19, మే 2026, మంగళవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 18 మే 2026*


     *శ్రీ మహావిష్ణు పురాణం*                                 

              *92వ భాగం*


          *భక్త అంబరీష చరిత్ర*```


మత్స్యావతారంలో శ్రీమహా విష్ణువు అనుగ్రహం పొందిన సత్యవత్ర మహారాజు తరువాత జన్మలో సూర్యుని పుత్రుడిగా జన్మించాడు. అతనికి 

‘శ్రాద్ధ దేవుడు’ అని నామకరణం చేశారు. అతడే ‘వైవస్వతుడు’

గా వైవస్వంత మన్వంతరానికి మనువు అయ్యాడు. సూర్య వంశము ఇతని ద్వారా విస్తరించింది.


వైవస్వతునికి ఇక్ష్వాకువు, నాభాగుడు మొదలైన పది మంది కుమారులు జన్మించారు. శ్రీరామచంద్రుడు జన్మించిన ఇక్ష్వాకు వంశం గురించి మీరు ముందుగానే విన్నారు. వైవస్వత మనువు మరో పుత్రుడైన నాభాగుడికి నభగుడు అనే కుమారుడు జన్మించాడు. నభగుడి కుమారునికి తాత నాభాగుడి పేరే పెట్టారు. మహా పండితుడు, విష్ణుభక్తుడు అయిన ఇతనికి అంబరీషుడు కుమారుడిగా జన్మించాడు.


అంబరీషుడు రాజర్షియై నిరంతరం శ్రీమన్నారాయణ నామ స్మరణ చేస్తుండేవాడు. విష్ణుమూర్తికి ప్రియభక్తుడైన అంబరీషుడు భూమండలానికి రాజైనా భౌతిక సుఖములందు కోరిక ఉండక, హరి నామ స్మరణ తో హరిభక్తులను సేవిస్తూ ఉండే వాడు. రాజ్యపాలనచక్కగాచేస్తూ ప్రజపాలన జనరంజకంగా చేస్తూ విష్ణుభక్తి, విరక్తి వలన రాజర్షిగా ప్రసిద్ది చెందాడు.


అంబరీషుని నిర్మల భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు తన భక్తుని రక్షణకు సుదర్శన చక్రాన్ని నియమించాడు. అంబరీషుడు తన ధర్మపత్నితో కలసి శ్రీమహా విష్ణువు ప్రీతి కోసం ఏడాది పాటు సాగే ద్వాదశీ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించాడు. వ్రతం పరిసమాప్తి అయిన కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం ఉండి కాళింది నదిలో స్నానం చేసి, మధువనంలో శ్రీహరికి అభిషేకం చేసి గంధాక్షలతో, పుష్పాలతో పూజించాడు. వ్రత ఉద్యాపన చేసి ఉపవాస దీక్ష ముగించాలి.


బ్రాహ్మణులకు గోదానం చేసి బ్రాహ్మణ సమారాధన చేసిన తరువాత అంబరీషుడు ఉపవాస దీక్ష విరమించడానికి సిద్దమైయ్యాడు. ఆ సమయానికి ఈశ్వరాంశ సంభూతుడు, మహా తపస్వి, మహా క్రోధి అయిన దూర్వాస మహర్షి అంబరీషుడి వద్దకువచ్చాడు. మహర్షికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉన్నతాసనం ఏర్పాటు చేశాడు. ద్వాదశి వ్రత పారణ లో తనతోటి భోజనం చేయవలసిందిగా కోరాడు. దూర్వాస మహర్షి అంగీకరించి నదికి వెళ్లి స్నాన సంధ్యాదులు ముగించి వస్తానని వెళ్లాడు. నదికి వెళ్లిన మహర్షి ఎంతకి రాలేదు. అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశీ ఘడియలు ముగియక ముందే భోజనం (పారణ) చేసి ముగించ వలసి ఉంటుంది.


అతిథి అయిన దూర్వాస మహర్షి రాకుండ భోజనం చేస్తే మహర్షికి ఆగ్రహంవస్తుంది. సమయం లోపల మహర్షి రాకపోతే సంవత్సరo పాటు చేసిన ద్వాదశి వ్రతం వ్యర్ధమవుతుంది. సమయం ముగియటానికి అర్థ ముహుర్త కాలం మాత్రమే ఉండటంతో అంబరీషుడు పండితులను పిలిచి తన ధర్మ సంకటం వివరించి ఏమి చేయాలో చెప్పమని అడిగాడు.


శాస్త్రం తెలిసిన పండితులు ఆలోచించి "ఆహ్వానించిన అతిథి రాకుండా భోజనం చేయకూడదు. ద్వాదశి ఘడియలు దాటితే వ్రత భంగం అవుతుంది. మధ్యమార్గంగా ద్వాదశి ఉండగానే మీరు జలభక్షణ (జలము స్వీకరణ) చేస్తే వ్రతభంగం కాదు. భోజనం కాదు గనుక అతిథిని అగౌరవించినట్టు కాదు. ద్వాదశి వ్రత పారణ దక్కుతుంది" అని ఉపాయం చెప్పారు.


అంబరీషుడు ఆ మాటలను విష్ణువు ఆదేశంగా భావించి కొద్దిగా జలము స్వీకరించి మహర్షి కోసం నిరీక్షించసాగాడు. 


దూర్వాస మహర్షి నది నుంచి వచ్చాడు. జరిగింది తన దివ్య దృష్టితో గ్రహించి తను రాకుండానే జలభక్షణ చేసిన అంబరీషుని పై ఆగ్రహించాడు.

“అంబరీషా! అతిథిగా నన్ను భోజనానికి పిలిచి వేచి చూడకుండానే జలభక్షణ చేశావు. ఇంత గర్వము, అహంకారం ఉన్న నీవు విష్ణుభక్తుడివి, ధర్మపాలకుడివి కాదు. తగిన శిక్ష విధిస్తాను” అంటూ తన జడలలో ఒకటి పెరికి మంత్రించి భూమి పై విసిరాడు. అది కృత్య అనే మహారాక్షసిగా మారి అంబరీషుడి పైకి తినడానికి రాసాగింది.


ప్రజలందరు హాహాకారాలు చేస్తున్నా అంబరీషుడు కన్నులు మూసుకుని చేతులు జోడించి విష్ణునామం ధ్యానం చేస్తూ నిలిచాడు. 


వైకుంఠవాసుడైన శ్రీహరి గ్రహించి భక్తునికి రక్షణగా సుదర్శన చక్రం ప్రయోగించాడు. అగ్నిజ్వాలలు చిమ్ముతూ వచ్చిన సుదర్శన చక్రం కృత్య రాక్షసిని భస్మం చేసింది. తరువాత రాక్షసిని ప్రయోగించిన దూర్వాస మహర్షిని శిక్షించడానికి వెంట పడింది.


దూర్వాస మహర్షి సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి మేరు పర్వత గుహలలోకి వెళ్లి దాక్కున్నాడు. అయినా సుదర్శన చక్రం వెంట పడటం మానలేదు. మహర్షి ఎక్కడికి వెళ్లినా అక్కడికి వెంట వస్తోంది. సత్యలోకంలో బ్రహ్మ దగ్గరకు వెళ్లి చక్రం నుంచి రక్షించమని ప్రార్ధించగా బ్రహ్మ “దేవదేవుని సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి నాకు గానీ, ఇంద్రాది దేవతలకు గానీ లేదు” అని చెప్పాడు.


వెంటనే దూర్వాస మహర్షి తన పుట్టుకకు కారణమైన పరమేశ్వరుడి వద్దకు వెళ్లి సుదర్శన చక్రం నుంచి తనను రక్షించమని ప్రార్ధించాడు. శివుడు "సుదర్శనాన్ని ఆపడం దానికి స్వామి అయిన మహావిష్ణువు వలనే అవుతుంది” అని విష్ణువు వద్దకు వెళ్ళమన్నాడు.  


సుదర్శనం వెంట వస్తుండగా దూర్వాస మహర్షి వైకుంఠంలో శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లాడు. సుదర్శనం ద్వారం వద్ద ఆగి వేచి చూస్తోంది.


శ్రీహరి పాదాలకు ప్రణమిల్లి దూర్వాస మహర్షి "నారాయణా! నీ సుదర్శనం నుంచి నీవే కాపాడగలవు. నా తప్పు మన్నించి రక్షింపుము” అని ప్రార్ధించాడు. 


మహావిష్ణువు మందహాసంతో “మహర్షీ! నేను నా భక్తుల హృదయంలో బందీ అయ్యి ఉంటాను. అంబరీషుడి రక్షణ కోసం నియమింపబడిన సుదర్శనం ఆ భక్తుడు చెబితేనే వింటుంది.


అంబరీషుడు మహా భక్తుడు, ధార్మికుడు. ఎవరికీ హాని తలపెట్టని వాడు. అటువంటి మహాభక్తునికి ఆపద తలపెట్టి నీవు ఆపదలో చిక్కుకున్నావు. నిన్ను సుదర్శన చక్రం శిక్షించ కుండా ఉండాలంటే అంబరీషుని శరణు వేడి క్షమించమని కోరుము. అతను మాత్రమే నిన్ను కాపాడగలడు” అని చెప్పి పంపాడు.


దూర్వాస మహర్షి సుదర్శన చక్రం తరుముతుంటే అంబరీషుడి వద్దకు వచ్చి శరణు కోరి “అంబరీష చక్రవర్తీ! నా తప్పును మన్నించి నన్ను సుదర్శన చక్రం నుండి రక్షించుము” అని ప్రార్ధించాడు. 


మహర్షి తన పాదాల పై పడినందుకు అంబరీషుడు బాధపడి ఆయనను లేపి ఉచితాసనుని చేశాడు. సుదర్శన చక్రానికి నమస్కరించి

“చక్రరాజమా! శ్రీహరి ఆదేశంతో నీవు భక్తులను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తావు. దూర్వాస మహర్షి దుష్టుడు కాదు మహాతపస్వి. శివాంశ సంభూతులు. క్షణిక ఆగ్రహంలో తప్పు చేశారు. సహృదయంతో మన్నించి ఆయనను శిక్షించకుండా వదిలి వేయుము” అని ప్రార్ధించడంతో సుదర్శన చక్రం శాంతించి అదృశ్యమయ్యింది.


దుర్వాస మహర్షి అంబరీషుడి ఆతిథ్యం స్వీకరించి దీవించి వెళ్లి పోయాడు. 


రాజర్షి అయిన అంబరీషుడికి ముగ్గురు పుత్రులు కలిగారు. పెద్దవాడైన విరూపునికి రాజ్యం అప్పగించి అంబరీషుడు ధర్మపత్నితో వానప్రస్థానికి వెళ్లి పోయాడు. తపస్సుతో శ్రీహరిని మెప్పించి వైకుంఠప్రాప్తిపొందాడు. చిన్నవారైన కేశుమంతుడు, శుంభుడు తండ్రి వలెనే విష్ణు భక్తులై తపస్సుకి వెళ్లారు. 


విరూపుని వంశంలోని రథీతరుడి సంతతి వారు బ్రాహ్మణులై రథీతరగోత్రులుగా ప్రసిద్ధి చెందారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శ్రీ హనుమాన్ చాలీసా🍁*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

     *మంగళవారం 19 మే 2026*


 *🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*

*🍁 జ్ఞాన యజ్ఞం - 15వ రోజు🍁*


గత చౌపాయిలో శ్రీరామచంద్రుడు హనుమంతుని తన సోదరుడైన భరతునితో సమానంగా గౌరవించడం చూశాం. ఆ క్రమంలోనే రాముడు హనుమను అక్కున చేర్చుకుని, ఆయన కీర్తిని ఇంకా ఎలా కొనియాడారో ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడి నుంచి వచ్చే మూడు నాలుగు చౌపాయి లు హనుమ స్వామిని ఎవరెవరు కీర్తించారు అనే విషయాన్ని చెపుతారు.


         **13వ చౌపాయి**


 **సహస బదన తుమ్హరో జస గావైం |**

 **అస కహి శ్రీపతి కంఠ లగావైం ||**


          **ప్రతిపదార్థం**


       * **సహస బదన** 

     వేయి నోళ్లతో (వేనోళ్లతో)

      * **తుమ్హరో జస** 

  నీ యొక్క కీర్తిని/యశస్సును

           * **గావైం** 

      గానం చేసి (కీర్తించాలి)

           **అస కహి* 

            అని చెబుతూ

            * **శ్రీపతి** 

లక్ష్మీనాథుడైన ఆ శ్రీరామచంద్రుడు

        * **కంఠ లగావైం:** 

హనుమంతుడిని గాఢంగా కౌగిలించుకున్నాడు.


               **వివరణ**


**1. వేనోళ్లతో కీర్తన (శ్రీరాముని ప్రశంస)**


శ్రీరామచంద్రుడు హనుమంతునితో ఇలా అంటున్నాడు.

ముందు చౌపాయి లో చెప్పిన హరషి ఉర లాయే కు కొనసాగింపు ఇది.


కంఠంతో ఆలింగనం చేసుకోవడం అనే ఘట్టంలో రాముడు వెయ్యి నోర్లతో నీ కీరిని గానం చేశాడు. శ్రీపతి అంటే లక్ష్మిపతి రాముడు నారాయణుడు ఆయన నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. 'సహసబదన్' సహస్రముఖః సహస్రాక్షః సహస్రకరః ఈయనని కీర్తించడానికి ఒక్క నోరు చాలదేమో వెయ్యి నోళతో నిన్ను కీరించాడంటే అనంతంగా నిన్ను కీరించాడని అర్థం. వేనోళ్ళ పొగడాలి అంటే అర్థం. నిరంతరం పొగడడం బహు విధాలుగా పొగడడం


 "హనుమా! నీవు చేసిన సహాయానికి, నీ భక్తికి నేను ఇచ్చే ఏ ప్రశంస కూడా సరిపోదు. నీ కీర్తిని వర్ణించడానికి ఒక నోరు సరిపోదు అని రాముడు అన్నాడు. అంతే కాదు వేయి నోళ్లు ఉన్నవాడే నీ గుణగణాలను పూర్తిగా గానం చేయగలడు."అని కూడా చెప్పవచ్చు.


అంటే భగవంతుడు తన భక్తుని గొప్పతనాన్ని వేనోళ్లతో కొనియాడే అంతటి ఉన్నత స్థితికి హనుమంతుడు చేరుకున్నాడు.


శ్రీపతి అని చెప్పడంలో మరొక చమత్కారం ఉంది ఆయన కీరించడమే కాదు. ఆవిడ కూడా కీర్తించింది. రామాయణంలో శ్రీ అనే మాట ఎక్కడ వచ్చినా సీతమ్మ అనే అర్థం. 'రామ అంటే నా మంత్రం, శ్రీరామ అంటే సీతారామ మంత్రం' అన్నాడు రాముడు. అందుకే శ్రీరామ జపం చాలా శ్రేష్ఠం.


ఇక్కడ ఇంకొక అర్థాన్ని కూడా చెప్పవచ్చు- 'సహసబదన' అని విడిగా చెప్తే హనుమంతుని సంబోధిస్తూ వేయిముఖములవాడా! అనే అర్థం వస్తుంది. వేయి ముఖాలవాడైనా ఆంజనేయుడా..! నీ కీర్తిని శ్రీపతి కీర్తించి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు అనే అర్ధాన్ని కూడా కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు.


ఆంజనేయస్వామి బహుముఖాలుగా గోచరిస్తారు. ఆయనకు పంచవదనం. సప్తవదనం. ఏకాదశ వదనం ఉంది. బహు వదనాలు ఉన్నాయి. ఆయన విరాడ్రూపుడు. భీముడంతటి వాడే హనుమ విరాట్ రూపం చూడలేక పోయాడు. స్వామి రూపం ఊహకు అందదు.


సహస బదన్' అన్నప్పుడు బహు ముఖములుగా భాసించిన నీ స్వరూపాన్ని సీతమ్మ, రామచంద్రమూర్తి కీర్తించారు. ఎందుకంటే వారు ఆ స్వరూపాన్ని చూశారు కనుక అని భావించ వచ్చు.


**2. దైవిక ఆలింగనం**


'శ్రీపతి' (విష్ణుస్వరూపుడైన రాముడు) హనుమంతుడిని కౌగిలించుకోవడం అనేది భక్తుడికి లభించే అత్యున్నత పురస్కారం. సేవలో అహంకారం లేనప్పుడు, ఆ యజమానే సేవకుడిని వెతుక్కుంటూ వచ్చి అక్కున చేర్చుకుంటాడని ఈ ఘట్టం నిరూపిస్తుంది.


**తులసీదాసు గారి సందేశం**


మనం చేసే పనిలో నిజాయితీ, నిష్కామ బుద్ధి ఉంటే.. లోకం మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, సాక్షాత్తు ఆ పరమాత్మే మనల్ని వేనోళ్లతో కీర్తిస్తాడు. భగవంతుని ప్రేమను పొందడానికి కేవలం 'సేవ' మరియు 'శరణాగతి' ఉంటే సరిపోతుందని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు తెలియజేశారు.


*జై శ్రీరామ్!జై హనుమాన్!*

        🍁🌹🙏🌷🍁


          *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

మనభాషలను

 *మనభాషలను మనమే రక్షించుకోవాలి,ప్రభుత్వాలు కూడా రక్షించడం లేదు*

    జనబాహుళ్యంలో *బండి ర* గా పేరొందిన ఆ అక్షరం అసలు పేరు ఏమి టో తెలుసా??? *బండ ర*.

మన *ర* కారాలు(రకారాన్ని సంస్కృత భాషలో రేఫ అంటారు) మూడు రకాలు.

    మొదట ది *సున్నితమైన రకారం...ఋ*. దీనిని సున్నితంగా పలకాలి,

ఉదా:-- ఋషి, కృషి, తృష్ణ, మాతృభాష, పితృదేవతలు....

రెండవ ది *సామాన్య రకారం*. ఇది కొంచెం నొక్కి(బలం గా) పలికేది. ఉదా:-- రాముడు, తరంగాలు, శ్రుతి, శ్రమ,అక్రమ, విక్రమ, ...,

మూడవ ది *బండ ర కారం*. దీని ని బాగా బలం గా/బండగా నొక్కి పలకాలి.

ఉదా:-- కఱ్ఱ, బుఱ్ఱ, నఱ్ఱ,చెఱకు,అఱుగు.....

ఎవరో ఈ బండ ర ను బండి లా ఉండటంతో బండి ర అనడం, తద్వారా సంస్కృత మున కూడా దీనిని శకట రేఫ అని ప్రస్తావించడం జరిగింది. ఇదీ దీని అసలు కథ. 

*అయితే ఈ బండ ఱకారం తెలుగు భాషలో మాత్రమే ఉంది అని ఎంతమంది కి తెలుసో!!!???*

శివభక్తి

 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


          🔱*శివభక్తి*🔱

         

    🌲 *భవిష్య పురాణం* 🌲


✴️ *శివార్చన లేని జన్మ నిరర్థకం* ✴️


❇️ *యేన రానార్చయంతీహ శివం త్రిభువనేశ్వరం| న తే స్వర్గస్య మోక్షస్య రాజ్యస్యాపి న భాజనం||* ❇️


🌻*ఈ లోకంలో త్రిభువనేశ్వరుడైన ఆ పరమశివుడిని ఎవరైతే ఆరాధించరో, వారు స్వర్గానికి గానీ, మోక్షానికి గానీ, కనీసం ఈ లోకంలోని రాజ్య భోగాలకు గానీ అర్హులు కారు.* 


🌻 *అంటే, సకల శుభాలకు మూలం శివారాధన అని భావం.*


🔱 *నియమబద్ధమైన ఆరాధన* 🔱


❇️ *వరం ప్రాణపరిత్యాగః శిరసో వాపి కర్తనం| నత్వ సంపూజ్య భూంజీత భగవంతం త్రిలోచనం||* ❇️


🌻 *ముక్కంటి దేవుడైన ఆ పరమేశ్వరుడిని పూజించకుండా భోజనం చేయకూడదు*. 


♀️ *శివార్చన చేయకుండా తినడం కంటే, ప్రాణాలను వదలడం లేదా శిరచ్ఛేదనం చేసుకోవడం మేలు (ఇది శివారాధన పట్ల ఉండవలసిన నిష్ఠను, పట్టుదలను సూచించే తీవ్రమైన ఉదాహరణ).* ♀️


🔱 *శివభక్తుడే శివుడు* 🔱


❇️ *స్ఫుటం నిర్వహతే యస్య యావజ్జీవం శివార్చనం| మనుష్య చర్మణానద్ధః స రుద్రో నాత్ర సంశయః||* ❇️


🌻 *ఎవడైతే తన జీవితాంతం నిరంతరం శివార్చన చేస్తాడో, వాడు మనుష్య చర్మం ధరించిన సాక్షాత్తు ఆ రుద్రుడే*. 


🌻 *ఇందులో ఎటువంటి సందేహం లేదు. శివభక్తుడు శివస్వరూపమే అని దీని అర్థం.*


🔱 *లింగం అంటే ఏమిటి* 🔱


❇️ *ఆకాశం లింగమిత్యాహుః పృథివీ తస్యపీఠికా| ఆలయః సర్వభూతానాం లయనాల్లింగ ముచ్యతే||* ❇️


🔱*ఆకాశమే లింగం, పృథ్వి (భూమి) దాని పీఠం.* 🔱


🌻*సకల ప్రాణులు దేనియందు లయమవుతాయో (ఐక్యమవుతాయో) దానినే 'లింగం' అంటారు. అంటే అనంతమైన విశ్వమే శివలింగ స్వరూపం.*


🔱 *సర్వదేవతా స్వరూపం* 🔱


❇️ *అర్చాయాం పూజయేద్యోమాం విష్ణుర్భవతి పూజితః| అర్చితా మూర్తయః సర్వాయోమేలింగం సమర్చయేత్||* ❇️


🌻 *శివలింగ రూపంలో నన్ను (శివుడిని) పూజించేవాడు విష్ణువును కూడా పూజించినట్లే.*


🌻 *ఎవరైతే శివలింగాన్ని అర్చిస్తారో, వారు సకల దేవతా మూర్తులను అర్చించినట్లే అవుతుంది.* 


🌻 *శివుని యందే సమస్త దేవతలు కొలువై ఉన్నారని దీని అర్థం.*


🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱