21, సెప్టెంబర్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం

 *21.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*అవధూతం ద్విజం కంచిచ్చరంతమకుతోభయమ్|*


*కవిం నిరీక్ష్య తరుణం యదుః పప్రచ్ఛ ధర్మవిత్॥12450॥*


ధర్మవేత్తయైన యదుమహారాజు ఒకసారి తరుణవయస్కుడైన ఒక బ్రాహ్మణ అవధూత నిర్భయముగా తిరుగుచుండుట చూచెను. పిమ్మట అతడు ఆ అవధూతను ఇట్లు ప్రశ్నించెను.


*అవధూతమ్ = అభ్యంగవాదిభిః అసంస్కృతదేహమ్, నతు వర్ణాశ్రమధర్మత్యాగినమ్, కుతశ్చిత్ శీతతాపాదిభయరహితమ్* అవధూత యనగా దేహమునకు అభ్యంగాది సంస్కారములను జరుపనివాడు. అతడు తీవ్రమైన చలికి, ఎండకు తట్టుకొనుచు నిర్భయముగా మసలుకొనుచుండును. ఐనను అతడు వర్ణాశ్రమ ధర్మములను త్యజింపడు.


*యదురువాచ*


*7.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*కుతో బుద్ధిరియం బ్రహ్మన్నకర్తుః సువిశారదా|*


*యామాసాద్య భవాఀల్లోకం విద్వాంశ్చరతి బాలవత్॥12451॥*


*యదుమహారాజు ఇట్లనెను* బ్రాహ్మణోత్తమా! నీవు ఎటువంటి కర్మలను ఆచరించుటలేదు. ఐనను, నీకు ఆత్మానాత్మ వివేకమును గూర్చిన ఇంత గొప్ప బుద్ధికౌశల్యము ఎట్లు లభించినది? తద్ద్వారా ఎంతో గొప్ప విద్వాంసుడవైనప్పటికినీ ఈ లోకంలో నీవు బాలునివలె ఎట్లు మసలుచుంటివి?


*7.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ప్రాయో ధర్మార్థకామేషు వివిత్సాయాం చ మానవాః|*


*హేతునైవ సమీహంతే ఆయుషో యశసః శ్రియః॥12452॥*


*7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*త్వం తు కల్పః కవిర్దక్షః సుభగోఽమృతభాషణః|*


*న కర్తా నేహసే కించిజ్జడోన్మత్తపిశాచవత్॥12453॥*


మానవులు తఱచుగా ఆయస్సును, యశస్సును, సంపదలను పొందగోరి, ధర్మార్థకామములయందును, తత్త్వజిజ్ఞాసయందును ప్రవృత్తులగుచుందురు. కానీ, నీవు సమర్థుడవు, జ్ఞానివి, దక్షుడవు, స్ఫురద్రూపివి, మధురభాషివి; ఐనను నీవు ఏ పనినీ చేయవు, దేనినీ కోరవు. కానీ నీవు జడుడు, ఉన్మత్తుడు ఐన అవధూతవలె ఆత్మానందమును పొందుచున్నావు.


*7.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నినా|*


*న తప్యసేఽగ్నినా ముక్తో గంగాంభఃస్థ ఇవ ద్విపః॥12454॥*


జనులు కామక్రోధలోభములనెడి దావానలములోబడి మ్రగ్గుచుందురు. కానీ వారు ఆ అగ్నినుండి ఏవిధముగను బయటపడజాలరు. కానీ నీవు ముక్తుడవు. నిన్ను ఆ అగ్నియొక్క సెగ ఇంచుక కూడా తాకినట్లు కనిపించుటలేదు. గంగాజలములలో నున్న ఏనుగును దావానలము దరిజేరజాలదు. పైగా అది (ఆ ఏనుగు) చల్లదనమును అనుభవించుచుండును. అదేవిధముగా ముక్తుడవైన నీపై కామలోభములనెడి సాంసారిక తాపములు ఎట్టి ప్రభావమునూ చూపజాలవు.


*7.30 (ముప్పదియవ శ్లోకము)*


*త్వం హి నః పృచ్ఛతాం బ్రహ్మన్నాత్మన్యానందకారణమ్|*


*బ్రూహి స్పర్శవిహీనస్య భవతః కేవలాత్మనః॥12455॥*


మహాత్మా! నీకు ఈ సాంసారిక విషయములలో దేనియందును ఆసక్తిలేదు. శబ్దాది విషయస్పర్శలు లేకుండా కేవలము ఎట్టి అనుబంధములును లేని దేహమునందు ఉన్నావు. అనిర్వచనీయమైన నీ ఈ ఆత్మానందమునకు కారణమేమి? దయతో తెలుపుము".


*శ్రీభగవానువాచ*


*7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*యదునైవం మహాభాగో బ్రహ్మణ్యేన సుమేధసా|*


*పృష్టః సభాజితః ప్రాహ ప్రశ్రయావనతం ద్విజః॥12456॥*


*శ్రీకృష్ణభగవానుడు ఇట్లు నుడివెను* "ఉద్ధవా! యదుమహారాజు బ్రాహ్మణభక్తి తత్పరుడు, బుద్ధికుశలుడు. అతడు వినమ్రభావముతో అవనత శిరస్కుడై మహాత్ముడైన ఆ అవధూతను భక్తిశ్రద్ధలతో పూజించి ప్రశ్నింపగా ఆ మహానుభావుడు ఇట్లు వచించెను-


*బ్రాహ్మణ ఉవాచ*


*7.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*సంతి మే గురవో రాజన్ బహవో బుద్ధ్యుపాశ్రితాః|*


*యతో బుద్ధిముపాదాయ ముక్తోఽటామీహ తాన్ శృణు॥12457॥*


*బ్రహ్మవేత్త దత్తాత్రేయుడు వచించెను* "యదుమహారాజా! నేను బుద్ధిపూర్వకముగా పెక్కుమంది గురువులను ఆశ్రయించితిని. వారివలన నేను జ్ఞానోపదేశమును పొంది, ముక్తుడనై ఇట్లు సంచరించుచున్నాను. ఆ విషయములను అన్నింటిని తెలిపెదను వినుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

పుస్తకాలతో ఆనందంగా

 📚📔📓📗📕📖


           ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే 

ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.

           - *మహాత్మగాంధీ*


ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే 

పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.

             - *నెహ్రు* 


మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ 

పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.

         - *ఫెడ్రంట్ రసెల్*


మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.

          - *ఆల్బర్ట్ ఐన్స్టెయిన్*


ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు 

       - *నెల్సన్ మండేలా* 


🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం,

📘 పుస్తకం అన్నారు .

పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు 

పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ వ్యక్తి 

       - *లెనిన్*


📚 ఒక్కో చిత్రం నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.

              - *చార్లీ చాప్లిన్*


ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.

              - *విన్స్టెన్ చర్చిల్*


📚 భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు.

            - *మార్టిన్ లూధర్కింగ్*


📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.

                    - *భగత్ సింగ్*


          📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.

             - *అబ్రహం లింకన్*


📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి, 

            అతడే నా మార్గదర్శి అన్నారు.

           - *జూలియస్ సీసర్* 


           🌏 ప్రపంచపటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా, అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.

                       - *టెస్కార్డ్స్*


         📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.

              - *ఇంగర్సాల్*


         🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, 

         అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.

               - *సిగ్మెంట్ ఫ్రాయిడ్* 


             📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.


            ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే 


           📒 ముఖపుస్తకం (Face Book) పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.

           📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి *చదవండి, చదివించండి .*📚

🙏 *శుభోదయం*🙏

బ్రాహ్మణత్వం

 🌺🌺🌺🌺🌺🌺🌺🌺

     బ్రాహ్మణత్వం 

(అనుశాసనిక పర్వంలోని ఓ కథ)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి 

ధర్మరాజు ఇలా అడిగాడు.


"పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! " అని తన సందేహం వెలిబుచ్చాడు. 


భీష్ముడు " ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను.


 పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. 


ఆ గాడిద తన కూతురుతో " అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు " అని చెప్పింది. 


గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు "ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? " అనుకున్నాడు. 


విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. గాడిద " విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు " అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో " తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను " అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.


మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. "ఇంద్రుడు" ఇంద్రుడు ప్రత్యక్షమై " కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి " అని అడిగాడు. మతంగుడు " దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి " అని అడిగాడు. ఇంద్రుడు " కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో " అని అన్నాడు. మతంగుడు " అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను " అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇంద్రుడు " కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గు డైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సారాల తపస్సుకు వస్తుందా ! చెప్పు " అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టు కొనుట కష్టము. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్త లేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు " అన్నాడు. మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. అతడి శరీరము శిధిలమై పడిపోతుడగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు " అన్నాడు. మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు " నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు " అని వరాలు ప్రసాదించాడు. కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.

(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).


అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.


జై బ్రాహ్మణ్...జై జై బ్రాహ్మణ్.

🌺🌺🌺🌺🌺🌺🌺

మొదటి శత్రువు

 మొదటి శత్రువు 

మన ఉపనిషత్తులు అరిషడ్వార్గాన్ని నియంత్రించటం మొట్ట మొదటగా సాధకుడు ప్రయతించాలసిందని చెపుతున్నాయి.  అది చాల ముఖ్యమైన విషయం ఎందుకంటె ఆ మాయలోపడి ముముక్షువు తన సాధన చేయకుండా జీవితానికి అర్ధం, పరమార్ధం లేకుండా కాలాన్ని వృధా చేస్తాడు.  

కానీ నాకు అంతకన్నా ముందుగా సాధకుడు ఇంకొక అంతర్గత శత్రువుని నియంత్రించాలిసిన పని వుంది అదే బద్దకం.  ప్రతి మనిషిలో తెలియకుండా దాగివున్న అంతర్గత శత్రువు ఈ బద్ధకం. బద్దక్కన్ని ఎప్పుడైతే సాధకుడు అధిగమించగలుగుతాడో అప్పటినుంచి మాత్రమే సాధన మొదలవుతుంది. మనస్సు తన వశంచేసుకున్న సాధకుడు మాత్రమే సాధనలో పట్టు సాధించగలుగుతారు. 

 మనః యేన కారణాయ మోక్ష ఏవ బ్యాందః 

స్వల్పం (limited) రెండు అనల్పం (unlimited)

భేదం 

మనం మన జీవితానుభవాలల్లో రెండు విషయాలను తరచుగా చూస్తున్నాము.  అది ఒకటి స్వల్పం (limited) రెండు అనల్పం (unlimited) మనకు ఈ రెండు వాటి వాటి అవసరాలనుగుణంగా కావలసి ఉంటుంది.  మీరు మంచినీరు తాగటానికి ఇంట్లో నిలువ చేసుకున్నారనుకోండి అది ఒక బిందెలోనో లేక ఒక చిన్న స్టీల్ డ్రమ్ములోనో ఉంచుకొని మీకు కావలసినప్పుడు  ఒక గ్లాసులో తీసుకొని తాగుతారు.  అదే మీరు వాడుకునే నీరు అంటే స్నానాలకు మరియు పాత్రలు కడగటానికి ఇలా వివిధ పనులకు ఉపయోగించే నీరు మీరు ఒక పెద్ద డ్రమ్ములోనో లేక నీళ్లట్యాంకులోనో నిలువ చేసుకొని ఒక చెంబు లేక ఒక మగ్గుతో ఆ నీటిని తీసుకొనే వాడుకుంటారు కదా. ఇక్కడ బిందెలోని నీరు బక్కెటు లోని నీరు రెండు ఒకే చోటినుంచి తీసుకొని వచ్చినవే కానీ దేని ఉపయోగం దానికి మాత్రమే వాడతారు.  బిందెలోని నీతితో స్నానం చేయరు, అలాగే బక్కెట్లోని నీటిని తాగరు .  ఇలా నీరు ఒకటే అయినా  మీరు వాడే అవసరాన్ని బట్టి వేరు వేరుగా ఉంచుతున్నారు. 

భక్తి మార్గంలో  కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనం గుడిలో చూసే మెట్లు, గోడలు, గోపురం అన్ని రాళ్లతో కట్టినవే. అలాగే గర్భ గుడిలో ఉన్నశివలింగం కూడా బహుశా అదే రాతితో చేసి ఉండవచ్చు.  కానీ మనం గర్భగుడిలోని రాతినే ఎందుకు మొక్కుతాము అంటే ఆ రాయి మనం  పవిత్రంగా చూస్తాం అన్నమాట.  అజ్ఞానులు కొందరు ఇటీవల ఒక వితండ వాదం చేస్తున్నారు అదేమంటే గుడిలో మెట్లు, చాకలి బట్టలుతికే రాయి, గుడి స్తాంబాలు అన్నీ ఒకే రాతితో చేసినప్పుడు కేవలం గర్భ గుడిలోని శివలింగం, లేక విష్ణుమూర్తి విగ్రహంలోనే దేముడు ఉంటాడా అని అంటున్నారు.  అటువంటివారు తెలుసుకోవలసినది ఏమిటంటే నీవు నీ ఇంట్లో నీటిని ఏ రకంగా ఐతే రెండు విధాలుగా అంటే త్రాగే నీటిని శుభ్రంగా బిందెలో నింపూకుని వుంచుకుంటావో మరియు వాడుకునే నీటిని బక్కీట్లో వుంచుకుంటావో అదే విధంగా ఇక్కడ మూలవిరాట్టును పవిత్రంగాను, మిగిలిన రాళ్లను సామాన్యంగాను చుస్తున్నామన్న సత్యాన్ని తెలుసుకుంటే ఎవ్వరు విమర్శించలేరు. 

హిందూ ధర్మంలో ప్రతి విషయానికి ఒక నిబద్దత కలిగివుంది. కేవలం అజ్ఞానులు మాత్రమే విమర్శించగలరు. 

శ్రీమద్భాగవతము

 *21.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2268(౨౨౬౮)* 


*10.1-1388-*


*క. భూతముల కెగ్గుచేసిన*

*భూతంబులు నీకు నెగ్గు పుట్టించె వృథా*

*భూత మగు మనికి యెల్లను*

*భూతద్రోహికిని శుభము పొంద దధీశా!* 🌺 



*_భావము: ప్రాణులకు నీవు చేసిన హానికి ప్రతిగా, ఆ ప్రాణులే నీకు ప్రతి క్రియచేశాయి. జీవులకు అపకారము తలపెట్టినవాడెప్పటికిని శుభములు పొందలేడు సరికదా, వాని జీవితమే వ్యర్థము._* 🙏



*_Meaning: In response to the harm caused by you to the living beings, those victims took revenge on you today. One who thinks of causing injury and pain to others, can never live in peace and comfort and such person's life is useless and futile._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

సంస్కృత మహాభాగవతం

 *21.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.17 (పదిహేడవ శ్లోకము)*


*సత్యస్య తే స్వదృశ ఆత్మన ఆత్మనోఽన్యం వక్తారమీశ విబుధేష్వపి నానుచక్షే|*


*సర్వే విమోహితధియస్తవ మాయయేమే బ్రహ్మాదయస్తనుభృతో బహిరర్థభావాః॥12442॥*


సర్వేశ్వరా! నీవు సత్వస్వరూపుడవు. స్వయంప్రకాశ స్వరూపుడవు. నీవు సకలప్రాణులలో అంతరాత్మవై యుండి వెలుగులను ప్రసాదించుచుండువాడవు. కనుక ఆత్మతత్త్వమును గూర్చి బోధించుటకు నీవు తప్ప దేవతలలోగూడ ఎవ్వరును సమర్థులుగా నాకనిపించుట లేదు. కర్మాధీన దేహధారులైన ఈ బ్రహ్మాదిదేవతలు అందరును నీ మాయచే మోహితులై బాహ్యదృష్టిని కలిగియున్నారు.


*7.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*తస్మాద్భవంతమనవద్యమనంతపారం సర్వజ్ఞమీశ్వరమకుంఠవికుంఠధిష్ణ్యమ్|*


*నిర్విణ్ణధీరహము హ వృజినాభితప్తో నారాయణం నరసఖం శరణం ప్రపద్యే॥12443॥*


దేవా! అందువలన నలువైపులనుండి వ్యాపించిన దుఃఖముల తాపముచే నేను తపించి పోవుచున్నాను. తద్ద్వారా విరక్తి చెందిన నేను, నిన్ను శరణుజొచ్చుచున్నాను. నీవు దోషరహితుడవు. దేశకాలాది అవధులకు అతీతుడవు. సర్వజ్ఞుడవు. సర్వశక్తిమంతుడవు. అప్రతిహతమగు వైకుంఠలోక నివాసుడవు. నరులకు నిత్యసఖుడవు. నారాయణుడవు. కనుక, నీవు నాకు శ్రేయోమార్గమును ఉపదేశించి, నన్ను ఉద్ధరింపుము.


*శ్రీభగవానువాచ*


*7.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ప్రాయేణ మనుజా లోకే లోకతత్త్వవిచక్షణాః|*


*సముద్ధరంతి హ్యాత్మానమాత్మనైవాశుభాశయాత్॥12444॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* "ఉద్ధవా! లోకమున ఆత్మానాత్మ విచక్షణ చేయుటయందు కుశలులై కొద్దిమంది మానవులు సుశిక్షితమైన మనస్సుద్వారా (కుశాగ్రబుద్ధిద్వారా) విషయవాసనలనుండి తమను తామే ఉద్ధరించుకొందురు.


*7.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః|*


*యత్ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోఽసావనువిందతే॥12445॥*


మానవుడు మాత్రమే తన జీవితకాలములో ప్రత్యక్ష-అనుమాన ప్రమాణములద్వారా జగత్తుయొక్క అనిత్యత్వమును దర్శించి, వైరాగ్యముద్వారా తన శ్రేయస్సును పొందగలడు. కనుక పురుషుడు తనకు తానే గురువు.


*7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*పురుషత్వే చ మాం ధీరాః సాంఖ్యయోగవిశారదాః|*


*ఆవిస్తరాం ప్రపశ్యంతి సర్వశక్త్యుపబృంహితమ్॥12446॥*


మనుష్యయోని యొక్క గొప్పతనమేమనగా సాంఖ్యశాస్త్రము నందును, యోగశాస్త్రమునందును కోవిదులు జితేంద్రియులైన మానవులు సర్వశక్తిమంతుడైన పరమాత్మునిగ నన్ను ప్రత్యక్షరూపమున దర్శింతురు. అట్లే వారు సర్వవ్యాపకుడైన విరాట్ పురుషునిగా నిరాకార రూపములో గూడ నన్ను సాక్షాత్కరింపజేసికొందురు.


*7.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ఏకద్విత్రిచతుష్పాదో బహుపాదస్తథాపదః|*


*బహ్వ్యః సంతి పురః సృష్టాస్తాసాం మే పౌరుషీ ప్రియా॥12447॥*


ఒక పాదము, రెండు పాదములు, మూడు పాదములు, నాలుగు పాదములు, బహుపాదములు, పాదములు లేనివి అగు ప్రాణులను నేను సృజించితిని. కానీ వాటిలో అన్నింటికంటెను పురుషార్థసాధకమగు మానవశరీరమే నాకు మిగుల ప్రియమైనది.


*7.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*అత్ర మాం మార్గయంత్యద్ధా యుక్తా హేతుభిరీశ్వరమ్|*


*గృహ్యమాణైర్గుణైర్లింగైరగ్రాహ్యమనుమానతః12448॥*


ఈ మానవజన్మయందు ప్రజ్ఞావంతులైన వారలు బుద్ధి మొదలగువాటిద్వారా తెలియబడునట్టి హేతువులతో, గుణములతో, చిహ్నములతో గ్రాహ్యము కానట్టి పరమాత్మనగు నన్ను, అనుమానాది ప్రమాణములద్వారా సాక్షాత్కరింపజేసికొందురు.


*7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్|*


*అవధూతస్య సంవాదం యదోరమితతేజసః॥12449॥*


ఈ విషయములో మహాత్ములు ప్రాచీనమైన ఒక ఇతిహాసమును తెలుపుదురు. ఇది అమితతేజోమూర్తియైన దత్తాత్రేయునకును యదుమహారాజునకు మధ్య జరిగిన సంవాదరూపమున ఉన్నది. (సంవాదము అనగా ప్రశ్నోత్తరరూప సంభాషణము).


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*996వ నామ మంత్రము* 21.9.2021


*ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః*


శ్రీచక్రరాజమే తన నిలయమై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీచక్రరాజ నిలయా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కొంగుబంగారమై ఉంటూ, సర్వకాల సర్వావస్థలయందును రక్షణ కల్పించుచూ, భౌతిక మరియు ఆముష్మిక పరమైన కోర్కెలను సిద్ధింపజేయును.


బిందువు, త్రికోణము, షట్కోణము, ఈ విధముగా శ్రీచక్రలేఖనము చెప్పబడినది అని భాస్కరరాయలువారు చెప్పారు. అటువంటి శ్రీచక్రమే నివాసముగా గలిగిన పరమేశ్వరి *శ్రీచక్రరాజనిలయా* యని అనబడినది. శ్రీచక్రము శివపార్వతుల శరీరమని భాస్కరరాయలువారు చెప్పారు. మన శరీరములో జీవుడు ఉన్నాడు. అలాగే శ్రీచక్రమునందు పార్వతీ పరమేశ్వరులున్నారు.


 *బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మమన్వస్రనాగదళ షోడశపత్రయుక్తమ్||*


*వృత్తత్రయం చ ధరణీ నత్రయంచ శ్రీ చక్రరాజ ఉదితః పరదేవతాయా||*


 *చక్రరాజము అను పేరుగల రథములో ఉంచబడిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడిన తల్లికి నమస్కారము ( శ్రీ చక్రమునకు కూడా చక్రరాజము అను పేరు ఉన్నది.)*

                *చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా*


అన్నిరకాలయిన ఆయుధములతోనూ అలంకరించబడిన 'చక్రరాజము” అనేరథాన్ని

పరమేశ్వరి అధిరోహించింది. రథాలలో కూడా రకాలున్నాయి అని రథశాస్త్రము చెబుతోంది.

అందులో ముఖ్యంగా మూడురకాలున్నాయి. 

1. చక్రరాజము, 2. గేయచక్రము, 3. కిరిచక్రము. 

లలితోపాఖ్యానంలో ఈ విషయాన్ని వివరిస్తూ....


ఆనందధ్వజముతో కూడినది. తొమ్మిది పర్వముల (ఆవరణలు)తో కూడినది. పదియోజనాలఎత్తు నాలుగుయోజనాల వెడల్పు గలిగినటువంటిది దేదీప్యమానముగా ప్రకాశించునది అయిన చక్రరాజము అను రథమును పరమేశ్వరి అధిరోహించెను. ఈ చక్రరాజరథమే శ్రీచక్రము.


శ్రీచక్రము అంటే చరాచరజగత్తే కాని వేరు కాదు. అందుకే భైరవయామళంలో


శ్రీచక్రాన్ని గురించి పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరిస్తూ


ఓ పరమేశ్వరీ ! శ్రీచక్రము అంటే సామాన్యమైనటువంటి ఒక చిన్న యంత్రం కాదు. అది ఈ బ్రహ్మాండం మొత్తానికి ప్రతీక. ఏరకంగా అంటే...


సృష్టికి కారణం పంచభూతాలు, తన్మాత్రలు, సృష్టి ఆరంభంలో మొట్టమొదటగా తన్మాత్రలు ఏర్పడ్డాయి. అవే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఆ తరువాత తన్మాత్రల స్థూలరూపాలయిన పంచభూతాలు ఏర్పడ్డాయి. అవి పృథివి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము.


ఇవన్నీ పంచీకరణం చెందినాయి. అప్పుడు పంచభూతాలు, తన్మాత్రలు విడివిడిగా 15

భాగాలయినవి. ఆ తరువాత ఇవి గుణత్రయంతో కలిసాయి. అప్పుడు ఈ సృష్టి జరిగింది. కాబట్టి సృష్టికి మూలమైనటువంటివి పంచభూతాలు, తన్మాత్రలు. అవి రెండూ శ్రీచక్రంలోనే ఉన్నాయి. అంటే పంచభూతాల, తన్మాత్రల తత్త్వాలు శ్రీచక్రంలో ఉన్నాయన్న

మాట. కాబట్టి శ్రీచక్ర చరాచరజగత్తుకు ప్రతీక. అందుచేతనే శ్రీచక్రాన్ని అర్చించినటైతే చరాచరజగత్తును అర్చించినట్లే. జగత్తు అంటే కేవలము అడవులు, కొండలు, చెట్లు, పుట్టలతో కూడిన భూమి మాత్రమే కాదు. దానిమీద ఉండే జీవజాలము కూడా. శ్రీచక్రంలో

ఇంద్రియాలున్నాయి అన్నారు. అని రెండు రకాలు. 1. జ్ఞానేంద్రియాలు. 2. కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియాలు ప్రతిపాణికీ ఉంటాయి. అందుచేతనే ఆహారనిద్రా మైధునాలు అన్ని

జీవులకు సామాన్యము అని చెప్పబడుతోంది. ఈ రకంగా దశేంద్రియాల తత్త్వాలు శ్రీచక్రంలో ఉన్నాయి కాబట్టి శ్రీచక్రం చరాచరజగత్తులోని జీవరాశి కంతటికీ ప్రతీక. అయితే ఈ జీవరాశిలో మానవుడున్నాడా ? అన్నదే ప్రశ్న మిగిలిన జీవరాశికి లేనిది, మానవుడికి ఉన్నది ఒక్కటే. అదే మనస్సు. సంకల్పవికల్పాలకు కారణమైంది మనస్సు. దీని కారణంగానే మానవుడికి యుక్తాయుక్తవిచక్షణాజ్ఞానం కలుగుతోంది. ధర్మాధర్మాలను

విచారించగలుగుతున్నాడు. మరి ఆ మనస్సు యొక్క తత్త్వము కూడా శ్రీచక్రంలోనే ఉన్నది. కాబట్టి శ్రీచక్రము జగత్తులోని మానవాళి కంతటికీ ప్రతీక. అందుచేతనే శ్రీచక్రానికి అంత గొప్పతనం ఉన్నది. శ్రీచక్రాన్ని గనక పూజించినట్లైతే చరాచరజగత్తునూ అర్చించినట్లే.

విశ్వమానవాళినంతటినీ సేవించినట్లే. శ్రీచక్రపూజచెయ్యడమంటే తనను తాను గౌరవించుకోవటం తప్ప వేరుకాదు.


ఈ జగత్తుకు అధిపతి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు ? అని అడిగితే - జగత్తులోని ప్రతి వస్తువునందు ఉంటాడు. చరాచరజగత్తంతా పరమేశ్వరమయం ఈ జగత్తే శ్రీచక్రం అయినప్పుడు మరి ఆ పరమేశ్వరి శ్రీచక్రంలోనే కదా నివసించేది.

అందుచేతనే *శ్రీచక్రరాజనిలయా* యని అనబడినది.


ఇక మంత్రశాస్త్రంలోకి వెడితే ప్రపంచసార సంగ్రహంలో


బిందువు, త్రికోణము, అష్టకోణము, పదికోణములుగల చక్రములు రెండు, పద్నాలుగుకోణములుగల చక్రములు. అష్టదళము వృత్తము, షోడశదళము వృత్తము, భూగృహము అనే ఆవరణలున్నాయి.


ఈ రకంగా శ్రీచక్రంలో ఉండే ఆవరణలు అనేకచోట్ల చెప్పబడ్డాయి.



అయితే శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలున్నాయి. వాటన్నింటికీ కూడా విడివిడిగా

పేర్లున్నాయి. రత్నాయరుషి వ్రాసిన ఆవరణ దేవతాస్తుతిలో వాటిని వివరించటం జరిగింది.


*త్రైలోక్యమోహనం వందే సర్వాశాపరిపూరకమ్‌*


*సర్వసంక్షోభణం చక్రం సర్వసౌభాగ్యదాయకమ్॥*


*సర్వార్థసాధకం చక్రం సర్వరక్షాకరం పరమ్‌॥*


*సర్వరోగహరం చక్రం సర్వసిద్ధిప్రదాయకమ్‌|*


*సర్వానందమయం చక్రం ఇతి చక్రక్రమంభజే॥*


1. ప్రధమావరణ భూపురము త్రైలోక్యమోహనచక్రము


2. ద్వితీయావరణ షోడశదళము - సర్వాశాపరిపూరకచక్రము.


3. తృతీయావరణ అష్టదళము - సర్వసంక్షోభణచక్రము


4. చతుర్థావరణ చతుర్దశారము - సర్వసౌభాగ్యదాయక చక్రము


5. పంచమావరణ బహిర్దశారము - సర్వార్ధసాధకచక్రము


6. షష్టావరణ అంతర్దశారము - సర్వరక్షాకరచక్రము


7. సప్తమావరణ అష్టకోణము - సర్వరోగహరచక్రము


8. అష్టమావరణ త్రికోణము - సర్వసిద్ధిప్రదచక్రము


9. నవమావరణ బిందువు - సర్వానందమయచక్రము


ఈ రకంగా నవావరణలున్నాయి. వీటిలో వృత్తత్రయం మాత్రం లేదు అని గుర్తించాలి. ఏ సంప్రదాయంలోనూ కూడా వృత్తత్రయానికి పూజలేదు.


భండాసురుని యొక్క వేదవిద్యలకు విరుద్ధమైన చర్యలకు పరమేశ్వరి ఆచరించే దండనలే ప్రతి క్రియలు. అవి ప్రకృతులు, పరివారదేవతలు ఆవరణదేవతలు,ాఆయుధదేవతలుగా చెప్పబడుతున్నారు.


శ్రీచక్రంలో ఉన్న తొమ్మిదిఆవరణలే, దేవికూర్చునే రథానికి పర్యములుగా ఉన్నాయి. ఈ ఆవరణలలో ఒక్కొక్క ఆవరణకు కొంతమంది దేవతలున్నారు. వారే ఆవరణ దేవతలు.


1. మొదటి ఆవరణ : ఇది భూపురము. త్రైలోక్యమోహనచక్రము. ఇందులో మూడు రేఖలున్నాయి. ఈ మూడు రేఖలు భూలోక భువర్లోక సువర్లోకాలకు ప్రతీక. ఈ ఆవరణలో

ఉండే దేవతలవివరాలు.


ప్రధమరేఖలో అష్టసిద్ధులు ఉంటాయి.


1. అణిమాసిద్ధి, 2. లఘిమాసిద్ధి, 3. గరిమాసిద్ధి, 4. మహిమాసిద్ధి, 5. ఈశిత్వసిద్ధి, 6. వశిిత్వసిద్ధి, 7. ప్రాకామ్యసిద్ధి, 8. ప్రాప్తిసిద్ధి, 9. సర్వకామసిద్ధి. 


రెండవరేఖలో అష్టమాత్రుకలు ఉంటాయి.


1. బ్రాహ్మి, 2. మాహేశ్వరి, 3. కౌమారి, 4. వైష్ణవీ, 5. వారాహి, 6. మాహేంద్రి, 7. చాముండి, 8. శ్రీమహాలక్ష్మి.

 

మూడవరేఖలో ముద్రాశక్తులు ఉంటాయి.


1.సర్వసంక్షోభిణీ, 2.సర్వవిద్రావిణీ,3.సర్వాకర్షిణీ, 4. సర్వవశంకరీ, 5. సర్వోన్మాదినీ, 6.సర్వమహాంకుశ, 7. సర్వఖేచరీ, 8.సర్వబీజా,9.సర్వయోనిః


ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా. ఇక్కడ ఉండే యోగిని పేరుప్రకటయోగిని.


2. రెండవ ఆవరణ : ఇది షోడశదళపద్మము. అనగా పదహారు దళాలు ఉన్నటువంటి పద్మము. చంద్రకళాస్వరూపము. ఈ పదహారుదళాలలోను చంద్రుని యొక్క పదహారు కళలు ఉంటాయి. ఆ కళలన్నీ ఆకర్షణ దేవతల రూపంలో ఉంటాయి. అవి


1.కామాకర్షిణి, 2.బుద్ధ్యాకర్షిణి, 3.అహంకారాకర్షిణి, 4.శబ్దాకర్షిణి, 5 .స్పర్శాకర్షిణి, 6.రూపాకర్షిణి, 7. రసాకర్షిణి, 8. గంధాకర్షిణి 9. చిత్తాకర్షిణి, 10. ధైర్యాకర్షిణి,11. స్మృత్యాకర్షిణి, 12. నామాకర్షిణి,

13. బీజాకర్షిణి,14. ఆత్మాకర్షిణి, 15.అమృతాకర్షిణి, 16.శరీరాకర్షిణి, 


ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశి.

ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తయోగిని.


౩. మూడవ ఆవరణ : ఇది సర్వసంక్షోభణ చక్రము. 

ఎనిమిది దళాలు గల పద్మము.


అష్టమూర్వాత్మకము. దీని ఎనిమిది దళాలలోను విడివిడిగా ఉండే దేవతలు. అప్టమూర్త్యాత్మ!


1. అనంగకుసుమా, 2. అనంగమేఖలా, 3. అనంగమదనా,4.అనంగమదనాతురా, 5. అనంగరేఖా, 6. అనంగవేగినీ, 7.అనంగాంకు, 8. అనంగమాలినీ


ఈ ఆవరణకు అధిదేవత త్రిపురసుందరి. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తతరయోగిని.



4, నాల్గవ ఆవరణ: ఇది సర్వసౌభాగ్యదాయకచక్రము. చతుర్దశారము. అంటే పదునాలుగు కోణాలుగల పద్మము ఇందులోని పదునాలుగు కోణాలు పదునాలుగు లోకాలకు ప్రతీక. ఇక ఇక్కడ ఉండే

దేవతల వివరాలు. 1.సర్వ సంక్షోభిణీ, 2.సర్వవిద్రావిణీ, ౩. సర్వాకర్షిణీ, 4. సర్వాహ్లాదినీ, 5. సర్వసమ్మోహినీ, 6.సర్వస్తంభినీ, 7.సర్వజృంభిణీ, 8. సర్వవశంకరీ, 9. సర్వరంజనీ, 10. సర్వోన్మాదినీ, 

11. సర్వార్థసాధినీ, 12. సర్వసంపత్తిపూరిణీ, 13. సర్వమంత్రమయి, 14. సర్వద్వంద్వక్షయంకరీ.


ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని. ఇక్కడ ఉండే యోగిని పేరు సంప్రదాయయోగిని.


5. ఐదవ ఆవరణ : ఇది సర్వార్ధసాధక చక్రము. పది కోణాలు గల పద్మము. దీన్ని బహిర్దశారము అంటారు. దీనిలోని పదికోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలకు

ప్రతీక. ఇందులో ఉండే దేవతలు.


1.సర్వసిద్ధిప్రద, 2.సర్వసంపత్ప్రద, 3..సర్వపియంకరి, 4.సర్వమంగళకారిణి, 5. సర్వకామప్రద, 6. సర్వదుఃఖవిమోచని, 7. సర్వమృత్యుప్రశమని, 8. సర్వవిఘ్ననివారిణి, 9. సర్వాంగసుందరి, 10. సర్వసౌభాగ్యదాయిని.


ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ. ఇక్కడ ఉండే యోగిని పేరు కుళోతీర్ధయోగిని.


6. ఆరవ ఆవరణ : ఇది సర్వరక్షాకరచక్రము. పదికోణములుగల పద్మము. దీన్ని


అంతర్జశారము అంటారు. ఇందులోని కోణాలు అగ్నికళలకు ప్రతీక. ఇక్కడ ఉండే దేవతలు:

1. సర్వజ్ఞా, 2. సర్వశక్తిః, 3. సర్వైశ్వర్యప్రదాయిని, 4. సర్వజ్ఞానమయి, 5. సర్వవ్యాధివినాశిని, 6. సర్వాధారస్వరూప, 7. సర్వపాపహరా, 8. సర్వానందమయీ, 

9. సర్వరక్షాస్వరూపిణీ, 10. సర్వేప్సితఫలప్రద.


ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని. ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని,


7. ఏడవ ఆవరణ : ఇది సర్వరోగహరచక్రము. అష్టకోణము. దీని కోణాలలో


అష్టవసువులు వాగ్దేవతలరూపంలో ఉంటారు.


1. వశిని, 2. కామేశ్వరి,3. మోదిని,  

4. విమల, 5. అరుణ, 6. జయిని,

7. సర్వేశ్వరి, 8. కౌళిని


ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా సిద్ధాంబ


ఇక్కడ ఉండే యోగిని పేరు

రహస్యయోగిని.


8. ఎనిమిదవ ఆవరణ : ఇది సర్వసిద్ధిప్రద చక్రము. త్రికోణము. త్రిగుణాత్మకము.

ఇందులో కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే ముగ్గురు దేవతలు ఆయుధబీజసంయుతులై

ఉంటారు. ఇక్కడ త్రికోణము యొక్క మూడు కోణాలయందు.


1.త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రుడు

2.త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి

3.సృష్టి స్థితి లయాలు

4.వామజ్యేష్టరౌద్రి

5.ఇచ్చాజ్ఞానక్రియాశక్తులు

6.జ్ఞాత జ్ఞానము జ్ఞేయము

7.అ నుంచి స వరకు 48 అక్షరాలు


ఉంటాయి. అసలు సృష్టి అంతా ఇక్కడి నుంచే జరిగింది. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాంబ. ఇక్కడ ఉండే యోగిని పేరు అతి రహస్యయోగిని.


9. తొమ్మిదవ ఆవరణ : ఇది సర్వానందమయ చక్రము. బిందురూపము. అదే పరబ్రహ్మస్వరూపము. ఈ ఆవరణకు అధిదేవత మహాత్రిపురసుందరి. ఇక్కడ ఉండే యోగిని పేరు పరాపర రహస్యయోగిని.


ఈ రకంగా తొమ్మిది ఆవరణలు గల శ్రీచక్రంలోని సర్వానందమయచక్రంలో పరమేశ్వరి ఉన్నది.


శ్రీచక్రము అంటే కేవలము పూజామందిరంలో ఉంచి పూజించే ఒక యంత్రం మాత్రమే కాదు. చరాచరజగత్తే శ్రీచక్రము. అది ఎలా అంటే...

శ్రీచక్రంలోని వివిధ ఆవరణలను భావనోపనిషత్తు వివరిస్తోంది.



1. మొదటి ఆవరణలోని మొదటిరేఖలో సాధకుని శరీరంలోని నవరసాలే ఇక్కడ

సిద్ధిదేవతలు. నవరసాలు అంటే -


శృంగారరసము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయము, భీభత్సము,

అద్భుతము, శాంతము.


రెండవరేఖలో సాధకుని శరీరంలోని మనోవికారాలే ఇక్కడ అష్టమాత్రుకలు.

మనోవికారాలంటే -


కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, పుణ్య పాపములు.


మూడవరేఖలో సాధకుని శరీరంలోని మూలాధారం నుండి ద్వాదశాంతం వరకు ఉండే స్థానాలే. ముద్రాశక్తులు. ఆ స్థానాలవివరాలు.


మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధచక్రము, లంబికాగ్రము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ద్వాదశాంతము.


2. రెండవ ఆవరణలో చంద్రకళలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,

మనస్సు, పంచభూతాలు.


3. మూడవ ఆవరణలో ఇక్కడ అష్టమూర్తులు అంటే సాధకుని శరీరంలోని ఇంద్రియధర్మాలు. అవి వచన, దాన, గమన, విసర్ద, సంభోగ, ప్రవృతి, నివృత్తి, ఉపేక్ష


4. నాల్గవవ ఆవరణలో చతుర్దశభువనాలు అంటే సాధకుని శరీరంలోని ముఖ్యమైన

నాడులే అవి.


అలంబుసా, కుహూ, విశ్వోదరి, వరుణా, హస్తిజిహ్వ, యశస్వని, అశ్వని, గాంధారి, పూషా, శంఖినీ, సరస్వతీ, ఇడా, పింగళా, సుషుమ్నా.


5. ఐదవ ఆవరణలో సాధకుని శరీరంలోని ప్రధాన వాయువులు, ఉపవాయువులే దశావతారాలు. ఆ వాయువుల వివరాలు.


ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములు.


6. ఆరవ ఆవరణలోని అగ్నికళలు దశవాయువులగుణాలు. చతుర్విదాన్నములను

పచనముచేయు శక్తులు. అవి


దశవిధవాయువులగుణాలు : రేచకము, పూరకము, శోషకము, దాహకము, ప్లావకము.


వివిధాన్నములు : భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోప్యము, పేయము.

 

7. ఏడవ ఆవరణలోని అష్టవసువులు సాధకుని శరీరంలోగల లక్షణాలు అవి

శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, సత్వగుణము, రజోగుణము, తమోగుణము.


8. ఎనిమిదవ ఆవరణలోని త్రిశక్తులు పాడ్యమి నుంచి పూర్ణిమలేక అమావాస్య వరకుగల తిథులు.


9. తొమ్మిదవ ఆవరణలో కామేశ్వరీ కామేశ్వరులుంటారు. సాధకుని ఆత్మయే కామేశ్వరి. బుద్ధికామేశ్వరుడు. ఈ రెండూ ఒకటైతే సాదకుడు బ్రహ్మెక్యానుసంధానం పొందుతాడు. అదే జీవన్ముక్తి.


కాబట్టి శ్రీచక్రరాజములోని తొమ్మిదవ పర్వములో ఆ పరమేశ్వరి ఉన్నది అని చెప్పాలి. గనుకనే అమ్మవారు *శ్రీచక్రరాజనిలయా* యని అనబడినది.


అసలు మానవశరీరమే శ్రీచక్రము. శ్రీచక్రంలోని వివిధ ఆవరణలు మానవదేహంలోని వివిధ భాగాలు.



*బైందవమ్‌ బ్రహ్మరంధ్రం చ । మస్తకం చ త్రికోణకమ్‌ ।


లలాటే ష్టారకంపత్రం భృవోర్మధ్యే దశారకమ్‌


బహి ర్దశారం కంఠే తు! మన్వశ్రంహృదయం భవేత్‌


నాభౌ చ వసుపత్రం చ ॥ కట్యాం షోడశపత్రకమ్‌


వృత్తత్రయం చ ఊరుభ్యాం ! పద్భ్యాం భూపురత్రయమ్‌ ॥॥


బిందువు నా బ్రహ్మరంధ్రము

త్రికోణము నా తలముందు భాగము

అష్టకోణము గా లలాటము

అంతర్దశారము గా భ్రూమధ్యము

బహిర్దశారము గా కంఠము

చతుర్దశారము గా హృదయము

అష్టదళము గా నాభి

షోడశదళము గా కటి ప్రదేశము

వృత్తత్రయము గా ఊరువులు

భూపురము గా పాదాలు.


 మానవదేహమనే శ్రీచక్రంలో మొదటి ఆవరణ అయిన పాదాల దగ్గరనుండి బయలుదేరి పైకి వెళ్ళగా బ్రహ్మరంధ్రమే బిందుస్థానము. అదే తొమ్మిదవ ఆవరణ.


ఆధారచక్రంలో నిద్రిస్తున్న కుండలినీ శక్తిని జాగృతంచేసి సహస్రారానికి చేర్చినట్లేతే, అజ్ఞాని అయిన సాధకుడికి భగవసాక్షాత్కారం కలుగుతుంది. కాగా జ్ఞానికి

ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది. అంటే పరబ్రహ్మస్వరూపమైన పరమేశ్వరి సాధకుని

దేహమనే శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ అయిన సర్వానందమయ చక్రమనే బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నది.


ఇప్పుడు అజ్ఞాని అయిన భండాసురునికి జ్ఞానాన్ని ప్రసాదించటానికి ఆ దేవి అతడితో యుద్ధానికి సమాయత్త మవుతున్నది. శ్రీచక్రరథమును సిద్ధిపొందినవాడు అనగా శ్రీవిద్యలో సిద్ధిపొందినవాడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అతడికి సాయుజ్యం లభిస్తుంది.


శంకరభగవత్పాదులవారు శ్రీచక్రమును ఈ విధంగా వర్ణించారు:


*చతుర్భిః శ్రీకంఠైః - శివయువతిభిః పంచభిరపి|*


*ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |*


*చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ*


 *త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః || 11 ||*


శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, నలుబదినాలుగు అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.


*భావము:*


అమ్మా...శ్రీచక్రంలో శివకోణములు నాలుగు,( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు, ( వీటి కోణములు పైకి ఉండును.) మూలప్రకృతులు తొమ్మిది ,అష్టదళములు ఎనిమిది, షోడశదళములు పదహారు , త్రివలయములు మూడు , భూపురత్రయములు మూడు . ఈ తీరున శ్రీచక్రంలో మొత్తం నలుబది నాలుగు కోణములు ఉండును. అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది తల్లీ. శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. శ్రీచక్రమునందు నలుబదినాలుగు కోణములు, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు, ఇరువది నాలుగు సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, అస్తి అనునవి ఐదు శక్తి మూలకములు,  ధాతువులు.  మజ్జ,శుక్రము,ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,

పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు,సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంత ర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోనగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.


ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.


 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు.


అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదట సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.


ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరుగవలెను.


సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *20.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తస్మాద్యుక్తేంద్రియగ్రామో యుక్తచిత్త ఇదం జగత్|*


*ఆత్మనీక్షస్వ వితతమాత్మానం మయ్యధీశ్వరే॥12434॥*


కావున, ఉద్ధవా! నీవు ఇంద్రియములను, చిత్తమును వశమునందుంచుకొని, ఈ సంపూర్ణ విశ్వమును ఆత్మయందు చూడుము. ఆత్మను సర్వేశ్వరుడైన నాయందు దర్శింపుము.


*7.10 (పదియవ శ్లోకము)*


*జ్ఞానవిజ్ఞానసంయుక్త ఆత్మభూతః శరీరిణామ్|*


*ఆత్మానుభవతుష్టాత్మా నాంతరాయైర్విహన్యసే॥1245॥*


'సకల దేహములలోనున్న ఆత్మ నీ ఆత్మ స్వరూపమే' అని భావింపుము. ఇట్టి ఆత్మానుభవమునందు ఆనందమగ్నుడవై జ్ఞానవిజ్ఞాన సంపన్నుడవు కమ్ము. అప్పుడు ఎట్టి విఘ్నములు ఏర్పడినను నీవు కలత చెందవు.


*7.11 (పదకొండవ శ్లోకము)*


*దోషబుద్ధ్యోభయాతీతో నిషేధాన్న నివర్తతే|*


*గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథార్భకః॥12436॥*


'గుణదోషములు' అను రెండింటి నుండి పూర్తిగా అతీతుడవు కమ్ము. పసిబాలునకు గుణబుద్ధి యుండదు. దోషబుద్ధియు ఉండదు. గుణబుద్ధితో అతడు విహితకర్మలను చేయడు. దోషబుద్ధితో అతడు నిషిద్ధకర్మలనుండి నివృత్తుడును కాడు. అతడు పరమహంసవలె ఉండును. అట్లే నీవును గుణదోషములకు అతీతుడవు అగుము.


*7.12 (పండ్రెండవ శ్లోకము)*


*సర్వభూతసుహృచ్ఛాంతో జ్ఞానవిజ్ఞాననిశ్చయః|*


*పశ్యన్ మదాత్మకం విశ్వం న విపద్యేత వై పునః॥12437॥*


జ్ఞానవిజ్ఞాన సంపన్నుడైన యోగి సకలప్రాణులయందును సుహృద్భావమును కలిగియుండును. అతడు సర్వదా ప్రశాంతచిత్తుడై యుండును. పరమాత్మతత్త్వమును దృఢముగా అనుభవించుచు దృశ్యమునంతయును నా స్వరూపముగనే భావించును. అట్టివాడు ఈ జననమరణ చక్రములో పరిభ్రమింపడు'.


*శ్రీశుక ఉవాచ*


*7.13 (పదమూడవ శ్లోకము)*


*ఇత్యాదిష్టో భగవతా మహాభాగవతో నృప|*


*ఉద్ధవః ప్రణిపత్యాహ తత్త్వజిజ్ఞాసురచ్యుతమ్॥12438॥*


*శ్రీశుకుడు ఇట్లు పలికెను* రాజా! శ్రీకృష్ణభగవానుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట భాగవతోత్తముడైన ఉద్ధవుడు ఆ స్వామికి ప్రణమిల్లి, తత్త్వజ్ఞానమును పొందగోరినవాడై ఆ దేవదేవునితో ఇట్లు నుడివెను.


*ఉద్ధవ ఉవాచ*


*7.14 (పదునాలుగవ శ్లోకము)*


*యోగేశ యోగవిన్యాస యోగాత్మన్ యోగసంభవ|*


*నిఃశ్రేయసాయ మే ప్రోక్తస్త్యాగః సన్న్యాసలక్షణః॥12439॥*


*ఉద్ధవుడు ఇట్లనెను* "పరమాత్మా! యోగేశ్వరా! నీవు యోగములకు గుప్తనిధివి. యోగస్వరూపుడవు. యోగశాస్త్రమునకు జన్మస్థానమైన వాడవు. నా పరమశ్రేయస్సుకొరకై సన్న్యాసరూపత్యాగమును ఉపదేశించితివి.


*7.15 (పదిహేనవ శ్లోకము)*


*త్యాగోఽయం దుష్కరో భూమన్ కామానాం విషయాత్మభిః|*


*సుతరాం త్వయి సర్వాత్మన్నభక్తైరితి మే మతిః॥12440॥*


అనంతా! విషయసుఖలోలుడైన వారికి కామములను త్యజించుట ఎంతయు కష్టము. సర్వాత్ముడవైన నీయందు భక్తిలేనివారికి ఆ త్యాగము ఇంకను కష్టమని నేను తలంతును.


*7.16 (పదహారవ శ్లోకము)*


*సోఽహం మమాహమితి మూఢమతిర్విగాఢః త్వన్మాయయా విరచితాత్మని సానుబంధే|*


*తత్త్వంజసా నిగదితం భవతా యథాహం సంసాధయామి భగవన్ననుశాధి భృత్యమ్॥12447॥*


ప్రభూ! *నేను-నాది* అను సుడిగుండములోబడి గిలగిలలాడుచున్నాను. నీ మాయాప్రభావమున నా బుద్ధి నా పరివారమునందును, స్వజనుల యందును మగ్నమైనది. అందువలన అజ్ఞానవశమున అహంకారమమకారములలో చిక్కుపడియున్నాను. ఇట్టి నాకు నీవు త్యాగధర్మమును *('సర్వం పరిత్యజ్య' అని)* ఉపదేశించితివి. కాని, ఆ త్యాగమును నేను సులభముగా నెరవేర్చగలిగెడు విధమును కూడా నీ భృత్యుడనైన నాకు నేర్పుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

హుహు ? ఎక్కడి వాడు ?

 ఎవరీ హుహు ? ఎక్కడి వాడు ?

________________________________


(1) 

(అ) ద్రోణి > దొన > కొండమీది నీటిగుంట.

(ఆ) ద్రోణి > దోసె > చిన్నపడవ

(ఇ) ద్రోణి > దోని > అమ్ములపొది.


(2) వాడికి కాస్తా మకరు, చెప్పిన మాట వినడు.

(అ) మకురు > మూర్ఖుడు

(ఆ) మకురు > మొండి


(3) అప్పటి స్నానాలు ఐదురకాలు

(అ) ఆగ్నేయము > వళ్ళంతా విభూది పూసుకోవడం. అప్పటి విభూది రోగక్రిమినాశిని, అందుకే పూసుకొనేవారు.

(ఆ) వారుణం > నీటిలో మునిగి స్నానంచేయుట.

(ఇ) బ్రాహ్మ్యము > మంత్రపఠనం చేస్తూ దర్భలతో నీటిని వదలుట.

(ఈ) వాయువ్యం > సాయంత్రం గోవులు ఇంటికి వచ్చే సమయంలో రేగిన గోదూళిని తలపై పడునట్లుగా చేసుకొనుట.

( ఉ) దివ్యం > ప్రొద్దున సాయంత్ర సమయంలో ఎండలో నిలబడుట.


(4) హుహు > గజేంద్రమోక్షఘట్టంలో కొలనులో మొసలిగావుండి ఏనుగుకాలును పట్టుకొని పీడించినది హుహు అనే గంధర్వుడే. ఇతను పూర్వం దేవమునుల శాపం వలన మొసలిగా భూలోకంలో పడివుంటాడు. అగస్త్యమహముని శాపవశాన ఇంద్రజ్ఞమునుడు అనే రాజు ఏనుగుగా జన్మిస్తాడు. ఈ ఇద్దరిని రక్షించి ఆ శ్రీ మహావిష్ణువు ముక్తిని ప్రసాదించాడు. అదే గజేంద్రమోక్షం.


(5) హస్తినాపురం > పూర్వం ధ్రితరాష్ట్ర అనే రాజుండేవాడు. దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రునకు చాలా పూర్వీకుడీ ధ్రితరాష్ట్ర.ఇతనికి కుండికా, హస్తి, వితార్కా, క్రాత, హవిహ్రవస్, ఇంద్రభా, సుహోత్రుడు,భూమన్యు అనే ఏనిమిదిమంది సంతానం.

వీరిలో హస్తి అనేవాడే హస్తినాపుర నిర్మాత, ఇతనికి ఇది రాజధాని కూడా.

గంగానది ఒడ్డున వుంది.

దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణకు స్వయంవరం ప్రకటించినపుడు శ్రీకృష్ణుని కొడుకు సాంబుడు ఆమెను ఎత్తుకుపోతాడు.

కౌరవులు సాంబుడిని బంధించి చెరశాలలో వుంచుతారు.

కోపించిన బలరాముడు హస్తినకు వచ్చి హస్తినాపురాన్ని గంగలో కలపటానికి నాగలి ద్వారా నదిని లాగటానికి ప్రయత్నిస్తాడు.

దుర్యోధనుడి శాంతింపచేసి లక్ష్మణను సాంబుడికిచ్చి పెండ్లిచేస్తాడు.

హస్తిన కౌరవుల రాజధాని. పూర్వపు హస్తిన గంగలో మునిగిపోయింది.


(6) పూజలు పుణ్యహవాచనముతో మొదలుపెట్టడం అనవాయితి.పుణ్యహము అంటే పుణ్యం, పుణ్యదినం. పుణ్యహవాచనమంటే పుణ్యహ అనే మాటను ముమ్మారు (మూడు సార్లు) ఉచ్ఛరించడం.


(7) తలకొరివి పెట్టడం > చితిపై ప్రేతంయొక్క తలకు కొరివి పెట్టడం.


(8) ఎదురుకోలు > వివాహానికి తరలి వచ్చిన వరున్ని అతని బంధువులను వధువు తరపువారు ఎదురెళ్ళి అహ్వానించడం.


(9) ఇనుమడించడం > ఇనుమారు > ఇను > రెండు. ఇనుమడించడమంటే రెండు రెట్లుగా పెరగడం. ఇమ్మడి నరసింహరాయలు > ఇమ్మడి > రెండు > రెండో నరసింహరాయలు.


(10) ఇనుమారు ముమ్మారు > ఇనుమారంటే రెండు రెట్లనిపైన చెప్పుకొన్నాం. ముమ్మారంటే మూడురెట్లు.ఇనుమారు ముమ్మారుగా అభివృద్ధి చెందడమంటే 2 రెట్లు 3 రెట్లుగా పెరగడం.

ముమ్మడి నరసింహరాయలు > ముమ్మడి > మూడు > మూడో నరసింహరాయలు.


॥సేకరణ॥

__________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

శ్రీమద్భాగవతము

 *20.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2267(౨౨౬౭)*


*10.1-1386-వ.*

*10.1-1387-*


*సీ. "గోపాలసింహంబు గోపించి వెల్వడి*

  *నిను గజేంద్రుని భంగి నేడు గూల్చె*

*యాదవేంద్రానిల మాభీలజవమున*

  *నిను మహీజము మాడ్కి నేల వ్రాల్చె*

*వాసుదేవాంభోధి వారి యుద్వేలమై*

  *నిను దీవి కైవడి నేడు ముంచె*

*దేవకీసుతవజ్రి దేవత లలరంగ*

  *నినుఁ గొండ క్రియ నేడు నిహతుఁ జేసె*

*తే. హా! మనోనాథ! హా! వీర! హా! మహాత్మ!*

*హా! మహారాజ! నీ విట్లు హతుఁడవైన*

*మనుచు నున్నార మక్కట! మమ్ముఁ బోలు*

*కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు?* 🌺 



*_భావము: కంసుడు అతని అనుచరులు నశించగా, వారి భార్యలు ఇళ్లలోంచి బయటకొచ్చి, తలలు బాదుకుంటూ కన్నీటిధారలు కురుస్తుండగా యుద్ధభూమిలో మడిసిన తమ భర్తల శరీరాలను కౌగిలించుకుంటూ విలపిస్తూ ఇలా అంటున్నారు: "గోపకిశోరము కోపించి నిన్ను మత్తగజమును కూల్చినట్లు కూల్చాడు. గొల్లపిల్లవాడనే వాయువు మహావేగముతో వచ్చి నిన్ను మహావృక్షమును కూలద్రోసినట్లు నేలకూల్చాడు. శ్రీకృష్ణుడనే మహా సముద్రము చెలియలి కట్ట దాటి ద్వీపములను ముంచేసినట్లు నిన్ను ముంచేశాడు. దేవకీసుతుడనే వజ్రాయుధము వంటి కృష్ణుడు కొండ వంటి నిన్ను పడగొట్టాడు. హా ప్రాణేశా ! వీరా! మహారాజా! నీవిలా మరణించియున్నా, మేము ఇంకా జీవించియే ఉన్నాము. మా బోటి రాతి గుండెలు కలవారుంటారా ఈ ప్రపంచములో?”._* 🙏 



*_Meaning: As Kamsa and his associates were killed, their wives came out with tears rolling down their eyes, clung to the bodies of their husbands and lamented: "This boy won over you like a lion overpowers the elephant. This cowherd boy attacked and thrashed you to ground like a gale uprooting the tree. This Sri Krishna, like the mighty ocean inundating the island, overwhelmed you. This son of Devaki and Vasudeva, felled you like the Vajrayudha vanquishing a mountain. O King! soulmate and warrior! It is our misfortune that we are still surviving in spite of the fact that you are dead. Will there be such heartless people in this world?"_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*