21, ఆగస్టు 2026, శుక్రవారం

ప్రాపంచిక సుఖానికి

  **తాత్కాలికమైన ప్రాపంచిక సుఖానికి, శాశ్వతమైన అంతర్గత ఆనందానికి మధ్య తేడా ఏమిటి?*


విష్ణు సహస్రనామాలలో **శతానందః”అనే ఎంతో అద్భుతమైన నామం ఉంది. ఆదిశంకరులు దీనికి వందల కొద్దీ ఆనందాలను, అనంతమైన ఆనందాలను పొందినవాడు” అని అర్థం చెప్పారు.


మహాభారతంలో భీష్ముడు మానవాళి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పవిత్రమైన *విష్ణు సహస్రనామాన్ని* అందించాడు. అందులోని “శతానందః” అనే నామం ఆనందం యొక్క అసలైన స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది.


ఆది శంకరులు చెప్పిన వందల కొద్దీ ఆనందాలు అంటే ఏమిటి?


**తైత్తిరీయ ఉపనిషత్తు** ఆనందానికి అనేక స్థాయులు ఉన్నాయని చెబుతుంది. మనిషి పొందగలిగే అత్యున్నత ఆనందాన్ని **మానుషానందం** అంటారు. దానికంటే దేవ-మానవుల ఆనందం వంద రెట్లు ఎక్కువ. దానికంటే గంధర్వుల ఆనందం వంద రెట్లు ఎక్కువ. ఇలా ఒక్కో స్థాయి ఆనందం ముందు స్థాయి కంటే వంద రెట్లు పెరుగుతూ చివరకు *బ్రహ్మానందం*వరకు చేరుతుంది.


ఈ రకరకాల ఆనందాలన్నీ తనలోనే నిండుగా కలిగినవాడే *శతానందః—*

శ్రీ మహావిష్ణువు.


అంటే, మనం ప్రపంచంలో అనుభవించే సుఖాలన్నింటికంటే పరమమైన, శాశ్వతమైన ఆనందం భగవంతుని స్వరూపమే.


**మానుషానందం అంటే ఏమిటి?**


భూమండలాన్నంతటినీ పరిపాలించే ఒక గొప్ప చక్రవర్తిని ఊహించుకోండి. అతనికి శత్రువులు లేరు. అన్నీ అతనికి అనుకూలంగానే ఉన్నాయి. అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. చుట్టూ ఉన్నవారంతా అతనితో సంతోషంగా, స్నేహంగా ఉంటున్నారు. అతనికి తీరని కోరికలు కూడా ఏవీ లేవు.


అలాంటి వ్యక్తి అనుభవించే సంపూర్ణ సుఖాన్నే **మానుషానందం** అంటారు. భూమిపై ఇలాంటి ఆనందాన్ని అనుభవించిన వ్యక్తిగా *ధర్మరాజు యుధిష్ఠిరుడిని*

ఆది శంకరులు పేర్కొంటారు.


అయితే మనం రోజువారీ జీవితంలో అనుభవించే సుఖాలు మాత్రం శాశ్వతమైనవి కావు. ఈ రోజు మనకు ఆనందాన్ని ఇచ్చిన విషయం రేపు అదే ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు అదే విషయం తర్వాత మనకు బాధను కూడా కలిగించవచ్చు.


అందుకే *ప్రాపంచిక సుఖం తాత్కాలికం, అంతర్గత ఆనందం శాశ్వతం.*


ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానానికి మొదటి అడుగు. బయట ఉన్న పరిస్థితులు మారినా, మనలోని శాంతి మరియు ఆనందం చెదిరిపోకుండా ఉండే స్థితిని సాధించడానికి మనం ప్రయత్నించాలి.


అప్పుడు జీవితంలో సుఖం కోసం బయట వెతకాల్సిన అవసరం ఉండదు. *నిజమైన ఆనందం మనలోనే ఉందని తెలుసుకుంటాం.*


*శుభమస్తు.*

ఓం స్వస్తి..👌🏼

శ్రీధర్ శర్మ తోటపల్లి..

శ్రీ సద్గురు పీఠం.....👉

చంపేంత కసి...

 గురువును చంపేంత కసి...

పదో తరగతి వయసులోనే ఎందుకు.?


రూపా రెడ్డి హత్య నన్ను వెంటాడుతున్న ప్రశ్నలు...

మన పిల్లలను మనం ఏ దిశలో తీసుకెళ్తున్నాం.?


– వెంకటేశ్వరరావు ఉమ్మిడిశెట్టి

నేషనల్ మీడియా జర్నలిస్ట్


కొన్ని వార్తలు రాసి పక్కన పెట్టేయొచ్చు...


కొన్ని వార్తలు చదివి మరచిపోవచ్చు...


కానీ కొన్ని ఘటనలు మాత్రం మనసులో ప్రశ్నగా మిగిలిపోతాయి.


నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు కూడా అలాంటి ఘటనగానే నాకు అనిపించింది.


పోలీసులు వెల్లడించిన వివరాలు విన్న తర్వాత ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా కలచివేసింది...


“పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో కత్తులు ఎందుకొచ్చాయి?”


ఇంకా బాధ కలిగించే విషయం...


గురువుగా విద్యాబుద్ధులు చెప్పిన వ్యక్తిపైనే ఆమె వద్ద చదువుకున్న పదో తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం.


ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీగా చదివి ముందుకు వెళ్లిపోవాల్సిన ఘటన కాదు.


ఇది మన కుటుంబ వ్యవస్థను ప్రశ్నిస్తోంది.


ఇది మన విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తోంది.


ఇది మన పిల్లల పెంపకాన్ని ప్రశ్నిస్తోంది.


ఇది మన సమాజాన్ని ప్రశ్నిస్తోంది.


పదో తరగతి వయసులో హత్య ఆలోచన ఎలా వచ్చింది?


పదో తరగతి...


ఒక విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన దశ.


ఈ వయసులో పిల్లలు భవిష్యత్తు గురించి కలలు కనాలి.


డాక్టర్ కావాలని...


ఇంజనీర్ కావాలని...


పోలీస్ కావాలని...


సైన్యంలో చేరాలని...


తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని...


కలలు కనే వయసు ఇది.


అలాంటి వయసులో...


డబ్బు కావాలి... అందుకోసం ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన ఎలా వచ్చింది?


ఇది ఒక్కరోజులో పుట్టిన ఆలోచనా?


లేక చాలా కాలంగా పెరుగుతున్న ఏదో ఒక మానసిక పరిస్థితికి ఇది చివరి రూపమా?


డబ్బుపై ఆకర్షణ...


జల్సాలపై ఆసక్తి...


మద్యం వంటి అలవాట్లు...


బైకులపై మోజు...


కోపం...


తప్పు స్నేహాలు...


ఇవన్నీ ఒక బాలుడి ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేయగలవు?


మన పిల్లల మార్కులు మనకు తెలుసు... వారి మనసులు తెలుసా?


పిల్లల మార్కులు తగ్గితే మనం వెంటనే గమనిస్తాం.


ర్యాంకు తగ్గితే ఆందోళన చెందుతాం.


చదువులో వెనుకబడితే పాఠశాలకు వెళ్లి మాట్లాడతాం.


కానీ...వారి ప్రవర్తనలో మార్పు వస్తే గమనిస్తున్నామా?


వాళ్లు ఎవరితో స్నేహం చేస్తున్నారు?


ఎక్కడికి వెళ్తున్నారు?


ఎవరితో తిరుగుతున్నారు?


ఎందుకు తరచూ డబ్బు అడుగుతున్నారు?


వారి ఫోన్‌లో ఏం చూస్తున్నారు?


వారి మాటల్లో, ఆలోచనల్లో కోపం పెరుగుతోందా?


మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారా?


ఈ ప్రశ్నలను మనం ఎంతవరకు అడుగుతున్నాం?


మార్కులు తగ్గితే గమనిస్తున్నాం...


మరి విలువలు తగ్గితే?


పిల్లలకు ఖరీదైన విద్య ఇస్తున్నాం... కానీ జీవితం నేర్పుతున్నామా?


పిల్లలకు మంచి పాఠశాల కావాలి.


మంచి కాలేజీ కావాలి.


మంచి ఉద్యోగం కావాలి.


మంచి భవిష్యత్తు కావాలి.


ఇవన్నీ కోరుకోవడంలో తప్పు లేదు.


కానీ...వారికి మంచి మనిషిగా ఎలా జీవించాలో కూడా నేర్పుతున్నామా?


డబ్బు సంపాదించడం ఎలా అనేది నేర్పుతున్నాం.


డబ్బు కోసం ఏం చేయకూడదో కూడా నేర్పుతున్నామా?


గెలవడం ఎలా అనేది చెబుతున్నాం.


ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలో చెబుతున్నామా?


కోపం రావడం సహజమే.


ఆ కోపాన్ని ఎలా నియంత్రించాలో నేర్పుతున్నామా?


స్వేచ్ఛ ఇస్తున్నాం.


బాధ్యతను కూడా నేర్పుతున్నామా?


ఒకప్పుడు కుటుంబం ఒక పాఠశాల... ఇప్పుడు?


ఒకప్పుడు పిల్లల పెంపకంలో కుటుంబం పెద్ద పాత్ర పోషించేది.


తాతయ్యలు, అమ్మమ్మలు కథలు చెప్పేవారు.


మంచి–చెడు గురించి మాట్లాడేవారు.


మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు పిల్లలకు పరిచయం చేసేవారు.


పెద్దలను గౌరవించడం...


చిన్నలను ప్రేమించడం...


ఇతరుల బాధను అర్థం చేసుకోవడం...


తప్పు చేస్తే ఒప్పుకోవడం...


ఇవి జీవితంలో భాగమని చెప్పేవారు.


ఇప్పుడు పిల్లలకు సమయం ఇస్తున్నామా?


లేక...వారికి వస్తువులు ఇస్తూ, సమయాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నామా?


ఖరీదైన ఫోన్ కొనివ్వగలుగుతున్నాం.


ఖరీదైన విద్య అందించగలుగుతున్నాం.


అవసరమైన ప్రతిదీ కొనివ్వగలుగుతున్నాం.


కానీ...వారి పక్కన కూర్చొని 

“నీ మనసులో ఏముంది?” అని అడగడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం?


పాఠశాల బాధ్యత కూడా అంతే ముఖ్యం


పాఠశాల అంటే కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు కాదు.


అది వ్యక్తిత్వాన్ని నిర్మించే స్థలం.


ఒక విద్యార్థి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తే...


కొత్త స్నేహాలు ఏర్పడితే...


అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే...


మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావం కనిపిస్తే...


కోపం, అసహనం పెరిగితే...


పాఠశాల కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.


అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలి.


ఎందుకంటే...


ఒక విద్యార్థిని పరీక్షలో ఫెయిల్ కాకుండా కాపాడటం ఎంత ముఖ్యమో... అతను జీవితంలో తప్పు దారిలోకి వెళ్లకుండా కాపాడటం అంతకంటే ముఖ్యం.


ఇంతకీ రూపా రెడ్డి కేసులో ఏం జరిగింది?


ఇప్పుడు అసలు కేసు వివరాల్లోకి వస్తే...


నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారించామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


ఈ కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు ఎస్పీ వెల్లడించారు.


రూపా రెడ్డి హత్యకు గురైన తర్వాత ఆమె చివరిసారిగా తన పిన్నితో మాట్లాడిన సమయంలో “బాబు” అని సంబోధించినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్‌లో కూడా ఆమె విద్యార్థులను అదే విధంగా పిలుస్తుండటంతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.


హత్య అనంతరం స్కూల్‌కు నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు. స్కూల్ తిరిగి ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులను పోలీసులు విచారించారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.


ఆ ఐదుగురిలో ఇద్దరు విద్యార్థులు ఇటీవల డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు.


రూ.1.54 లక్షల నగదు.. అక్కడే అనుమానం


విచారణలో నిందితుల్లో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు పోలీసులు గుర్తించారు.


అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చారని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.


అయితే ఆ నగదు నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.


పరీక్షల్లో ఆ రక్తం రూపా రెడ్డికి చెందినదేనని నిర్ధారణ అయినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


దీంతో దర్యాప్తులో కీలక ఆధారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు.


హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చడంతో కోపం?


నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్‌లో ఉండేవాడు.


అతనికి మద్యం అలవాటు, బైకులపై మోజు ఉండేదని పోలీసులు గుర్తించారు.


అతని బ్యాగులో నగదు, ఫోన్‌ను గుర్తించిన రూపా రెడ్డి అతడిని మందలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చినట్లు వెల్లడించారు.


ఆ ఘటన తర్వాత రూపా రెడ్డిపై ఆ విద్యార్థికి కోపం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.


నెల రోజుల క్రితమే గోవాకు వెళ్లిన నిందితుడు


పోలీసుల ప్రకారం నిందితుల్లో ఒకరు నెల రోజుల క్రితం గోవాకు వెళ్లాడు.


ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రూపా రెడ్డి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.


హత్యకు ఐదు రోజుల ముందే ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు.


రూపా రెడ్డి ఇంట్లో స్కూల్ ఫీజులకు సంబంధించిన డబ్బు ఉంటుందని నిందితులకు తెలుసని పోలీసులు తెలిపారు.


మాస్కులు వేసుకుని ఇంట్లోకి.. గుర్తుపట్టడంతో దాడి


ఈ నెల 11న స్కూల్ ముగించుకుని రూపా రెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి ఆమె ఇంటి వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో వారిలో ఒకరి మాస్క్ కిందపడిపోయిందని, దీంతో అతడిని రూపా రెడ్డి గుర్తించినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.


ఆమె తమను గుర్తించిందనే భయంతో ఆమెపై కత్తితో 27 సార్లు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


అనంతరం కిందపడిపోయిన ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకుని, నగదుతో కలిసి అక్కడి నుంచి పరారైనట్లు ఎస్పీ తెలిపారు.


నిందితుల నుంచి స్వాధీనం


నిందితుల నుంచి:


- రూ.1.54 లక్షల నగదు

- ఒక ఐఫోన్

- రూపా రెడ్డికి చెందిన ఫోన్


స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువెనైల్ జస్టిస్ కోర్టు ముందు హాజరుపరుస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


మళ్లీ అదే ప్రశ్న...


కేసు దర్యాప్తు వివరాలు ఇప్పుడు మనకు తెలిసాయి.


పోలీసులు తమ పని చేశారు.


నిజానిజాలు న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది.


చట్టం తన పని చేస్తుంది.


కానీ సమాజం తన పని ఎప్పుడు చేస్తుంది?


పదో తరగతి వయసులోనే ఒక బాలుడి ఆలోచనలు ఇంతటి నేరం వైపు ఎందుకు వెళ్లాయి?


ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఆ ఇద్దరు బాలుర వద్ద వెతికితే సరిపోదు.


కుటుంబంలో వెతకాలి.


పాఠశాలలో వెతకాలి.


స్నేహ వాతావరణంలో వెతకాలి.


మన సమాజంలో వెతకాలి.


పిల్లలు నేరం చేసిన తర్వాత వారిని నిందించడం చాలా సులువు.


కానీ...వాళ్లు నేరం చేసే స్థితికి చేరుకునే ముందే వారి చేతిని పట్టుకోవడమే అసలైన బాధ్యత.


రూపా రెడ్డి మరణం ఒక కుటుంబానికి తీరని విషాదం.


ఇద్దరు బాలలపై హత్య ఆరోపణలు వారి కుటుంబాలకు మరో విషాదం.


కానీ ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్ న్యూస్‌గా చూసి మర్చిపోతే...


మనం అసలు పాఠాన్ని కోల్పోయినట్టే.


మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాదు... ఆ భవిష్యత్తును మంచి మనుషులుగా నిర్మించాల్సిన బాధ్యత కూడా మనదే.


–వెంకటేశ్వరరావు ఉమ్మిడిశెట్టి

నేషనల్ మీడియా జర్నలిస్ట్

నిజం ఆ రోజులే వేరు !!*

 *నిజం ఆ రోజులే వేరు !!*

*#############*


ఈ 40, 50 ఏళ్ళల్లో మన జీవితాల్లో వచ్చిన మార్పులు పరికిస్తుంటే బోలెడు ఆశ్చర్యం కలుగుతోంది. అప్పట్లో అలా ఉండే జీవనం ఇలా మారిపోయింది ఏమిటా అనే ప్రశ్న కి జవాబు మాత్రం దొరకడం లేదు.


ఉద్యోగం వచ్చి సొంతూరు వదిలేవరకు రైలు పెట్టెల్లా వరుసగా మూడు గదులుండే ఇంటిలో అయిదుగురం ఉండేవాళ్ళం. అప్పట్లో చాలా మంది ఇళ్ళు ఇలాగే ఉండేవి.


ముందు వరండా, వెనుక పడక గది, ఆ వెనుక వంట / భోజనాల గది. ఎవరైనా బంధువులు వచ్చినా అందులోనే సర్దుకునేవాళ్ళం. అందరం కలిసి కిందనే కూచుని అన్నాలు తినేవాళ్ళం. నేల మీద చాపలు, బొంతలు పరుచుకుని ఇంట్లో ఉన్న ఏకైక ceiling fan కింద 

హాయిగా నిద్ర పోయేవాళ్ళం. దోమలు ఉండేవి కావు, చల్లటి గాలి వచ్చేది కిటికీల్లోంచి.


ఇప్పుడు 3 BHK+ 2 car పార్కింగ్ + రెండు బాల్కనీ లున్నా బిక్కు బిక్కు మంటూ ఇంటికి ఇద్దరు లేక నలుగురే. కింగ్ బెడ్లు, ఏసీ లు ఉన్నా నిద్ర కరువే.

ఇక బంధువులు వచ్చినా ప్రైవసీ అంటూ హోటల్ లోనే బస. ఇదివరకటిలా కబుర్లు కాకరకాయలు లేవు. ఇదివరకు మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే మొహం మీదే అడిగేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కర్టెసీ మాటలే. వాళ్ళేమనుకుంటారో ఆనుకుని పొడి పొడి కబుర్లే. ఆ చుట్టాలు కూడా చుట్టం చూపుగా వచ్చి భోజనం తిన్నాం అనిపించి వెళ్ళిపోడమే.


ఏ కాలమైనా సరే, పొద్దున్నే బావి దగ్గిర నుంచుని బొక్కేనల కొద్దీ నీళ్లు తోడుకుని ఎగురుతూ, గెంతుతూ, అన్నదమ్ములం ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ నూతి గట్టు మీదే స్నానం చేసేవాళ్ళం. వేసవి కాలం చల్లగాను, చలికాలం వెచ్చగాను ఉండేవి బావిలోని నీళ్లు. అంతసేపు నానకండిరా, జలుబు చేస్తుంది అని అమ్మ ఓ పక్కన అరుస్తూనే ఉన్నా వినేవాళ్ళమా, నూతి గట్టు వదిలేవాళ్ళమా? ఇక వేసవికాలం అయితే చెప్పేదేముంది, రోజుకి మూడుసార్లు స్నానం చేసేవాళ్ళం.


ఇప్పుడు చలువరాతి బండలున్న బాత్రూం లో షవర్లు, వెచ్చగా నీళ్లిచ్చే గీజరులున్నా కాకి స్నానంలా ఏదో నాలుగు చెంబులు వంటిమీద తూ తూ మంత్రంలా దిమ్మరించుకుని, తువ్వాలు చుట్టుకుని, జారి పడకుండా గోడకున్న స్టీల్ రాడ్ పట్టుకుని, జాగ్రత్తగా బయట పడి అమ్మయ్య అనుకుంటున్నాం.


ఏ కాలం లో అయినా, బడికి ఎంత దూరమైనా సరే, ఓ పుస్తకాల గుడ్డ సంచీ భుజానికి తగిలించుకుని నడుచుకుంటూనే బడికి పోయేవాళ్ళం.

ఇప్పుడు పిలగాళ్లు ఇంటి ముంగట్లోనే ఏసీ స్కూలు బస్సులు ఎక్కి బడికి పోతున్నారు. వాళ్ళ నాన్నలు పరలాంగ్ దూరానికి కూడా నడవక బళ్ళు తీస్తున్నారు. ఎవ్వరికీ నడకలు ఇష్టం ఉండడం లేదు.


డిగ్రీ చదివేవరకు కూడా చద్దన్నంలో ఆవకాయ కలుపుకుని, ఆఖరన మజ్జిగ పోసుకుని ఆవకాయ పెచ్చు కొరుక్కుని కడుపునిండా తిన్న ఆ అన్నం ముందు నేడు తింటున్న ఖరీదైన ప్రోటీన్లు, ఫైబర్లు, ఆర్గానిక్ ఫుడ్స్, హైబ్రీడ్ కూరలు, కట్టె గానుగ నూనెల తిండి తో అన్న హితవే లేకుండా పోయింది.


ఇంట్లో ఒక సైకిల్ ఉంటే మహా గొప్పగా తలచే రోజులనుంచి ఇంటికి ఒక కారు రెండు స్కూటర్ల స్థాయికి చేరుకున్నా, నాన్నగారు తొక్కుతున్న సైకిల్ వెనక కారియర్ మీద నేనంటే నేను అని అన్నాదమ్ములతో పోట్లాటల మద్య సైకిల్ మీద తిరిగిన రోజులే బాగున్నట్లున్నాయి. రిక్షా ఎక్కినా పుష్పక విమానం ఎక్కిన గొప్ప ఫీలు ఉండేది అప్పట్లో.


సంక్రాంతి పండగకి కుట్టించిన మూడు జతల బట్టలతోటే ఆనందంగా గడిపిన రోజులనుంచి బీరువాల్లో అన్ని బట్టలు మూలుగుతున్నా ఫంక్షన్స్ కి వెళ్లే ఓపిక లేక, ఓపిక చేసుకున్నా ఎడతెగని బట్టల ఎంపిక తో విసుగు తెప్పిస్తున్న రోజులివి.

సాదా బట్టలతో వెళితే చుట్టాలు చెవులు 

కొరుక్కునే, హంగు ఆర్భాటాల డాబుసరి ప్రదర్శనల రోజులివి.


జనరల్ బోగీలో చెక్క బల్లల మీద కిటికీ పక్కన నేనంటే నేను అని తోడ బుట్టిన వారితో కొట్లాడి కిటికి పక్కకు చేరి పరుగెడుతున్న చెట్లని చూస్తూ, కంట్లో బొగ్గు నలకలు పడుతున్నా అమ్మకానికి వచ్చిన పల్లీలు, బఠానీలు ఏడ్చి రాగాలు తీస్తూ కొనిపించుకుని తిన్న ఆనందం, పక్కవారితో మాట్లాడకుండా ఫోనులో ములిగిపోయిన సాటి ప్రయాణీకుల మద్య, అద్దాలు బిగించిన ఏసీ బోగీల్లో బిగుసుకుని కూచుని చేస్తున్న నేటి ప్రయాణాల్లో కనపడడం లేదు. 


అప్పుడే దిగాల్సిన స్టేషన్ రాకూడదు అనుకున్న రోజుల నుంచి ఇంకెంతసేపురా బాబూ అనిపించే మౌన ప్రయాణపు రోజులివి.


ప్రయాణంలో దాహం వేస్తే స్టేషన్ రాగానే ఉరుక్కుంటూ వెళ్లి ప్లాట్ఫారం మీదున్న పంపు కింద చేయి పెట్టి ఏమాత్రం సందేహించకుండా నీళ్లు తాగి, మరచెంబుల నిండా నీళ్లు 

పట్టుకుని రైలు ఎక్కిన రోజుల నుంచి, best మినరల్ వాటర్ బాటిల్ అని మల్టీ నేషనల్ కంపెనీవాడు చెప్పినా కూడా సందేహిస్తూనే బోలెడు డబ్బులు పోసి కొనుక్కున్న నీళ్లు తాగుతున్న రోజుల్లో ఉన్నాం.


జలుబో, జ్వరమో, దగ్గో వస్తే RMP డాక్టర్ గారిచ్చిన రంగు నీళ్లు తాగి, బిళ్ళలు మింగగానే ఇట్టే తగ్గిపోయిన రోగాలు ఇప్పుడు సీబీపీ లాంటి రక్త పరీక్షలు, MRI, CT స్కాన్ లు చేయించుకుని ఖరీదైన మందులు మింగుతున్నా ఒక పట్టాన తగ్గడం లేదేమిటో!


పెళ్ళికి అయిదురోజుల ముందు వెళ్లి పచ్చటి కొబ్బరాకుల పందిరి ఆటల చుట్టూ అందరి బంధువుల పిల్లలతో కలిసి ఆడిన ఆటలు, బంక్తి భోజనాలు చేసి, ఏదో మూల పరిచిన చాప/దుప్పట్ల మీద వళ్ళు తెలియకుండా పడుకున్న రోజులు నుంచి , నేటి పెళ్లిళ్ళల్లో ముహూర్తం టైం కి వెళ్ళామా, మండపం ఎక్కి అక్షింతలు వేశామా, గిఫ్ట్ కవర్ ఇచ్చామా, ఫొటోలో పడ్డామా,

ప్లేట్ పట్టుకుని గుంపులో గోవిందాలాగా ఏదో కతికామా, రిటర్న్ గిఫ్ట్ అందుకున్నామా, అనే రోజులకి వచ్చాం. పెళ్లి మండంపం లో కన్నా రానూ పోను ప్రయాణ ట్రాఫిక్లో గడుపుతున్న టైమే ఎక్కువ ఉంటున్న రోజులివి.


పోతే, ఇలా ఇప్పుడు అప్పుడు అంటూ పోలికలు చేసుకోడం, ఆ రోజులే బాగున్నాయి, అవి మళ్ళీ వస్తే బాగుండును అని అనుకోడానికి తప్ప ఈ రాతల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నిజంగానే టైమ్ మెషిన్

ఎక్కి వెనక్కి వెళ్లినా, ఇప్పుడు మనకున్న రోగాలతో, సుఖాలు మరిగిన కాయాలతో, ఒక్కరోజు దాటి ఉండలేము. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో, నేటి ఉరుకుల పరుగుల జీవనంలో అప్పట్లా ఉండడం అస్సలు కుదరదు అనుకోండి. ఏదో కాస్త ఇలా పోల్చుకుంటూ ఆ రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆ ఘనమైన గతాన్ని తలుచుకుంటూ, తృప్తి పడడమే మిగిలింది మనకి.


 ఇప్పుడు మానవ సంబంధాలు తగ్గిపోయి యాంత్రికంగా అయిపోతున్నాం, చుట్టూ గిరి గీసుకుని ఉండిపోతున్నాం. ఇదివరకటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, తోడబుట్టిన వారిలో కూడా నెమ్మదిగా కనుమరుగు అవుతున్న రోజులివి.

మన జనరేషన్ మాత్రమే అనుభవించిన అనుభవిస్తున్న - కాలంతో పరుగు తీయలేక నిస్సహాయంగా వెళ్లబుచ్చుతున్న నగ్న సత్యాలు.

ఏమంటారు కాదంటారా??

సంసార సాగరం నుండి ఎలా బయట పడాలి?*

 *సంసార సాగరం నుండి ఎలా బయట పడాలి?*


ఈ సంసారం అంటే ఒక ముళ్ళ మంచం లాంటిది. అడుగడుగునా గుచ్చుతుంది.  

ఈ లోకమంతా దుఃఖాలతో నిండి ఉంది. మన శరీరం కూడా రోగాలతో నిండినదే.


ఈ సంసార బాధలకు భయపడే సూర్యుడు, చంద్రుడు కూడా ఆకాశంలోనే తిరుగుతున్నారు.  

శివుడు ఈ లోక గొడవలు వద్దని కైలాస పర్వతాన్ని తన ఇల్లు చేసుకున్నాడు.  


విష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుని పడవలా చేసుకొని దానిపై పడుకున్నాడు.  


బ్రహ్మ దేవుడు కూడా నీటిపై ఉన్న కమలాన్నే తన సీటుగా ఎంచుకున్నాడు. 


ఇదంతా సరదాగా చెప్పిన మాట.


ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు కేవలం పొట్ట నింపుకోవడం కోసం, 

డబ్బు సంపాదించడం కోసం పరిగెడితే... 

మన జీవితానికి అర్థమే ఉండదు. 

అది పూర్తిగా వృధా అయిపోతుంది.


ఈ లోకంలోని చిన్న చిన్న సుఖాల వెంట పడితే, మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చే దేవుడు దొరకడు.


అబద్ధమైన ఈ ప్రపంచాన్ని నెత్తిన పెట్టుకుని, బాధపడుతూ, దుఃఖంలో మునిగి చివరికి చనిపోతే... మిగిలేది గుప్పెడు బూడిద మాత్రమే.


మనిషిగా పుట్టినందుకు మనం ఈ లోకంలో గొప్పగా సాధించింది ఏముంది? 


మన బంధువులు, స్నేహితులు, డబ్బు, ఆస్తి, ఇల్లు, కారు... వీటిలో ఏదీ మనతో పాటు రాదు.


మనం బతికుండగా చేసిన మంచి పనులు, చెడు పనులు మాత్రమే మన వెంట వస్తాయి.


*సారాంశం ఒకే లైన్ లో:*  

లోకంలో ఉంటూనే, లోకానికి అతుక్కోకుండా, మంచి చేస్తూ, దేవుణ్ణి గుర్తుంచుకుంటూ బతకడమే సంసార సాగరం నుండి బయటపడే మార్గం.


శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం*🪷

 🪷

*ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం*🪷


*ప్రజలు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, భయాలను అధిగమించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడే అనేక పుస్తకాలు, వ్యాసాలు ఉన్నాయి. అయితే, ఆత్మవిశ్వాసం చాలాసార్లు మన ప్రాపంచిక విజయాలపై, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. అంటే, నేను ఏమి సాధించాను, నా వద్ద ఏమి ఉంది, నేను ఏ స్థాయిలో లేదా ఏ పదవిలో ఉన్నాను అనే విషయాలపై అది ఆధారపడి ఉంటుంది.*


*నేను ఆ పదవిలో లేనప్పుడు, ఇతరులు నా గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు లేదా నేను కూడబెట్టుకున్న ఆస్తులు, వస్తువులు నా వద్ద లేనప్పుడు కూడా నా ఆత్మవిశ్వాసం అలాగే ఉంటేనే అది నిజమైన ఆత్మవిశ్వాసం. ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం అనేది నేను ఏమిటి అనే దానిపై కాదు, నేను ఎవరు అనే అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఆ అవగాహనను ఎవరూ నా నుండి దూరం చేయలేరు.*


*ఒక వ్యక్తి ఎంతో ఉన్నత విద్యావంతుడై, విజయవంతుడై ఉండవచ్చు. అయినప్పటికీ, అతని అంతరంగంలో అభద్రతా భావం ఉండవచ్చు. మరోవైపు, చాలా తక్కువ వనరులు ఉన్న కొందరు తమ నిజమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని ప్రసరింపజేయగలరు.*


*ఇది “నేను ఎవరు?” అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా కలిగే నిశ్శబ్దమైన విశ్వాసం నుంచి ఉద్భవిస్తుంది. నేను శాశ్వతమైన ఆత్మను. శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం నా సహజ స్వభావాలు. పరమాత్మ అయిన భగవంతుడు నా శాశ్వత సహచరుడు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే అంతర్గత శక్తి నాలో ఉంది.*


*ఇలాంటి ఆత్మవిశ్వాసం ప్రశాంతంగా, వినయంగా ఉంటుంది. దీనికి ఇతరుల ఆమోదం లేదా గుర్తింపు అవసరం ఉండదు.*


*సవాళ్లు ఎదురైన సమయంలో కూడా ఈ అవగాహనను నిలుపుకోగలగడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. మనందరిలోనూ ఉండే అంతర్గత స్వరం నుంచే అంతర్గత మార్గదర్శకత్వం లభిస్తుంది. దానిని మనం అంతఃప్రజ్ఞ లేదా మనస్సాక్షి అని పిలవవచ్చు.*


*మనస్సు ప్రశాంతంగా, బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఈ అంతర్గత మార్గదర్శకత్వం ఎంతో స్పష్టంగా ఉంటుంది. కోపం, అహంకారం లేదా ఆందోళనతో మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు, ఆ అంతర్గత మార్గదర్శకత్వాన్ని స్పష్టంగా వినలేం.*


*నీటిలో అలలు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో మన ముఖ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడటం ఎంత కష్టమో మనకు తెలుసు. నీరు నిశ్చలంగా మారినప్పుడు మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. అదే విధంగా, ధ్యానం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారినప్పుడు, అంతర్గత స్వరం మనకు సరైన మార్గాన్ని స్పష్టంగా చూపించడం ప్రారంభిస్తుంది.*


*చాలామంది ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తమను తాము అనుమానించుకుంటారు. అందువల్ల అంతర్గత స్వరాన్ని స్పష్టంగా వినడం, దానిపై విశ్వాసం ఉంచడం బదులు, “ప్రజలు ఏమనుకుంటారు?”, “నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా?”, “నేను విఫలమైతే ఏమవుతుంది?” అని ఆలోచిస్తుంటారు.*


*మన స్వంత ఆధ్యాత్మిక జ్ఞానం కంటే ప్రపంచాన్ని ఎక్కువగా నమ్మడం ప్రారంభించాం. అయితే, మన నిజమైన స్వరూపం గురించి మనం ఎంత ఎక్కువగా అవగాహన పెంచుకుంటామో, అంతర్గత స్వరం అంత స్పష్టంగా వినిపిస్తుంది. మన ఆలోచనలు, మాటలు, చర్యలు మనకు మరియు ఇతరులకు మేలు చేసే ఫలితాలను అందించడంతో మన ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.*


*క్రమంగా మన అంతర్గత మార్గదర్శకత్వాన్ని విశ్వసించడం ప్రారంభిస్తాం. మన ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని దశలవారీగా పెంపొందించుకోవచ్చు.*


*ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే మార్గాలు*


1. *నేను చైతన్యంతో కూడిన కాంతి శక్తి అయిన ఆత్మను అనే విషయాన్ని తెలుసుకోవాలి.*


2. *ప్రతిరోజూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినాలి, అధ్యయనం చేయాలి.*


3. *మౌనం అంటే కేవలం మాటలు మాట్లాడకపోవడం కాదు. ప్రతి రోజు ప్రారంభంలో కొన్ని క్షణాలు మౌనంగా ఉండాలి. అలాగే, రోజు ముగింపులో కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవాలి.*


4. *ప్రతి ఉన్నతమైన ఆలోచనను ఆచరణలో పెట్టాలి ఎందుకంటే ప్రతి సానుకూల అనుభవం మన ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.*


*మన అంతర్గత స్వరాన్ని విన్న తర్వాత, అది నిజమైన అంతర్గత మార్గదర్శకత్వమా లేదా మన స్వంత కోరికల ప్రభావమా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలను మనం వేసుకోవచ్చు.*


*ధ్యానంలో పరమాత్మతో అనుసంధానమైనప్పుడు, బుద్ధి స్వచ్ఛంగా మారుతుంది, హృదయం బలపడుతుంది, జీవితం అర్థవంతంగా మారుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం మన సహజ స్వభావంగా మారుతుంది.*



 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకాస్సమస్తాః సుఖినోభవంతు*

*సమస్త సన్మంగళాని భవంతు*

 *శుభం భూయాత్*

 *శుభమస్తు*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*

పంచాంగం 21.08.2026 Friday,

   ఈ రోజు పంచాంగం 21.08.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష నవమి తిథి భృగు వాసర అనురాధ నక్షత్రం వైధృతి యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: నవమి.



 

నమస్కా⚛️


పంచాంగము 🌓 21.08.2026


🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔 


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: వర్ష


మాసం: శ్రావణ 


పక్షం: శుక్ల - శుద్ధ 


తిథి: నవమి రా.11:56 వరకు

తదుపరి దశమి

 

వారం: శుక్రవారం - భృగువాసరే

 

నక్షత్రం: అనూరాధ ప‌.01:36 వరకు 

తదుపరి జ్యేష్ఠ


యోగం: వైధృతి రా.తె.04:46 వరకు 

తదుపరి విష్కుంభ

 

కరణం: బాలవ ఉ‌.11:01 వరకు

తదుపరి కౌలువ రా.11:56 వరకు

తదుపరి తైతుల


వర్జ్యం: రా.07:47 - 09:33 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.08:31 - 09:22 

మరియు ప‌.12:44 - 01:34


రాహు కాలం: ఉ‌.10:44 - 12:19


గుళిక కాలం: ఉ‌.07:34 - 09:09


యమ గండం: ప‌.03:28 - 05:03

 

అభిజిత్: 11:54 - 12:44


సూర్యోదయం: 06:00


సూర్యాస్తమయం: 06:38


చంద్రోదయం: ప‌.01:32


చంద్రాస్తమయం: రా.12:39


సూర్య సంచార రాశి: సింహం


చంద్ర సంచార రాశి: వృశ్చికం


దిశ శూల: పశ్చిమం


🎊 శ్రీ వరమహాలక్ష్మి వ్రతం 🎊


🌼 జర - జీవంతికా పూజ 🌼


💦 వైధృతి‌ శ్రాద్ధము 💦


📿 దేవి పవిత్రారోపణం‌ 📿


🎉 నకుల‌ నవమి 🎉


🌷 కౌమారి పూజ 🌷


🏳️ కులైసిరై నాయనార్ 

గురుపూజ‌ 🏳️


🚩 నారాయణ్ మహరాజ్ 

పుణ్యతిథి‌ 🚩


🏳️ తఱిగొండ‌ వెంగమాంబ 

వర్ధంతి 🏳️


🎉 మదురై చొక్కనాథర్ 

పానన్ ఉత్సవం 🎉


🔯రః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ।। 38 ।।



ప్రతిపదార్థ:



కచ్చిత్ — ఒకవేళ; న — కాదు; ఉభయ — రెండు; విభ్రష్టః — భ్రష్టుడై; ఛిన్న — చెదిరిపోయిన/విడిపోయిన; అభ్రమ్ — మేఘము; ఇవ — లాగా; నశ్యతి — నిశించిన; అప్రతిష్ఠః — ఎటువంటి ఆధారం లేకుండా; మహా-బాహో — గొప్ప బాహువులు కల, కృష్ణా; విమూఢః — దిగ్భ్రమచెందిన; బ్రహ్మణః — భగవత్ ప్రాప్తి యొక్క; పథి — మార్గములో ఉన్న వ్యక్తి.



తాత్పర్యము: 



యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? ఓ మహా బాహువులు గల కృష్ణా, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా?



వివరణ:



విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికి అది సహజం; భగవంతుడు సర్వ-పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలము లాగే పరిపూర్ణంగా, విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయము/కార్యసిధ్ధి రెండు రంగాలలో ఉంటుంది - భౌతిక మైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతికప్రపంచం లో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడుతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు, భౌతిక ప్రయాసలని విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ, ఇంటువంటి ఆధ్యాత్మిక వాదులు తమ ప్రయత్నంలో విఫలం అయితే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపత్తి లేకుండా అయిపోవటం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ, వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.


ఒక మేఘము, తన గుంపు నుండి విడిపోతే, అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు, దాని బరువును పెంచుకుని వర్షం కురిపించేదిగా అవలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే, ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.