21, సెప్టెంబర్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం

 *21.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*అవధూతం ద్విజం కంచిచ్చరంతమకుతోభయమ్|*


*కవిం నిరీక్ష్య తరుణం యదుః పప్రచ్ఛ ధర్మవిత్॥12450॥*


ధర్మవేత్తయైన యదుమహారాజు ఒకసారి తరుణవయస్కుడైన ఒక బ్రాహ్మణ అవధూత నిర్భయముగా తిరుగుచుండుట చూచెను. పిమ్మట అతడు ఆ అవధూతను ఇట్లు ప్రశ్నించెను.


*అవధూతమ్ = అభ్యంగవాదిభిః అసంస్కృతదేహమ్, నతు వర్ణాశ్రమధర్మత్యాగినమ్, కుతశ్చిత్ శీతతాపాదిభయరహితమ్* అవధూత యనగా దేహమునకు అభ్యంగాది సంస్కారములను జరుపనివాడు. అతడు తీవ్రమైన చలికి, ఎండకు తట్టుకొనుచు నిర్భయముగా మసలుకొనుచుండును. ఐనను అతడు వర్ణాశ్రమ ధర్మములను త్యజింపడు.


*యదురువాచ*


*7.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*కుతో బుద్ధిరియం బ్రహ్మన్నకర్తుః సువిశారదా|*


*యామాసాద్య భవాఀల్లోకం విద్వాంశ్చరతి బాలవత్॥12451॥*


*యదుమహారాజు ఇట్లనెను* బ్రాహ్మణోత్తమా! నీవు ఎటువంటి కర్మలను ఆచరించుటలేదు. ఐనను, నీకు ఆత్మానాత్మ వివేకమును గూర్చిన ఇంత గొప్ప బుద్ధికౌశల్యము ఎట్లు లభించినది? తద్ద్వారా ఎంతో గొప్ప విద్వాంసుడవైనప్పటికినీ ఈ లోకంలో నీవు బాలునివలె ఎట్లు మసలుచుంటివి?


*7.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ప్రాయో ధర్మార్థకామేషు వివిత్సాయాం చ మానవాః|*


*హేతునైవ సమీహంతే ఆయుషో యశసః శ్రియః॥12452॥*


*7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*త్వం తు కల్పః కవిర్దక్షః సుభగోఽమృతభాషణః|*


*న కర్తా నేహసే కించిజ్జడోన్మత్తపిశాచవత్॥12453॥*


మానవులు తఱచుగా ఆయస్సును, యశస్సును, సంపదలను పొందగోరి, ధర్మార్థకామములయందును, తత్త్వజిజ్ఞాసయందును ప్రవృత్తులగుచుందురు. కానీ, నీవు సమర్థుడవు, జ్ఞానివి, దక్షుడవు, స్ఫురద్రూపివి, మధురభాషివి; ఐనను నీవు ఏ పనినీ చేయవు, దేనినీ కోరవు. కానీ నీవు జడుడు, ఉన్మత్తుడు ఐన అవధూతవలె ఆత్మానందమును పొందుచున్నావు.


*7.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నినా|*


*న తప్యసేఽగ్నినా ముక్తో గంగాంభఃస్థ ఇవ ద్విపః॥12454॥*


జనులు కామక్రోధలోభములనెడి దావానలములోబడి మ్రగ్గుచుందురు. కానీ వారు ఆ అగ్నినుండి ఏవిధముగను బయటపడజాలరు. కానీ నీవు ముక్తుడవు. నిన్ను ఆ అగ్నియొక్క సెగ ఇంచుక కూడా తాకినట్లు కనిపించుటలేదు. గంగాజలములలో నున్న ఏనుగును దావానలము దరిజేరజాలదు. పైగా అది (ఆ ఏనుగు) చల్లదనమును అనుభవించుచుండును. అదేవిధముగా ముక్తుడవైన నీపై కామలోభములనెడి సాంసారిక తాపములు ఎట్టి ప్రభావమునూ చూపజాలవు.


*7.30 (ముప్పదియవ శ్లోకము)*


*త్వం హి నః పృచ్ఛతాం బ్రహ్మన్నాత్మన్యానందకారణమ్|*


*బ్రూహి స్పర్శవిహీనస్య భవతః కేవలాత్మనః॥12455॥*


మహాత్మా! నీకు ఈ సాంసారిక విషయములలో దేనియందును ఆసక్తిలేదు. శబ్దాది విషయస్పర్శలు లేకుండా కేవలము ఎట్టి అనుబంధములును లేని దేహమునందు ఉన్నావు. అనిర్వచనీయమైన నీ ఈ ఆత్మానందమునకు కారణమేమి? దయతో తెలుపుము".


*శ్రీభగవానువాచ*


*7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*యదునైవం మహాభాగో బ్రహ్మణ్యేన సుమేధసా|*


*పృష్టః సభాజితః ప్రాహ ప్రశ్రయావనతం ద్విజః॥12456॥*


*శ్రీకృష్ణభగవానుడు ఇట్లు నుడివెను* "ఉద్ధవా! యదుమహారాజు బ్రాహ్మణభక్తి తత్పరుడు, బుద్ధికుశలుడు. అతడు వినమ్రభావముతో అవనత శిరస్కుడై మహాత్ముడైన ఆ అవధూతను భక్తిశ్రద్ధలతో పూజించి ప్రశ్నింపగా ఆ మహానుభావుడు ఇట్లు వచించెను-


*బ్రాహ్మణ ఉవాచ*


*7.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*సంతి మే గురవో రాజన్ బహవో బుద్ధ్యుపాశ్రితాః|*


*యతో బుద్ధిముపాదాయ ముక్తోఽటామీహ తాన్ శృణు॥12457॥*


*బ్రహ్మవేత్త దత్తాత్రేయుడు వచించెను* "యదుమహారాజా! నేను బుద్ధిపూర్వకముగా పెక్కుమంది గురువులను ఆశ్రయించితిని. వారివలన నేను జ్ఞానోపదేశమును పొంది, ముక్తుడనై ఇట్లు సంచరించుచున్నాను. ఆ విషయములను అన్నింటిని తెలిపెదను వినుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: