*20.09.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*7.9 (తొమ్మిదవ శ్లోకము)*
*తస్మాద్యుక్తేంద్రియగ్రామో యుక్తచిత్త ఇదం జగత్|*
*ఆత్మనీక్షస్వ వితతమాత్మానం మయ్యధీశ్వరే॥12434॥*
కావున, ఉద్ధవా! నీవు ఇంద్రియములను, చిత్తమును వశమునందుంచుకొని, ఈ సంపూర్ణ విశ్వమును ఆత్మయందు చూడుము. ఆత్మను సర్వేశ్వరుడైన నాయందు దర్శింపుము.
*7.10 (పదియవ శ్లోకము)*
*జ్ఞానవిజ్ఞానసంయుక్త ఆత్మభూతః శరీరిణామ్|*
*ఆత్మానుభవతుష్టాత్మా నాంతరాయైర్విహన్యసే॥1245॥*
'సకల దేహములలోనున్న ఆత్మ నీ ఆత్మ స్వరూపమే' అని భావింపుము. ఇట్టి ఆత్మానుభవమునందు ఆనందమగ్నుడవై జ్ఞానవిజ్ఞాన సంపన్నుడవు కమ్ము. అప్పుడు ఎట్టి విఘ్నములు ఏర్పడినను నీవు కలత చెందవు.
*7.11 (పదకొండవ శ్లోకము)*
*దోషబుద్ధ్యోభయాతీతో నిషేధాన్న నివర్తతే|*
*గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథార్భకః॥12436॥*
'గుణదోషములు' అను రెండింటి నుండి పూర్తిగా అతీతుడవు కమ్ము. పసిబాలునకు గుణబుద్ధి యుండదు. దోషబుద్ధియు ఉండదు. గుణబుద్ధితో అతడు విహితకర్మలను చేయడు. దోషబుద్ధితో అతడు నిషిద్ధకర్మలనుండి నివృత్తుడును కాడు. అతడు పరమహంసవలె ఉండును. అట్లే నీవును గుణదోషములకు అతీతుడవు అగుము.
*7.12 (పండ్రెండవ శ్లోకము)*
*సర్వభూతసుహృచ్ఛాంతో జ్ఞానవిజ్ఞాననిశ్చయః|*
*పశ్యన్ మదాత్మకం విశ్వం న విపద్యేత వై పునః॥12437॥*
జ్ఞానవిజ్ఞాన సంపన్నుడైన యోగి సకలప్రాణులయందును సుహృద్భావమును కలిగియుండును. అతడు సర్వదా ప్రశాంతచిత్తుడై యుండును. పరమాత్మతత్త్వమును దృఢముగా అనుభవించుచు దృశ్యమునంతయును నా స్వరూపముగనే భావించును. అట్టివాడు ఈ జననమరణ చక్రములో పరిభ్రమింపడు'.
*శ్రీశుక ఉవాచ*
*7.13 (పదమూడవ శ్లోకము)*
*ఇత్యాదిష్టో భగవతా మహాభాగవతో నృప|*
*ఉద్ధవః ప్రణిపత్యాహ తత్త్వజిజ్ఞాసురచ్యుతమ్॥12438॥*
*శ్రీశుకుడు ఇట్లు పలికెను* రాజా! శ్రీకృష్ణభగవానుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట భాగవతోత్తముడైన ఉద్ధవుడు ఆ స్వామికి ప్రణమిల్లి, తత్త్వజ్ఞానమును పొందగోరినవాడై ఆ దేవదేవునితో ఇట్లు నుడివెను.
*ఉద్ధవ ఉవాచ*
*7.14 (పదునాలుగవ శ్లోకము)*
*యోగేశ యోగవిన్యాస యోగాత్మన్ యోగసంభవ|*
*నిఃశ్రేయసాయ మే ప్రోక్తస్త్యాగః సన్న్యాసలక్షణః॥12439॥*
*ఉద్ధవుడు ఇట్లనెను* "పరమాత్మా! యోగేశ్వరా! నీవు యోగములకు గుప్తనిధివి. యోగస్వరూపుడవు. యోగశాస్త్రమునకు జన్మస్థానమైన వాడవు. నా పరమశ్రేయస్సుకొరకై సన్న్యాసరూపత్యాగమును ఉపదేశించితివి.
*7.15 (పదిహేనవ శ్లోకము)*
*త్యాగోఽయం దుష్కరో భూమన్ కామానాం విషయాత్మభిః|*
*సుతరాం త్వయి సర్వాత్మన్నభక్తైరితి మే మతిః॥12440॥*
అనంతా! విషయసుఖలోలుడైన వారికి కామములను త్యజించుట ఎంతయు కష్టము. సర్వాత్ముడవైన నీయందు భక్తిలేనివారికి ఆ త్యాగము ఇంకను కష్టమని నేను తలంతును.
*7.16 (పదహారవ శ్లోకము)*
*సోఽహం మమాహమితి మూఢమతిర్విగాఢః త్వన్మాయయా విరచితాత్మని సానుబంధే|*
*తత్త్వంజసా నిగదితం భవతా యథాహం సంసాధయామి భగవన్ననుశాధి భృత్యమ్॥12447॥*
ప్రభూ! *నేను-నాది* అను సుడిగుండములోబడి గిలగిలలాడుచున్నాను. నీ మాయాప్రభావమున నా బుద్ధి నా పరివారమునందును, స్వజనుల యందును మగ్నమైనది. అందువలన అజ్ఞానవశమున అహంకారమమకారములలో చిక్కుపడియున్నాను. ఇట్టి నాకు నీవు త్యాగధర్మమును *('సర్వం పరిత్యజ్య' అని)* ఉపదేశించితివి. కాని, ఆ త్యాగమును నేను సులభముగా నెరవేర్చగలిగెడు విధమును కూడా నీ భృత్యుడనైన నాకు నేర్పుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి