ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
21, నవంబర్ 2024, గురువారం
మొగలిచెర్ల అవధూత
మోక్ష మార్గానికి మార్గం
*మోక్ష మార్గానికి మార్గం - వివేక చూడామణి గ్రంధాధ్యయనం*
అద్వైత సిద్ధాంతాన్ని స్పష్టం చేయడానికి శ్రీ ఆదిశంకర భగవత్పాదులు రచించిన గ్రంథాలలో *వివేక చూడామణి* ఉత్తమమైనది. ఈ పుస్తకంలో అతను ఆ సిద్ధాంతం యొక్క అన్ని దశలను సంక్షిప్తంగా మరియు స్పష్టంగా వివరించాడు. ప్రధానంగా ఈ గ్రంథంలో వేదాంత తత్త్వాన్ని తెలుసుకోవాలని, జ్ఞాని అయిన శిష్యుడు తన గురువు నుండి తత్త్వాన్ని అడిగే విధానాన్ని, అటువంటి శిష్యునికి సరైన మార్గంలో తత్త్వాన్ని బోధించే న్యాయాన్ని గురించి, యోగ్యతఅంటే ఏంటో చెప్పాడు.
మన పరమ గురువు జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఈ గ్రంథంపై చక్కని ఉపన్యాసం రాశారు.దాని ద్వారా ఈ గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు.శ్రీ శంకర భగవత్పాదులు ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని చిట్ట చివరి శ్లోకంలో చెప్పారు
అంటే మోక్షమార్గం ఈ గ్రంథంలో చెప్పబడింది. భగవత్పాదులు ఆ మార్గం గురించి ప్రధానంగా చెప్పారు
మోక్షం పట్ల ఆసక్తి ఉన్నవాడు విషం వంటి ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టాలి. తృప్తి, దయ, సహనం, నిజాయితీ, శాంతి, నియంత్రణ అనేవాటిని అమృతాన్ని సేవించినట్లే అలవర్చుకోవాలి.అంటే ఈ యోగ్యతను పొందిన వ్యక్తి మాత్రమే మోక్షమార్గంలో ప్రవేశించగలడు.
ఎన్నో మంచి విషయాలు ఉన్న ఈ వివేక చూడామణిని అందరూ చదవండి.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
ధర్మాత్ములు
ఇలాంటి ధర్మాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టే వర్షాలు పడుతున్నాయి…
ఉన్నారు, ఇంకా అక్కడక్కడ !
ఇపుడు 55 ఏళ్ల వయసు కలిగిన సుధాకరన్ కు 2014 లో 45 ఏళ్ళ వయసు. ఆయన ఉత్తర కేరళలోని కన్హన్ ఘాడ్ లో శీతల పానీయాలు ,మిఠాయిలతో పాటు లాటరీ టికెట్లు కూడా అమ్ముతాడు.
ఆయన దుకాణం పేరు శ్రీ మూకాంబిక. నెలకు 10 వేల రూపాయల కంటే ఎక్కువ సంపాదన చూడలేదు.
దైవభక్తుడు. తక్కువగా మాట్లాడతాడు. కోపం రాదు. సహనం పోదు. పెద్దగా చదువుకోలేదు (అదృష్టం కొద్దీ !). జీవితంలో ఏవో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు.
సాధారణ జీవితం. ఆ జీవితంలో కొన్ని పాటిస్తూ వస్తున్నాడు : తల్లితండ్రులు చెప్పే వాటిలో మంచి వుంటే, దాన్ని పాటించాలి, ఎవరినీ మోసం చేయరాదు, డబ్బు వున్నా, లేకపోయినా ఒకే విధంగా వుండాలి, ఎంతమందిని మోసం చేసినా, ఎన్ని తంటాలు పడినా, యమ భటులో, దేవ దూతలో వచ్చినపుడు, నేను ఇక్కడి నుండీ ఆవగింజను కూడా తీసుకెళ్లలేను…
ఒక రోజు తన దుకాణానికి దాదాపు ప్రతి రోజూ వచ్చే అశోకన్ అనే వ్యక్తి, సుధాకరన్ కు చరవాణి పిలుపు చేసి ” నాకు 10 లాటరీ టికెట్లు పక్కన పెట్టు. డబ్బు మళ్ళీ ఇస్తాను ” అన్నాడు. ఈయన సరేనని 10 టికెట్లు పక్కన పెట్టి మిగతావి అమ్మేసాడు. మరుసటి రోజు లాటరీ టికెట్ల ఫలితాలు వచ్చాయి. సుధాకరన్ తాను అశోకన్ కోసం ఎత్తి పెట్టిన టికెట్లను తీసికొని చూస్తే వాటిలో ఒక టికెట్ లాటరీ గెలుచుకొంది. డబ్బు ఎంత? ఒక కోటి రూపాయలు.
2014 లో ఒక కోటి రూపాయలు.
అశోకన్ కోసం ఎత్తి పెట్టిన లాటరీ టికెట్ల సంఖ్యలు తనకు తప్ప, ఎవరికీ తెలియదు. ఆ టికెట్లకు అశోకన్ ఇంకా డబ్బు కూడా ఇవ్వలేదు, ఏదో ఒక మాట చెప్పి ఆ కోటి రూపాయలు తాను తీసుకోవచ్చు. అలానే చేశాడా ? లేదు.
చరవాణి అందుకొని తండ్రికి కాల్ చేసి, జరిగిన విషయం చెప్పి ” ఏమి చేయమంటారు? ” అని అడిగితే ఆయన ” ఇందులో ఆలోచించేందుకు ఏముంది? అశోకన్ కు చరవాణి పిలుపు చేసి నీవు ఒక కోటి రూపాయలు గెలుచుకొన్నావు ‘ అని చెప్పి, ఆ లాటరీ చీటీ అతనికి ఇచ్చేయి ” అన్నాడు.
సుధాకరన్ మరో ఆలోచన కూడా చేయలేదు. తండ్రి చెప్పినట్టే చేసాడు.
“అంత డబ్బు చూసాక, మీరు దాన్ని మీ సొంతం చేసుకోవాలి అనిపించలేదా? అశోకన్ కు ఆ లాటరీ సంఖ్య తెలియదు కదా? ఇతరులకు కూడా ఆ టికెట్ సంఖ్య గురించి తెలియదు కదా? ” అని ఒక పాత్రికేయుడు అడిగితే ” అసలు అలా అనిపించలేదు. నా తల్లితండ్రులు నాకు నిజాయితీగా బ్రతుకు అని చెప్పారు. ‘ నీకు డబ్బు అవసరం వుంటే, అడుక్కు తిను కానీ ఇతరుల డబ్బును తీసుకువద్దు ‘ అని వాళ్ళు నాకు చిన్నప్పటి నుండీ నేర్పించారు, ” అన్నాడు సుధాకరన్.
ప్రపంచంలో 99% మంది ఎందుకు, ఎలా జీవిస్తారో అలా కాకుండా 1% మంది మరి దేనికోసమో జీవిస్తారు. ధర్మాన్ని వదలరు. అబద్దం చెప్పరు. సత్యాన్ని తప్పరు. ఆ ఒక్క శాతం మనుషులే ఈ భూమికి అందం, ఈ లోకానికి అలంకారం….
కార్తీకపురాణం 20
కార్తీకపురాణం 20 వ అధ్యాయము
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🍃🌷పురంజయుడు దురాచారుడగుట:
జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో "గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును ఇంకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు" డనెను.
అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో "ఓ రాజా ! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి , అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును ఇట్లు వివరించిరి...
పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి , "ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము...
త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను.
ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భంధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.
అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై, వారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రుసైన్యములపై బడెను.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.
ఓం నమః శివాయ...🙏🙏
Kartika Puranam - 21
Kartika Puranam - 21
కార్తిక పురాణము - ఇరవై ఒకటో అధ్యాయము
ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను, వాడియైన గుదియలతోను, ఇనుపకట్ల లాటీ కర్రలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరములతోను, కుంభాయుధములతోను, గొడ్డళ్ళతోను, కర్రలతోను, ఆయుధముల విక్షేపములతోను, యుద్ధము చేసిరి. గుర్రపురౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్దమును భటులనన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి.
ఓ అగస్త్య మునీంద్రా! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచికట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడువందల బాణముల వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వాలే విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంభోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వాలే పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు.
సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు గూర్చి పురంజయునితో యిట్లనియె.
క్షత్రియా! వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారధిని, ఛత్రమును వాని ధనుస్సును త్రుంచినవి. పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియెను. రాజా! శూరుడువౌదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను.
ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి.
అప్పుడు భయంకరమయిన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మేడలు విరిగి భూమియందు పడిరి.
అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి. గుర్రముల తోకలు తెగినవి. కాల్బంటులు హతులైరి. రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలబడిరి. కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడినయొకభటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో యిట్లనియె. తిరుగు వెనుకను తిరుగు, నాముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు శూరుడవు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ మునీ ఇట్టి నిష్ఠురములగు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని జేయుచు సింహగర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూణీరములనుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించ లేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆయుద్ధమందు సూదిదూరు సందులేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను, భటులను బంగారపు కట్లతో గూడినవియు, స్వయముగా వాడియైనవియు, సానపెట్టబడినవియు, స్వనామ చిహ్నితములు అయిన అర్థ చంద్ర బాణములతోను, ఇనుప నారాచములతోను, ఇనుప అలుగులు గల బాణములతోను, ఖడ్గములతోను, పట్టసములతోను, ఈటెలతోను కొట్టుకొనిరి. గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రథికులను జంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్చాదితలైన అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడునావాడు, వీడు నావాడని పలుకుచుండగా శూరహతులయిన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. యుద్దమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరులచేతను, ఇతర రాజుల చేతను, సుభటులచేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు గగుర్పొడిచినది. ఇట్టి యుద్దమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటియందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ భేతాళములతోడను, నక్కలతోడను, రాబందులతోను, గద్దలతోను, మాంసాశనులతోను, బ్రకాశించుచుండెను. కాంభోజరాజునకు పదమూడు అక్షౌహిణీళ సేన యున్నది. మూడు అక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తానూ యుద్ధమందోడుటకును, తన రాజ్యము శతృరాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓ రాజా! శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితినేని విష్ణుమూర్తి సేవ జేయుము. ఇప్పుడు కార్తికపూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రముతో కూడినది. కాబట్టి యిది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవిందా, నారాయణా మొదలయిన నామములను పాడుచు నాట్యమును జేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తిక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలు గల విష్ణు చక్రము పంపును. కార్తిక మాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను? నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది. ఇకముందు సత్ధర్మపరుడవు గమ్ము. అట్లయిన కొనియాడదగిన వాడగుదువు. ఓ రాజా! కార్తిక వ్రతమాచరింపుము. హరి భక్తుడవు కమ్ము. కార్తిక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము.
ఇతి స్కాంద పురాణే కార్తికమహాత్మ్యే ఏక వింశాధ్యాయః సమాప్తః
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - షష్ఠి - పుస్యమి - గురు వాసరే* (21.11.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*