6, మే 2026, బుధవారం

Mantra - 31

 Mantra - 31 ARUNAM 4 anuvaakam


అజ్ఞానమనే పొర నీ కంటిని కప్పి ఉంచినంత కాలం నీకు సత్యం కనిపించదు. సాధన ద్వారా ఆ పొరను తొలగించుకున్నప్పుడు, నీ బుద్ధి నిర్మలమై (విప్రసన్నే), నీవు ఏకత్వాన్ని దర్శిస్తావు అని పూర్వ మంత్రం ఉపదేశిస్తే, ఈ క్రింది మంత్రం సూర్యుడిని జీవన ప్రదాతగా కొలుస్తుంది.


"కనకాభాని వాసాగ్ంసి। 

అహతాని నిబోధత|

అన్నమశ్నీత మృజ్మీత। 

అహం వో జీవనప్రదః||”


ఇది సూర్యారాధనలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణించ బడుతుంది. ఎందుకంటే ఇది భగవానువాచ. పరమాత్మ స్వయంగా చెప్పిన మాట ‘వలే’ ఈ మంత్రంలో ఉంది. ఇక్కడ సూర్య భగవానుడు స్వయంగా మానవాళికి తన ఉనికిని, రక్షణను మరియు జీవనాధారాన్ని వివరిస్తున్నట్లుగా ఉంటుంది.


‘కనకాభాని వాసాగ్ంసి’ - సూర్యుడు అంటున్నాడు - "’నేను బంగారు కాంతితో మెరిసిపోయే వస్త్రాలను ధరించిన వాడిని’ అని. ఇక్కడ వస్త్రాలు అంటే సూర్యుడి చుట్టూ ఉండే కిరణాలు లేదా ఆయన తేజస్సు అని అర్థం. సూర్యుడు బంగారు రంగులో ప్రకాశిస్తూ లోకాన్ని కప్పుతాడు.


“అహతాని నిబోధత” - ఆ సూర్యుని వస్త్రాలు (కాంతి పుంజములు) ఎప్పటికీ చెక్కుచెదరనివి (అహతాని - కొత్తవి లేదా నశించనివి) అని తెలుసుకోండి. సూర్య కాంతి ప్రతిరోజూ నూతనంగా, స్వచ్ఛంగా ప్రసరిస్తుంది. ఆ దివ్యమైన కాంతిని గుర్తించమని (నిబోధత) వేదం చెబుతోంది.


"అన్నమశ్నీత మృజ్మీత” - సూర్యుడు అంటున్నాడు - ‘అన్నాన్ని భుజించండి, పరిశుద్ధులుగా ఉండండి’ అని. (మృజ్మీత - స్నానాదుల ద్వారా లేదా అంతఃశుద్ధి ద్వారా నిర్మలమవ్వడం)’. భగవంతుడు ప్రసాదించిన ఆహారాన్ని స్వీకరిస్తూ, శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవాలని దీని అర్థం.


“అహం వో జీవనప్రదః" - సూర్య భగవానుడు స్వయంగా చెపుతున్నాడు - ‘నేనే మీకు జీవనాన్ని ప్రసాదించేవాడిని’ - అని. సూర్యుడు లేనిదే సృష్టిలో ప్రాణం లేదు. ఆయనే సకల ప్రాణకోటికి ఆహారాన్ని (photosynthesis ద్వారా), శక్తిని, ఆయుష్షును ఇచ్చే 'జీవనదాత'.


ఈ మంత్రం సూర్యుడిని 'ప్రత్యక్ష నారాయణుడు' గా స్థాపిస్తుంది. మనం తినే అన్నం (Energy) సూర్యుడి నుండే వస్తుంది కాబట్టి, ఆయనకు కృతజ్ఞతగా ఈ మంత్రాన్ని పఠిస్తాము. సూర్యుడు - జీవనదాత.


‘మృజ్మీత’ అనే పదం కేవలం బాహ్యమైన స్నానమే కాకుండా, సూర్యరశ్మి ద్వారా కలిగే ఆరోగ్య శుద్ధిని కూడా సూచిస్తుంది. ఆరోగ్యం మరియు శుద్ధి కారకుడు.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలను చదువుతున్నప్పుడు, సూర్యరశ్మి మన శరీరంపై ప్రసరించేలా చూసుకుంటే అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా (ప్రాణశక్తి మరియు Vitamin D) ఎంతో మేలు జరుగుతుందని సదాచార సంపన్నులు అందరూ చెబుతుంటారు. భౌతిక భావన చూసాము. ఇంక…


తత్వాన్ని విచారిస్తే…

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం జీవుడికి మరియు పరమాత్మకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తుంది:


‘కనకాభాని’ - హిరణ్మయ పురుషుడు, - 

బంగారం ఎలాగైతే స్వచ్ఛతకు, వికార రహిత తత్వానికి సంకేతమో, పరమాత్మ కూడా అలాగే ఉంటాడు. ఉపనిషత్తులు పరమాత్మను 'హిరణ్మయ పురుషుడు' (బంగారు కాంతి గలవాడు) అని వర్ణిస్తాయి. ‘హిరణ్మయః పురుషుః’ - నారాయణోపనిషత్; హిరణ్మయేన పాత్రేణ - ఈశావాస్యోపనిషత్)

ఇక్కడ 'వస్త్రాలు' అంటే సూర్యుడి కిరణాలు మాత్రమే కాదు, సృష్టిలోని అనంతమైన శక్తులు.

అద్వైత దృష్టిలో, బంగారం నుండి తయారైన నగలు ఎలా బంగారమే అవుతాయో, ఆ హిరణ్మయ పురుషుడి నుండి వచ్చిన ఈ జగత్తు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. 


‘అహతాని’ - అవ్యయ తత్వం - 'అహత' అంటే దెబ్బతిననిది లేదా చిరగనిది. లౌకికమైన వస్త్రాలు పాతబడిపోతాయి, కానీ సూర్యుడి ప్రకాశం లేదా పరమాత్మ చైతన్యం ఎప్పటికీ పాతబడదు. అది నిత్య నూతనం. ‘నిబోధత’ అని అనడం ద్వారా—బయట కనిపించే అనిత్యమైన వస్తువుల మీద కాకుండా, ఎప్పటికీ నశించని (అహత) ఆత్మ తత్వం మీద దృష్టి పెట్టమని వేదం బోధిస్తోంది.


‘అన్నమశ్నీత మృజ్మీత’ - ఉపాధి ధర్మం - అద్వైతం ప్రపంచాన్ని మిథ్య అని చెప్పినా, శరీరమనే ఉపాధిని నిర్లక్ష్యం చేయమని చెప్పదు. ‘అన్నమశ్నీత’ (అన్నం తినండి) అంటే దేహాన్ని సక్రమంగా (bare minimum) ఉంచుకోమని అర్థం. ఎందుకంటే *శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం*—ఆత్మ విచారణ చేయాలన్నా ఈ శరీరం ఒక సాధనం. ‘మృజ్మీత’ అంటే శుద్ధి. కేవలం బాహ్య శుద్ధి మాత్రమే కాదు, జ్ఞానమనే నీటితో అంతఃకరణను (మనస్సును) శుద్ధి చేసుకోవడం. శుద్ధమైన మనస్సులోనే సత్యం ప్రతిబింబిస్తుంది.


‘అహం వో జీవనప్రదః’ - అద్వైత సిద్ధాంతం ప్రకారం,

ఇక్కడ 'అహం' Pure I, Pure consciousness, నేను - అనేది సూర్యమండల మధ్యవర్తి అయిన పరమాత్మను సూచిస్తుంది. అద్వైతంలో 'అహం' అంటే పరిమితమైన అహంకారం (ego) కాదు, అది సర్వవ్యాప్తమైన 'నేను' (The Universal Self).


‘మీ అందరికీ జీవనాన్ని ఇచ్చేది నేనే’ అని చెప్పడం ద్వారా - జీవుడిలో ఉన్న ప్రాణ శక్తి, పరమాత్మ చైతన్యం కంటే వేరు కాదని స్పష్టమవుతోంది. సూర్యుడు లేనిదే ప్రాణం లేదు, ఆత్మ లేనిదే ఉనికి లేదు.


బంగారు కాంతితో నిరంతరం వెలిగే ఆత్మ వస్త్రం (చైతన్యం) నీలోనే ఉంది. నీవు తీసుకునే అన్నం, నీవు చేసే కర్మలు అన్నీ ఆ పరమాత్మ శక్తి వల్లే సాధ్యమవుతున్నాయి. నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు. ఆ ఏకత్వాన్ని గుర్తించి, పరిశుద్ధమైన మనస్సుతో జీవించు అని మంత్ర భావన. ఈ చిన్న మంత్రంలో ఊహకి అందని భావం ఎంత ఉందో కదా!

బుధవారం,మే 6,2026

  🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

బుధవారం,మే 6,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:పంచమి పూర్తి

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:మూల మ1.16 వరకు 

యోగం:సిద్ధం రా10.49 వరకు

కరణం:కౌలువ సా5.48 వరకు

తదుపరి తైతుల తె4.51 వరకు

వర్జ్యం:ఉ11.29 - 1.16 మరల రా11.48 - 1.33

దుర్ముహూర్తము:ఉ11.31 - 12.21

అమృతకాలం:ఉ6.10 - 7.57

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:ధనుస్సు     

సూర్యోదయం:5.36

సూర్యాస్తమయం:6.17

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

హనుమంతుడు

 శ్రీరామ (137 ) హనుమంతుడు - 5


( వాల్మీకి మహర్షి ధ్వనిరూపంలో చెప్పిన కుండలనీ యోగమే సుందరకాండ )



శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                        ----------------------



నిన్నటి (5-5-'26) పోష్టులో,

 హనుమంతుడు శ్రీవిద్యోపాసకుడని,సుందరకాండ హనుమంతుడు ఆచరించిన కుండలినీ యోగమన్న విషయం ఈ క్రింది శ్లోకాన్ని బట్టి పండితులు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పుకున్నాము.


శ్లో// కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మన:/

త్వాం ద్రష్టు ముపయాతో౽హం, సమాశ్రిత్య పరాక్రమమ్//


(నేను నా పరాక్రమాన్ని ఆశ్రయించి దురాత్ముడైన రావణుని శిరస్సు పై పాదము పెట్టి,నిన్ను దర్శించుటకు ఇక్కడకు వచ్చితిని. తల్లీ! ) 


అని, అశోకవనంలో సీతాదేవిని దర్శించిన హనుమంతుడు అన్నాడు.


పై శ్లోకాన్ని వివరిస్తూ, సాధకుడు మూర్ధ్ని స్థానమైన సహస్రార చక్రంలో దృఢంగా పాదము నిలిపి శిఖాస్థానమైన " పీఠక " చక్రంలో ఉన్న చిచ్ఛక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని దర్శించాలని పరమపూజ్యులు శ్రీ చందోలు శాస్త్రిగారు చెప్పిన విషయం కూడా నిన్నటి పోష్టులో చెప్పుకున్నాము.


ఆ శ్లోకంలోని ' రావణస్య దురాత్మనః ' అంటే ఏమిటి?

కామ, క్రోధములకు వశుడై, అంతులేని సంసారచక్రములో పరిభ్రమిస్తూ ఉంటాడు జీవుడు.

ఆజీవుడే రావణుడు. 


దురాత్ముడు (నిష్కల్మష చిత్తం లేనివాడు) అయిన అట్టి రావణుని శిరస్సుపై పాదము పెట్టాను అన్నాను హనుమంతుడు.


 అనగా యమ, నియమాదులు బాగా అభ్యసించి, రాగద్వేషములను జయించిన చిత్తము కలవాడినయ్యాను అనటం.


సుందరకాండ ప్రారంభ శ్లోకంలోనే హనుమంతుడు శత్రుకర్శనుడు అనగా శత్రువులను క్షీణింపజేసినవాడు అనే పదం వాడబడింది.


శ్లో// తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్శనః/

ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి//


( జాంబవంతుడు,మొదలైన వారు ప్రేరేపించగా, శత్రువులను కృశింపజేసిన హనుమంతుడు, రావణుడు అపహరించిన సీతా దేవిని వెదకుటకై,చారణులు మొదలైన దేవతలు సంచరించు ఆకాశమార్గము ద్వారా లంకకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను).


సుందరకాండ లోని ఈ మొదటి శ్లోకంలో హనుమంతుడు " శత్రుకర్శనుడు" అని కీర్తింపబడ్డాడు.


సముద్ర లంఘనమునకు ముందు హనుమంతుడు ఏ శత్రువులను నశింపజేయలేదు.


అందువలన " శత్రుకర్శనుడు " అంటే ఈసందర్భంగా కామ,క్రోధాది అంతశ్శత్రువులను నశింపజేసిన వాడు, అనే అర్థం అని పండితులు వ్యాఖ్యానించారు.


" కామ క్రోధాదులను జయించి, కల్మషరహితమైన అంత:కరణము కలవాడినై,

 నీ దర్శనము కోసము వచ్చాను తల్లీ ! "


అని హనుమంతుడు సాక్షాత్తు చిచ్ఛక్తి స్వరూపిణి, జగన్మాత, అయిన సీతాదేవితో విన్నవించడము, పై శ్లోకము యొక్క తాత్పర్యము అని పండితుల అభిప్రాయం.


అలాగే " పరాక్రమమును ఆశ్రయించి" (సమాశ్రిత్య పరాక్రమం) అనే పదములను పెద్దలు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు.


" పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ, అని నాలుగు విధములుగా వుండే "వాక్కు" లో, మొదటిదైన "పరా" వాక్కు వుండే స్థానం "మూలాధార చక్రము".

అక్కడ నుండి క్రమముగా ( పరాక్రమం) "స్వాధిష్ఠానము", "మణిపూరము", "అనాహతము", "విశుద్ధము", " "ఆజ్ఞా", అనే ఆరు చక్రములను దాటి ఏడవ చక్రమైన "సహస్రారము" చేరుకోవటం, 

 "సమాశ్రిత్య పరాక్రమమ్" అనే పదానికి అర్థం అని పండితులు చెబుతున్నారు.

అలాగే,

" త్వాం ద్రష్టు ముపయాతోహం" లోని చివరి అక్షరం "హం",

" సమాశ్రిత్య పరాక్రమమ్" అనే పదములోని మొదటి అక్షరం "సం" ,

ఈ రెండు అక్షరములు కలిసి "హంసం"అవుతుంది.

ఇదే ప్రాణశక్తి స్వరూపమైన హంస గాయత్రి.


"హంస హంస:పరమహంస స్సోహం హంస స్సోహం హంస:"

"హంస హంసేతి యో బ్రూయాత్, హంసో నామ సదాశివ:" 

రుద్రాభిషేకం సందర్భంగా మహాన్యాసం లో చెప్పే పై మంత్రం "హంస" అంటే సదాశివుడు అని అర్థం చెబుతున్నది.

హంస గాయత్రి అంటే ఆ సదాశివుని మంత్రమే.


ఆ హంస గాయత్రి మంత్రమును ఆశ్రయించి,పరా,పశ్యంతి,మధ్యమా, వైఖరీ క్రమమున నీ దర్శనం కోసం వచ్చాను తల్లీ, అని సీతాదేవితో హనుమంతుడు అన్నట్లుగా ప్రఖ్యాత కవులు, శ్రీవిద్యా ఉపాసకులు అయిన కీ.శే.లు 

శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు వ్యాఖ్యానించారు.


ఈ పదములను,సుందరకాండలోని ఇతర శ్లోకములను కూడా వ్యాఖ్యానిస్తూ, సుందరకాండ, కుండలినీ యోగమే అని చెప్పారు.( షోడశి రామాయణ రహస్యాలు).


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

6-5-'26.

నేనెవరు

 *'నేనెవరు'*🧘‍♂️🧘‍♂️🧘‍♂️


*జీవితంలో ప్రతి మానవుడు 'నేనెవరు' అని ప్రశ్నించుకోవాలి., తనలోకి తాను చూడగలగాలి. "అంతర్మథనం" సాగాలి. అదే నిజమైన సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక ప్రయాణం, వేదాంత జ్ఞానం., కనిపించేది అంతా కనుమరుగు అవుతుంది. శాశ్వతమైన సత్యమార్గాన్ని తెలుసుకోగలుగుతాము... అదే భగవంతుని తత్వం.* .


*“శరీరం తాత్కాలికం, కనిపించని ఆత్మ శాశ్వతం. కనిపించని పరమాత్మ దానికి ఆధారం.”*


*“ క్లిష్టమైన సంస్కృత శ్లోకాలతో వేద ప్రామాణికాలతో సాగే ప్రబోధాలవల్ల సామాన్య మానవుడు 'నేనెవరు' అనేది గుర్తించడం లేదు. తనను తాను విచక్షణతో తెలుసుకోలేక సందేహంలో ఊగిసలాడుతున్నాడు., ఆధ్యాత్మిక జ్ఞానం వైపు దృష్టి సారించలేకపోతున్నాడు.*


*సరళమైన, సులభమైన గురుబోధ నరేంద్రుణ్ని వివేకానందుడిగా తీర్చిదిద్దింది.*🙏🙏🙏


*నేనెవరు అని ప్రశ్నించుకొని, “నీలోకి నిన్ను చూడు” అనే సందేశంతో తనలో దాగి ఉన్న అంతరార్థం “మానవత్వ మార్గం”., గ్రహాల పైకి ప్రయాణించే మానవుడు, అగాధమైన సముద్రం లోతుకు వెళ్లే మానవుడు, కొన్ని అంగుళాల లోపల ఉన్న అంతరంగంలోకి వెళ్లలేక పోతున్నాడు., దానినే మాయ అని అంటారు.* 


*తాను, తన సంపద, అధికారం, పరివారం శాశ్వతమని మానవుడు భావిస్తున్నాడు.., అవే అకృత్యాలకు, స్వార్థానికి, సంకుచిత మనస్తత్వానికి కారణాలు... స్వార్థం తగ్గిస్తే శ్రేయస్సు, కోరికను అదుపు చేస్తే శాంతి.., మోహక్షయం మోక్షం....*


*నేనెవరు అని ప్రశ్నించుకొనే కనీస జ్ఞానం తనకు తాను ఇవ్వగలిగితే చాలు., మానవుడు తనలోని మనసు అనే క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొందగలడు., అంతర్యామి బాహ్యంలో లేదు. పదిఅంగుళాల పరిమాణంలో నీలోని నువ్వుగా ఉన్నాడని నారాయణసూక్తం చెబుతోంది. ప్రతి ప్రాణీ భగవంతుని స్వరూపమే. ఎవరికి సేవ చేసినా  ఆ భగవంతునికే చెందినట్లు. ఎవరిని బాధించినా ఆ భగవంతున్ని బాధించినట్లు. ఇదే “బ్రహ్మోపదేశం”*


*పట్టాభిషేకమైనా, వనవాసమైనా స్థిరచిత్తముతో సాగిన శ్రీరాముడు దేవుడిగా మారాడు. “శోకం వదలి, ఫలితాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తించు” అని బోధించిన కృష్ణుడు దేవుడిగా పూజలందుకున్నాడు.*🙏🙏🙏


*అహింస పరమధర్మం., శాంతి సౌఖ్యాలు సమాజ సేవలోనే దొరుకుతాయి., హృదయాన్ని వీణగా భావించి కరుణ, విషాదం, ఆనందం, దుఃఖం, అవమానం, సత్కారం తీగలుగా రాగాలు పలికిస్తే- అదే మానవ జీవనానికి ఆధ్యాత్మిక ప్రయాణం.*🙏🙏🙏


*ధ్యాన సాధనతో, జ్ఞానముతో ప్రతి మానవుడు ఈ స్థితిని పొందగలడు.., "సాధన ముఖ్యం..," "సాధన ద్వారానే సాధించగలము.*


సర్వేజనాః సుఖినోభవంతు 

 శుభమస్తు🙏

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - చతుర్థి - మూల -‌‌ సౌమ్య వాసరే* (06.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*