యాయామం,


 యోగాభ్యాసం,


 సద్గ్రంథ పఠనం,


 సతతక్రియాశీలత, మితాహారం,


 హితాహారం, 


మంచి మాటలు 


ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.*

 🙏🙏🙏 🙏🙇🏻‍♂️🙏 🙏🙏🙏

Panchaag


 

దేవాలయాలు - పూజలు 11*

 *దేవాలయాలు - పూజలు 11*




హైందవ ధర్మం దేవుడిని మూర్తులకు, ప్రతిమలకు మరియు చిత్రాలకు మాత్రమే పరిమితం చేయదు. 

కాని, ఆరాధనకు ఒక మాధ్యమాన్ని అందించే పవిత్ర చిహ్నాలు మూర్తులు, *అర్చామూర్తులు* ప్రతిమలు, విగ్రహాలు, చిత్రాలు. ఈ చిహ్నాలు మన *భౌతిక నేత్రాలతో దైవ స్వభావాన్ని గూర్చి ఆలోచించడానికి మరియు అర్థం చేసుకోవడానికి శక్తివంతమైన సాధనాలుగా ఉపకరిస్తాయి*.


 *దేవాలయాలలో స్వయంభూ కొన్ని, మరికొన్ని  మహానుభావులచే ప్రాణ ప్రతిష్ట చేయబడినవి*.  కొన్ని సార్లు పూజా సమయాలలో నిశ్శబ్ధ బీజాక్షరాలను, మన్త్రాలను, స్తుతులను, శ్లోకాలను గూడా అనుసంధానించడం అవసరమవుతుంది. అది ఆ అక్షర,శబ్ద,ధ్వని తరంగ  సాంకేతిక నిర్మాణ శక్తి రహస్యం.


దేవాలయాలలో గాని గృహంలో గాని ఏ దేవతకు/దేవీకి ఉపచారము (పూజ)చేస్తారో , ఆ దైవం స్తుతి (శక్తి రహస్యాల్ని కీర్తన)గావించడం సర్వ సాధారణం. కొంత మంది అర్చక స్వాములు పురుష సూక్తం నుండి ఒక ఒక  ఋక్కు  చదివి, వెంటనే 

ఆ మూల మూర్తి శ్లోకం అందుకుంటారు... 

ఈ ఆచారాన్ని *పురుష సూక్త విధానేన* షోడశోపచారపూజ అని వ్యవహరిస్తూ ఉంటారు.


దేవీ, దేవతా పూజలలో తీర్థ ప్రసాదాలకు గణనీయమైన ప్రాముఖ్యత ఉన్నది. తీర్థాలలో నాలుగు రకాలు. 1) పంచామృత అభిషేక తీర్థం. 

2) పానక నివేదిత తీర్థం 

3) జల తీర్థం

4) కషాయ తీర్థం. 


వివరాలు.

1) *పంచామృత అభిషేక తీర్థం* వలన అన్ని పనులు సునాయాసంగా, సంపూర్తిగా నెరవేరుతాయి. మరియు బ్రహ్మ (పుణ్య) లోక ప్రాప్తి.

2) *పానక తీర్థం*  గుడ ( బెల్లము) యుక్త జల తీర్థమే  పానక తీర్థము. ఈ తీర్థము ముఖ్యంగా శ్రీ నరసింహ స్వామి దేవాలయాలలో ఆనవాయితీగా ఉంటుంది. ఈ తీర్థము వలన జ్ఞాపక శక్తి వృద్ది, నీరస శమనము, నూతన ఉత్సాహం మరియు మధు మేహ నివారిణి ఫలితాలను అందజేస్తుంది.

3) *జల తీర్థం* సుగంధ ద్రవ్యాలు మరియు తులసి దళ యుక్త తీర్థమే జల తీర్థం. సర్వ రోగ నివారిణి, కష్ట మరియు దుఃఖోప శాంతి, అప మృత్యు హరణం.

4) *కషాయ తీర్థం* ఈ తీర్థ వివరాలు సాధారణంగా అందుబాటులో ఉండవు. అర్చక స్వాములు మాత్రమే ఎరుగుదురు. ఈ తీర్థము రాత్రిపూట జరుగు పూజలలో సేవించబడుతుంది. ప్రత్యేకంగా అస్సాం రాష్ట్రంలోని 

*కామాఖ్య దేవాలయం*, కొల్లాపురం (మహారాష్ర్ట) లోని

 *శ్రీ మహా లక్ష్మీ దేవాలయము* 

హిమాచల్ ప్రదేశ్ లోని *జ్వాలా మాలిని* దేవాలయము మరియు కొల్లూరు (ఆంధ్ర ప్రదేశ్) లోని *మూకాంబికా దేవాలయము* ల లోనూ తప్పనిసరిగా ఈ తీర్థము తప్పనిసరిగా భక్తులకు ఇస్తారు.  ఈ తీర్థము సర్వ ఆరోగ్యం, శుభాలను ప్రసాదిస్తుంది.


ధన్యవాదములు.

*(సశేషము)*

దేవాలయాలు - పూజలు 10*

 *దేవాలయాలు - పూజలు 10*




*ఉషోదయ కాలంలోనే అర్చక స్వాముల వారు ప్రాతః సంధ్య పూజకై దేవాలయ ప్రవేశం చేసి గణేశ ప్రార్థన శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే*


 పఠన అనంతరము , 

మూల మూర్తి *శుద్ధికై* స్వామి వారిపై జలము చిలకరిస్తూ

 *ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా, యఃస్మరేత్ పుండరీకాక్షం, సబాహ్యఅభ్యంతర శుచిః, పుండరీకాక్ష నమః, పుండరీకాక్ష నమః, పుండరీ కాక్షాయ నమః*.


ఆ తదుపరి గర్భాలయ శుద్ధిలో భాగంగా దిగువ మంత్రం చదువుతూ..


 *ఉత్తిష్టంతు భూత పిశాచాః, ఏతే భూమి భారకా:, ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే*.  


అర్చక స్వాముల వారు కొన్ని అక్షతలు వాసన చూస్తూ వెనుకవైపు వేసుకుంటారు.

 పై మంత్రాన్ని జపిస్తూ అర్చక స్వాముల వారు ఈ భూమికి భారమైన భూత, పిశాచ గణాలను ఈ స్థలము వదిలి వెళ్ళండి అని కోరుతూ భగవంతుడికి జయము పలుకుతాడు.


ఆ తదనంతరము ఏక హారతి వెలిగించి సంకల్పం చెబుతారు. *మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం* అంటూ ఆ దేవాలయపు మూల మూర్తిని స్మరిస్తారు/ సంబోధిస్తారు. ఈ ప్రక్రియ కొనసాగిస్తూ యుగ,కాల సమయములను సంకల్పిస్తారు / స్మరిస్తారు.


 *శుభే శోభన ముహూర్తే,* 

శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే,

శ్రీ శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భారత వర్షే, భరత ఖండే (పూజాదికాలు నిర్వహించే వారు ఏప్రదేశంలో/ఎక్కడుంటే ఆ ఖండము పేరు ఉచ్చరిస్తారు), మేరో దక్షిణ దిగ్బాగే (ఏ నది దగ్గర ఉంటే ఆ నది పేరు పలకుతారు), 

శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే 

(శ్రీ శైలానికి ఏ వైపు ఉంటే ఆ దిక్కు పేరు చెప్పాలి, ప్రదేశాన్ని బట్టి దిక్కులు మారుతూ ఉంటాయి). 

భగవత్ భాగవతాచార్య సన్నిధౌ....

అస్మిన్ వర్తమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ధక్షిణాయనే, .......ఋతౌ, ......మాసే, ......పక్షే, ........ తథౌ, ...వాసరా వాసరస్తు .....వాసరే,..... నక్షత్రే ...శుభయోగే...శుభకరణే...ఏవంగుణ విశేషణ విశిష్ఠాయం....... తిథౌ.


*ఆ రోజును పురస్కరించుకుని తిథి, వార, నక్షత్రాల వివరాలు చెప్పాలి*.



భగవత్ ఆజ్జయా భగవత్ కైంకర్యార్థం భగవత్ ప్రీత్యర్థం , ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివారణార్థం, లోకకళ్యాణార్థం. .... శ్రీ....స్వామి ప్రాతఃకాల/ సాయంకాల ఆరాధనం కరిష్యే...అని సంకల్పించి...


ఆ తదుపరి అర్చక స్వాముల వారు మిగతా పూజాదికాలను యధాతతంగా జరుపుతారు.


*ఒక ముఖ్య గమనిక*

అర్చక స్వాముల వారు ప్రాతః కాలంలో ఆ దేవాలయపు అధి దేవతకు *సుప్రభాత సేవల లగాయతు*, ఆ దినపు సేవల ముగింపు సమయాన భగవంతుడు సెద దీరుటకు *స్వస్తి వచనములు పల్కు వరకు* అర్చక స్వాములు ఆ దేవాలయంలో *బ్రహ్మ స్థానంలో* ఉంటారు. కావున దర్శకులు, భక్తులు, యాజమాన్య సిబ్బంది, ఇతరులు ఎవరైనా అర్చక స్వాముల పట్ల అనుచితంగా, దురుసుగా, అసహనంగా, విమర్శలు మరియు వేళా కోళాలు చేయరాదు. ఇది సనాతన ధర్మ నియమము.


 ఏవైనా సూచనలు, సలహాలు మరియు అభ్యర్థనలు ఉంటే సవినయంగా మనవి చేయవలసి ఉంటుంది. 


*సర్వులకు విదితమే నిత్యాగ్ని హోత్రులు, నిరంతర పూజా దురంధురులను మినహాయిస్తే, సాధారణ ప్రజలకు అర్చక స్వాముల వారు భక్తులకు మరియు భగవంతునకు అనుసంధాన కర్త అని*.


ధన్యవాదములు.

*(సశేషం)*

కళల వలన ప్రయోజనం

 

కళల వలన  ప్రయోజనం

 విద్య అంటే మనం పాఠశాలల్లోనో లేక కళాశాలల్లోనో చదువుకునే చదువే కాదు మనం తెలుసుకునే ప్రతి జ్ఞ్యానం కూడా విద్యయేకొన్ని సందర్భాలలో మనం చిన్నతనంలో సరదాగా నేర్చుకునే కళలు కూడా కొన్ని సందర్భాలలో మన ప్రాణాలను కాపాడవచ్చుఅటువంటిదే ఒక యదార్ధ సంఘటన నాకు ఇంటర్నెట్లో దొరికిందిఅది మీతో పంచుకుంటున్నాను.

కేరళ నుంచి ఒక మిత్ర బృందం అస్సాం అందాలు చూడాలని బయలుదేరి వెళ్ళారు. చాలాచోట్ల తిరిగారు. ఒక కొత్త ప్రదేశం చూడాలని అక్కడివారి సాయంతో జీప్ లో బయలుదేరి వెళ్ళారు, చూడవలసినవి చూసి వస్తున్నారు ఘాట్ రోడ్ లో. హటాత్తుగా ఏనుగుల గుంపు కనిపించింది, ఏం చేయడానికి తోచక జీప్ ఆపుకుని కూచున్నారు. కొందరు జీపు దిగారు. ఒక పక్క లోయ, మరో పక్క ఎత్తైన కొండ. లోయ పక్క దట్టమైన చెట్లు. ఒక ఏనుగు జీపుని లోయలోకి తోసేసింది. ఎవరికి తోచింది వారు చేశారు, జీప్ నుంచి దూకినవారు, పరుగెట్టి వెనక్కిపారిపోయినవారు, ఇలా చెట్టుకొకరు పుట్టకొకరు ఐపోయారు. ఒకతను జీప్ లో ఉండిపోయాడు, జీప్ ని తోయడంలో బయటపడి లోయలో పడిపోయాడు, చివరికి జారి లోయ కిందికి చేరిపోయాడు.స్పృహ తప్పిపోయాడు జీపు చెట్లలో చిక్కుకుపోయింది. .

 రాత్రి పడింది, పైవాళ్ళు ఏనుగులు వెళ్ళిన తరవాత ఒక్కొకరూ చేరేరొకచోటికి, అందరూ చేరారు కాని లోయలో పడినవాడు కనపడలేదు, వెతికినా! లోయలో పడిపోయి ఉంటాడనుకున్నారు, కేకలేశారు, కిందవాడికా కేక అందలేదు,స్పృహ తప్పిపోయాడు. ఉదయం చూద్దామని ముందుకెళ్ళిపోయింది మిత్ర బృందం చాలా సేపు వెతికి వేసారిమర్నాడు ప్రమాదం జరిగిన చోట వెతికారు,ప్రయోజనం లేకపోయింది, జీప్ ను పైకి లాక్కుని వెళిపోయారు.. పోలీస్ కి ఫిర్యాదిచ్చి వెనక్కి పోయారు, ఆచూకీ దొరకలేదని.

లోయలో పడినవాడికి కొంతకాలానికి తెలివొచ్చింది. కేకలేశాడు, పైకి ఎక్కడానికి ప్రయత్నమూ చేశాడు, విఫలమయ్యాడు. దారి ఉపయోగించేవారు తక్కువ కావడంతో ప్రయోజనం లేకపోయింది. ఏంచెయ్యాలి? కడుపులో కాలుతోంది, మరికొంత దూరం కాలు సారిస్తే కొన్ని పళ్ళు దొరికాయి,తిన్నాడు, సెలయేరు కనపడితే నీరుతాగాడు. ఆకలి దప్పికలు తీరాయి, తరవాతకీ భయం లేకపోవడంతో పైకి చేరుకునే మార్గం గురించి ఆలోచన మొదలు పెట్టేడు. ఏం చేయాలో తోచలేదు. అలా తిరుగుతుండగా వెదురుపొద కనపడింది. వెదురు కర్రని సాధ్యం చేసి, ఉన్న రాళ్ళ తో ఒక వేణువును తయారు చేశాడు. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న వేణువును పలికించడం ప్రారంభించాడు. అదే ఒక తపస్సు అయి వేణువును పలికించడమే పరమావధిగా చేసుకున్నాడు.

ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక సైనికాధికారి రోడ్ పోతూ వేణుగానాన్ని విన్నాడు, జీప్ ఆపించి పరిశీలించమన్నాడు. ఎవరూ కనపడలేదు, కేకలకి ప్రతి స్పందించలేదుఅధికారి లాభం లేదనుకుని మరలిపోయాడు. మరునాడు మళ్ళీ వేణుగానం విన్నాడు, ఆచోటిలోనే. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలం బయలుదేరి, కొంతమంది సైనికులతో, తాళ్ళు తదితర సామగ్రితో వచ్చి లోయలోకి దిగి వేణుగానం వైపుసాగారు. అక్కడ ఇతను కనపడ్డాడు. లోయలో ఉన్నావాని భాష సైనికులకురాదు, సైనికుల భాష లోయలోనివానికి తెలియదు. మొత్తానికి అతన్ని తీసుకుని పైకొచ్చారు. అధికారిదీ అదే వ్యధ, లోయలో పడినవానికి మరో భాష రాదు. విదేశీయుడా? గూఢచారా? అనేక అనుమానాల మధ్య అతన్ని సైనిక కేంద్రానికి తీసుకొస్తే అతను మాటాడుతున్న భాష మలయాలం అని తెలిసి, సైనికులలో మలయాలం తెలిసినవారితో మాటాడించి అతని చరిత్ర తెలుసుకున్నారు.

లోయలో పడినవాని మురళీ వాయిద్యానికి అధికారి ముగ్ధుడయాడు. ఒక సభ చేసి ఇతనిచే వేణుగానం చేయించి విన్నారు. అందరూ ఆనంద పరవశులయ్యారు. ఎవరిమటుకువారు అతనికి కొంత సొమ్మిచ్చారు, అప్పటికప్పుడు, అక్కడికక్కడ. అధికారి ఇతని క్షేమసమాచారం అతని ఇంటికి చేరేశారు, తొందరలో తిరిగొస్తున్నట్టూ టెలిగ్రాం లిచ్చారు. ఇతని చేత మరికొన్ని కచేరీలు చేయించి ఇతోధికంగా సత్కరించి, రైలెక్కించి, తడికళ్ళతో వీడ్కోలు పలికారు. కథ శుభాంతం అయింది.

చూసారా చిన్న చిన్న విషయాలు ఎలా పెద్ద సహాయకారిగా అవుతాయో కదామనం చిన్నప్పుడు నేర్చుకునే చెట్లు ఎక్కటం, ఈతకొట్టటం, వేగంగా పరిగెత్తటం, చేతులు నోటి ముందుపెట్టుకుని పెద్దగాఅరవటం, తదితర విషయాలు మనకు జీవితంలో ఎప్పుడో ఒక్కప్పుడు అవసరానికి ఉపయోగపడవచ్చు. చిన్నతనంలో పిల్లలు వారి వారి అభిరుచులను పట్టి ఎన్నో కళలు నేర్చుకుంటారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ప్రస్తుతం బాల్యం నాలుగు గోడలమధ్యన సెల్పోను తోటి గడుస్తుందిపిల్లలలో సృజనాత్మకత అభివృద్ధి కావటంలేదు, మానవసంబందాలు ఏర్పడటంలేదు. ఇది ఇట్లావుండగా పిల్లలకు తలకు మించిన భారంగా పుస్తకాలు, పాఠశాలల, కళాశాలల మధ్య పోటీతో పిల్లలను బలిచేస్తున్నారుతల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు రావాలనే తాపత్రయంతో వారి సంతోషాలను, ఆనందాలను బాలి తీసుకుంటున్నారు. మన పిల్లలను రోలులో ఒక గంట అయినా బయట తోటి పిల్లలతో ఆడుకునేటందుకు ప్రోత్సహించాలిఆదివారాలు, శలవుదినాలలో పిల్లలతో కలిసి సినిమాలకు, చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడటానికి అనుమతించి వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందటానికి తోడ్పడాలి. కొన్నిసందర్భాలలో అనిపిస్తుంది పిల్లలను అతి ప్రేమగా చూడటం వారి అభివృద్ధికి గొడ్డలి పెట్టు అవుతుందనిపిస్తుంది

మీ 

భార్గవ శర్మ