11, నవంబర్ 2026, బుధవారం

అపురూపంగా పుట్టావు

 పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. 


అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు. 


అందరాని చందమామకోసం అలకలు పోయావు. 

కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. 


బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు. 


ఆయన నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు. 


ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభను ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు. 


తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందామనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు. 


చెప్పొద్దూ! అంత అహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు. 


ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభను ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.


ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. 


నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానా యాగీ చేసేసింది. 


నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదు ఫొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది. 


ఇక్కడుంటే మా నాయకుల్లా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏమిటో? 


పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు. 


‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు. 


నీకు తోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓ ఉత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు. 


తనూ బట్టలు సర్దేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.


ఇహ మీతమ్ముడు. 


చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు. 


డబ్బడిగితే జేబుఖాళీ అంటారు. 

పన్చెబితే చెయిఖాళీలేదంటారు. 


అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు. 


వాళ్ళతో కలిసి నీ మూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు. 


నిశ్శబ్ద మందిరాల్లో నిదరోయే మహరాజు బిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠి కిందే పడుకున్నావు.


ఒకటారెండా.... పద్నాలుగేళ్ళు! 


ఎన్నో తప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. 


జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మా సరదా తీర్చకుండా బయటే ఊరేగుతూ వుంటారు.


అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు. 


అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచిన వెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. 


నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు. 


ఇంటో అన్నీ వుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం! 


అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆ లేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపంచెంది,  తెద్దామని బయల్దేరావు.


మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు. 


ఏ మాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు. 


నిస్సహాయతనేది సామాన్య మానవుణ్ణి ఎలా బాధిస్తుందో నిరూపించావు. 


మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. 


ఎంతో ఇష్టంకాబట్టే ఎంత కష్టపడాలో అంతాపడ్డావు. 


ఏ సాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ మనోవైజ్ఞానిక గ్రంథాలూ చెప్పలేదు. 


తాతయ్య నోటివెంట నీ కథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటి అనుమానం... కోతుల్నెలా లొంగదీసుకోడమని! 


అదీ చూసేవాళ్ళం మా చిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం! 


వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు అందులో వినోదమే కనబడేది! 


ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువు చేసిన స్నేహమూ, ఆనక వాళ్ళ సాయంతోనే నువు కట్టిన వారధీ చూస్తే... 


దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!


సెభాషోయ్ రామా! నీ గురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా! 


నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీ జీవితం!


నిలకడ లేని వాళ్ళతో పొంతన

నీళ్ళను దాటడానికొక వంతెన

నిర్భయమేగావుంటే నీచెంతన

నిరాధారులకిచ్చావు సాంత్వన

నికార్సైనది నీ మార్గం ఎంతైనా

నిరతమూ మాకదేకదా చింతన


నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!


నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని 

నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!


పదిమందీ కలిస్తే పండగ! 

పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! 

పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!


అందాలరాముడు....

అందువలన దేముడు!!





..........జగదీశ్ కొచ్చెర్లకోట

కర్తా

 కర్తా కారయితాచైవ ప్రేరకశ్చానుమోదకః సుకృతే దుష్కృతేచైవ చత్వారస్సమభాగినః

😂😂😁😁

ఉసిరికాయ

 ఉసిరికాయ గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


  ఉసిరికాయను సంస్కృతంలో ఆమలకి , శ్రీఫలా , ధాత్రికా , అమృతా అని అంటారు. 


       ఉసిరిచెట్టు పెద్ద వృక్షం , ఆకులు సన్నగా చింతాకు వలే ఉండును. పువ్వులు సన్నగా కాడల వెంట పచ్చగా పూయును. కాయలు గుండ్రముగా సన్నని ఆరురేఖలు కలిగి ఉండును. ఈ కాయలు ఫాల్గుణ మాసాంతం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో పండి పరిపూర్ణంగా ఉండును. అప్పుడు తెచ్చి ఎండించి దాచి సంవత్సరం వాడవచ్చు . కాయపైన బెరడు ఔషధాల్లో ఉపయోగిస్తారు . ఇవి సర్వత్రా తోటల్లో అరణ్యాలలో ఉండును.


  ఉసిరికాయ ఉపయోగాలు  -


* ఉసిరికాయ వగరుగా, పులుపుగా , మధురంగా ఉండును. శీతలతత్వం కలిగి ఉండును.


* ఉసిరికాయ ఆయువు మరియు ఆరోగ్యాలను ఇచ్చును.


* శరీరంలోని వేడిని , వాంతిని , ప్రమేహాన్ని , నంజును హరించును .


* కఫాన్ని హరించును . రుచికరంగా ఉండును.


* రక్తములో దోషాన్ని హరించును . శరీర శ్రమని పోగొట్టును .


* మలబద్ధకాన్ని పోగొట్టును .  కడుపుబ్బరాన్ని తగ్గించును . అమృతంతో సమానం అయినది.


* ఉసిరికాయ కరక్కాయతో సమానమైన గుణం కలిగినది . రక్తపిత్త రోగాన్ని పోగొట్టును .


* ధాతువృద్ధిని కలిగించును. వాతం, పిత్తం, కఫం మూడింటిని హరించును . త్రిదోష హరమైనది.


* వెంట్రుకలకు మేలు చేయును . మంచి విరేచనకారి.


* నోరు అరుచి రోగమును పోగొట్టును . తొందరగా ముసలితనం రానివ్వదు.


* శరీరంలోని విషపదార్ధాలను హరించును . జ్వరాన్ని తగ్గించును .


* ఎండించిన ఉసిరికాయలను తీసుకొవడం వలన విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోనును.


* నేత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు ఎండించిన ఉసిరికాయలు తీసుకోవడం వలన చాలా మంచి మేలు జరుగును.


* ఎండించిన ఉసిరికాయలను అరగదీసి శరీరముకు గంధం వలే పూయుట వలన శరీరం యొక్క కాంతి పెరుగును .


* శరీరము నందు కొవ్వు ఉన్న సమస్యతో ఇబ్బంది పడువారు ఎండించి ఉసిరికాయలను సేవించుట వలన కొవ్వు కరుగును.


* ఉసిరికాయలు నుంచి తీసిన ద్రవము త్రిదోషములను , రక్తదోషమును , పిత్తమును , మోహమును నాశనం చేయును .


* ఉసిరికాయ పచ్చడి అన్నం మొదటిముద్దలో తినడం వలన జీర్ణరసాలు సరిగ్గా ఊరతాయి.


* ముత్ర విసర్జన సమయంలో మంట , నొప్పి ఉంటే ఉసిరి కషాయం బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఉపశనం ఉంటుంది.


* రాచ (పెద్ద ) ఉసిరి గింజలను బూడిదగా మార్చి కొబ్బరినూనెలో కలిపి చిక్కగా చేసి రాస్తుంటే శరీరం పైన వచ్చు చిడుము నివారణ అగును.


* ఉసిరికాయల కషాయం అరకప్పు తాగుతుంటే జ్వరం తగ్గును.


* ఆవనూనెలో రాచ ఉసిరికాయలు వేసి ఉసిరికాయలు మునిగేంత వరకు నూనె పోసి వారం రోజులు నానబెట్టి పైన తేరుకున్న నూనెని తలకు రాయుచున్న తలతిప్పు రోగం నయం అగును.


* ఉసిరికలో "సి" విటమిన్ పుష్కలంగా ఉంది. కావున "సి" విటమిన్ లోపం వలన వచ్చు వ్యాధులకు అద్భుత ఔషధం .


* "స్కర్వి" అనే ఈ వ్యాధిలో ఉసిరి అత్యద్భుత ఔషధం . ఈ వ్యాధి సముద్రప్రయాణం ఎక్కువుగా చేసే వారికి వచ్చును.


* ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఉసిరికాయలు తినుచున్నచో ఎక్కిళ్లు వెంటనే తగ్గును.


* ఉసిరికాయల రసంలో పసుపుకొమ్ము చూర్ణం కలిపి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి ఉదయం , సాయంత్రం రెండు పూటలా తీసుకుంటూ చప్పిడి పథ్యం పాటిస్తే కామెర్ల వ్యాధిని తగ్గును.


* పేగుల్లో పురుగులు ఉన్నప్పుడు పెద్ద ఉసిరికాయలు తింటూ ఉంటే కడుపులో పురుగులు నశించును.


* పెద్ద ఉసిరికాయలను ఎండబెట్టి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరచెంచా చొప్పున తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.


* కళ్లు ఎరుపెక్కి మంట పుడుతుంటే ఎండిన పెద్ద ఉసిరికాయలను గ్లాసెడు మంచినీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన ఆ నీటితో కంటిని కడుగుచున్న కంటి ఎరుపు తగ్గును.


* ఉసిరికాయల రసం తీసి అందులో కొంచం పంచదార కలిపి చేతి వ్రేలితో యోని రంధ్రంలో ఆ రసం వ్రాస్తే యోనిమంట తగ్గును.


              ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని ముక్కలుగా కోసి ఎండించి దాచుకొనవలెను. ఉసిరికాయలు దొరకనప్పుడు వాటిని వాడుకోవచ్చు . అలా ఎండిన వాటిని "ఉసిరిక వొరుగు " అని పిలుస్తారు . 



మాయ మనలను

  మాయ మనలను మోసం చేస్తుందా?


 జీవుడు మోక్షం పొందే వరకు ఈ మాయ వల లోనే ఉంటాడా? మాయ నుంచి మనం బయటపడేది ఎలా?

ఆధ్యాత్మిక మరియు వేదాంత దృక్పథంలో మాయ (Maya) గురించి ఇవి అత్యంత గంభీరమైన, ప్రాథమికమైన ప్రశ్నలు. దీనికి సమాధానాలు అద్వైత వేదాంతం మరియు భగవద్గీత ఆధారంగా వివరంగా చూద్దాం:

​1. మాయ మనలను మోసం చేస్తుందా?

​మాయ మనలను కావాలని మోసం చేయదు; కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా (భ్రాంతిని) మనకు చూపిస్తుంది.

​వేదాంతం ప్రకారం, సత్యమైనది కేవలం ఆత్మ (బ్రహ్మం) మాత్రమే. కానీ మాయ ప్రభావం వల్ల మనం ఈ భౌతిక ప్రపంచాన్ని, శరీరాన్ని, ఇంద్రియ సుఖాలనే శాశ్వతమైనవిగా నమ్ముతాము.

​ఉదాహరణకు: చీకట్లో త్రాడును చూసి పాము అనుకుని భయపడటం. అక్కడ పాము లేదు, కేవలం త్రాడు మాత్రమే ఉంది; కానీ మన అజ్ఞానం (భ్రాంతి) వల్ల అది పాములా కనిపిస్తుంది. అలాగే ఈ సృష్టి వెనుక ఉన్న పరమాత్మను చూడలేక, కేవలం నామ-రూపాలతో కూడిన ప్రపంచానే్న సత్యమని భ్రమించడమే మాయ చేసే మోసం.

​2. జీవుడు మోక్షం పొందే వరకు ఈ మాయ వలలోనే ఉంటాడా?

​అవును, జీవుడు జ్ఞానోదయం (మోక్షం) పొందే వరకు మాయ వలయంలోనే (సంసార చక్రంలో) కొట్టుమిట్టాడుతుంటాడు.

​భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:

​దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |

మామేవ యే ప్రపద్యంతే మాయামেతాం తరంతి తే || (గీత 7.14)

​నా యొక్క ఈ త్రిగుణాತ್ಮకమైన (సత్వ, రజో, తమో గుణాలతో కూడిన) మాయ దాటడానికి చాలా కష్టమైనది. ఎవరైతే నన్ను (పరమాత్మను) శరణు వేడుకుంటారో, వారు మాత్రమే ఈ మాయను దాటగలరు అని దీని అర్థం.

​మోక్షం అంటే ఈ మాయ బంధనాల నుంచి పూర్తిగా విముక్తి పొందడమే. ఆత్మకు నిజమైన జ్ఞానం కలిగినప్పుడు, మాయ యొక్క తెర తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది.

​3. మాయ నుంచి మనం బయటపడేది ఎలా?

​మాయను పూర్తిగా నాశనం చేయడం ఎవరివల్ల కాదు, ఎందుకంటే అది ఈ సృష్టి శక్తి. కానీ దాని ప్రభావం నుంచి (అజ్ఞానం నుంచి) బయటపడవచ్చు. అందుకు పెద్దలు సూచించిన మార్గాలు:

​ఆత్మజ్ఞానం / విచక్షణ: "నేను ఈ మార్పు చెందే శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మను" అనే సత్యాన్ని గ్రహించడం. ప్రతి దాని వెనుక ఉన్న అంతరార్థాన్ని విచారించడం.

​భక్తి మరియు శరణాగతి: భగవంతునిపై సంపూర్ణ నమ్మకం ఉంచి, నిస్వార్థంగా కర్మలు ఆచరించడం. దైవ కృప ఉంటేనే మాయను దాటడం సాధ్యం అవుతుంది.

​గురువును ఆశ్రయించడం: మాయ వలలో చిక్కుకున్న జీవుడికి సద్గురువు సరైన జ్ఞానాన్ని ప్రసాదించి, కళ్లకు కట్టిన మాయ పొరలను తొలగిస్తారు.

​గుణాలను జయించడం: మాయ సత్వ, రజస్, తమస్ అనే మూడు గుణాలతో నడుస్తుంది. తమో, రజో గుణాలను తగ్గించుకుని, సత్వ గుణాన్ని పెంపొందించుకుంటూ ఆ త్రిగుణాలకు అతీతంగా (గుణాత్ీతుడుగా) నిలవడం.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రకృతిలోని త్రిగుణాల (సత్వ, రజస్, తమస్) గురించి చాలా స్పష్టంగా వివరించాడు. భగవంతిని మాయ ఈ మూడు గుణాల ద్వారానే జీవుడిని బంధిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వేదాంత దృక్పథంలో ఇలా ఉన్నాయి:

​1. త్రిగుణాలు మాయను ఎలా బంధిస్తాయి?

​మాయ అనేది కేవలం ఏదో ఒక శక్తి కాదు; అది ఈ మూడు గుణాల సమ్మేళనం. జీవుడు తన నిజమైన స్వభావాన్ని (ఆత్మను) మరచిపోయి, ఈ గుణాలతో తదాత్మ్యత చెందడమే బంధనం.

​సత్వ గుణం (ప్రశాంతత, జ్ఞానం, సుఖం): ఇది ప్రకాశవంతమైనది, నిర్మలమైనది. అయితే ఇది జీవుడిని సుఖం మరియు జ్ఞానంపై మమకారం (అటాచ్‌మెంట్) ద్వారా బంధిస్తుంది. "నేను చాలా జ్ఞానిని, సుఖంగా ఉన్నాను" అనే అహంకారాన్ని కలిగిస్తుంది.

​రజో గుణం (కోరికలు, ఆశలు, ఆరాటం): ఇది రాగస్వభావం కలది (కోరికల పుట్టుకకు కారణం). ఇది జీవుడిని కర్మల పట్ల ఆసక్తి, కోరికలు, మరియు వాటి ఫలితాల కోసం ఆరాటపడేలా ప్రేరేపిస్తుంది. కోరికలే బంధనానికి ప్రధాన మూలం.

​తమో గుణం (అజ్ఞానం, బద్ధకం, నిద్ర, మమత): ఇది అజ్ఞానం వల్ల పుడుతుంది. ఇది జీవుడిని మత్తు, సోమరితనం, నిర్లక్ష్యం మరియు విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. తప్పు ఒప్పులను గుర్తించలేని అంధకారంలో ఉంచుతుంది.

​గీత (14.5) ప్రకారం:

​సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |

జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||

"సత్వగుణం సుఖంలోనూ, రజోగుణం కర్మలోనూ, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదంలోనూ (అజ్ఞానంలోనూ) జీవుడిని బంధిస్తాయి."

​2. త్రిగుణాలను ఎలా అధిగమించాలి? (గుణాత్ీతులు కావడం ఎలా?)

​ఈ గుణాలు ప్రకృతికి సంబంధించినవి. శరీరం ఉన్నంతవరకు గుణాలు పనిచేస్తూనే ఉంటాయి. కానీ వాటి ప్రభావం మనపై పడకుండా ఉండటమే గుణాత్ీత స్థితి (అధిగమించడం). గీత 14వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దీనికి మార్గం చెప్పాడు:

​సాక్షి భావంతో ఉండటం (ద్రష్టగా మారడం): గుణాలు తమ పని తాము చేస్తున్నాయని (సుఖం, దుఃఖం, కోరికలు, బద్ధకం రావడం సహజమని) గుర్తించి, వాటిలో లీనం కాకుండా కేవలం ఒక సాక్షిలా (చూసేవాడిగా) గమనించడం.

​సమత్వం అలవర్చుకోవడం: సుఖం కలిగినప్పుడు పొంగిపోకపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోకపోవడం; అలాగే శత్రువునైనా, మిత్రునైనా, నిందనైనా, ప్రశంసనైనా సమానంగా స్వీకరించడం.

​అచంచలమైన భక్తి: భగవంతునిపై అనన్య భక్తి కలిగి ఉండటం. శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పాడు—ఎవరైతే భగవంతుడిని పూర్తిగా శరణు వేడుకుంటారో, వారు ఈ త్రిగుణాలను సులభంగా దాటగలరు (గీత 14.26).

​కర్తృత్వ భావన వదలడం: "నేనే అన్నీ చేస్తున్నాను" అనే అహంకారాన్ని వదిలి, ఇంద్రియాలు, గుణాలే వాటి పనులను చేస్తున్నాయి అని భావించడం.

​సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ గుణాలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు; కానీ వాటిని గమనిస్తూ, వాటికి అతీతంగా (గుణాత్ీతుడిగా) జీవించడమే మాయను జయించే మార్గం.

ప్రారబ్ధము

  ప్రారబ్ధము (కర్మ సిద్ధాంతం) అనే అంశంపై భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశాన్ని, మానవ జీవితంపై దాని ప్రభావాన్ని వివరిస్తూ రాసిన 20 తెలుగు పద్యాల (కంద పద్యాలు) కవితా వ్యాసం ఇక్కడ ఇవ్వబడింది:


పీఠిక (పరిచయము)


తనువున బుట్టిన కర్మము

అనుభవించక తప్పదెందు నవనిని జూడన్

మును జేసిన సత్కృత్యము

వెనువెంటనె వచ్చునండ్రు విజ్ఞులు ధరలోన్.

కర్మము మువ్విధములగును

మర్మము దెలియంగ వలయు మానవజాతిన్

సంచిత ప్రారబ్ధములును

అంచితముగ నాగామియు ననెడి పేర్లతోన్.

బాణము వింటిని వీడిన

ఏ రీతిగ నదియు వెనక కిల తిరుగదో

ఆ రీతిగ ప్రారబ్ధము

ధారుణిలో ననుభవించ తప్పదు సుమ్మీ.


ప్రారబ్ధ కర్మ స్వరూపము


పూర్వపు జన్మల కర్మల

ఉర్విని పండిన వగుచును ఉద్భవమొందున్

ప్రారబ్ధ మనగ నదియే

నేర్పరియై వెంటనంటు నిరతము మనకున్.

సుఖమును దుఃఖము నొసంగును

ముఖమున నవ్వులను నింపు ముదమును గూర్చున్

శిఖరమునైనను పడద్రోయును

లిఖితంబగు కర్మఫలము లీలగ జగతిన్.

ధనమును రూపము బలమును

జననము గల్గెడి కులమును జగతిని మనకున్

కనుగొన ప్రారబ్ధముచే

నిర్ణయమగు నండ్రు పెద్ద నిశ్చయముగను.


ప్రారబ్ధము - మానవ ప్రయత్నము


బుద్ధియు కర్మానుగతై

సిద్ధించును నండ్రు బుధులు క్షితిలోపలనే

బుద్ధిని మార్చగ లేదో

శుద్ధమగును జ్ఞానమార్గ శోధన చేతన్.

వ్యాధులు కష్టము లొచ్చిన

రోదనలను జేయబోక రూఢిగ నెమ్మన్

ప్రారబ్ధఫలము లనుచును

ధీరతతో నెదురుకొనగ ధన్యత గల్గున్.

కర్మము దైవము నొకటే

మర్మము తెలియంగ వలయు మానవ మాత్రుల్

విత్తును నాటిన రీతిగ

మొలకయు నై యెదుగుచుండు మోదము తోడన్.


జ్ఞానము మరియు ప్రారబ్ధము


జ్ఞానాగ్ని సర్వకర్మల

దానిని భస్మము నొనర్చు తథ్యము జగతిన్

కాని యీ ప్రారబ్ధము

దేహము ముగియు రసమువలె దీపించు నిలన్.

కుమ్మరి చక్రము తిప్పిన

నెమ్మదిగను పాత్ర నచట నేర్పుగ దీసి

ఆపిన నది తిరుగునట్లు

దేహము ప్రారబ్ధమునను దిరుగును ధరలోన్.

జీవన్ముక్తుడు నైనను

దేహము తోడున్న దాక ధీరత తోడన్

ప్రారబ్ధము ననుభవించును

తామర ఆకుపైన నీటి తత్వము లాగన్.


కర్మ నుండి విముక్తి మార్గము


ఆగామి కర్మల నెల్లను

త్యాగముచే నంటకుండ ధన్యత గనవచ్చున్

సంచితము జ్ఞానము చేతను

మంచెడి ప్రారబ్ధ మనుభ వంబున దేలున్.

ఈశ్వరు నందున భక్తిని

నిశ్చలముగ నుంచినట్టి నిర్మల మతికిన్

ప్రారబ్ధ భారమెల్లను

తృణముగ నై పోవునండ్రు తత్వవిదులిలన్.

సుఖమున పొంగియు పోకయు

దుఃఖమునను క్రుంగిపోక దొడ్డ గుణముతో

సమభావము గల్గియున్న

కర్మల బంధాలు వీడు కమలాక్షు కృపన్.

ఎక్కాల పుస్తకం

 *ఎక్కాల పుస్తకం* 😃


ఎవరు కనిపెట్టారో కాని చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది.


ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కాని, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు. ఏ అక్కో, అన్నో వాడేసి చిరిగి శల్యావస్థ లో వున్న పుస్తకం వాడుకోమనే వారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు. ఇదొక యునివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్లు నాలుగే – ఒక్క తెలుగు సినిమాలో తప్ప. అక్కడ మాత్రం “రెండు రెళ్లు ఆరు”.


అందరికీ బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది కదా. రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాట్లు. “ రెండొకట్ల రెండు, రెండ్రెళ్ళు నాలుగు, రెండు మూళ్ళు ఆరు ...” అంటూ ఒక ప్రత్యేక రాగం లో మాస్టారు పాడితే మనం కూడా అనాలన్న మాట. వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా ఒకే రాగంలో మంత్రాలు చదవలేరన్నట్లుగా సాగేది ఆ రాగం. ఈ ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్ధం కాదు. దీని గొప్పతనం ఏమిటంటే ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగ్గా వచ్చేది. కాని దాని శృతి/రాగం/తాళం ఏమాత్రం మార్చినా ఆ ఎక్కం నోటికి వచ్చేది కాదు. అసలు అది బుర్రలోకి అంత సులభంగా ఎక్కదు కాబట్టే దానికి “ఎక్కము” అనే పేరు వచ్చి వుంటుంది.


అసలు ఎక్కాలు అంటే గుణకారాలేనని తెలియడానికి ఓ రెండు మూడు ఏళ్లు పట్టేది. అసలు ఇవి ఎందుకు కంఠతా పట్టాలి మాస్టారూ అని అడిగితే “పెద్దయ్యాక ఉపయోగిస్తాయిరా” అనే సమాధానం వచ్చేది.


ఇరవై ఇరవైలు దాకా కంఠస్థ పడితే కాని పైక్లాస్ కి పంపము అని ప్రతీ క్లాస్ లోనూ అందరికీ ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవారు. ప్రతీ ఎక్కం ఇరవై దాకానే ఎందుకుంటుంది, అలాగే పుస్తకంలో 20వ ఎక్కం దాకానే ఎందుకుంటుంది అన్నది అప్పట్లో అంతుచిక్కని ప్రశ్న. బహుశా మన సామర్ధ్యం ఇరవైల దాకానే అని వాళ్ళు నిర్ధారించుకుని వుంటారు.


ఏ పనికైనా వాయిదా పద్ధతి వున్నట్లు రెండో క్లాస్ లో పది పదుల దాకా చాలు అనేవారు. ఒక్కో క్లాసు పెరిగే కొద్దీ పన్నెడు పన్నెడులు, పదహారు పదహార్లు, చివరికి ఇరవై ఇరవైలు దాకా సాగేది. ఎక్కాలు అప్పజెప్పే సమయంలో అందరికీ గుండెలు దడ దడ లాడేవి. అప్పటి దాకా చదివినదే అయినా మాస్టారి దగ్గరకి వచ్చే సరికి ఆరు ఆర్లు కాస్తా నలభై రెండు అయిపోయేది. ఓ రెండు బెత్తం దెబ్బలు కొట్టి మళ్ళీ మొట్టమొదటి నించీ చదివి అప్పజెప్పు అని లైన్ లో చివరికి పంపించే వారు.


నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఎక్కాలు మోసం చేసేవి. అన్నీ చక్కగా అప్పచెప్తూ ఆరార్లు ముప్ఫై ఆరు అని చెప్పగానే మాస్టారు కోపంగా “ముప్ఫై ఆరా ?” అని గద్దించే సరికి సెల్ఫ్ డౌట్ వచ్చి నలభై రెండు అనడం, రెండు దెబ్బలు తినడం, మళ్ళీ లైన్ లో చివరికి వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయేది.


అప్పట్లో వీడియోలు లేవు కానీ ఈ ఎక్కాల క్లాస్ వీడియో తీస్తే ఒక హారర్ రీల్ గా వైరల్ అయిపోయేది. చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్య మాస్టారి బెత్తం వైపు బెరుకు చూపులు చూస్తూ అప్పజెప్తుంటే భలే వుండేది. ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోయి ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయానికై అర్ధించేవాళ్ళు. దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి రెండు చిన్న బెత్తం దెబ్బలు మాస్టారి ద్వారా ప్రసాదించేవాడు.


ప్రతీ క్లాస్ లోనూ ఒకరిద్దరు ఐన్స్టీన్ లు వుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు కంఠస్థ పడతారో తెలిసేదికాదు గాని టక టకా అప్పజెప్పేసే వాళ్ళు. ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ళ వైపు జాలిగా చూస్తుండేవారు. మనకి వళ్ళు మండిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత.


సరే, రాగాన్ని ప్రాక్టీస్ చేసో, కొండగుర్తులు పెట్టుకునో, బండగా బట్టీ పట్టో మొత్తానికి ఇరవై ఇరవైల దాకా అప్పజెప్పామనుకోండి, వెంటనే మాస్టారు రూల్స్ మార్చేసేవారు. ఈసారి తలక్రిందుగా అప్పజెప్పాలి అనే వారు. అంటే ఇరవై ఇరవైలు నాలుగొందలు నించి రెండు ఒకట్ల రెండు దాకా అన్న మాట. పట్టుదలగా అదీ సాధిస్తే ఈ సారి రాండమ్ గా అడిగే వారు. పదమూడు పదిహేళ్లెంత అనో, పద్దెనిమిది పదమూళ్లెంత అనో ఆడగ్గానే మనసులో రాగం పాడుకోడానికి టైమ్ పట్టేది.


స్కూల్లో మాష్టర్లే కాదు, ఇంటికొచ్చిన చుట్టాలు,పక్కాలు కూడా కనబడితే చాలు “ఎన్నో క్లాస్ రా నువ్వు ? ఎన్ని ఎక్కాలు వచ్చు ? పన్నెడు పద్నాలుగులు ఎంత ?” లాంటి ప్రశ్నలతో వేధించే వాళ్ళు. అందుకే వాళ్ళని తప్పించుకుని తిరగవలసి వచ్చేది.


ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాక ఇంకా ఎన్నో వుండేవి. అవి చాలా ఇంటరెస్టింగ్ గా వుండేవి. ప్రతీ పేజీలోనూ క్రింద ఒక మంచి సుభాషితమో, సామెతో, వేమన పద్యమో వుండేది. అవన్నీ చక్కగా కంఠతా వచ్చేసేవి. చివరి పేజీలలో అన్ని భాషల లోనూ తెలుగు వారాల పేర్లు,నెలల పేర్లు,ఋతువులు,తిధులు,నక్షత్రాల పేర్లు వుండేవి. తెలుగుతో బాటు తమిళ, హిందీ భాషలలొ కూడా వుండేవి. భాను వారము, ఇందు వారము .. చిత్తి , వయ్యాశీ.. ఇలాగ. నిజానికి తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్ళలో వుండేవారికి దేశంలో తెలుగుతో బాటు వేరే భాషలు కూడా వుంటాయని మొదటి సారి పరిచయం చేసేది ఈ ఎక్కాల పుస్తకమే. అవి చదివేసిన విద్యార్ధులు బహుభాషా కోవిదుల్లా ఫీలైపోయేవారు.


మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలా పనిచేసేది. ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకి తెలుగు నెలలు, తిధుల పేర్లు తెలిసేవి. ఇప్పటి బాలలని ఎవరిని అడిగినా ఇవి సరిగ్గా చెప్పలేరని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి.


ఇంతటి ఘన చరిత్ర వున్న ఎక్కాల పుస్తకం ఈనాటి కాలిక్యులేటర్లు, అబాకస్ లు, టాబ్లెట్ ల ధాటికి తట్టుకోలేక మాయమైపోతోంది. దానితోబాటే మన పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నించీ నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతోంది. ఐ మిస్ యు - ఎక్కాల పుస్తకం !!


ఇది చదివిన తర్వాత మీరు కూడా మిస్సవుతున్నారు కదూ? వెంటనే బజారుకెళ్ళి ఓ ఎక్కాల పుస్తకం కొనుక్కుని ఇరవై ఇరవైల దాకా తలక్రిందుగా కంఠస్థం చేయండి. మొబైల్లో పాడు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేకంటే అదే మంచిది. మైండ్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా వుంటుంది.

కార్తీకపురాణం

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*సౌమ్యవారం తేదీ 11 నవంబరు 2026*


             *కార్తీకపురాణం*             

         *రెండవ అధ్యాయం*                                          


*సోమవార వ్రత మహిమ*

*కుక్క కైలాసానికి వెళ్లుట*```


వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు “జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. 

ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు..


“కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. 


ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను”అని ఇలా చెప్పసాగాడు..```


*కుక్క కైలాసానికి వెళ్లుట*```


“పూర్వ కాలమున కాశ్మీర్ లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 

అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు,పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. 


అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.


ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. 


చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేయించారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, 

అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసము ఉండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపించిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడము, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. 


ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. 


ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? 

నీ వృత్తాతమేమిటి ?’ అని ప్రశ్నించాడు. 


అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు” అని ప్రార్థించింది.     


దాంతో ఆ శునకం మీద జాలితో 

ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. 


అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”```


*ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే ద్వితీయోఽధ్యాయః సమాప్తః*

```

*🕉️ఓం నమః శివాయ🙏*


             🌷🙏🌷


   *🕉️🌹సేకరణ🕉️🌹*

    🙏*న్యాయపతి*🙏 

       *నరసింహారావు*