🌹 *రామాయణానుభవం_ 113*
*తతోరావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః*
*ఇయేష పదమన్వేష్టుం। చారణా చరితేపథి* .
జాంబవంతుని ద్వారా స్తోత్రము చేయబడి, వానరులందరికి తన సామర్ధ్యాన్ని వివరించిన తరువాత శత్రుహంత అయిన హనుమచారణులనే దేవగాయకులు సంచరించే ఆకాశమార్గం ద్వారా వెళ్లి రావణుని చేత అపహరింపబడి, నిర్బంధింపబడిన సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకాలని సంకల్పించాడు.
*దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః* చేయసాధ్యం కానిది, సాటిలేనిది అయిన సాహసానికి పూనుకున్నాడు.
అబోతు కోడెవలె ధైర్యం తో తల ఎత్తి నిలి చాడు....
సింహము వంటి ఆయన గంభీర రూపానికి భయపడి పక్షులు పారిపోయాయి, మృగాలు మరణించాయి. ఆయన మడుగులో స్వైర విహారం చేస్తున్న మత్త గజము వలె కనబడుతున్నాడు.
తాను నిర్వహించబోయే కార్యము సిద్ధించడానికి హనుమ సకలలోక సాక్షియైన సూర్యునికి, మూడు లోకాల ప్రభువైన మహేంద్రునికి, తన తండ్రి అయిన వాయుదేవునికి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి మనసారా ప్రణమిల్లాడు.
పర్వదినాలలో సముద్రము ఉప్పొంగినట్లు, రామకార్యసిద్ధి కొరకు హనుమ పొంగిపోతున్నాడు.
ఇక ఆ పర్వతం పై నుండి ఆకాశంలోకి ఎగురాలనుకొన్నాడు.
ఆ కొండను తన కాళ్లతో చేతులతో బలంగా అదిమాడు. ఆ కొండ కొంత కదిలింది. ముందుగా చెట్ల పూలన్ని జలజల రాలాయి. ఏనుగు తొండాన్నుండి కారే మదధారలవలె ఆ కొండనుండి రంగు రంగుల ధారలు స్రవించసాగాయి.
నల్లని మనశ్శిలలు కొండనుండి దొరలి క్రింద పడసాగాయి.
హనుమ మరింత గట్టిగా కొండను నొక్కాడు. ఆ కొండ గుహలలోని జంతువులు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణభయంతో బిగ్గరగా అరవసాగాయి.
బిలాలలోని సర్పాలు విషాన్ని వెడలగ్రక్కుతూ ఆ పర్వత శిలలను కాటువేయసాగాయి.
ఆ పర్వతముపై విద్యాధరులు తమ తరుణులతో విలాసంగా మధ్యపానం చేస్తున్నారు. ఆకస్మికంగా జంతువుల అరుపులు, పడిపోయే కొండ రాళ్లను చూచి ఆ పర్వతము బ్రద్దలవుతున్నదనే భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదలి ఆకాశంపైకి ఎగిరి ఆశ్చర్యంతో చూడసాగారు.
ఆ మహాపర్వతం పైనున్న మహానుభావులైన మహర్షులు “రామ కార్యార్థమై హనుమ కొండంత శరీరంతో నూరు యోజనాల విశాలమైన సముద్రాన్ని దాటబోతున్నాడ”ని తెలిపారు.
హనుమ తన శరీరాన్ని యోగాభ్యాస వశం చేశాడు, చేతులను కదలకుండా బిగించి, నడుమును సన్నగా చేసి, మెడను సంకోచింప జేసి ఎగరడానికి వీలుగా పాదాలను ముడిచి యోగ నియమాలను పాటించాడు.......
**
బయల్దేరడానికి సిద్ధమై వానరవీరులందరూ వినేలా ఇలా ప్రకటించాడు.
*యధా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః* *గచ్ఛేత్తద్వద్గమిష్యామి లఙ్కాం* |*రావణపాలితామ్*
రామబాణంలా వాయువేగంతో రావణపాలితమైన లంకకు వెళ్ళి వెదుకుతాను. అక్కడ సీత కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళి వెదుకుతాను. అక్కడా సీత కనబడకపోతే. ఏమాత్రం అలసట లేకుండా లంకకు వచ్చి రావణుణ్ణి బంధించి, సీతతో సహా తెస్తాను. ఎలాగైనా సీతను తీసుకునే వస్తాను. ఆమె కనబడకపోతే రావణుడితో సహా లంకను పెల్లగించి. తీసుకు వస్తాను. అనుకున్న కార్యం సాధించి తీరాను." మనస్సునుంచి ఇతర ఆలోచనలు దూరం చేసాడు. సముద్రలంఘనం మీదనే బుద్ధి ఏకాగ్రం చేసి మహేంద్రపర్వతం నుంచి గాలిలోకి ఎగిరాడు.
ఆ మహాకపి తొడల వేగానికి పర్వతం మీద ఉన్న వృక్షాలు కూకటివేళ్ళతో భూమిని పెకలించుకుని బయటకు వచ్చి కొమ్మలన్నిటినీ కిందకు ముడిచి పెట్టుకుని, ఆయనవెంట గాలిలోకి ఎగిరాయి.
సారవంతమైన కొన్ని వృక్షాలు, రాజును సాగనంపే సైన్యంలా పరిమితదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.
తేలికపాటి చెట్లు, ప్రియబంధువును సాగనంపేవారిలా చాలాదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.
ఆ వృక్షాలకు ఉన్న పుష్పాలు రాలి, గాలికి పైకిలేచి హనుమంతుడి శరీరమంతా అలంకరించినట్లు అంటుకున్నాయి.
కుప్పించి ఎగిరిన పర్వతమంత మహాకపి, ఆ కపి వెనుక గాలిలోకి లేచిన విశాలమైన వృక్షసమూహాలు, వాటినుండి రాలి అయస్కాంతానికి తగులుకున్న ఇనుపరజనులా హనుమంతుడి శరీరానికి తగులుకున్న పుష్పాలు- అదో మహాద్భుతదృశ్యమై కనబడింది.
గుండ్రంగా, పచ్చగా ఉన్న ఆ మహాకపినేత్రాలు ఆకాశంలో సూర్యచంద్రులు ఏకకాలంలో, ఒకే కాంతితో ఉదయించినట్లున్నాయి. వృత్తాకారంలో ఉన్న తోకతో హనుమంతుడు ఆకాశంలో గూడుకట్టిన సూర్యుడిలా ఉన్నాడు.
ఆయన వేగానికి, బాహుమూలాలనుండి వస్తున్న గాలి చేసే చప్పుడు మేఘగర్జనలా ఉంది. మేఘమండలంలో ఉన్న మేఘాలను లాక్కుపోతున్నాడా అనిపించేలా నీలిమేఘాలన్నీ ఆయనను అనుసరించి కదిలాయి.....
*
[హనుమ తనను *యధా రాఘవ నిర్ముక్త శరః*
రాముడు వదిలిన బాణం గా చెప్పుకొన్నాడు. ఇది కర్మయోగము యొక్క మూల సూత్రం. రాముని బాణం రాముని యొక్క పనిముట్టు.
రాముడు తన పనికై వినియోగించుకొనును. అపుడు రాముడు వేగముతో లాగి వదలగా రాముడు కల్పించిన వేగమే దాని వేగముగా ఆ బాణము పోవును; మధ్యలో ఆగదు. లక్ష్యమును చేరును.
హనుమ తన్ను ఆ బాణముతో పోల్చుకొనుచున్నాడు. రాముని బాణము ఎట్లు సహజమగు వేగములేనిదో నేనును అంతే! రామునిపనిమీద రాముడు పంపగా రామునివేగము నా వేగమై పోవుదును గాని ఇది నా శక్తి కాదు. భగవత్పారతంత్ర్యమును భావించుకొనును....]