21, సెప్టెంబర్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం

 *21.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.17 (పదిహేడవ శ్లోకము)*


*సత్యస్య తే స్వదృశ ఆత్మన ఆత్మనోఽన్యం వక్తారమీశ విబుధేష్వపి నానుచక్షే|*


*సర్వే విమోహితధియస్తవ మాయయేమే బ్రహ్మాదయస్తనుభృతో బహిరర్థభావాః॥12442॥*


సర్వేశ్వరా! నీవు సత్వస్వరూపుడవు. స్వయంప్రకాశ స్వరూపుడవు. నీవు సకలప్రాణులలో అంతరాత్మవై యుండి వెలుగులను ప్రసాదించుచుండువాడవు. కనుక ఆత్మతత్త్వమును గూర్చి బోధించుటకు నీవు తప్ప దేవతలలోగూడ ఎవ్వరును సమర్థులుగా నాకనిపించుట లేదు. కర్మాధీన దేహధారులైన ఈ బ్రహ్మాదిదేవతలు అందరును నీ మాయచే మోహితులై బాహ్యదృష్టిని కలిగియున్నారు.


*7.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*తస్మాద్భవంతమనవద్యమనంతపారం సర్వజ్ఞమీశ్వరమకుంఠవికుంఠధిష్ణ్యమ్|*


*నిర్విణ్ణధీరహము హ వృజినాభితప్తో నారాయణం నరసఖం శరణం ప్రపద్యే॥12443॥*


దేవా! అందువలన నలువైపులనుండి వ్యాపించిన దుఃఖముల తాపముచే నేను తపించి పోవుచున్నాను. తద్ద్వారా విరక్తి చెందిన నేను, నిన్ను శరణుజొచ్చుచున్నాను. నీవు దోషరహితుడవు. దేశకాలాది అవధులకు అతీతుడవు. సర్వజ్ఞుడవు. సర్వశక్తిమంతుడవు. అప్రతిహతమగు వైకుంఠలోక నివాసుడవు. నరులకు నిత్యసఖుడవు. నారాయణుడవు. కనుక, నీవు నాకు శ్రేయోమార్గమును ఉపదేశించి, నన్ను ఉద్ధరింపుము.


*శ్రీభగవానువాచ*


*7.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ప్రాయేణ మనుజా లోకే లోకతత్త్వవిచక్షణాః|*


*సముద్ధరంతి హ్యాత్మానమాత్మనైవాశుభాశయాత్॥12444॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* "ఉద్ధవా! లోకమున ఆత్మానాత్మ విచక్షణ చేయుటయందు కుశలులై కొద్దిమంది మానవులు సుశిక్షితమైన మనస్సుద్వారా (కుశాగ్రబుద్ధిద్వారా) విషయవాసనలనుండి తమను తామే ఉద్ధరించుకొందురు.


*7.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః|*


*యత్ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోఽసావనువిందతే॥12445॥*


మానవుడు మాత్రమే తన జీవితకాలములో ప్రత్యక్ష-అనుమాన ప్రమాణములద్వారా జగత్తుయొక్క అనిత్యత్వమును దర్శించి, వైరాగ్యముద్వారా తన శ్రేయస్సును పొందగలడు. కనుక పురుషుడు తనకు తానే గురువు.


*7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*పురుషత్వే చ మాం ధీరాః సాంఖ్యయోగవిశారదాః|*


*ఆవిస్తరాం ప్రపశ్యంతి సర్వశక్త్యుపబృంహితమ్॥12446॥*


మనుష్యయోని యొక్క గొప్పతనమేమనగా సాంఖ్యశాస్త్రము నందును, యోగశాస్త్రమునందును కోవిదులు జితేంద్రియులైన మానవులు సర్వశక్తిమంతుడైన పరమాత్మునిగ నన్ను ప్రత్యక్షరూపమున దర్శింతురు. అట్లే వారు సర్వవ్యాపకుడైన విరాట్ పురుషునిగా నిరాకార రూపములో గూడ నన్ను సాక్షాత్కరింపజేసికొందురు.


*7.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ఏకద్విత్రిచతుష్పాదో బహుపాదస్తథాపదః|*


*బహ్వ్యః సంతి పురః సృష్టాస్తాసాం మే పౌరుషీ ప్రియా॥12447॥*


ఒక పాదము, రెండు పాదములు, మూడు పాదములు, నాలుగు పాదములు, బహుపాదములు, పాదములు లేనివి అగు ప్రాణులను నేను సృజించితిని. కానీ వాటిలో అన్నింటికంటెను పురుషార్థసాధకమగు మానవశరీరమే నాకు మిగుల ప్రియమైనది.


*7.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*అత్ర మాం మార్గయంత్యద్ధా యుక్తా హేతుభిరీశ్వరమ్|*


*గృహ్యమాణైర్గుణైర్లింగైరగ్రాహ్యమనుమానతః12448॥*


ఈ మానవజన్మయందు ప్రజ్ఞావంతులైన వారలు బుద్ధి మొదలగువాటిద్వారా తెలియబడునట్టి హేతువులతో, గుణములతో, చిహ్నములతో గ్రాహ్యము కానట్టి పరమాత్మనగు నన్ను, అనుమానాది ప్రమాణములద్వారా సాక్షాత్కరింపజేసికొందురు.


*7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్|*


*అవధూతస్య సంవాదం యదోరమితతేజసః॥12449॥*


ఈ విషయములో మహాత్ములు ప్రాచీనమైన ఒక ఇతిహాసమును తెలుపుదురు. ఇది అమితతేజోమూర్తియైన దత్తాత్రేయునకును యదుమహారాజునకు మధ్య జరిగిన సంవాదరూపమున ఉన్నది. (సంవాదము అనగా ప్రశ్నోత్తరరూప సంభాషణము).


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: