14, మే 2026, గురువారం

చతుష్షష్టి కళలు:*

 155f6;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


శ్రీకృష్ణ పరమాత్మ..

            *చతుష్షష్టి కళలు:*

                 ➖➖➖✍️

```

శ్రీకృష్ణ పరమాత్మ 64 కళలను 64 రోజులలో నేర్చుకున్నాడంటారు అవి 

ఏ కళలు ?


జ). చతుష్షష్టి కళలు


1. వేదం 2. శాస్త్రం 3. ధర్మశాస్త్రం

4. వ్యాకరణం 5.జ్యోతిష్యం  6.ఆయుర్వేదం 7.కవిత్వం  8.గాంధర్వం  9. స్వర శాస్త్రం

10. సాముద్రికం  11. మల్లవిద్య  12.గారుడం13.కొక్కోకం 14.శకునం  15. వాక్చమత్కారం16. బూజ విజయం  17.లిపి జ్ఞానం 18. లిపి లేఖనం.

19. దేశభాషలు 20. ఆరద గమనం  21. రత్న పరీక్ష

22. అస్త్ర విద్య  23. పాక చమత్కారం 24. కుట్టుపని

25. శిల్ప శాస్త్రం 26. జంతుభేదం 27. వృక్షదోహన క్రియ


28.ఆగమ శాస్త్రం  29. మహేంద్ర జ్ఞానం  30. ఇంద్రజాల విద్య  31.రసగంధ వాదం  32. చిత్ర లేఖనం  33. భూపాల విధి  

34. అంజన విశేషములు  35. వాస్తు శాస్త్రం 36. వాయు, జలాగ్ని స్తంబన  37. ధ్వని విశేషం  38. గుటికా శుద్ధి 39. సర్ప శాస్త్రం 40. అవిద్యాశ్శోదనా విద్య  41. పశుపాలనా విద్య 42. విహంగ భేదగతి  43 అభినయ శాస్త్రం 44. చోరత్వ ధీమంతం 45. వడ్రంగం 

46. మోదర 47. చర్మకట్టు 48.మణిమంత్రౌషధ సిద్ధి  

49. లోహకారకత్వం



50. కాశపని  51. ప్రశ్న శాస్త్రం  52. వ్యాపారం

53. స్వప్న శాస్త్రం 54. కులాల శాస్త్రం 55. వేట

56. గణిత శాస్త్రం 57. కార్యకరణ విద్య  58. దుతికా కృత్యం 59. చరాచరాన్యధాకరణం  60. తంతు విద్య  61. యోగరాజం  62. సేద్యం  63. మిత్రభేదం

64. తురగారోహాణం.✍️```

                  -సేకరణ.

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐


శుక్రవారం, మే 15, 2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:త్రయోదశి ఉ6.10 వరకు

తదుపరి చతుర్దశి తె4.09 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:అశ్విని రా6.57 వరకు 

యోగం:ఆయుష్మాన్ మ1.04 వరకు

కరణం:వణిజ ఉ6.10 వరకు తదుపరి భద్ర సా5.10 వరకు ఆ తదుపరి శకుని తె4.09 వరకు


వర్జ్యం:మ3.08 - 4.39 మరల తె4.02 - 5.33

దుర్ముహూర్తము:ఉ8.05 - 8.56

మరల మ12.21 - 1.12

అమృతకాలం:సా5.41 - 7.14

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 -4.30


సూర్యరాశి:మేషం

చంద్రరాశి:మేషం     

సూర్యోదయం:5.32

సూర్యాస్తమయం:6.19


మాసశివరాత్రి, వృషభ సంక్రమణం ఉ10.04


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము - నరసాపురం, ఆంధ్రప్రదేశ్ - 534 275

Mobile: 91 83280 14080


https://drive.google.com/file/d/1kzv2TBHh_J9GLWH622Xu_zuLAsqzji-Z/view?usp=drive_link

వైశాఖ పురాణం



 


   *🚩వైశాఖ పురాణం🚩*        

      *27వ అధ్యాయము*


*కలిధర్మములు - పితృముక్తి*```


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు.. 

శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసమున ఉత్తమములగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదు’నని యడిగెను.


అప్పుడు శ్రుతదేవుడు ‘శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని యేకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలన ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్ర్కియలు, హరికథాశ్రవణము యివన్నియును సద్యోముక్తిదాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.


పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు, గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసికొనుట, మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు, ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరునుండరని భావము.


దరిద్రులు, ధనవంతులు కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు(భార్యలేనివారు)స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిధిని చెప్పుదును వినుము. మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును. ఆ తిధినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.


ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.


అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించినవచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు, దానధర్మములులేని యీ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.


ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిస్నమును, నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును, జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ యీ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.


ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను, జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.


భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు యింకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు, గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు, ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను, గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.


జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు, నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా, ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు, ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను, నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా! వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.


ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక యెలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన యెలుకగడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.


ధర్మవర్ణుడును దీనులై ,యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను అప్పుడు వారు ఓయీ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు యీ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను యిది యొకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును యీ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన యీ గడ్డికి అంకురములులేవు. ఈ యెలుక యీ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ యెలుక మిగిలిన యీ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది.


కావున నాయనా! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన యెలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ యెలుకయే కాలము. ఇప్పటికి యీ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనో నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు యిందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశవమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్దము మున్నగువి చేయవచ్చును. ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.


తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువమండి యున్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను యీ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.


ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై యిట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము, నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము యిష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.


ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని యెట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా! విష్ణుకథలయందనురక్తి, స్మరణము, సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని, భారతము గాని యింటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు వున్నయింటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని యిచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును, శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.


ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.```


_*వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం*_ 


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

.

శ్రీ కృష్ణ కుచేల

               శ్రీ కృష్ణ కుచేల 


సతి మాటల్ విని  భూసురాన్వయుడు 

           శ్రీ సర్వేశునిన్ జూడగన్

నతి వేగంబుగ నేగె ద్వారకకు

           నానా ప్రాంతముల్ దాటియున్ ,

గతి యింకన్ తన  కీజగంబునను

         యా కంసారియే నంచు తా

మతిలో దల్చుచు భక్తితో మధు రి

          పున్ మాధుర్య ముప్పొంగగన్      17* 


కతిపయ దినములు నడచియు

యతులితమగు   భక్తి తోడ  యా భూసురుడున్

శృతి వంద్యు డైన కేశవు

నతి వేగము తోడ కలువ నగరము జేరెన్.  18** 


అటజని కాంచె భూమిసురు

           డంబరచుంబిత భర్మహర్మ్యముల్ ,

భటయుత రాజమార్గములు ,

           భాసుర దివ్య వికాస పణ్యముల్ ,

నటు నిటు  దిర్గు పౌరులను ,

           నవ్య శుభాంగుల దివ్య కాంతులన్ ,

స్పుటతర చారుసుందరపు

         శోభల నచ్చట ద్వారకాపురిన్       19** 


సర్వ మెరిగిన కృష్ణుడు సమ్మతమున

బాల్య మిత్రుని రాకకు పరవశించి

గురుకులంబున విషయముల్ గుర్తురాగ

పలికె నీరీతి సతులతో బాల్యసరళి.       20** 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

చేయవలసిన పనిని

  ☘☘☘☘☘☘☘☘☘☘☘☘

                    *ధార్మికగీత - 126*

                      ***************

       *శ్లో:- ఉపేక్ష్య సమయే కార్యే౹*

              *భగ్నే చింతా నిరర్థకా ౹*

              *నిర్గతే సలిలే తత్ర ౹*

              *సేతు బంధో నిరర్థకః ౹౹*

                             *****

    *భా:- చేయవలసిన పనిని తగిన సమయములో చేయ కుండా, తరువాత ఆ పని పాడయి పోయినదని విచారించడం వలన ప్రయోజనం ఉండదు. నీరు పారు తున్నప్పుడే గట్టు కట్టాలి. తరువాత గట్టు కడితే లాభం ఏమిటి? గత జల సేతుబంధనం అంటే ఇదే!*

☘☘☘☘☘☘☘☘☘☘☘☘

🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*గురువారం 14 మే 2026*


*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం -10వ రోజు **🌹


నిన్న మనం హనుమంతుని విద్యా చాతుర్యాన్ని, రామకార్యం పట్ల ఆయనకు ఉన్న ఆతురతను తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు శ్రీరాముని కథను వినడానికి ఎంతటి మక్కువ చూపుతారో మరియు ఆయన హృదయంలో సీతారామ లక్ష్మణులు ఎలా కొలువై ఉంటారో ఈ ఎనిమిదవ చౌపాయి ద్వారా తెలుసుకుందాం.


    **ఎనిమిదవ చౌపాయి**


 **ప్రభు చరిత్ర సునిబే కో రసియా |**

**రామ లఖన సీతా మన బసియా ||**


           **ప్రతిపదార్థం**


          * **ప్రభు చరిత్ర**  


తన ప్రభువైన శ్రీరామచంద్రుని కథలను/చరిత్రను


  * **సునిబే కో** 

        వినడానికి


  * **రసియా:** 


మిక్కిలి ఆసక్తి కలిగినవాడు (ఆనందాన్ని పొందేవాడు)


  * **రామ లఖన సీతా**


 శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ


  * **మన బసియా**


(ఆయన) మనస్సులో ఎల్లప్పుడూ నివసిస్తారు.


**విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. ప్రభు చరిత్ర సునిబే కో రసియా (రామకథా ప్రేమికుడు)**


ఆసక్తి దేనియందు ఉంటుందో అది రసికత. ప్రభు చరిత్ర వినడం లో రసికుడు స్వామి.రామకథను వినడంలో ఆయనకు ఎప్పుడూ తృప్తి కలగదు. "ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు అంజలి ఘటించి రెండు చేతులు శిరసు మీద పెట్టుకొని పరమ ఆర్ద్రత తో కన్నీరు కారుస్తూ వింటాడు" 


రామచంద్రమూర్తి అయోధ్య వాసులందరికి ముక్తినిస్తూ సరయూనదిలోకి వెళుతూ హనుమంతుని మాత్రం నువ్వు చిరంజీవి కనుక ఇక్కడే ఉండాలన్నాడు. నీ కథ ఉన్నంతకాలం ఉంటానన్నాడు హనుమ. ఆయనకు రామకథ అంటే అంత ఆసక్తి సర్వవ్యాపకమైన పరమేశ్వరస్వరూపం కనుక ఇప్పటికీ ఎక్కడ రామకథ జరిగితే అక్కడ ఉంటాడు ఆంజనేయస్వామి


శ్రవణం ఒక యోగం, భగవత్ కథలు ఏడు రోజుల విన్నంత మాత్రాన ముక్తి పొందాడు పరీక్షిత్తు. రసికత ఉంటే వెంటనే ఆ యోగం వస్తుంది.


ప్రుధు చక్రవర్తి అనేక యాగాలు చేసి సాక్షాత్ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకుని కోరిన వరం ఏమిటో తెలుసా ఎల్లప్పుడూ నీ కథలు వినడానికి పది వేల చెవులు ఇవ్వమని. అంటే ఎల్లప్పుడూ నీ కథలు వినే భాగ్యం కావాలి అని కోరడం.


సంస్కారం ఉన్నవారికి భగవత్కథలు వింటూ ఉంటే విసుగు రాదు, ఇంకా వినాలనిపిస్తుంటుంది. వారు ఎన్నిమార్లు వింటామని కాకుండా ఎన్నిమారైనా వింటారు. హనుమంతుడు ఎన్నో మార్లు విన్నాడు... ఇప్పటికీ వింటూనే ఉంటున్నాడు. రామకథలో రసజ్ఞత ఉన్నది.


మనం చదివితే కొంతే మనసులోకి వెళ్తుంది,అదే వింటే అనేక విషయాలు వస్తాయి,మనం చదువుకునేది హనుమాన్ చాలీసా కానీ ఇందులో రామాయణం వస్తుంది, పరాశర సంహిత వస్తుంది, అక్కడక్కడ భారతం వస్తుంది, భాగవతం వస్తుంది అందుకే శ్రవణం ఒక యోగం.


రెండు చేతులూ శిరస్సు మీద పెట్టుకుని, కనుల ఆనందబాష్పాలు రాల్చుతూ తన్మయుడై వింటాడు అలా విన్నవాడు ఎవడైనా కనిపిసే వాడే హనుమంతుడు మహాత్ములు ఎప్పుడు ప్రచ్ఛన్నంగా వస్తారు. అలాంటి వారిని పోల్చడం కూడా మహాకష్టం


రామకథ జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. తులసీదాసుకు ఇది అనుభవము. అందుకే రామకథ జరిగేటప్పుడు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. హనుమంతుడు ఉన్న చోటులో మనం కూర్చుంటాం. ఆ మహాత్ముని శక్తి తరంగాలు వ్యాపించిన ప్రాంగణంలో కూర్చుంటే సమస్త పాపాలూ నశించిపోతాయి. రామకథారసజ్ఞుడు హనుమంతుడు. అది 'ప్రభుచరిత్రసునివేకోరసియా'


ఇది భక్తుడికి ఉండవలసిన 'శ్రవణ భక్తి'కి నిదర్శనం. జ్ఞానం ఎంత పెరిగినా భగవంతుని లీలలను వినడం వల్ల కలిగే ఆనందం అంతటిది.


**2. రామ లఖన సీతా మన బసియా (హృదయ పీఠం)**


హనుమంతుని హృదయం ఒక దివ్యమైన కోవెల. అక్కడ సీతారామ లక్ష్మణులు నిరంతరం కొలువై ఉంటారు అని ఒక భావం. ఇది సత్యమే కానీ తులసి దాసు గారు హృదయం ఇది కాదు అని పెద్దలు చెపుతారు.సీతా, రామ లక్ష్మణుల హృదయాల్లో ఉన్న హనుమను ఇక్కడ తులసి దాసు గారు దర్శించారు.


దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్


రామచంద్రమూర్తికి దక్షిణం వైపు లక్ష్మణుడు, ఎడమవైపు సీతమ్మ ఉన్నారు. ముందు హనుమ ఉండి ఆ ముగ్గురినీ హృదయంలో నిలుపుకుని ధ్యానిస్తున్నాడు. కానీ ఆ ముగ్గురి హృదయంలో హనుమంతుడు ఉన్నాడని ఇక్కడ చెప్పారు. అంటే హనుమంతుడు ఎంత రామభక్తుడో సీతారాములు అంత హనుమద్భక్తులు అనే విషయాన్ని ప్రమాణంతో చెప్పుకున్నాం.


రామచంద్ర మూర్తి ఇసుమంత ఉపకారం చేస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు.వేలకొలది అపకారాలు చేసినా మర్చిపోతాడు. అది రామచంద్రమూర్తి గొప్ప వ్యక్తిత్వం. అంత వ్యక్తిత్వం కలవాడు మహోపకారం చేసిన హనుమను మర్చిపోతాడా...? ఎప్పుడూ హృదయంలోనే పెట్టుకున్నాడు.


ఇక సీతమ్మ హనుమ ను ఎప్పుడు మర్చిపోదు పట్టాభిషేక సమయంలో కూడా రాముడు ప్రేమతో ఇచ్చిన ముత్యాల హారం హనుమ కి ఇచ్చింది తల్లి. అంతటి కృతజ్ఞతా భావం.


సంజీవని తెచ్చి ప్రాణం కాపాడిన హనుమను, సంజీవ రాయుడుగా ఎల్లప్పుడూ హృదయం లోనే పెట్టుకున్నాడు.


అందుకే 'రామలషన సీతా మన బసియా' అనే ఒక్క మాటలో సీతారామలక్ష్మణులు హనుమంతుడి నుంచి పొందిన ఉపకారం, ఆ ఉపకారాన్ని నిరంతరం మనస్సులో పెట్టుకోవడాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు.


అటు తర్వాత మరొక అద్భుతమైన చౌపాయీలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడినుంచి రెండు చౌపాయీలు హనుమ యొక్క అద్భుతమైన రూపాలను చూపిస్తుంటాయి. వాటిని రేపు దర్శించబోతున్నాం. ఇవి అత్యంత ముఖ్యమైన చౌపాయీలు.


**తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా భక్తి మార్గంలో రెండు ముఖ్యమైన సూత్రాలను చెప్పారు:


*1. **వినడం (Listening)** 


ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుని గుణగణాలను నిరంతరం వినడం అవసరం.


*2. **ధ్యానం (Meditation)** 


మనస్సును భగవంతుని నివాసంగా మార్చుకోవాలి.

మనం కూడా హనుమంతుని వలె రామకథా రసికులమైతే, మన మనస్సులో కూడా ఆ పరమాత్మ స్థిరంగా కొలువై ఉంటాడని ఈ చౌపాయి అంతరార్థం.


*జై శ్రీరామ్! జై హనుమాన్!*       

       🍁🌹🙏🌷🍁


          *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

విషములువిషములు

విషములు వాని లక్షణములు  - 


 మహా విష సర్పములు  - 


 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.


 స్థాన విధి దోషము  - 


 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.


 నక్షత్ర దోషము  - 


 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .


 విష సాధ్య లక్షణములు  - 


  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 


 తేలు విషము  - 


  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 


 గర విష లక్షణము  - 


 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 


 పెట్టుడు మందు లక్షణము  - 


 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 


 విషాన్న లక్షణము  - 


 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 


 విషము కలిపిన కూరలు  - 


 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 


 విషాన్న పరీక్ష  - 


  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .