14, మే 2026, గురువారం

శ్రీ కృష్ణ కుచేల

               శ్రీ కృష్ణ కుచేల 


సతి మాటల్ విని  భూసురాన్వయుడు 

           శ్రీ సర్వేశునిన్ జూడగన్

నతి వేగంబుగ నేగె ద్వారకకు

           నానా ప్రాంతముల్ దాటియున్ ,

గతి యింకన్ తన  కీజగంబునను

         యా కంసారియే నంచు తా

మతిలో దల్చుచు భక్తితో మధు రి

          పున్ మాధుర్య ముప్పొంగగన్      17* 


కతిపయ దినములు నడచియు

యతులితమగు   భక్తి తోడ  యా భూసురుడున్

శృతి వంద్యు డైన కేశవు

నతి వేగము తోడ కలువ నగరము జేరెన్.  18** 


అటజని కాంచె భూమిసురు

           డంబరచుంబిత భర్మహర్మ్యముల్ ,

భటయుత రాజమార్గములు ,

           భాసుర దివ్య వికాస పణ్యముల్ ,

నటు నిటు  దిర్గు పౌరులను ,

           నవ్య శుభాంగుల దివ్య కాంతులన్ ,

స్పుటతర చారుసుందరపు

         శోభల నచ్చట ద్వారకాపురిన్       19** 


సర్వ మెరిగిన కృష్ణుడు సమ్మతమున

బాల్య మిత్రుని రాకకు పరవశించి

గురుకులంబున విషయముల్ గుర్తురాగ

పలికె నీరీతి సతులతో బాల్యసరళి.       20** 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కామెంట్‌లు లేవు: