31, మార్చి 2026, మంగళవారం

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 31.03.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి తిథి భౌమ వాసర పూర్వఫల్గుని నక్షత్రం గండ యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: చతుర్దశి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 68*


*బాణసృణిపాశకార్ముకపాణిమముం కమపి కామపీఠగతమ్।*

*ఏణధరకోణచూడం శోణిమపరిపాకభేదమాకలయే॥*


*భావము :*


*తన చతుర్భుజములలో బాణము, అంకుశము, ధనుస్సు, పాశము వంటి ఆయుధములుగాను, బాలచంద్రుని సిగలో ఆభరణముగాను ధరించి, కామపీఠమును అధిరోహించిన అరుణవర్ణయైన మాతనుస్మరిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ।

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।। 33 ।।



ప్రతిపదార్థ:



సదృశం — దానికి తగినట్లుగా; చేష్టతే — క్రియలను చేయును; స్వస్యాః — తమంత తామే; ప్రకృతే — ప్రకృతి గుణములు; జ్ఞానవాన్ — జ్ఞానులు; అపి — కూడా; ప్రకృతిం — సహజ స్వభావం; యాంతి — అనుసరించుట; భూతాని — అన్ని ప్రాణులు; నిగ్రహః — నిగ్రహించి; కిం — ఏమి; కరిష్యతి — చేసెదరు.


తాత్పర్యము : 


   

వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?



 వివరణ:


శ్రీ కృష్ణుడు మళ్లీ, అకర్మ కన్నా కర్మయే శ్రేష్ఠమనే విషయం సూచిస్తున్నాడు. జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపింపబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు. పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా, అనంతమైన పూర్వ జన్మ సంస్కారాలని (వారి ధోరణులు, అభిప్రాయాలు), ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ (అసంఖ్యాక పూర్వ జన్మల నుండీ పేరుకుపోయిన సంచిత కర్మ ఆధారంగా, ఈ జన్మ సమయంలో కేటాయించబడ్డ విధి) ని, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. ఆ అలవాట్ల, స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ వైదిక శాస్త్రాలు అన్నీ పనులను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే, అదొక అయోమయమైన/అస్థిర మైన పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాంటి అసహజమైన అణచివేత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అలవాట్ల, సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుండే ఆధ్యాత్మిక పురోగతి మొదలుపెట్టాలి; ఇది చేయాలంటే మన ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని అర్థం చేసుకుని, అంగీకరించి అక్కడినుండి మెరుగుపరుచు కోవాలి.


జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అణుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు. చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చూసుకోకుండా, తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి, ఇది మానవ సమాజంలో కనిపించటం అరుదు. ఒక ఆవుకి తన దూడ మీద ఎంత మమకారం ఉంటుందంటే, దూడ ఒక్క క్షణం కనిపించక పోయినా ఆవు ఆందోళనకి లోనవుతుంది. మానవులెవరికీ సాధ్యం కాని అమితమైన విశ్వాస గుణాన్ని కుక్కలు ప్రదర్శిస్తాయి. అదే విధంగా, మనం మానవులం కూడా మన సహజ స్వభావంచే నడిపింపబడుతాము. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి, శ్రీ కృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు, ‘నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది (భగవద్గీత 18.59)’; ‘నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఆలోచనే నిన్ను ఆ పని చేయటానికి ప్రోద్బలం కలిగిస్తుంది (భగవద్గీత 18.60)’. మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ ప్రాప్తి దిశగా మార్చటం ద్వారా, మరియు, మన విధులను రాగ ద్వేష రహితంగా, భగవత్ సేవ రూపంగా చేయటం ద్వారా, ఆ సహజ స్వభావాన్ని పవిత్రమొనర్చుకోవాలి

ఆంజనేయ స్తుతి🙏

  🌸ఆంజనేయ స్తుతి🙏

    ॐॐॐॐॐॐॐ

సీ౹౹పావన!హనుమయ్య పాలింపరావయ్య!

                        భక్తులబ్రోచెడి పరమపురుష!

     సంజీవ రాయుడా! సర్వజ్ఞ! సామీర!

                 సత్వరమే రమ్ము! సాధు చరిత !

     వీరాంజనేయుడా! వినుమయ్య వినతి నీ

                     సేవయే మాకును చింత తీర్చు!

      జలధిని! లంఘించి జానకి !జాడను 

                   తెలిపిన తేజస్వి! ధీరహనుమ!

తే౹౹ సూర్యునిదరికిని జనుచు శ్రుతులనేర్చి

       వ్యాకరణపండితుడవైన వాయుపుత్ర!

       రామసుగ్రీవులకుమైత్రి! లక్షణముగ

      నెఱపినట్టి ప్రసన్నాంజనేయ !శరణు !


                "సాహితీ శ్రీ " జయలక్ష్మి పిరాట్ల

రామాయణం - 21)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 21)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (30-3-'26 పోష్టు తరువాయి భాగము)


శ్రీరాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ ధనస్సును గ్రహించి, బాణం సంధించగానే జగత్తంతా కంపించింది.


ధనస్సును ఎక్కుపెట్టి, శరాన్ని సంధించి, 

కోపంతో రాముడు ఇలా అన్నాడు.


 "ఓ పరశురామా! నీవు బ్రాహ్మణుడవగుట చేతను,

 విశ్వామిత్రునకు బంధువు వగుట చేతను,

 నాకు పూజ్యుడవు. 

అందువలన, నీ ప్రాణములు హరించేందుకు ఈ శరాన్ని, ప్రయోగింపజాలను.


శ్లో//ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్/

లోకా న ప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి//


(భార్గవరామా! నీ పాదగమన శక్తిని గాని,

తపోబలముతో నీవు సంపాదించుకున్న,సాటిలేని ఉత్తమ లోకములను గాని,

ఈ బాణముతో కొట్టివేసెదను.

నీకు ఏది ఇష్టమో చెప్పుము).


దివ్యమైన ఈ వైష్ణవ శరము వ్యర్ధమగుటకు వీలు లేదు.


శ్లో//వరాయుధ ధరం రామం ద్రష్టుం సర్షిగణాఃసురాః/

పితామహం పురస్కృత్య సమేతా స్తత్ర సంఘశః//

గంధర్వాప్సరసశ్చైవ సిద్ధ చారణ కిన్నరాః//

యక్ష రాక్షస నాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతమ్//


అది ఒకఅద్భుత సన్నివేశం. 

శ్రీ మహావిష్ణువు తన స్వంత ధనస్సును, మానవుడుగా ధరించడం,అనే దివ్య సన్నివేశం.

విష్ణుధనస్సు ధరించి, తాను స్వయంగా విష్ణువునేనని చెప్పకుండా చెబుతున్న ఆ రాముని చూడడానికి,

 అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చాడు. 


" పుంసాం మోహన రూపాయ" (పురుషులను కూడా మోహింపజేసే అందమైన రూపం కలవాడు రాముడు).


వైష్ణవ ధనస్సును ధరించిన ఆ రాముని దివ్యమంగళ రూపాన్ని చూడటానికి,

దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు,యక్షులు, రాక్షసులు, నాగులు, మొదలైనవారు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. 


శ్రీరాముడు వైష్ణవ ధనస్సును స్వీకరించగానే, అవతార ప్రయోజనము పూర్తి అయిన పరశురాముడు నిర్వీర్యుడైనాడు


శ్లో// జడీకృతే తదా లోకే రామే వర ధనుర్ధరే/

నిర్వీర్యో జామదగ్న్యో౽సౌ రామో రామ ముదీక్షత//


(రాముడు, శ్రేష్ఠమైన ఆ ధనస్సును ఎక్కుపెట్టగానే, అత్యంత ప్రభావంతో కూడిన ఆ దివ్య వైష్ణవ శరమును చూచి లోకమంతా భయపడి, స్తంభించి పోయింది. 

పరశురాముడు నిర్వీర్యుడు అయిపోయినాడు.

ఆయన రామునివంక అత్యాశ్చర్యముతో చూచాడు).


ఆయనకు జ్ఞానోదయం అయింది.

ధర్మరక్షణకు అవతరించిన శ్రీ మహావిష్ణువే రాముడని పరశురాముడు అప్పుడు గ్రహించాడు.

రామునకు నమస్కరించాడు.


శ్లో//అక్షయ్యం మధుహన్తారం జానామి త్వాం సురేశ్వరమ్/

ధనుషో౽స్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప//


(ఈ ధనస్సును గ్రహించుటవల్ల, నీవు అక్షయుడవు, మధువు అనే రాక్షసుని సంహరించిన వాడవు, సర్వదేవతలకు ఈశ్వరుడవు అయిన శ్రీమహావిష్ణువు వని తెలుసుకొన్నాను. ఓ పరంతపా! నీకు స్వస్తియగుగాక.)




త్రిలోకనాధుడవైన నీ చేత నిర్జింపబడటం వల్ల నేను సిగ్గుపడటం లేదు. 

అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ భూమిని కశ్యపునకు దానమిచ్చినందున నేను మహేంద్ర పర్వతముపై నివసిస్తున్నాను. 

నేను అక్కడకు వెళ్ళాలి. అందువల్ల నా గమన శక్తిని నశింపజేయవలదు.

నీ బాణం ప్రయోగించి నేను తపశ్శక్తితో సంపాదించిన పుణ్యలోకాలు నశింపజేయుము,అన్నాడు.


బ్రహ్మజ్ఞానికి, పుణ్యము పాపము, రెండూ ఉండకూడదు కాబట్టి, పరశురాముని కోరిక ప్రకారము, రాముడు ఆ పుణ్యలోకాలనన్నింటినీ బాణప్రయోగంతో నశింపజేశాడు.


పరశురాముడు, దశరథ రాముని స్తోత్రం చేసాడు.

ప్రదక్షిణము చేసి మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు

చీకటి తొలగి దిక్కులన్నీ ప్రకాశించినవి.


విష్ణుధనస్సును ధరించిన రాముని దేవతలు,ఋషులు స్తుతించారు.


శ్లో// గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః/

వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం//


(ప్రశాంత మనస్సుతో కూడిన రాముడు, పరశురాముడు వెళ్లిన వెంటనే, ఆ ధనస్సును, బాణమును, అప్రమేయ ప్రభావంగల వరుణునకు ఇచ్చివేసెను).


             శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

               ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

31-3-'26.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ    చాంద్రమాన  పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌త్రయోదశి  -‌ పూర్వాఫల్గుని -‌‌ భౌమ వాసరే* (31.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*