17, ఫిబ్రవరి 2026, మంగళవారం

పంచాంగం



18ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🌷 *బుధవారం*🌷 

  *🪷18ఫిబ్రవరి2026🪷*

    *దృగ్గణిత పంచాంగం*               

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : పాడ్యమి* ‌సా 04.57 వరకు ఉపరి *విదియ*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : శతభిషం* రా 09.16 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం : శివ* *రా 10.45* వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : బవ* సా 04.57 *బాలువ* రా.తె 04.31 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  :*మ 02.04 - 03.40*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    :రా03.33-05.08 తె*

*దుర్ముహూర్తం  :ప11.58- 12.45*

*రాహు కాలం   :మ12.21- 01.49*

గుళికకాళం      : *ఉ 10.54 - 12.21*

యమగండం    : *ఉ 07.59 - 09.27*

సూర్యరాశి : *కుంభం*                     

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.42*  

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం       :*ఉ 06.32- 08.52*

సంగవ కాలం      :*08.52 - 11.12*

మధ్యాహ్న కాలం   :*11.12 - 01.31*

అపరాహ్న కాలం   :*మ 01.31-03.51*

*ఆబ్ధికం తిధి :ఫాల్గుణ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం    :*సా 03.51 - 06.11*

ప్రదోష కాలం       :*సా 06.11- 08.39*

రాత్రి కాలం         :*రా 08.39- 11.56*

నిశీధి కాలం        :*రా11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.53 - 05.42*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ శ్లోకం🌷*


        *ఇంద్రనీలాలకా*     

      *చంద్రబింబాననా*

       *పక్వబింబాధరా*  

       *రత్నమౌళీధరా*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

ఫాల్గుణం మాసం*

☸️✳️🔆🐚🛕🔆✳️🐚☸️


      *ఫాల్గుణం మాసం*

*18తేదీ బుధవారం నుండి*

          *ప్రారంభం*

                       

*🐚ఫాల్గుణం ప్రఖ్యాతం.....*


*సూర్యతేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు.. ఋతువులు, మాసాలు, తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి.*


*ప్రకృతిలో ఆకురాలే కాలం. నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు, ఆహ్లాద వాతావరణం ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం. వసంతం అంకురించే కాలము పచ్చదనము పరిమళించే కాలం ఆద్యంతమూ ఆనందభరితమైన, లౌకిక ఆధ్యాత్మిక సమ్మిళితమైన అనుభూతులను పంచే కాలం అదే ఫాల్గుణ మాస శుభతరుణం*


*షడృతువులలో ఆఖరిదైన శిశిర ఋతువులలో రెండవది, మాసాలలో చివరిది ఫాల్గుణం.*


*ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది. కామోద్రేకం వలన మానసికానందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు. ఆ సమయంలో మనో నిగ్రహం కావాలి. దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించుటకు అనువైన మాసం ఫాల్గుణము.*


*వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణీ నక్షత్రం. అందు ప్రధమం పూర్వ పల్గుణీ (పుబ్బ) ద్వితీయం ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించుట వలన ఫల్గుణుడయ్యాడు. పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రం ఉన్న చాంద్రమాసమును ఫల్గుణ మాసమని పిలుస్తారు. ఈ మాసం శిశిర ఋతువుకు వీడ్కొలు చెప్తూ వసంతాగమనానికి ఆహ్వానం పలుకుటకు స్వాగత ద్వారం వంటిది.*

*ఫల+గుణ = ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. కావుననే ఫాల్గుణం విశిష్టమైనది, దివ్య ప్రభావం కలిగినది. అందుకే ప్రాముఖ్యత పొందింది.*


*విష్ణు సహస్రనామాలలో శిశిరఃశర్వరీ కరః నారాయణునకు ఒక నామం కలదు. నారాయణుడు ఈ సమాసంలో గోవిందనామంతో నియామకుడు. ఈ కారణంచే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు.*


*ఫల్గుణీ నక్షత్రం దేవతా గణం. పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి సూర్యడు "ఆర్యముడు” అనే పేరుతో దేవతగా ఉంటాడు. ఈయన అధిక తేజస్సు కలవాడు కావున దేవతలందరూ అనుసరించి ఉంటారు. ఫాల్గుణ మాసంలో ఎన్నో వ్రతాలాచరించాలని శాస్త్ర వచనం.*


*నేటినుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త వేళలో క్రియాశీలమైన సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైన మాసం. ఫాల్గుణం ఆధ్యాత్మికమయం, తపోమయం, ఆరోగ్యమయం. విజ్ఞానమయం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతం ప్రయోవ్రతమంటారు. ఈ పన్నెండు దినాలు నదీస్నానమాచరించాలి. పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని "తిల" చతుర్థి అంటారు. దీనినే పుత్రగణపతి వ్రతమని, శాంత చతుర్థీ వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత హోమం చేసినవారు తినాలి. దీని వలన సర్వవిఘ్నాలు తొలగిపోతాయి. ఈ రోజున పుత్రగణపతి వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది.*


*శుద్ధ పంచమినాడు అనంత పంచమి వ్రతం చేయాలి. ఈనాడు గణేశుని అర్చించి నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి. సప్తమి నాడు అర్కసంపుట సప్తమి ఆచరించాలి. ఉషోదయ కాల స్నానానంతరం సూర్యునకు అర్ఘ్యమివ్వాలి. సూర్యనమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్. కావున ఆరోగ్యం కొరకు సూర్యుని ప్రార్థించాలి.*


*ఈ మాసంలో లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం, సంపద చేకూరుతుంది. లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీలక్ష్మీ నారాయణులను తులసి దళాలతో మందార పుష్పాలతో అర్చించాలి. మీన సంక్రమణం మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను పూజించి ఉపవాసం, జాగరణం చెయ్యాలి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీలక్ష్మీ నారాయణులను పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన వ్రతాల వలన వేలకొలది గోదానాలు చేసిన ఫలితా కలుగుతుంది. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీనృసింహస్వామిని అర్చిస్తే సర్వ విఘ్నాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే గంగానది స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్నిస్తుంది. శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కొరకు మన్మధ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీమహేశ్వర వ్రతమాచరించాలి. ఈ నెలలో హోళి పండుగ నిర్వహిస్తారు. పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని, హోళి అని, 'హోల' అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈ రోజు ఉదయాన్నే ఎండిన పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానిలో రాక్షస పీడ పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆవహింపజేసి "శ్రీహోళికాయైనమః " అని పూజించి మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ "వందితాసి సురేంద్రణే బ్రహ్మణా శంకరేణ ఛ అతస్త్వాం పాహినోదేవి భూతే భూతి ప్రధోభవ" అని చదవాలి.*


*హోళి పసుపుకు, పసుపు పరిమళానికి ప్రతీక. నీటిలో కలిపిన ద్రవాన్ని "వసంతం" అని అంటారు.*


*వసంతాలాడుకోవడం వసంతమాసానికి స్వాగతం చెప్పడమే. పూర్ణిమ సాయంత్రం నృత్యగీత వాద్యాలతో బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి డోలోత్సవం జరపాలి. ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం.*


*ఈ పూర్ణిమనాడు మధురైలో శ్రీమీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ముత్తెదువచే వందన తిలకం, నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పూవును భక్షించడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.*


*బహుళ ఏకాదశిని విజయైకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను అర్చించి ఉపవాసముండి నియమ బద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి.*


*బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమవాస్య అంటారు. ఈరోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం శ్రేష్ఠం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగరమథనం జరిగింది. అయ్యప్పస్వామి అవతరణ, ఈ మాసంలోనే జరిగింది. ఈమాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం. భక్తులందరికీ పావనం, ముక్తిదాయకం. అందుకే ఫాల్గుణం యింత ప్రాముఖ్యం.*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఉపచారం

 *ఉపచారం* 


ఆచమనం అంటే ఏమిటి


పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట 

చాలా సార్లు వింటాం. 

కానీ ఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు.

 అందుకే ''ఆచమనం'' అంటే ఏమిటో, 

దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


"ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది. 

ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు,

భోజనానికి ముందు, తర్వాత, 

బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత 

ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత 

ఆచమనం చేయొచ్చు.

ఆచమనం చేసే వ్యక్తి శుచిగా,శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.


ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. 

అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని 

(ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు) 

పోసి, వాటిని తాగాలి. 

చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, 

తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి.


ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు.. బాగానే ఉంది. 

1.అసలు ఆచమనం ఎందుకు చేయాలి? 

2.నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి? 

3.అలా ఎందుకు తాగాలి?

4.ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?

5.మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?

6. నీరు కొంతఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది? 7.“కేశవాయ స్వాహా,నారాయణాయ స్వాహా, 

మాధవాయ స్వాహా...” అని మాత్రమేఎందుకు చెప్పాలి? 


ఇలాంటి సందేహాలు కలగడం సహజం. 

అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం.


మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. 

దీన్ని స్వరపేటిక అంటాం. 

దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక 

కొంత వరకూ రక్షణ లభిస్తుంది. 

అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, 

అంత సున్నితమైనది. 

ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు,

ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. 

స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. 

ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. 

ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి,ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. 

స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.


ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.


ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా! 

గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. 

ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.


శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. 

ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, 

అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది. 


రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.


“కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది.

నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. 

చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. 


ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు,నాలుక, పెదాలకు 

వ్యాయామం లభిస్తుంది. 

పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, 

భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.


ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, 

చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, 

మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. 

అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.


ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.


ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.


ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.

మంచి మనుష్యులుగా మెలుగుదాము*

 *మంచి మనుష్యులుగా మెలుగుదాము*




మనిషి స్వభావం 

అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. కొంత మందిని చూస్తే ఎప్పుడూ కోపంగా, గంభీరంగా, మొహం ముడిచేసి ఉంటారు. 


అలాంటి వారి దగ్గరకు వెళ్లాలంటే చాలామందికి భయం మరియు చిరాకు వేస్తుంది. తమ బాధను చెప్పుకోవాలనిపించినా, సమస్యను పంచుకోవాలనిపించినా, వారి దగ్గరకు వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వారు కఠినంగా కనిపిస్తారు. 


అలాంటి స్వభావం వల్ల ఇతరులు *వారి* నుండి దూరంగా వెళ్లిపోతారు. *వారితో* ప్రేమ, అనుబంధం, స్నేహం ఇవన్నీ తగ్గిపోతాయి.


మనిషి జీవితం ఒంటరిగా గడవడానికి కాదు. మనం అందరం ఇతరులతో కలిసిమెలిసి, ఒకరికి ఒకరం తోడుగా ఉండడానికే పుట్టాం. 


ఒక మంచి వ్యక్తి అంటే తన దగ్గరకు వచ్చినవారు సంతోషంగా తిరిగి వెళ్లేలా ఉండాలి. తన వద్దకు వెళ్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అనిపించాలి. తనతో మాట్లాడితే మనసుకు తేలిక అవుతుంది అనిపించాలి. అలాంటి వ్యక్తి సమాజంలో అందరికీ అవసరమవుతాడు.


ఎవరైనా తమ బాధను చెప్పుకోవడానికి ఒక చోటు కావాలి. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సందేహాలు ఉంటాయి. ఆ సమయంలో ఒకరు సహాయం చేస్తే, ఓదార్పు మాట చెప్పితే, ఆ మనిషి మనసు ఎంతో తేలిక అవుతుంది. 


అందుకే మనం ఎప్పుడూ చిరునవ్వుతో, ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. మన మాటలు మృదువుగా ఉండాలి. అప్పుడు మన దగ్గరకు వచ్చినవారు భయపడకుండా తమ సమస్యలను చెప్పుకుంటారు.


 సమాజంలో ఎవరైనా ఈ వ్యక్తి దగ్గరకు వెళ్తే నాకు ఏదో ఒక మంచి సలహా దొరుకుతుంది అని అనుకునేలా ఉండాలి. 


*అంతేగాని ఈ సమాజంతో నాకేమి పని. నాకున్నది చాలు, నా వాళ్ళు నాకున్నారు* అని అనుకోరాదు.


మంచి మనుషుల చుట్టూ ఎప్పుడూ మనుషులు ఉంటారు. వారి దగ్గర ప్రేమ, నమ్మకం, గౌరవం పెరుగుతాయి.

ఎప్పుడూ కోపంగా, కఠినంగా కనిపించడం వల్ల వారికి ఇతరులకు దూరం ఏర్పడుతుంది. మనిషి ముఖంలో చిరునవ్వు ఉంటేనే దగ్గరకు రావాలనిపిస్తుంది. 


ఒక మంచి మాట, ఓదార్పు చూపు, ఓపికగా వినే స్వభావం ఇవే మనిషిని గొప్పవాడిగా చేస్తాయి. ఎవరి సమస్య అయినా శ్రద్ధగా విని, తాను తెలిసినంతలో మార్గం చూపితే, అతను అందరికీ ఆప్తుడవుతాడు.


మన దగ్గరకు వచ్చినవారికి సాంత్వన ఇవ్వాలి. కొన్నిసార్లు పరిష్కారం ఇవ్వలేకపోయినా, వారి మాటలు ఓపికగా వినడం కూడా ఒక పెద్ద సహాయమే. 


మనతో కాసేపు కూర్చుంటే వారికి కొత్త విషయాలు తెలుస్తే, మంచి ఆలోచనలు వస్తే, అది మన జీవితానికి గొప్ప అర్థం ఇస్తుంది. 


మన సాంగత్యం వల్ల ఎవరికైనా మంచి మార్గం కనిపిస్తే, అంతకంటే గొప్ప సంతోషం మరొకటి లేదు.


అలాగే మన ప్రవర్తన ప్రేమతో, కరుణతో నిండివుండాలి. కోపం వచ్చినా అదుపులో పెట్టుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం కేవలం ఒక మనిషిగా కాకుండా, అందరికీ అవసరమైన వ్యక్తిగా మారాలి.


ఒక మనిషి జీవితంలో గొప్పదనం అతని సంపదలో కాదు, అతని హృదయంలో ఉంటుంది. తన దగ్గరకు వచ్చినవారికి ధైర్యం ఇవ్వగలగడం, సమస్యలకు మార్గం చూపగలగడం ఇవే నిజమైన గొప్పతనం. 


అలాంటి వ్యక్తిగా తయారవ్వడం ప్రతి మనిషి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నవారు మన దగ్గరకు రావడానికి ఇష్టపడతారు, మన మీద నమ్మకం పెంచుకుంటారు, 

మనతో ఉండడం ద్వారా సంతోషాన్ని పొందుతారు.


*కొందరు పని గట్టుకుని తమ స్థాయిలను మర్చి ఇతరులను అదేపనిగా విమర్శిస్తుంటారు* ఇది ఆత్మహత్య సదృశ్యము.


అందుకే ప్రతి ఒక్కరు హృదయం తెరిచిన మహర్షిలా ఉండాలి, విచ్చుకున్న గులాబి (పువ్వు) సుగంధ హృదయలా ఉండాలి. ప్రతి ఒక్కరు అందరిని (తోటి వారిని) ఆహ్వానించాలి హృదయంలోకి. 


మన మంచితనాన్ని విస్తృత స్థాయిలో సమాజానికి అందించాలన్నా, పంచాలన్నా సంస్థలలో చేరుదాము. అవుతే, సంస్థలలో చేరి నిమిత్తమాతృలుగా ఉండరాదు, క్రియాశీలంగా ఉండాలి. సంస్థల కార్యక్రమాలను అభిమానిద్దాము, సంస్థల అభివృద్ధికి సహకరిద్దాము.


ధన్యవాదములు

*(సేకరణ)*

.

సమాజ అధోగమనము*

 *సమాజ అధోగమనము


మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, స్వపరిపాలన వచ్చి 77 సంవత్సరాలు అయినది. విద్య, వైద్య, ఆర్థిక, సాంకేతిక మరియు రక్షణ రంగాలలో అభివృద్ధి పరంగా ఎంతో ఎదిగాము. *కాని, నైతికంగా ఎదగవలసినంతగా మనము ఎదగలేదు.* ప్రలోభాల ప్రభావాలను అధిగమించే తత్వాన్ని అలవరచుకొలేకపోతున్నాము, ఇంకా చెప్పుకుంటాము ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశమని. కాని *స్వార్థ పరంగా, దోషులను సమర్థించడంలో మరియు నేరస్తులను ఉపేక్షించడంలో నియమిత ఎల్లలు, హద్దులు దాటి ఎదిగాము*. 


రాజకీయ నాయకులు, ఇతర రంగాలలో ఉన్న ప్రముఖులు, పార్టీలు గాని అవకతవకలకు పాల్పడినప్పుడు వారి ప్రధమ మరియు ప్రధాన ఆయుధము *మతము, కులము, లింగ బేధం, ఉత్తరాది, దక్షిణాది వాదనలు*. గత వింశతి (20) సంవత్సరాలుగా దేశ చరిత్రను పరిశీలించిన వారికి, దోషభూయిష్టులైన ఏ ఏ నాయకులు, ఇతర రంగాలలోని ప్రముఖులు దేశ స్వతంత్రతను, ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడుకున్నారో అన్ని కరతలామలకములే, అభిజ్జానములే. 


సావకాశంగా సంఘటనలు పరిశీలిస్తే ఒక నాయకుడంటాడు నేను మైనారిటీ మతం వాడిని నన్ను బలి పశువును చేస్తున్నారు అని. ఇంకొక ప్రముఖుడంటాడు నేను వెనుకబడిన తరగతుల వాడిని కాబట్టి నాపై కక్ష్య కట్టారు అని. ఇంకొక ప్రముఖురాలంటుంది నేను మహిళను కాబట్టి నేరం ఆపాదిస్తున్నారు అని. రాజకీయ నాయకుల దుర్మార్గాలు, దుష్చేష్టలు, దురలవాట్లు బైటపడ్డప్పుడు, ఆ పార్టీ వాళ్ళు వందలకొద్దీ ధర్నాలు, సమ్మెలు. రక్షక భట శాఖ *నిందితులను* న్యాయస్థానాల వైపు తరలిస్తున్నప్పుడు, ఏ మాత్రం *న్యూనత* లేకుండా త్వరలో జనంలోకి వస్తామని చేతులూపుతూ నిర్బంధశాలలకు వెళ్తుంటారు. *తప్పులు చేసినా దోష భావన ఎక్కడా ప్రతిబింబించదు* ప్రతి రాజకీయ పార్టీకి అండ దండగా వారి సమాచార (పత్రిక, Tv) మాధ్యమాలు ఉంటాయి. అందులో పని గట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం మరియు ప్రత్యర్థులను నిందించడం మామూలైపోయింది. పార్టీల బేధం ఉన్నప్పుడు దక్షిణాది వారు ఉత్తరాది వారిని, ఉత్తరాది వారు దక్షిణాది వారిని విమర్శించడం సర్వ సాధారణమైనది. తమ తప్పులను సమర్థించుకోవడానికి మతాన్ని, కులాన్ని, వర్గాన్ని లింగాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ రాజకీయ వ్యక్తిగత లాభాలను పొందడానికి నిస్సిగ్గుగా వాడుకుంటున్నారు. *మనమందరము భారతీయులము అను జాతీయ భావం నాస్తి*. ఇన్ని రకాల స్వభావాల మధ్య జాతి ఐక్యత వర్ధిల్లాలి అంటే హిమాలయాల అధిరోహణా సామర్థ్యము కావాలేమో. *అధిక శాతం* పౌరులు *నైతికతను మరుగు పర్చుకుంటున్నారే తప్ప, మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నించడం లేదు. నైతికత, సత్య సంధ్యత*

*అలవర్చుకునే ప్రయత్నం చేయాలి*, ఎందుకంటే అధికులలో *అది లోపించింది కాబట్టి*.


దేశాభివృద్ధిని సాధిస్తూ అధిక శాతం ప్రజల చేత *స్వదేశంలోనే గాకుండా విశ్వ వ్యాప్తంగా మన్నన* పొందుతూ ఉన్న నాయకులు కొందరైతే, *భారత దేశానికి ఆయువు పట్టైన హైందవాన్ని ద్వేషిస్తూ, సరిహద్దులు దాటి దేశంలో ప్రవేశించే విదేశస్తులను ప్రోత్సహిస్తూ, విదేశాలలో దేశ పరువు తీస్తూ నాయకులనిపించుకునే వారు ఇంకొందరు.* 


ఒక్కొక్కసారి భారత ప్రజలకు (సామాన్యులు మరియు మాన్యులు) అనుమానం వస్తుంది నిజమైన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నైతిక అంధకారంలో ఉన్నామా అని. నేరస్తులైన నాయకులు, ప్రముఖుల విషయంలో ప్రజా స్పందన ఎలా ఉండాలంటే *పరువు తక్కువ వెధవా నేరం నుండి నిర్దోషిగా విడుదల అయ్యేవరకు మా వైపు రావద్దు*. ఎవరైనా చూస్తే మా పరువు పోతుందని భయం కాదు, *మా మనః సాక్షి ఒప్పుకోదు నీలాంటి నిదితులతో బంధం అని కరాఖండిగా చెప్పాలి. చెప్పగలిగే ధైర్యమే నిజాయితీ*. ఇంకా చెప్పాలంటే ఈలాంటి నిందితులకు శిక్ష పడిన తర్వాత సమాజం దూరం ఉంచాలి, ప్రముఖ స్థానాలకు అనర్హులను చేయాలి. *నిజాయితీగా జీవిద్దాము, దోషులను చట్టానికి అప్పగిద్దాం*


.

విశిష్ట వైద్యము - హోమియోపతి 2*

 *తెలుసుకుందాము*

*విశిష్ట వైద్యము - హోమియోపతి 2*


హోమియోపతి వైద్య విశేషములను ఒకసారి గమనిద్దాము. ఈ ఔషధములను వాడుటవలన పెక్కు లాభములు. 1) ప్రతి వ్యాధికి సారూప్యమైన ఔషధము కనుగొనబడింది. 2) ఔషధ ప్రయోగము వలన జనించిన రోగ లక్షణములు కొద్దికాలమే శరీరంపై ప్రభావం చూపి, సత్వరమే వ్యాధి నివారణ గావించి, పూర్తి స్వస్థత చేకూరును. 3) వైద్యుడు శరీర తత్వమును బట్టి క్రమ పద్ధతిలో మోతాదులను నిర్ణయించును. 4) ఈ ఔషధములన దుష్ఫలితములు ఉండవు. *కాని మోతాదును మించి వాడరాదు*. 


Dr హానిమన్ మరియు వారి సహాయకులు ప్రతి ఔషధమును ముందు తమపై ప్రయోగించుకుని, కనుగొన్న వ్యాధి లక్షణములను, అనుభవములను నమోదు చేసి, తదనుగుణంగా నికరమైన మందులను తయారు చేసి, మోతాదులను నిర్ణయించడం జరుగును. హోమియోపతి వైద్య లక్షణములను తెలియజేయు గ్రంథమే *హోమియో వస్తుగుణ దీపిక (Materia Medica)*. 


ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం హోమియోపతి వైద్య విధానంలో ఈ జబ్బుకు ఈ మందు అని ప్రత్యేకంగా ఉండదు. *అవుతే కొన్ని మందులను జన బాహుళ్యం కొరకు, తాత్కాలిక నివారణకు సూచిస్తూ ఉంటూంటారు*. వైద్యులు రోగ లక్షణములను పరిశీలించి, దానికి అనుగుణంగా ఉండే సారూప్య ఔషధములను, మోతాదులను నిర్ణయిస్తారు. 


హోమియోపతి ఔషధములకు కావలసిన ముడి పదార్థములను, వృక్షములు, ఖనిజములు, జంతువులు, రోగ మాలిన్య పదార్థములు మొదలగువాటితో మందులు తయారు కాబడును. మందులను శక్తివంతంగా పొటెంటైజెషన్ (Potentaisation) పద్ధతిలో తయారు చేస్తారు. ఈ విధానంలో మూడు ముఖ్య సూత్రములుండును. 1) ఏకౌషధము. 2) సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదు 3) సారూప్య సిద్ధాంతము.


ధన్యవాదములు


Dr C మధుసూదన్ రావు (సహాయ ప్రొఫెసర్, 

JSPS ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల, రామంతాపుర్, హైదరాబాద్) గారి సౌజన్యంతో.

విశిష్ట వైద్యము - హోమియోపతి 4*

  *తెలుసుకుందాము*

*విశిష్ట వైద్యము - హోమియోపతి 4


గత వ్యాసాలలో ఒక విషయం మననం చేసుకున్నాము. హోమియోపతి వైద్య విధానంలో, ఒకరి ఇబ్బందికి వాడిన మందు, అదే రుగ్మత ఉన్న వారికి వైద్య సలహా లేకుండా ఇతరులు వాడరాదు. రోగి రోగికి మందులు, మోతాదులు, చికిత్సా సమయం మారుతూ ఉంటుంది. అయినా, సాధారణ పరిజ్ఞానము కొరకు హోమియోపతి సిద్ధాంతము కొన్ని మందులను సూచిస్తున్నది. *దిగువ ఔషధముల పట్టిక విషయ పరిజ్ఞానము మరియు ఒక అవగాహన కొరకు మాత్రమే* వైద్యులను సంప్రదించింది మాత్రమే ఔషధములు పుచ్చుకోవాలి.

1) *జ్వరము (Fever)* = బెల్లడోనా (Belladona), అర్సినిక్ ఆల్బమ్ (Arsenic album), జెల్సిమియం (Gelsimium), పైరోజినం (Pyrogenum). 30 మోతాదులో (Potency).

2) *మేహవాతం (Rheumatism)* రోడో డెండ్రాన్ (Rhodo Dendron), డల్కమారా (Dulcamara), లేడం (Ledam), కాల్మియా (Kalmia), కాస్టికం (Causticum), కాలి అయోడ్ (Kali iod), రస్ టాక్స్ (Rustox), 

3) *నడుము నొప్పి (Lumbago)* రస్ టాక్స్ (Rustox), బ్రయోనియా (Bryonia), ఆర్నికా (Arnika), కాల్కేరియా ఫ్లోర్ (Calcaria Flore).

4) *మలబద్ధకము (Constipation)*. అల్యూమినా (Alyumina), బ్రయోనియా (Bryonia), నక్సువామికా (Nuxvomica), ఓపియం (Opium), సల్ఫర్ (Sulphur).

5) *అతిసార, విరేచనాలు (Diarrhoea)* కామోమిల్లా (Chamomilla), పల్స టిల్లా (Pulsatilla), నక్సవామిక (Nuxvomika), పోడోఫైలం (Podophylum), మెర్కుసాల్ (Meecusol).


*పై పట్టిక సమాచారము మరియు అవగాహనకు మాత్రమే* వైద్య సలహా లేకుండా మందులు వాడరాదు.

ధన్యవాదములు


Dr C మధుసూదన్ రావు (విశ్రాంత సహాయ ప్రొఫెసర్, JSPS ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల, రామంతాపుర్, హైదరాబాద్) గారి సౌజన్యంతో

⚜ శ్రీ మహాలక్ష్మీశ్వర ఆలయం

🕉 మన గుడి : నెం 1391


⚜  తమిళనాడు : తిరునింద్రియూర్ 


⚜  శ్రీ మహాలక్ష్మీశ్వర ఆలయం



💠 లక్ష్మీపురీశ్వరర్ ఆలయం తమిళనాడులోని మైలాడుతురై జిల్లాలోని మైలాడుతురై తాలూకాలోని తిరునింద్రియూర్ గ్రామంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన దేవాలయం.  


💠 ఈ ఆలయాన్ని మహాలక్ష్మీశ్వర 

ఆలయం అని కూడా అంటారు.  అధిష్ఠాన దేవతని లక్ష్మీపురీశ్వరర్ / మహాలక్ష్మీశ్వరర్ / పరికేశ్వరర్ అని పిలుస్తారు మరియు తల్లిని ఉలగ నాయకి / లోక నాయకి అని పిలుస్తారు. 


💠 ఈ ఆలయం ప్రారంభ మధ్యయుగ తేవారం శ్లోకాలలో కీర్తింపబడిన 276 పాదల్ పెత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.  


💠 ఈ ఆలయం చోళనాడు లోని కావేరి నదికి ఉత్తరం వైపున ఉన్న 73వ దేవర పాదల్ పెట్ర శివ స్థలం మరియు 19వ స్థలం.


⚜ స్థల పురాణం


💠 స్థలపురాణం ప్రకారం, మహాలక్ష్మి దేవత విష్ణువు ఛాతీలో శాశ్వత స్థానం పొందాలని కోరుకుంది. కాబట్టి, ఆమె ఇక్కడికి వచ్చి, శివుడిని పూజించి, విష్ణువు ఛాతీలో ఆ స్థానాన్ని పొందింది.  


💠 మహాలక్ష్మి (తిరు) ఇక్కడ శివుడిని పూజించడంతో, ఈ ప్రదేశం తిరునింద్రవూరుగా పిలువబడింది మరియు శివుడిని మహాలక్ష్మీశ్వరర్ / లక్ష్మీపురీశ్వరర్ అని పిలుస్తారు.


💠  శ్రీమహాలక్ష్మి ఇక్కడికి వచ్చినప్పుడు, ఆమె కొంతకాలం ఈ ప్రదేశంలోనే ఉంది. 

శ్రీ మహాలక్ష్మికి మరో పేరు "తిరు" లేదా "శ్రీ", కాబట్టి ఈ ప్రదేశాన్ని తిరు-నింద్ర-ఊర్ (లక్ష్మి నివసించిన ప్రదేశం) అని పిలుస్తారు.


💠 పురాణాల ప్రకారం, తన తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు, పరశురాముడు తన తల్లి రేణుకను శిరచ్ఛేదం చేశాడు. 

అప్పుడు జమదగ్ని మహర్షి పరశురాముడికి ఒక వరం ఇచ్చాడు, అతను తెలివిగా తన తల్లి మరియు సోదరులను తిరిగి బ్రతికించమని కోరాడు.


💠 పరశురాముడి తెలివితేటలకు ముగ్ధుడైన జమదగ్ని రేణుక మరియు ఆమె నలుగురు కుమారులను తిరిగి బ్రతికించాడు. తల్లిని చంపిన పాపానికి పాల్పడినందుకు, శాంతి కోసం ఇక్కడ శివుడిని పూజించాడు.

జమదగ్ని కూడా తన తొందరపాటు నిర్ణయాన్ని గ్రహించి, ఇక్కడ శివుడిని ప్రార్థించాడు.


💠 వారి పూజకు సంతోషించిన శివుడు తండ్రి మరియు కొడుకు ఇద్దరికీ దర్శనం ఇచ్చాడు మరియు వారి పాపాలకు ఉపశమనం కలిగించాడు. 


💠 పరశురాముడు ఈ ఆలయానికి 365 కొలతల వ్యవసాయ భూములను ప్రసాదించాడని నమ్ముతారు. 

భూమి నుండి వచ్చే ఆదాయం సంవత్సరం మొత్తం పూజకు అయ్యే ఖర్చులకు ఉపయోగించబడుతుంది. జమదగ్ని మహర్షి మరియు పరశురామ మహర్షి పూజించిన లింగాలను ప్రాకారంలో చూడవచ్చు.


💠 చోళ రాజు త్రిభువన చక్రవర్తి శ్రీ రాజరాజ దేవ ప్రతి రోజూ చిదంబరానికి వెళ్లి శివుడిని పూజించేవాడు. 

ఒకసారి, అతను ఆ ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు అన్ని దీపాలు ఆరిపోతాయని, ఆ ప్రదేశం దాటిన తర్వాత స్వయంచాలకంగా తిరిగి వెలిగిపోతాయని గమనించాడు. విచిత్రంగా, ఇది ప్రతిసారీ పునరావృతమైంది.


💠 విచారించినప్పుడు, ఒక గొర్రెల కాపరి అతనితో ఒక ఆవు ప్రతిరోజూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో మరియు సమయంలో పాలు పోస్తుందని చెప్పాడు. 

ఈ సమయం అతను ఆ ప్రదేశాన్ని దాటుతున్నప్పుడు దీపాలు ఆరిపోయిన సమయంతో సరిగ్గా సరిపోలిందని రాజు గ్రహించాడు. 


💠 రాజు గొడ్డలితో ఆ ప్రదేశాన్ని తవ్వినప్పుడు , రక్తం కారడం ప్రారంభమైంది, మరియు వారు ఆ ప్రదేశంలో ఒక శివలింగాన్ని కనుగొన్నారు, దాని తలపై గాయం ఉంది (ఇది నేటికీ కనిపిస్తుంది). దీనికి కారణమైనందుకు బాధపడ్డ రాజు, ఇక్కడ శివుని గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించి క్షమాపణ కోరాడు. 


💠 ఆ ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు దీపాల వత్తులు (తమిళంలో తిరి) మెరుస్తూ ఆగిపోయాయి (తమిళంలో నింద్ర) కాబట్టి ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు 


💠 సాధారణంగా, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి బంధువులలో గౌరవం ఉంటుంది. వారు ఉన్నత పదవులు అధిష్టిస్తారు మరియు ప్రభుత్వంచే గౌరవించబడే అదృష్టం కలిగి ఉంటారు.

 వారు ఇతరుల మనసును అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తారు


💠 సాధారణంగా అందరూ తమ జన్మ నక్షత్రాలతో సంబంధం లేకుండా ప్రతికూల గ్రహాల నుండి ఉపశమనం కోసం ఇక్కడ ప్రార్థిస్తారు, అయితే అనురాధ నక్షత్రం ఉన్నవారు ప్రత్యేకంగా దీని కోసమే ప్రార్థిస్తారు. వారు నివారణ పూజలు నిర్వహిస్తారు.


💠 భక్తులు స్వామివారికి, అమ్మవారికి వస్త్రాలు సమర్పించి అభిషేకాలు చేస్తారు.


💠 ఈ ఆలయం తూర్పు వైపు ముఖంగా మూడు అంతస్తుల రాజగోపురంతో ఉంది.

 ఆలయం పూర్తిగా ప్రాంగణ గోడల లోపల ఉంది మరియు రెండు ప్రాకారాలు ఉన్నాయి. 

నంది రాజగోపురం తర్వాత వెంటనే గర్భగుడి వైపు ముఖంగా కనిపిస్తాయి. 


💠 రాజు కోచెంగట్ చోళుడు దాదాపు 70 ఆలయాల నిర్మించాడని నమ్ముతారు. 

ఈ ఆలయం వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. 



💠 మైలదుత్తురై నుండి 11 కి.మీ, చిదంబరం నుండి 36 కి.మీ



రచన 

©️ Santosh Kumar

17-02-2026 మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

17-02-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

---------------------------------------


మిధునం


ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తికావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. 

---------------------------------------


సింహం


సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి.

---------------------------------------


కన్య


ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


తుల


ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


వృశ్చికం


సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


ధనస్సు


ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

---------------------------------------


మకరం


ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కుంభం


చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

---------------------------------------


మీనం


ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 33*


*కుట్మలిత కుచకిశోరైః కుర్వాణైః కాంచిదేశసౌహార్దమ్|*

*కుంకుమశోణైర్నిచితం కుశలపథం శంభుసుకృతసంభారైః॥*


*భావము :*


*కాంచీపురమునకు, ఈశ్వరునికి పుణ్య సంపదగా, కుంకుమ వర్ణపు ఎరుపుతో శోభిల్లే మొగ్గలవంటి స్తనసంపద కలిగిన మాతృమూర్తి మా మార్గమును సుసంపన్నము, క్షేమకరము చేయుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


ఆపూర్యమాణమచలప్రతిష్ఠం

సముద్రమాపః ప్రవిశంతి యద్వత్

తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే

స శాంతిమాప్నోతి న కామకామీ ।। 70 ।।



ప్రతిపదార్థ:


ఆపూర్యమాణమ్ — అన్నీ దిశలనుండీ నిండి; అచల-ప్రతిష్ఠం — కలవరపడని; సముద్రం — సముద్రము; ఆపః — నీరు; ప్రవిశంతి — వచ్చినా; యద్వత్ — ఎలాగో; తద్వత్ — అలాగే; కామాః — కోరికలు; యం — ఎవరికైతే; ప్రవిశంతి — వచ్చునో; సర్వే — అన్ని; సః — ఆ వ్యక్తి; శాంతిమ్ — శాంతి; ఆప్నోతి — పొందును; న — కాదు; కామ-కామీ — కోరికలను సంతృప్తి పరుచుకునేందుకు కృషి చేసేవాడు.

 

 తాత్పర్యము :   


ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపర్చుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.


 వివరణ:


ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్నా, సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే విలక్షణమైన సమర్థత ఉంది. ప్రపచంలోని అన్ని నదులు సముద్రాలలోనికి వచ్చి పోర్లిపోతుంటాయి, కాని సముద్రం మాత్రం పొంగదు, తరగదు. శ్రీ కృష్ణుడు 'ఆపూర్యమాణమ్' (అన్ని దిశల నుండి నిండిన) అన్న పదాన్ని వాడాడు, అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు. అదే విధంగా, జ్ఞానోదయమైన ముని, శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా, లేదా అవేమీ లేకపోయినా సరే, ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు. కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు.

వేద ఆశీర్వచనం.

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - ధనిష్ట -‌‌ భౌమ వాసరే* (17.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

17ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

 *🌹17ఫిబ్రవరి2026🌹*

   *దృగ్గణిత పంచాంగం*                

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - బహుళపక్షం*


*తిథి  : అమావాస్య* ‌సా 05.30 ఉపరి *ఫాల్గుణమాస ప్రారంభః*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : ధనిష్ఠ* రా 09.16 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : పరిఘ* రా 12.29 వరకు ఉపరి *శివ*

*కరణం  : నాగ* సా 05.30 *కింస్తుఘ్న* రా.తె 05.17 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

           *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *ఉ 10.39 - 12.17*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.45*

*వర్జ్యం    : రా04.28 -06.04 తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.52 - 09.39 రా 11.07 - 11.57*

*రాహు కాలం  :మ03.16- 04.43*

గుళికకాళం      : *మ 12.22 - 01.49*

యమగండం    : *ఉ 09.27 - 10.54*

సూర్యరాశి : *కుంభం*                              

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 06.42* 

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం   :*ఉ 06.32 - 08.52*

సంగవ కాలం :*08.52 - 11.12*

మధ్యాహ్న కాలం :*11.12 - 01.31*

అపరాహ్న కాలం :*మ01.31 - 03.51*

*ఆబ్ధికం తిధి : మాఘ అమావాస్య*

సాయంకాలం   :*సా 03.51 - 06.11*

ప్రదోష కాలం     :*సా06.11 - 08.39*

రాత్రి కాలం        :*రా 08.39 - 11.57*

నిశీధి కాలం      :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.54 - 05.43*

<><><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


        *🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*సింధూర తైల రచి తాతి విభూషణాత్మన్!*

*లాంగూల తాడ నకృతాసుర సంఘ నాశ!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మాఘ పురాణం - 30వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷మంగళవారం 17 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 30వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *17వ తేదీ మంగళవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

```

మాఘ పురాణం ముప్పయ్యవ అధ్యాయంలో, మృకండ మహర్షి దంపతులకు సంతానం లేకపోవడంతో శివుని పూజించి వరం పొందారు. ఆ వర ప్రసాదంగా మార్కండేయుడు జన్మించాడు కానీ, అతని ఆయుష్షు పదహారేళ్లే అని శివుడు నిర్ణయించాడు. పెరిగి పెద్దవాడైన మార్కండేయుని ఆయుష్షు పూర్తవుతున్న సమయంలో, కుటుంబం మొత్తం కాశీకి వెళ్లి శివుని ఆరాధించడం ప్రారంభించింది. రాత్రింబవళ్ళు శివలింగాన్ని ధ్యానం చేస్తూ గడిపేవాడు మార్కండేయుడు. పదహారవ జన్మదినం రోజున యముడు అతని ప్రాణాలు తీసుకోవడానికి వెళ్లగా, ధ్యానంలో ఉన్న మార్కండేయుని చుట్టూ తేజస్సు ఏర్పడి యముడు అతని దగ్గరకు చేరలేకపోయాడు. కోపించిన యముడు కాలపాశాన్ని విసిరాడు. భయంతో మార్కండేయుడు వచ్చి శివుని ప్రార్థించగా, శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో  యముని సంహరించాడు.


తన భక్తుడైన మార్కండేయుని రక్షించడానికి శివుడు యముని చంపడం చూసి ఆశ్చర్యపోయిన దేవతలు, శివుని కోపం చల్లార్చాక, యముని బ్రతికించమని కోరారు. యముని బ్రతికిస్తూ మరల తన భక్తుల దగ్గరకు రావద్దని హెచ్చరించాడు శివుడు. 


కుమారుడు చిరంజీవి అవ్వడంతో సంతోషించిన మృకండ మహర్షి, ఈ సంఘటన మాఘమాసం ప్రభావాన్ని తెలియజేస్తుందని భావించి, ఆ మాసం గురించి ప్రజలకు చెప్పుకుంటూ ఉండేవాడు…


*మార్కండేయుని వృత్తాంతము*```


వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము,కాశీవిశ్వనాధుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి “మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరించెదను, శ్రద్దగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే, రోజులు గడచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలు అన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలెనే అచిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను.


అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు “కుమారా! నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ది కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు.

అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ, పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళ కరమగును గాన, నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును” అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమ శివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులు అందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరుకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసి నందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరు ఇట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించ గలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.

అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. ‘చిరంజీవి అయి వర్ధిల్లు’ మని దీవించినందున వారి వాక్కుల సత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంట బెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండు” అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతసించెను. మునులు అందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ ‘చిరంజీవిగా జీవించు నాయనా’ అని దీవించెను.


అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొంత తడవడి “భయపడకు”మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక” యని తన మనస్సులో శివుని ధ్యానించెను. 


అంతట మునుల వంక చూచి “ఓ మునులారా! మీరు పోయి రండు ఇతనికి ఏ  ప్రమాదమునూ జరుగనేరదు” అని పలికి “వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగద”ని ధైర్యము చెప్పి పంపి వేసెను.


మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, ‘కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ’ నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదన లేక, కుమారుని విడిచి పెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందు ఒక  ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివ ధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగెను.

క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీప మందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికెరిగించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు అతని  ప్రాణములను తీసుకొని పోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివ లింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాస వాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.


యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపము చల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. 


అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి ‘యమా నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా!’ అని హెచ్చరించి అంతర్ధానము అయ్యెను. 


పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతోషించి, తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.```


*మాఘపురాణం ముప్పైవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

ఈరోజు సూర్యగ్రహణం

ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది, కానీ అది మన భారత దేశంలో కనిపించదు కాబట్టి భారతీయులకు ఎటువంటి గ్రహణ సంబంధిత గ్రహణసూచకములు ఉండవు.


ఇది కేవలం దక్షిణ ఆఫ్రికా, అంటార్కిటికా, మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. 


భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతీయులు ఈ గ్రహణం మనకు సంబంధించిన ఎటువంటి నియమములు పాటించవలసిన అవసరం లేదు నిత్య నైమెత్తిక కర్మములు యధావిధిగా కొనసాగించవచ్చు, దేవతార్చన కూడా యధావిధి ఆచరించవచ్చు.

పైన తెలిపిన దేశాలలో ఉన్నటువంటి భారతీయులు మాత్రము సూతక నీమములు, అనగా గ్రహణ కాలమున ఆచరించవలసిన నియమములు ఆచరించవలెను గ్రహణమునకు ముందు గ్రహణ స్నానము చేసి గ్రహణ సమయంలో ఏదేని మంత్రమును అనుష్టాన పరచుకున్న అది సాధారణ సమయములలో చేసిన జపం కన్నా ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని అంటారు.

ఈ సమయంలో సరైన గురువు దొరికితే దిష్టి మంత్రము, తేలు మంత్రము, పాము మంత్రము కూడా ఉపదేశం పొందవచ్చు.  ఆ మంత్రం జపము వలన అది ఉపదేశము పొందిన వారికి ఫలించును అంతేకాక నిత్యము అనుస్థానం చేసుకునే మంత్రము కూడా గ్రహణ సమయమున జపించిన యెడల ఎక్కువ ఫలితము ఇస్తుందని పెద్దలు అంటారు.


గ్రహణమును వీక్షిస్తున్న మన పాఠకులు అంటే పైదేశాలలో ఉన్నవారు గ్రహణ నియమములు ఆచరించగలరు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు మాత్రము ఈ గ్రహణం గురించి ఎటువంటి విచారణ చేయవలసిన పనిలేదు


గ్రహణ విషయములలో మీకు ఏమైనా సందేహములు ఉన్నాయెడల మీ సమీపమున ఉన్న సిద్ధాంతులను సంప్రదించగలరు.


ఇక్కడ పేర్కొన్న విషయములు కేవలము సమాచారం కొరకు ఇచ్చినవి మాత్రమే. ప్రామాణికములుగా భావించవలదు.


పంచాంగం