16, జూన్ 2026, మంగళవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

 సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ।

ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ ।। 4 ।।



ప్రతిపదార్థ:



సాంఖ్య — కర్మ సన్యాసము; యోగౌ — కర్మ యోగము; పృథక్ — వేరువేరు; బాలాః — అజ్ఞానులు; ప్రవదంతి — అంటారు; న — కాదు; పండితాః — పండితులు; ఏకం — ఒక్క దానిలో; అపి — అయినా; ఆస్థితః — స్థితులై ఉండి; సమ్యక్ — సంపూర్ణముగా; ఉభయోః — రెంటి యొక్క; విందతే — పొందుతారు; ఫలం — ఫలమును.


 

 తాత్పర్యము : 



అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము (కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము) మరియు కర్మ యోగము (భక్తితో పని చేయటము) భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు.



వివరణ:


ఇక్కడ, శ్రీ కృష్ణుడు, 'సాంఖ్య' అన్న పదాన్ని కర్మ సన్యాసమును సూచించటానికి వాడుతున్నాడు, అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించటం అన్నమాట. సన్యాసము అనేది రెండు రకాలుగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం, అవి: ఫాల్గు వైరాగ్యము, యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి, జనులు, కష్టాలను, బాధ్యతలను వదిలిచ్చుకోవటం కోసము దానిని త్యజించటాన్ని ఫాల్గు వైరాగ్యం అంటారు. ఇటువంటి ఫాల్గు వైరాగ్యం, పలాయనవాద దృక్పథంలో ఉన్నది మరియు అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు, దాన్ని కూడా మరల వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి ఆశిస్తారు. యుక్త వైరాగ్యంలో, జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు. వారికి ఉన్న దానిని వారికి చెందినదిగా పరిగణించరు మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు. బదులుగా, దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయటానికే ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము స్థిరమైనది మరియు కష్టాలకు చలించనిది.


కర్మ యోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే, యుక్త వైరాగ్య భావాలు (స్థిరమైన వైరాగ్యం) పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులగా మరియు భగవంతుడిని భోక్తగా పరిగణిస్తారు; అందుకే ప్రతీదీ భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో స్థితులౌతారు. ఈ విధంగా, వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవత్ ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో సమానంగా ఉంటుంది. బాహ్యంగా వారు ప్రాపంచిక మనుష్యుల లాగ కనిపించినా అంతర్గతంగా సన్యాసుల కు ఏమాత్రం తీసిపోరు.


పురాణములు మరియు ఇతిహాసములు భారత చరిత్రలలో మహోన్నతమైన రాజుల గురించి చెపుతూ, బాహ్యంగా వారు రాజ ధర్మాలను నిక్ఖచ్చిగా నిర్వర్తిస్తూనే రాజ విలాసాలలో నివసిస్తున్నా, వారు మానసికంగా పూర్తిగా భగవత్ భావన లోనే స్థితులై ఉన్నారని పేర్కొన్నాయి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు, విభీషణుడు, యుధిష్ఠిరుడు మొదలగువారంతా అత్యుత్తమ కర్మ యోగులే. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటున్నది:


గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో న ద్వేష్టి న హృష్యతి

విష్ణోర్మాయామిదం పశ్యన్ స వై భాగవతోత్తమః (11.2.48)


‘ఇంద్రియ వస్తు విషయములను, వాటి కోసం ప్రాకులాడకుండా మరియు వాటి నుండి పారిపోకుండా, భగవత్ దృక్పథంతో, సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే, అన్ని ఆయన సేవకే, అన్న దృక్పథంలో స్వీకరించే వాడు అత్యున్నత భక్తుడు.’ ఈ విధంగా, కర్మ యోగికి, కర్మ సన్యాసికి మధ్య, నిజమైన జ్ఞానికి, తేడా ఏమీ కనపడదు. వీటిలో ఏ ఒక్కటి పాటించినా, ఈ రెంటి యొక్క ఫలితములు లభించును.

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ! 

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

ఈ భౌతిక జగత్తులో ప్రతి జీవి ఎన్నో కష్టాలు, దుఃఖాలు మరియు బాధలతో సతమతమవుతోంది. అయితే శ్రీల ప్రభోధానంద సరస్వతి ఠాకూర్ ఈ ప్రపంచం ఆనందంతో నిండి ఉందని చెబుతున్నారు. అది ఎలా సాధ్యం?


ఆయన సమాధానం ఇలా ఇస్తారు:

"యత్-కారుణ్య-కటాక్ష-వైభవవతాం తం గౌరమేవ స్తుమః"

అనగా, శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అహేతుక కృప వల్లే ఒక భక్తుడు ఈ భౌతిక ప్రపంచంలోని కష్టాలను కూడా ఆనందంగా స్వీకరించగలుగుతాడు.


శ్రీ చైతన్య మహాప్రభువు తన స్వీయ ఆచరణ ద్వారా, తాను ఎప్పుడూ దుఃఖానికి లోనుకాకుండా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంలో నిరంతరం ఆనందంగా ఉండేవారని చూపించారు.


అందువల్ల మనం కూడా శ్రీ చైతన్య మహాప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ, నిరంతరం ఈ మహామంత్రాన్ని జపించాలి:


హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే ।

హరే రామ హరే రామ

రామ రామ హరే హరే ॥


అప్పుడు ఈ ద్వంద్వమయ భౌతిక ప్రపంచంలోని సుఖదుఃఖాలు మనలను బాధించలేవు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, భగవంతుని పవిత్ర నామాన్ని జపించే వ్యక్తి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.


(శ్రీమద్భాగవతం, షష్ఠ స్కంధం, 17వ అధ్యాయం, 30వ శ్లోకం వ్యాఖ్యానం)


హరే కృష్ణ 🙏

సదా మీ శ్రేయోభిలాషి 🌺

భాగవతం వింటే బాగవుతాం*

 *భాగవతం వింటే బాగవుతాం*

శ్రీ పోతన భాగవత మధురిమలు 


(8-223-క.)

నీ యంద సంభవించును

నీ యంద వసించి యుండు నిఖిల జగములున్

నీ యంద లయముఁ బొందును

నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!


*భావము:-* రుద్రదేవా! అన్నిలోకాలు నీలోనే పుడతాయి; నీలోనే నివసిస్తాయి; ప్రాణులు అన్ని నీలోనే లయమవుతాయి; నీ ఉదరం ప్రాణులు అన్నిటికి అలవాలం.


శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

తెల్లవారుజామున 4 గంటలు

  *తెల్లవారుజామున 4 గంటలు. 65 ఏళ్ల మహిళ నిద్దుర లేచింది*.

*మొదటి ఆసనం - మాలాసనం*: *వంగి ముగ్గు వేస్తుంది. 21 చుక్కలు. ఒక్కో గీతకు వెన్నెముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి. డాక్టర్ చెప్పిన "Squat Exercise" బామ్మకు 60 ఏళ్లుగా తెలుసు. "ముగ్గు వేస్తే మోకాళ్ల నొప్పులు రావు" అనేది*.


*రెండో ఆసనం - ఉత్కటాసనం*: బట్టలు ఉతకడం. రెండు కాళ్లూ కొంచెం వంచి, నడుము నిటారుగా పెట్టి, చేతులతో బట్టను రాయికి బాదడం. 20 నిమిషాలు. భుజాలు, చేతులు, నడుము అన్నీ ఒకేసారి వ్యాయామం. జిమ్‌లో "Chair Pose + Arm Workout" కి అవ్వ పెట్టిన పేరు - 'చీర ఉతకడం'.


*మూడో ఆసనం - త్రికోణాసనం*: తడి బట్టలు పిండి, దండెం మీద ఆరేయడం. కాలు ఒకవైపు, చేయి పైకి, నడుము వంచడం. శరీరం పక్కకి సాగుతుంది. లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి.


*నాలుగో ఆసనం - అధోముఖ శ్వానాసనం*: వంగి ఇల్లు కసువు ఊడవడం. రక్తప్రసరణ తలకు ఎక్కుతుంది. మెదడు చురుకవుతుంది.

*ఐదో ఆసనం - మార్జరాసనం*: కూర్చుని బూడిదతో గిన్నెలు తోమడం. మణికట్టు, వేళ్లు తిరుగుతాయి. ఆర్థరైటిస్ రాదు. బూడిదలో ఉన్న పొటాష్ సహజమైన క్రిమిసంహారిణి.


మనవడు రవి అడిగాడు: బామ్మ, నువ్వు పని మనిషిలా ఇన్ని పనులు ఎందుకు చేస్తావ్? ఒకరిని పెట్టుకోవచ్చుగా?"


బామ్మ నవ్వింది: "పనిమనిషారా , నేను కాదురా. ఇది నా *ఇంటి యోగం*. ఈ పనులు మానేసిన రోజు నా ఒళ్ళు పట్టుకుపోతుంది, మనసు పాడైపోతుంది."


లచ్చమ్మ కోడలు దీప. సాఫ్ట్‌వేర్. ఉదయం లేవగానే Washing Machine ఆన్, Dishwasher ఆన్, Robot Vacuum ఆన్.


8 గంటలు ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం. మెడ నొప్పి, నడుము నొప్పి, బీపీ, షుగర్. సాయంత్రం జిమ్‌కి 2000 రూపాయలు కట్టి వెళ్తుంది. ట్రైనర్ చెప్తాడు: "మేడం, 20 స్క్వాట్స్ చేయండి, 15 నిమిషాలు Arm Rotation చేయండి, Bend అయ్యి Sweep చేయండి."


దీపకు ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన: "అరే, ఇవన్నీ మా అత్తగారు డబ్బులు తీసుకోకుండా ఇంట్లోనే చేసేవారు కదా! మేము దాన్ని 'పని' అని హేళన చేశాం. వాళ్ళు దాన్ని 'ఆరోగ్యం' అని బతికారు."


ఆ రోజు నుంచి దీప మారింది. మెషిన్ ఉన్నా, ఆదివారం పిల్లలతో కలిసి ముగ్గు వేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. "అమ్మా, ఇది పని కాదు, ఫ్యామిలీ యోగా టైం" అని పిల్లలకు చెప్పింది.


### *3. అసలు తప్పు ఎక్కడ జరిగింది?*

మనం రెండు తప్పులు చేశాం:

తప్పు 1: పేరు మార్చేశాం.*


వంగి ముగ్గు వేస్తే 'మాలాసనం'. ఇంట్లో వేస్తే 'పనిమనిషి పని'.


బయట జిమ్‌లో చేస్తే 'Fitness'. ఇంట్లో చేస్తే 'Chores'.


పేరు మారగానే గౌరవం మారిపోయింది.


*తప్పు 2: ఉద్దేశం మర్చిపోయాం.*


అవ్వ ముగ్గు వేసింది 'ఇల్లు అందంగా ఉండాలి' అని కాదు.


*"నా కుటుంబం ఉదయం లేవగానే అందమైనది చూసి, మంచి మూడ్‌తో రోజు మొదలుపెట్టాలి"* అనే ప్రేమతో.


అన్నం వండింది 'ఆకలి తీర్చడానికి' కాదు.


*"నా చేత్తో తింటే నా బిడ్డకు నా ప్రేమ, నా శక్తి అందాలి"* అనే తపనతో.


ఇల్లు ఊడ్చింది 'దుమ్ము పోతుంది' అని కాదు.


*"నా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి రోగాలు రాకూడదు"* అనే బాధ్యతతో.


మనం 'పని'ని మాత్రమే చూశాం. దాని వెనకాల ఉన్న *'ప్రేమ'* ని చూడలేదు. అదే మన తప్పు.


### *4. యోగం అంటే ఏంటి?*


పతంజలి అష్టాంగ యోగంలో చెప్పాడు: "యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చేయడం."/


మన అవ్వలు అదే చేశారు:


ఇంటి పని యోగాసనం శరీరానికి లాభం మనసుకు లాభం


**ముగ్గు వేయడం** మాలాసనం, పద్మాసనం మోకాళ్లు, వెన్నెముక బలం ఏకాగ్రత, సృజనాత్మకత


**బట్టలు ఉతకడం** ఉత్కటాసనం, భుజంగాసనం చేతులు, భుజాలు, నడుము ఓర్పు, కష్టే ఫలి అనే తృప్తి


**కసువు ఊడవడం** అధోముఖ శ్వానాసనం రక్తప్రసరణ, జీర్ణశక్తి ఇల్లు శుభ్రం అయ్యిందనే ప్రశాంతత


**రుబ్బురోలు తిప్పడం** చక్రాసనం చేతులు, ఛాతి బలం సొంతంగా చేసుకున్నాం అనే ఆత్మవిశ్వాసం


**గిన్నెలు తోమడం** వజ్రాసనం అరిగే శక్తి, మణికట్టు కుటుంబం కోసం అనే సేవాభావం


వీళ్ళకి 'Yoga Mat' అవసరం లేదు. *నేలే యోగా మ్యాట్. ఇల్లే యోగా స్టూడియో. కుటుంబమే యోగా గురువు.*


### *చివరి మాట: నీ తప్పు కాదు, మనందరి తప్పు*


"ఇది పనిమనిషి పని" అని మనం అన్నప్పుడు, మనం ఒక తల్లి ప్రేమను అవమానించాం.


"Time Waste" అన్నప్పుడు, 5000 ఏళ్ల సైన్స్‌ను చెత్తబుట్టలో వేశాం.


*గుర్తుంచుకో:*


ఇంటి పని అనేది 'పని' కాదు. అది *'ప్రేమను పంచే పద్ధతి'*.


వంట చేయడం అంటే *'రుచిని కాదు, ఆయుష్షుని వడ్డించడం'*.


ఇల్లు శుభ్రం చేయడం అంటే *'చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం'*.


ఇకనుంచి ఎవరైనా "అమ్మా, నువ్వెందుకు ఇన్ని పనులు చేస్తావ్?" అని అడిగితే ఇలా చెప్పు:


*"నేను పనులు చేయడం లేదు నాన్నా. నేను నా ఇంటికి, నా ఒంటికి, నా వాళ్లకి యోగం చేస్తున్నాను. ఇది నా పూజ."*


ఎందుకంటే *భారతీయ సంస్కృతిలో 'పని' వేరు, 'సేవ' వేరు.*


పని చేస్తే అలసట వస్తుంది. సేవ చేస్తే ఆనందం వస్తుంది.


మన అవ్వలు 90 ఏళ్ళు బతికింది జిమ్‌కి వెళ్లి కాదు, *ఇంటినే గుడిగా, పనినే యోగంగా* మార్చుకుని.


మరి రేపటి నుంచి మీ ఇంట్లో 'పని' ఉంటుందా? లేక 'యోగం' మొదలవుతుందా? ఆలోచించండి.

శుభోదయం

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐


బుధవారం, జూన్ 17, 2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

నిజ జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:తదియ రా2.09 వరకు

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:పునర్వసు సా6.00 వరకు 

యోగం:ధృవం రా1.44 వరకు

కరణం:తైతుల మ3.16 వరకు తదుపరి గరజి రా2.09 వరకు


వర్జ్యం:ఉ6.45 - 8.15 మరల రా1.34 - 3.05

దుర్ముహూర్తము:ఉ11.34 - 12.26

అమృతకాలం:మ3.45 - 5.15

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00


సూర్యరాశి:మిథునం

చంద్రరాశి:మిథునం 


సూర్యోదయం:5.29

సూర్యాస్తమయం:6.31


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము - నరసాపురం, ఆంధ్రప్రదేశ్ - 534 275



శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక 577 139 ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.

కృష్ణుడు చెప్పిన “చిలుక గూడు

 🕉️ కృష్ణుడు చెప్పిన “చిలుక గూడు నీతి కథ” 🕉️


ఒకసారి సాయంత్రం సమయం. యమునా నది తీరంలో భక్తులు అందరూ కూర్చుని ఉన్నారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో కృష్ణుడు తన మధురమైన చిరునవ్వుతో భక్తులను చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక భక్తుడు వినమ్రంగా అడిగాడు:


“ప్రభూ! మనిషి జీవితంలో జ్ఞానం ఎందుకు అంత ముఖ్యము? తెలియక చేసే తప్పులు ఎలా మన జీవితాన్ని మార్చేస్తాయి?”


కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించాడు.


ఒక అడవిలో ఒక చిన్న చిలుక ఉండేది. ఆ చిలుక చాలా అమాయకం. అది ఒక పెద్ద చెట్టుపై గూడు కట్టుకుని ఆనందంగా జీవించేది. ప్రతి రోజు ఉదయం పాడుతూ ఆకాశంలో ఎగిరేది, సాయంత్రం తన గూడు దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకునేది.


ఒక రోజు ఆ అడవిలో ఒక వేటగాడు వచ్చాడు. అతను పక్షులను పట్టుకోవడానికి ఒక వల వేసి వెళ్లిపోయాడు. ఆ వల చెట్టు క్రింద పడివుండేది.


అది చూసిన చిలుకకు ఆసక్తి కలిగింది. “ఇది ఏమిటి?” అని ఆలోచిస్తూ దగ్గరకు వెళ్లింది. అది వల అని తెలియక ఆ వలపైకి ఎగిరి కూర్చుంది. వెంటనే వల బిగుసుకుని చిలుక చిక్కుకుంది.


అప్పుడు చిలుక చాలా బాధపడింది. “అయ్యో! నేను తెలిసి ఉంటే ఈ వల దగ్గరకు రానే రాను. తెలియక చేసిన ఒక చిన్న తప్పు నా స్వేచ్ఛను తీసుకుంది!” అని విచారించింది.


కొద్దిసేపటికి వేటగాడు వచ్చి చిలుకను తీసుకుపోయాడు.


కథ ముగిసిన తరువాత కృష్ణుడు భక్తులను చూస్తూ ఇలా చెప్పాడు:


“మనుషుల జీవితమూ ఈ చిలుకలాంటిదే. తెలియక చేసిన చిన్న తప్పు కూడా పెద్ద బంధనానికి కారణం అవుతుంది.


అందుకే జ్ఞానం చాలా ముఖ్యము. జ్ఞానం ఉన్నవాడు ప్రమాదాన్ని ముందే గుర్తిస్తాడు. జ్ఞానం లేని వాడు మాత్రం ఆపదలో పడిన తరువాత మాత్రమే పశ్చాత్తాపపడతాడు.”


భక్తులు ఆ మాటలు విని లోతుగా ఆలోచించారు. వారికి ఒక గొప్ప సత్యం అర్థమైంది.


✨ నీతి (Moral):


జ్ఞానం మనిషికి రక్షణ. తెలియక చేసే పనులు జీవితంలో బంధనాలకు దారి తీస్తాయి. కాబట్టి ప్రతి పని చేసే ముందు జ్ఞానం మరియు వివేకంతో ఆలోచించాలి.

మరణం

 #మరణం : ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


యమధర్మరాజు : మానవా.. నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


యమధర్మరాజు : తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


యమధర్మరాజు : వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


యమధర్మరాజు : వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


యమధర్మరాజు : తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. 


 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

మందు షాపు లిచ్చు మాత్రలే

 మందు షాపు లిచ్చు మాత్రలే మింగేసి

పోయె జబ్బు లనుచు పొంగిపోకు

తెలియకెదిగి జబ్బు తిక్కనే దీర్చురా

సకురు అప్ప రావు సత్య మిదిర! 


భావం: ఏ బాధ వచ్చినా, ఇంగ్లీష్ మందుల షాపు నుంచి ఏదో ఒక టెంపరరీ మాత్ర ఒకటి తెచ్చుకొని వేసేసుకుని, ఆహా! భలే తగ్గిపోయిందనుకుని, సంతోషపడిపోవద్దు! అది తగ్గిస్తున్నది నిజంగా జబ్బుని కాదు! ఆ జబ్బు ఒక బాధ ద్వారా తనకేమి కావాలో, తను భవిష్యత్తులో ఎటువంటి విపత్తులోకి వెళుతుందో, తనదైన భాషలో చెబుతూ, పన కేమి కావాలో అడుగుతుంది! అది ఒక మూగవాడి సైగల భాషలాగా రకరకాల లక్షణాలతో తెలియజేస్తూ ఉంటుంది! అటువంటి ఆ భాషలో ఉండే లక్షణాలను అర్ధం చేసుకుని, ఆ రాబోయే ఉపద్రవాన్ని నివారించగలిగే శక్తి హోమియో వైద్యానికి ఉంది! మెషీన్లు కనిపెట్టలేని క్లిష్టమైన సమస్యలను సైతం హోమియోలో అవలీలగా గుర్తించి, నయం చేయవచ్చు! శరీర భాషను తెలిసిన ఏకైక వైద్యం హోమియో మాత్రమే! కాబట్టి టెంపరరీ ఇంగ్లీషు మాత్రలతో సమస్యలు ముదరబెట్టుకుని ఆపదలపాలవ్వకుండా, మంచి హోమియో వైద్యుల సహాయంతో ప్రతీ బాధనూ సవ్యంగా నయం చేయించుకోండి! టెస్ట్ లూ, స్కానింగ్ ల చుట్టూ తిరిగి టైమ్, డబ్బులూ వేస్ట్ చేసుకోకుండా, సింపుల్ గా శరీర లక్షణాలను బట్టి వ్యాధులను నయం చేయగలిగే మంచి హోమియో వైద్యుల దగ్గరకు వెళ్ళండి! 

సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

అష్టాదశ పురాణాలు

 అష్టాదశ పురాణాలు - శ్రీ మత్స్య మహాపురాణం - కౌశిక పుత్రుల కథ - బ్రహ్మదత్తుడి చరిత్ర - ముప్పై రెండవ భాగం

__________________________________________________

తీవ్రమైన అనావృష్టిలో ఆకలితో అలమిటిస్తున్న కౌశికుని పుత్రులు ఏడుగురు "మేపడానికి తీసుకువచ్చిన గురువు గర్గ మహర్షి ఆవు దూడలలో ఆవుని చంపి ఆకలి తీర్చుకుందామని, గురువు గారికి ఆవును అడవిలో పులి చంపి తినేసిందని చెప్పి దూడను ఇచ్చేదామని" నిర్ణయించుకున్నారు.


కడపటి వాడైన పితృవర్తి "గోహత్య మహాపాతకం, వద్దని చెప్పినా అన్నలు ఆరుగురు వినకపోవడంతో అలోచించి "అన్నల్లారా! గోవుని చంపక తప్పని పరిస్థితిలో పితృశ్రాద్ధము చేద్దాం. పితరుల శ్రాద్ధంలో గోవధ పాపం మనకంటదు" అని చెప్పడంతో సరేనని అన్నలు ఆరుగురుఅంగీకరించారు.


పితృవర్తి పితృశ్రాద్ధ కార్యం ఆరంభించి విశ్వదేవతల స్థానంలో ఇద్దరిని, పితరుల స్థానంలో ముగ్గురిని, అతిథిగా ఒకరిని చేశాడు. తను శ్రాద్ధకర్త అయ్యి మంత్రపూర్వకంగా భక్తితో శ్రాద్ధం నిర్వహించాడు. ఆవుని చంపి ఆవుమాంసం పితరులకు అర్పించి, తాము ప్రసాదంగా స్వీకరించి ఏడుగురు అన్నదమ్ములు క్షుద్బాధను తీర్చుకున్నారు.


ఆశ్రమానికి తిరిగి వెళ్లి దూడను గురువుగారికి అప్పగించి "అడవిలో పులి దాడి చేసి ఆవుని చంపివేసింది. దూడను రక్షించి తీసుకువచ్చాము" అని అసత్యం పలికారు. గురువు గారైన గర్గాచార్యుడు వారిని చెప్పినది విశ్వవించాడు.


సమయం గడచి పోయింది. ఏడుగురు కౌశికుని కుమారులు కాలధర్మం ననుసరించి మరణించారు. మరుసటి జన్మలో దాశపురంలో బోయలుగా జన్మించారు. పితృశ్రాద్ధం భక్తి శ్రద్థలతో జరపడం వలన వారికి పూర్వజన్మ జ్ఞానము మరచిపోకుండా గుర్తుంది. వారు "శ్రాద్ధకర్మ చేసినా క్రూరకర్మ కావడంతో ఈజన్మలో జంతువులను వేటాడే బోయలుగా జన్మించాము" అని తెలుసుకున్నారు.


పూర్వజన్మలో చేసిన క్రూరకర్మకు పశ్చాత్తాపం చెంది విరక్తులై నిరాహార దీక్ష చేసి బోయ శరీరాలను పరిత్యాగం చేశారు. మరుసటి జన్మలో ఏడుగురు కాలంజర పర్వత అడవులలో జాతిస్మృతి అనగా పూర్వజన్మల జ్ఞానము గల మృగాలుగా జన్మించారు. ఈ జన్మలో కూడా జ్ఞాన వైరాగ్యాలతో శివుని కొలుస్తూ ధర్మబద్దంగా జీవించి మరణించారు.


తరువాత జన్మలో యోగనిష్ట గల చక్రవాక పక్షులుగా మానస సరస్సులో జన్మించారు. వారిలో ముగ్గురు విహరిస్తూ పాంచాలదేశంలోని ఉద్యానవనం చేరారు. అదే సమయంలో పాంచాల రాజు విభ్రాజుడు తన రాణులతో విహరిస్తూ సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. చక్రవాక పక్షిగా ఉన్న పితృవర్తి ఆ రాజుని, అనుభవిస్తున్న రాజవైభోగాలను చూసి వచ్చే జన్మలో తను రాజుగా పుట్టాలని కోరుకున్నాడు.


మిగిలిన ఇద్దరు మహాబలం వాహనాదులు గల మంత్రులను చూసి మరుసటి జన్మలో మంత్రులుగా పుట్టాలి అనుకున్నారు. మానస సరోవరం వద్ద ఉన్న మిగిలిన నలుగురు ఏ కోరికలు లేకుండా భక్తితో భగవంతుని సేవించారు. కాల పరిభ్రమణంలో ఏడుగురు చక్రవాక పక్షి జన్మలు ముగించి మరణించారు.


రాజుగా జన్మించాలని కోరుకున్న పితృవర్తి పాంచాల రాజు విభ్రాజునికి కుమారుడిగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. మంత్రులుగా పుట్టాలనుకున్న ఇద్దరు విభ్రాజుని మంత్రికి కండరీక, సుబాహులు అనే పేర్లతో పుత్రులుగా జన్మించారు. ఏ కోరికలు లేకుండా మరణించిన మిగిలిన నలుగురు బ్రాహ్మణులుగా జన్మించి ద్విజోత్తములు అయ్యారు.


విభ్రాజుని తరువాత బ్రహ్మదత్తుడు రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. కండరీక సుబాహులు బ్రహ్మదత్తుడికి మంత్రులు అయ్యారు. బ్రహ్మదత్తుడు సకల శాస్త్రాలలో నిష్ణాతుడు, పరాక్రమశాలి, బలవంతుడు, యోగవేత్త కావడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహంతో సమస్త ప్రాణుల (మృగ జంతు పశు పక్ష్యాదుల) బాషలు తెలిసిన నిపుణుడు అయ్యాడు.


శ్రాద్దకార్యంలో చంపబడిన కపిల గోవు (ఆవు) దేవలుడనే రాజుకు 'సన్నతి' అని కుమార్తెగా జన్మించి బ్రహ్మదత్తునికి భార్య అయ్యింది. బ్రహ్మదత్తుడు భార్యతో చక్కని దాంపత్యం చేస్తూ ధర్మబద్దంగా రాజ్య పాలన చేస్తున్నాడు. ఒకనాడు రాజదంపతులు ఇద్దరు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. పక్షులు క్రిమి కీటకాదుల భాష తెలిసిన బ్రహ్మదత్తునికి వనంలో పోట్లాడుకుంటున్న చీమల దంపతుల సంభాషణ వినిపించింది.


కోపంతో ఉన్న భార్య చీమను భర్త కోపం వదలమని అనేక విధాలుగా పొగడుతూ బ్రతిమాలుతున్నాడు. భార్య చీమ కోపంగా చూస్తూ "నిజంగా నామీద ప్రేమ ఉన్నవాడివే అయితే నిన్న నీవు సంపాదించిన లడ్డుపొడిని వేరే ఆడ చీమకు ఎందుకు ఇచ్చావు!" అని అడిగింది. దానికి భర్త చీమ "నన్ను క్షమించు! ఆ చీమ అచ్చం నీలాగే ఉంది. నీవే అనుకుని ఇచ్చాను. వేరే ఉద్దేశం ఏమి లేదు. ఇంకెప్పుడూ చేయను" అని కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడు. భార్య చీమ కోపం వదలి ప్రసన్నురాలైంది. ఇద్దరు కలసి ఆనందంగా చీమల పుట్టలోకి వెళ్లి పోయారు.


విష్ణువు అనుగ్రహం వలన సమస్త ప్రాణుల సంభాషణలు తెలిసిన బ్రహ్మదత్తుడు ఆ చీమల సంభాషణలు విని ఆశ్చర్యం చెందాడు.


శౌనకాది మునులు సూత మహర్షి భాషణం ఆపి "మహర్షీ! సకల జీవుల సంభాషణలు వినే విద్య బ్రహ్మదత్తుడు ఎలా పొందగలిగాడు. బ్రాహ్మణులుగా పుట్టిన నలుగురు కౌశిక పుత్రులు ఏం చేశారు? ఏమయ్యారు?" అని అడిగారు.


రేపటి భాగంలో ఆ కధ చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి చరిత్ర🛕🌞🙏🏻

 అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి చరిత్ర🛕🌞🙏🏻


📍 స్థలం: అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్


🛕 ఆలయ విశేషాలు:

• వయసు: 7వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు దేవేంద్రవర్మ నిర్మించారు. అంటే 1300+ ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన ఆలయం ఇది. • విగ్రహం ప్రత్యేకత: ఇక్కడ స్వామి వారు నిలబడి ఉన్న భంగిమలో, 5 అడుగుల ఎత్తు నల్లరాతి విగ్రహం. రెండు చేతుల్లో తామర పువ్వులు, పక్కన ఉష, ఛాయ, పద్మిని దేవేరులతో దర్శనమిస్తారు. • శాస్త్ర అద్భుతం: ప్రతి సంవత్సరం మార్చి 9, 10 & అక్టోబర్ 1, 2 తేదీలలో ఉదయం సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలో స్వామి వారి పాదాలను తాకుతాయి. దీన్ని కిరణోత్సవం అంటారు. ఇది చూడటానికి లక్షల మంది వస్తారు. • స్థల పురాణం: ఇంద్రుడు శాప విమోచనం కోసం ఇక్కడ సూర్య భగవానుడిని ప్రతిష్టించాడని పురాణ కథనం. • ప్రత్యేకత: భారతదేశంలో కోణార్క్ తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం ఇదే. ఆదివారం నాడు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. 

🙏 దర్శన సమయాలు: ఉదయం 6:00 నుండి రాత్రి 8:00 వరకు  

🎉 ప్రధాన పండుగ: రథసప్తమి - సూర్య జయంతి. ఆ రోజు లక్షలాది మంది వస్తారు.


మన తెలుగు నేల మీద ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి.  

ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః 🙏


               జై శ్రీరామ్ జై హనుమాన్

                                   

                       సదా మీ సేవలో 

         I am nothing without all of you" 

                  *_🌻శుభమస్తు🌻_*

                              ఇట్లు

                                మీ

                         భవధీయుడు

                అవధానుల శ్రీనివాస శాస్త్రి 

                  ❀┉┅━❀🕉️❀┉┅━❀

           🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏

          🙏లోకాస్సమస్తా సుఖినోభవంతు🙏

           🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

             👀👀👀👀👀👀👀👀👀👀👀

మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


16-06-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.  

---------------------------------------


వృషభం


ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయటా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దైవ చింతన కలుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------


మిధునం


గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. 

---------------------------------------


సింహం


ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


కన్య


భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


తుల


చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.  

---------------------------------------


వృశ్చికం


నూతన భూ గృహ యోగమున్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార,ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.

---------------------------------------


ధనస్సు


ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఋణదాతల ఒత్తిడితో నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది.

---------------------------------------


మకరం


కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో రావలసిన అవకాశాలు చేజారుతాయి.

---------------------------------------


కుంభం


వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.

--------------------------------------


మీనం

 

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

---------------------------------------

మాసశివరాత్రి

 *మాసశివరాత్రి*```

        

ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.

అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.

శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.

```

*మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?*```

మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు, అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.```


*చంద్రోమా మనస్సో జాతః*```

అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.


అందుకే మనం గమనించవచ్చు..,

అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.


కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.```


*మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?*```

ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5, 11, 18, 21, 56, 108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.


అలాగే ఆరోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.```


*మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?*```

ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.

సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.

వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది.

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.


ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖచ్చితముగా మార్పు వస్తుందని భావించవచ్చు.

మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందుదాం.

యాంత్రిక జీవితం*

 *యాంత్రిక జీవితం*

==================

సురేష్ వంకాయలపాటి 

=================


తిండి లో ఎక్కడ బలం?

తినే విధానంలోనే ఉంది ఫలం.


ప్రకృతికి దూరమైన మనిషి,

ప్రగతి పేరుతో పరుగులు తీశాడు.

యాంత్రిక జీవనంలో

మనిషి మారాడు యంత్రంలా,


సమయపు బంధీఖానాలో

తనను తాను బందించుకున్నాడు.

తానెవరో మరిచాడు,

ఏది ఆరోగ్యమో మరిచాడు,


శరీరానికి కావలసిన విశ్రాంతిని,

మనసుకు కావలసిన ప్రశాంతిని వదిలేశాడు.


నవ్వడం మరిచేడు,

నవ్వించడం మరిచేడు,


అనుబంధాల విలువను కోల్పోయి,

ఆప్యాయతల తలుపులు మూసేశాడు.


బ్రతుకు అంతా పరుగు,

గమ్యం తెలియని ఉరుకు,


సంపదల కోసం సాగిన ప్రయాణంలో,

సంతోషాన్ని వెనక్కి వదిలేశాడు.


భద్రత లేని బ్రతుకు,

భయాలతో నిండిన బతుకు,


ఎంత సంపాదించినా తృప్తి లేక,

ఎదో వెలితితో జీవిస్తున్నాడు.


మొక్కల సారం జీవానికి బలం,

ప్రకృతి ఒడిలోనే ఆరోగ్య నిలయం,


మితాహారం, మితభాష, మితనిద్ర ఉంటే,

శరీరం మనసు రెండూ సంతోషం.....


మనిషీ...ఒక్కసారి ఆగి చూడు,

నీ అంతరంగాన్ని నీవే విను,

ప్రకృతితో మమేకమై జీవిస్తే,

బ్రతుకు మళ్లీ పండుగవుతుంది......


కాలంతో పోటీ పడుతూ, కలలకే దూరమయ్యాడు.

చేతిలో ప్రపంచం ఉన్నా, ప్రేమను పంచడం మరచి 

ఒంటరి గా మిగిలేడు..


పక్షుల గానం వినలేక, ప్రకృతి పిలుపును గుర్తించలేక,

మనసుకు మనసే మందని తెలుసుకోలేక..... ఒంటరి అయ్యాడు...

జనారణ్యం లో 

జీవచ్చవం గా బ్రతుకు తున్నాడు...


మానవత్వంతో జీవిస్తే జీవితం పరిపూర్ణం....

అంతర్వాహినిగా

 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏


*🌼 సరస్వతి నదిని అంతర్వాహినిగా మారిపొమ్మని శపించింది ఎవరు*


🌼🌿🌼🌿🌼🌿🌼🌿


స్కంద పురాణం వైష్ణవ ఖండం వేంకటాచల మహత్యం లో సరస్వతి నది గురించి పేర్కొన్న అంశాలు ఈ పోస్ట్ కి ఆధారం.


ఒకసారి సరస్వతి దేవికి ఒక కోరిక కలిగింది. తాను కూడా ఒక నదిగా మారి మానవుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్దరించాలి అలాగే తనకు గంగ కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు కలగాలని కోరిక కలగడం తో ఇదే విషయాన్ని బ్రహ్మ దేవుని తో చెప్పింది. సరస్వతి దేవి కోరిక విన్న బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి గంగ కంటే గొప్పపేరా అని నవ్వుకుని సరే నీవు నదిగా మారుతావులే అని చెప్పి నారములకు అధిపతి ఐన శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయమని చెబుతాడు.


దాంతో సరస్వతిదేవి బదరిక్షేత్ర సమీపంలో 

దీక్ష తీసుకొని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం మొదలుపెడుతుంది.


బ్రహ్మ దేవుని నుంచి అనేకమంది ప్రజాపతులు ఉద్భవించారు. వారిలో పులస్త్య ప్రజాపతి ఒకరు. ఆయన తన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే గొప్ప వారసుడు తన వంశం లో పుట్టాలి అనే కోరికతో బదరి క్షేత్రానికి వచ్చి తపస్సు చెయ్యాలని భావిస్తాడు.


అలాగే తపస్సు చేయడానికి ముందు ఆచమనం చెయ్యాలి కాబట్టి నీటికోసం వెతుకుతాడు. కానీ ఆయనకు ఎక్కడా నీళ్ళు దొరకవు.


చుట్టూ చూడగా ఒక చోట దీర్ఘ తపస్సులో లీనమైన 

సరస్వతి దేవి కనిపిస్తుంది. సరస్వతి దేవి ముందు ఒక కమండలం ఉండడం తో అమ్మవారి ముందుకు వెళ్ళి తనకు జలం ఇవ్వాలని అడుగుతాడు. కానీ తీవ్ర తపస్సులో ఉన్న అమ్మవారికి అతడి మాటలు వినపడవు. దాంతో అతడు పదే పదే అడిగిన అమ్మవారు వినిపించుకోక పోవడంతో ఆగ్రహించి నువ్వు నాకు కనీసం ఆచమన జలం కూడా ఇవ్వలేదు. మళ్ళీ నదిగా మారి మానవులను ఉద్దరించాలి అని తపస్సు చేస్తున్నావు.


నువ్వు కోరినట్టే నదిగా మారుతావు కానీ కొంత కాలం తరువాత అంతర్వాహినిగా మారిపోతావు అని శపిస్తాడు.


అతడి మాటలకు అమ్మవారి తపస్సు భగ్నమై అతడి శాపవాక్కు విని సరస్వతి దేవికి కూడా విపరీతమైన ఆగ్రహం వచ్చి. ఉత్తమ వారసుడు కలగాలని తపస్సు చేయడానికి వచ్చావు కదానీ వంశానికి కళంకం తెచ్చే లోక కంటకుడు పరస్త్రీ వ్యామోహం తో సర్వనాశనం అయ్యే వాడు నీ వంశం లో పుడతాడు అని శపిస్తుంది సరస్వతి దేవి.


దాంతో అమ్మ వారి పాదాల పై పడి క్షమించమని వేడుకుంటాడు. కరుణామూర్తి ఐన అమ్మవారు. నా శాపాన్ని ఉపసంహారం చెయ్యను. నేను చెప్పినట్టే ఒక దుర్మార్గుడు నీకు మనవడుగా పుడతాడు.

కానీ నివు కోరినట్లు ఉత్తముడు వంశానికి వన్నె తెచ్చే వాడు ధర్మపరాయణుడు భాగవతోత్తములలో శ్రేష్టుడు చిరంజీవి ఐన వాడు కూడానీ వంశం లో పుడతాడు అని ఆశీర్వాదించగ పులస్త్యుడు అమ్మవారికి నమస్కరించి వెళ్ళిపోతుండగా. అప్పుడు సరస్వతి దేవి నీ శాపాన్ని ఉపసంహరించు అనగా అతడు అమ్మా నాకు అంత శక్తి లేదు నన్ను మన్నించు అని చెప్పి వెళ్ళిపోతాడు.


సరస్వతి దేవి శాపం మూలంగా పులస్త్య ప్రజాపతి కుమారుడు అయిన విశ్రవసు బ్రహ్మ కు కైకసి కి 

లోక కంటకుడు ఐన రావణుడు మరియు వర ప్రభావంతో భాగవతోత్తముడు రామ భక్తుడు అయినా విభీషణుడు జన్మించారు.


కానీ సరస్వతి దేవి తిరిగి తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయి ఏం వరం కావాలో కోరుకో అనగా అప్పుడు సరస్వతి దేవి తన కోరికను చెప్పగా శ్రీ మహావిష్ణువు నీవు కోరినట్టే గొప్ప నదిగా మారి వేదాలలో అత్యంత శ్రేష్ఠమైన నదిగా కీర్తిపొందుతావు. స్వామి ఇచ్చిన వరము ప్రకారం ఋగ్వేదం లో సరస్వతి నదిని అత్యంత శ్రేష్ఠమైన నదిగా పేర్కొన్నారు. కానీ శాపం ప్రకారం ద్వాపరయుగాంతం లో అంతర్వాహిని గా మారి కలియుగ మానవులకు అందుబాటులో ఉండవు అని అంటాడు. దాంతో సరస్వతి దేవి స్వామిని ప్రార్థించి కలియుగ మానవుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్ధరించే అవకాశం తనకు ఇమ్మని అడుగగా అప్పుడు స్వామి వెంకటాచలం లో స్వామీ పుష్కరిణీ లో తీర్థ రూపంలో ఉండమని చెప్పగా సరస్వతి దేవి తీర్థ రూపంలో తిరుమల లో స్వామి పుష్కరిణీ లో కొలువుదీరి ఉంది.మహాభారతం లో కూడా సరస్వతి నది గురించి అనేక చోట్ల ప్రస్తావించారు.


నోట్:- చాలా మంది సరస్వతి నదిని వ్యాసుడు శపించాడు అని అన్నారు. కానీ వ్యాసుడు శపించలేదు. ఆధి ఎవరో కల్పించిన విషయం ఆ మాటకు ఎలాంటి పురాణ ప్రమాణం లేదు.


ఓం శ్రీమాత్రే నమః 


🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

శ్రీమన్నారాయణీయము

  *శ్రీమన్నారాయణీయము*


*89వ దశకము - వృకాసురవధ - భృగు పరీక్షణము - ఎనిమిదవ శ్లోకము*


*331. సుప్తం రమాంకభువి పంకజలోచనం త్వాం*

*విప్రే వినిఘ్నతి పదేన ముదోత్థితస్త్వమ్*

*సర్వం క్షమస్వ మునివర్య ! భవేత్ సదా మే*

*త్వత్పాదచిహ్నమిహ భూషణమిత్యవాదీః*


*భావము :*

*ప్రభూ ! ఒకప్పుడు సరస్వతీ నదీతీరమందున్న మహర్షులకు, త్రిమూర్తులయందు మిక్కిలి సాత్వికుడెవ్వడనే సందేహం కలిగింది. ఈ విషయము తెలుసుకోవటానికై వారు భృగుమహర్షిని నియోగించారు. అప్పుడతడు బ్రహ్మలోకానికి వెళ్లి ఆయన యెడ అనాదరం చూపగా, అతనిపై బ్రహ్మదేవునికి కోపము కలిగింది. దానికి అతడు ఏ విధంగానో ఓర్చుకున్నాడు. కైలాసానికి వెళ్లి శంకరునిపై చులకన భావంతో ప్రవర్తించగా, ఆయనకు కోపము కలిగి భృగు మహర్షిని చంపబోయాడు. అప్పుడు పార్వతీదేవి శంకరుని వారించింది. చివరికా మహర్షి నీ దగ్గరికి వచ్చాడు.*


*శ్రీపతీ ! ఆ సమయంలో, పద్మాలవంటి కన్నుల గల నీవు, రమాదేవి యొక్క ఒడిలో నిద్రిస్తున్నావు. అప్పుడు భృగుమహర్షి తన కాలితో నిన్ను తన్నాడు. నీవు నిద్ర నుండి లేచి, ఏమాత్రమూ కోపించక, "మునివర్యా ! నా తప్పులన్నింటినీ క్షమించు. నీ పాదచిహ్నం నాకెప్పుడూ ఆభరణంగా ఉంటుంద"ని మిక్కిలి ఆదరంతో, ప్రశాంతంగా పలికావు.*

🙏🙏🙏

వివేకచూడామణి

 *వివేకచూడామణి*


 *శ్రీఆదిశంకర విరచితము*


*82. మోక్షస్య కాంక్షా యది వై తవాస్తి*

*త్యజాతిదూరాద్విషయాన్ విషం యథా*

*పీయూషవత్తోషదయాక్షమార్జవ*

*ప్రశాంతి దాంతీర్భజ నిత్యమాదరాత్*


*పదవిభజన :*

*మోక్షస్య కాంక్షా - యది - వై - తవ + అస్తి - త్యజ + అతిదూరాత్ + విషయాన్ -* *విషం - యథా -*

*పీయూషవత్ + తోష - దయా - క్షమా + ఆర్జవ - ప్రశాంతి - దాంతీః + భజ - నిత్యమ్ + ఆదరాత్*


*భావము :*

*శిష్యా ! సర్వ అనర్ధాలనూ తొలగించుకొని, నిత్య సుఖదాయకమైన మోక్షాన్ని నీవు నిజంగా పొందాలనుకుంటే, విషయభోగాలను విషం లాగా విసర్జించు. అమృతసమానమైన తోషం, దయ, క్షమ, ఆర్జవం, ప్రశాంతి అనే గుణాలను పెంపొందించుకో !*


*వివరణ :*

*దోషం : దుఃఖాలను ఖాతరు చేయకుండా, ఎల్లప్పుడూ సంతోషంగా వుండడం*

*దయ : సకల భూతాల హితవును నిర్హేతుకంగా ఎల్లవేళలా కోరడం*

*క్షమ : సర్వకాల సర్వావస్థలలో ఓరిమి కలిగి వుండడం*

*ఆర్జవం : ఋజువర్తనం. కపటం ఏమాత్రమూ లేని సత్ప్రవర్తన*

*ప్రశాంతి : కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల ఉపశమనం వలన లభించే చిత్తశాంతి*


*శబ్దాది విషయాలను హాలాహలం వలె అతి దూరంగా విడిచిపెట్టమని చెబుతున్నారు :*

*అకుర్వన్నపి విధ్యుక్తం నిషిద్ధం పరివర్జయేత్*

*నిషిద్ధ పరిహారేణ విహితే లభతే మతిమ్*

               - *సూతసంహిత*

*విధింపబడిన కర్మను చేయకపోయినా, నిషిద్ధ కర్మను మాత్రం వర్జించాలి. నిషిద్ధమైనదానిని పరిహరించటం వలన, విహితకర్మ యందు బుద్ధి కలుగుతుంది.*

🙏🙏🙏

మూకపంచశతి పాదారవిందశతకము

 💐💐💐💐💐💐

*శ్రీ మూకశంకర విరచిత మూకపంచశతిపాదారవిందశతకము* — 

*16వ శ్లోకంపై విశ్లేషణ*

💐💐💐💐💐💐

శ్రీ పోలా నరసింహమూర్తి గారు ఈ రోజు అందించిన మూకపంచశతి — పాదారవిందశతకము లోని 16వ శ్లోకము ఎంతో చమత్కారపూర్ణమైనది, అదే సమయంలో లోతైన తత్త్వార్థాన్ని కలిగినది. అమ్మవారి పాదపద్మాల మహిమను వర్ణించేటప్పుడు కవి ఉపయోగించిన *“సరాగః సద్వేషః”* అనే పదజాలం మొదటి చూపులో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే రాగద్వేషాలు మోక్షానికి అవరోధాలు. అలాంటి *రాగద్వేషాలతో కూడిన పాదపద్మాలు భక్తులకు కైవల్యమార్గాన్ని ఎలా చూపుతాయి?* — ఇదే ఈ శ్లోకంలోని కవితా రహస్యం.


> సరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం

> నిసర్గా దాక్రామన్ విబుధజనమూర్ధానమధికమ్ ।

> కథంకారం మాతః కథయ పదపద్మస్తవ సతాం

> నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్యసరణిమ్ ॥


*భావము :*

ఓ కామాక్షి మాతా! నీ పాదపద్మాలు “రాగము” కలిగినవిగా, “ద్వేషము” కలిగినవిగా కనబడుతున్నాయి. అవి సహజంగానే వికసించిన కమలాలను ప్రతిదినము అధిగమిస్తున్నాయి. దేవతల, జ్ఞానుల శిరస్సులపై నిలుస్తున్నాయి. అయినప్పటికీ, నీ పాదాలకు నమస్కరించిన సజ్జనులకు అవే కైవల్యమార్గాన్ని ప్రకటిస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం? దయచేసి చెప్పవమ్మా!


ఇక్కడ ప్రధానంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, అమ్మవారి పాదాలలో లోకజీవులకు ఉండే రాగద్వేషాలు నిజంగా ఉన్నాయని భావించకూడదు. ఇది కవి చేసిన అద్భుతమైన శ్లేషప్రయోగం మరియు విరోధాభాస అలంకారం.


*“రాగము”* అనే పదానికి సంస్కృతంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి — ఆసక్తి, మమకారం, బంధనరూపమైన ఇష్టం.


*రెండవది — రంగు, ముఖ్యంగా అరుణవర్ణం లేదా ఎర్రని కాంతి.* 

ఈ శ్లోకంలో కవి *“రాగము”* అనే పదాన్ని రెండవ అర్థంలో వాడారు. అమ్మవారి పాదాలు మంకెనపూలవలె, పద్మరాగములవలె, తామరరేకులవలె ఎర్రని దివ్యకాంతితో ప్రకాశిస్తున్నాయి. అందుకే అవి *“సరాగః”* — రాగంతో కూడినవి అని చెప్పబడ్డాయి. ఇక్కడ రాగం అంటే మమకారం కాదు; అమ్మవారి పాదాల సహజ అరుణకాంతి.


అలాగే *“ద్వేషము”* అనే పదం కూడా ఇక్కడ సాధారణ అర్థంలో వాడబడలేదు. ద్వేషం అంటే లోకంలో విరోధం, అసహనం, ప్రతికూలభావం. కానీ అమ్మవారి పాదాలకు అలాంటి మానసిక దోషం ఉండదు. ఇక్కడ కవి చెప్పే *“ద్వేషం”* అంటే, అమ్మవారి పాదాలు కమలాల సౌందర్యాన్ని మించి వాటిని జయిస్తున్నాయి. పద్మాలు తమ సౌందర్యంపై గర్విస్తే, అమ్మవారి పాదపద్మాలు ఆ పద్మాల గర్వాన్ని అణచివేస్తున్నట్లు కవి ఊహించాడు. అందుకే చమత్కారంగా *“సద్వేషః”* అని అన్నాడు. అంటే, అవి కమలాలను మించిపోవడం వల్ల కమలాలపై ద్వేషం ఉన్నట్లు కనిపిస్తున్నాయి.


కాని పరమార్థంగా చూస్తే, అమ్మవారు పరాశక్తి స్వరూపిణి. ఆమెకు మనోవికారరూపమైన రాగద్వేషాలు అసంభవం. రాగద్వేషాలు అజ్ఞానంతో, దేహాభిమానంతో, మమకారంతో బద్ధమైన జీవులలో కనిపిస్తాయి. పరిపూర్ణ చైతన్యస్వరూపిణి అయిన దేవికి అవి అంటవు. అందుకే ఇక్కడ రాగద్వేషాలు నిజమైన దోషాలు కావు; అవి కవితా చమత్కారంలో కనిపించే అలంకారార్థాలు మాత్రమే.


ఈ శ్లోకంలోని సున్నితమైన ప్రశ్న ఏమిటంటే — రాగద్వేషాలు ఉన్నట్లు కనిపించే పాదద్వంద్వం, రాగద్వేషరహితమైన కైవల్యమార్గాన్ని ఎలా చూపుతుంది? సమాధానం చాలా మధురమైనది. అమ్మవారి పాదాలలో ఉన్నది బంధకరమైన రాగం కాదు; అది అరుణకాంతి. అమ్మవారి పాదాలలో ఉన్నది ద్వేషదోషం కాదు; అది కమలసౌందర్యాన్ని అధిగమించిన పరమమాధుర్యం. అందువల్ల ఆ పాదాలు కైవల్యమార్గాన్ని ప్రకటించడంలో ఏ విరోధమూ లేదు.


ఇంకా లోతుగా చూడగా, అమ్మవారి పాదాలు భక్తుని హృదయంలోని నిజమైన రాగద్వేషాలను తొలగిస్తాయి. మనిషిని బంధించేది దేవి పాదాల రాగం కాదు; తనలోని విషయాసక్తి. మనిషిని క్షోభపెట్టేది దేవి పాదాల ద్వేషం కాదు; తనలోని అహంకారజన్య విరోధభావం. భక్తుడు అమ్మవారి పాదాలకు నమస్కరించినప్పుడు, తన అహంకారాన్ని, మమకారాన్ని, ద్వేషాన్ని, పక్షపాతాన్ని, అంతరంగ కలుషాలను తల్లి కృపలో సమర్పిస్తాడు. ఆ సమర్పణలోనే శరణాగతి ఉంది. శరణాగతిలోనే చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధిలోనే జ్ఞానోదయం ఉంది. జ్ఞానోదయంలోనే కైవల్యమార్గం ప్రత్యక్షమవుతుంది.


ఈ శ్లోకంలో *“విబుధజనమూర్ధానమ్”* అని చెప్పడం కూడా గంభీరమైనది. *అమ్మవారి పాదాలు దేవతల, పండితుల, జ్ఞానుల శిరస్సులపై నిలుస్తాయి.*


> *శిరస్సు అహంకారానికి చిహ్నం. ఎంత విద్య ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత దేవత్వం ఉన్నా, దేవి పాదసన్నిధిలో శిరస్సు వంచాలి. ఆ వినయమే ఆధ్యాత్మిక పురోగతికి ద్వారం. తల వంచిన చోట అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గిన చోట జ్ఞానం ప్రకాశిస్తుంది. జ్ఞానం ప్రకాశించిన చోట కైవల్యం దూరంగా ఉండదు.*


ఈ శ్లోకంలోని తాత్పర్యాన్ని మూడు విధాలుగా గ్రహించవచ్చు :


*1. కవితా దృష్టి :*

అమ్మవారి పాదాలు ఎర్రని కాంతితో ప్రకాశిస్తున్నాయి. కాబట్టి అవి సరాగము.


*2. అలంకార దృష్టి :*

అవి కమలాల సౌందర్యాన్ని జయిస్తున్నాయి. కాబట్టి అవి కమలాలపై సద్వేషము కలిగినట్లు కవి చమత్కరించాడు.


*3. తత్త్వ దృష్టి :*

అవి భక్తునిలోని నిజమైన రాగద్వేషాలను తొలగించి, అతనికి కైవల్యమార్గాన్ని చూపిస్తున్నాయి.


అందువల్ల, *ఈ శ్లోకంలో అమ్మవారి పాదాలకు రాగద్వేషాలు ఉన్నాయని చెప్పడము దోషారోపణ కాదు; అది మహిమారోపణ. లోకంలో రాగద్వేషాలు బంధానికి కారణమైతే, అమ్మవారి పాదశరణాగతి ఆ రాగద్వేషాలనే నాశనం చేసి మోక్షానికి కారణమవుతుంది. ఇదే మూకకవి చమత్కారంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం.*


> అమ్మవారి పాదాలు పద్మాలవలె కాదు;

> పద్మాలకు మూలమైన పరాశక్తి సౌందర్యస్వరూపాలు. 

> అవి ఎర్రని కాంతితో రంజింపజేస్తాయి;

> అహంకారకమలాలను జయిస్తాయి; 

> భక్తుల హృదయాలను పవిత్రం చేస్తాయి; 

> చివరికి కైవల్యసరణిని ప్రకటిస్తాయి.


*అమ్మవారి పాదరజస్సు మన మనస్సులోని రాగద్వేషాలను తొలగించి, శరణాగతి ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా కైవల్యాన్ని ప్రసాదించుగాక.*


*శ్రీ కామాక్షీ పాదారవిందార్పణమస్తు.*


*శ్వాసే ప్రాణః ।*

*ప్రాణే చైతన్యం ।*

*చైతన్యే దేవీమయత్వం ।*

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*జగద్గురు జ్ఞానపీఠం*

*9063939567*

💐💐💐💐💐💐

పంచాంగము