21, ఆగస్టు 2026, శుక్రవారం

నిజం ఆ రోజులే వేరు !!*

 *నిజం ఆ రోజులే వేరు !!*

*#############*


ఈ 40, 50 ఏళ్ళల్లో మన జీవితాల్లో వచ్చిన మార్పులు పరికిస్తుంటే బోలెడు ఆశ్చర్యం కలుగుతోంది. అప్పట్లో అలా ఉండే జీవనం ఇలా మారిపోయింది ఏమిటా అనే ప్రశ్న కి జవాబు మాత్రం దొరకడం లేదు.


ఉద్యోగం వచ్చి సొంతూరు వదిలేవరకు రైలు పెట్టెల్లా వరుసగా మూడు గదులుండే ఇంటిలో అయిదుగురం ఉండేవాళ్ళం. అప్పట్లో చాలా మంది ఇళ్ళు ఇలాగే ఉండేవి.


ముందు వరండా, వెనుక పడక గది, ఆ వెనుక వంట / భోజనాల గది. ఎవరైనా బంధువులు వచ్చినా అందులోనే సర్దుకునేవాళ్ళం. అందరం కలిసి కిందనే కూచుని అన్నాలు తినేవాళ్ళం. నేల మీద చాపలు, బొంతలు పరుచుకుని ఇంట్లో ఉన్న ఏకైక ceiling fan కింద 

హాయిగా నిద్ర పోయేవాళ్ళం. దోమలు ఉండేవి కావు, చల్లటి గాలి వచ్చేది కిటికీల్లోంచి.


ఇప్పుడు 3 BHK+ 2 car పార్కింగ్ + రెండు బాల్కనీ లున్నా బిక్కు బిక్కు మంటూ ఇంటికి ఇద్దరు లేక నలుగురే. కింగ్ బెడ్లు, ఏసీ లు ఉన్నా నిద్ర కరువే.

ఇక బంధువులు వచ్చినా ప్రైవసీ అంటూ హోటల్ లోనే బస. ఇదివరకటిలా కబుర్లు కాకరకాయలు లేవు. ఇదివరకు మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే మొహం మీదే అడిగేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కర్టెసీ మాటలే. వాళ్ళేమనుకుంటారో ఆనుకుని పొడి పొడి కబుర్లే. ఆ చుట్టాలు కూడా చుట్టం చూపుగా వచ్చి భోజనం తిన్నాం అనిపించి వెళ్ళిపోడమే.


ఏ కాలమైనా సరే, పొద్దున్నే బావి దగ్గిర నుంచుని బొక్కేనల కొద్దీ నీళ్లు తోడుకుని ఎగురుతూ, గెంతుతూ, అన్నదమ్ములం ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ నూతి గట్టు మీదే స్నానం చేసేవాళ్ళం. వేసవి కాలం చల్లగాను, చలికాలం వెచ్చగాను ఉండేవి బావిలోని నీళ్లు. అంతసేపు నానకండిరా, జలుబు చేస్తుంది అని అమ్మ ఓ పక్కన అరుస్తూనే ఉన్నా వినేవాళ్ళమా, నూతి గట్టు వదిలేవాళ్ళమా? ఇక వేసవికాలం అయితే చెప్పేదేముంది, రోజుకి మూడుసార్లు స్నానం చేసేవాళ్ళం.


ఇప్పుడు చలువరాతి బండలున్న బాత్రూం లో షవర్లు, వెచ్చగా నీళ్లిచ్చే గీజరులున్నా కాకి స్నానంలా ఏదో నాలుగు చెంబులు వంటిమీద తూ తూ మంత్రంలా దిమ్మరించుకుని, తువ్వాలు చుట్టుకుని, జారి పడకుండా గోడకున్న స్టీల్ రాడ్ పట్టుకుని, జాగ్రత్తగా బయట పడి అమ్మయ్య అనుకుంటున్నాం.


ఏ కాలం లో అయినా, బడికి ఎంత దూరమైనా సరే, ఓ పుస్తకాల గుడ్డ సంచీ భుజానికి తగిలించుకుని నడుచుకుంటూనే బడికి పోయేవాళ్ళం.

ఇప్పుడు పిలగాళ్లు ఇంటి ముంగట్లోనే ఏసీ స్కూలు బస్సులు ఎక్కి బడికి పోతున్నారు. వాళ్ళ నాన్నలు పరలాంగ్ దూరానికి కూడా నడవక బళ్ళు తీస్తున్నారు. ఎవ్వరికీ నడకలు ఇష్టం ఉండడం లేదు.


డిగ్రీ చదివేవరకు కూడా చద్దన్నంలో ఆవకాయ కలుపుకుని, ఆఖరన మజ్జిగ పోసుకుని ఆవకాయ పెచ్చు కొరుక్కుని కడుపునిండా తిన్న ఆ అన్నం ముందు నేడు తింటున్న ఖరీదైన ప్రోటీన్లు, ఫైబర్లు, ఆర్గానిక్ ఫుడ్స్, హైబ్రీడ్ కూరలు, కట్టె గానుగ నూనెల తిండి తో అన్న హితవే లేకుండా పోయింది.


ఇంట్లో ఒక సైకిల్ ఉంటే మహా గొప్పగా తలచే రోజులనుంచి ఇంటికి ఒక కారు రెండు స్కూటర్ల స్థాయికి చేరుకున్నా, నాన్నగారు తొక్కుతున్న సైకిల్ వెనక కారియర్ మీద నేనంటే నేను అని అన్నాదమ్ములతో పోట్లాటల మద్య సైకిల్ మీద తిరిగిన రోజులే బాగున్నట్లున్నాయి. రిక్షా ఎక్కినా పుష్పక విమానం ఎక్కిన గొప్ప ఫీలు ఉండేది అప్పట్లో.


సంక్రాంతి పండగకి కుట్టించిన మూడు జతల బట్టలతోటే ఆనందంగా గడిపిన రోజులనుంచి బీరువాల్లో అన్ని బట్టలు మూలుగుతున్నా ఫంక్షన్స్ కి వెళ్లే ఓపిక లేక, ఓపిక చేసుకున్నా ఎడతెగని బట్టల ఎంపిక తో విసుగు తెప్పిస్తున్న రోజులివి.

సాదా బట్టలతో వెళితే చుట్టాలు చెవులు 

కొరుక్కునే, హంగు ఆర్భాటాల డాబుసరి ప్రదర్శనల రోజులివి.


జనరల్ బోగీలో చెక్క బల్లల మీద కిటికీ పక్కన నేనంటే నేను అని తోడ బుట్టిన వారితో కొట్లాడి కిటికి పక్కకు చేరి పరుగెడుతున్న చెట్లని చూస్తూ, కంట్లో బొగ్గు నలకలు పడుతున్నా అమ్మకానికి వచ్చిన పల్లీలు, బఠానీలు ఏడ్చి రాగాలు తీస్తూ కొనిపించుకుని తిన్న ఆనందం, పక్కవారితో మాట్లాడకుండా ఫోనులో ములిగిపోయిన సాటి ప్రయాణీకుల మద్య, అద్దాలు బిగించిన ఏసీ బోగీల్లో బిగుసుకుని కూచుని చేస్తున్న నేటి ప్రయాణాల్లో కనపడడం లేదు. 


అప్పుడే దిగాల్సిన స్టేషన్ రాకూడదు అనుకున్న రోజుల నుంచి ఇంకెంతసేపురా బాబూ అనిపించే మౌన ప్రయాణపు రోజులివి.


ప్రయాణంలో దాహం వేస్తే స్టేషన్ రాగానే ఉరుక్కుంటూ వెళ్లి ప్లాట్ఫారం మీదున్న పంపు కింద చేయి పెట్టి ఏమాత్రం సందేహించకుండా నీళ్లు తాగి, మరచెంబుల నిండా నీళ్లు 

పట్టుకుని రైలు ఎక్కిన రోజుల నుంచి, best మినరల్ వాటర్ బాటిల్ అని మల్టీ నేషనల్ కంపెనీవాడు చెప్పినా కూడా సందేహిస్తూనే బోలెడు డబ్బులు పోసి కొనుక్కున్న నీళ్లు తాగుతున్న రోజుల్లో ఉన్నాం.


జలుబో, జ్వరమో, దగ్గో వస్తే RMP డాక్టర్ గారిచ్చిన రంగు నీళ్లు తాగి, బిళ్ళలు మింగగానే ఇట్టే తగ్గిపోయిన రోగాలు ఇప్పుడు సీబీపీ లాంటి రక్త పరీక్షలు, MRI, CT స్కాన్ లు చేయించుకుని ఖరీదైన మందులు మింగుతున్నా ఒక పట్టాన తగ్గడం లేదేమిటో!


పెళ్ళికి అయిదురోజుల ముందు వెళ్లి పచ్చటి కొబ్బరాకుల పందిరి ఆటల చుట్టూ అందరి బంధువుల పిల్లలతో కలిసి ఆడిన ఆటలు, బంక్తి భోజనాలు చేసి, ఏదో మూల పరిచిన చాప/దుప్పట్ల మీద వళ్ళు తెలియకుండా పడుకున్న రోజులు నుంచి , నేటి పెళ్లిళ్ళల్లో ముహూర్తం టైం కి వెళ్ళామా, మండపం ఎక్కి అక్షింతలు వేశామా, గిఫ్ట్ కవర్ ఇచ్చామా, ఫొటోలో పడ్డామా,

ప్లేట్ పట్టుకుని గుంపులో గోవిందాలాగా ఏదో కతికామా, రిటర్న్ గిఫ్ట్ అందుకున్నామా, అనే రోజులకి వచ్చాం. పెళ్లి మండంపం లో కన్నా రానూ పోను ప్రయాణ ట్రాఫిక్లో గడుపుతున్న టైమే ఎక్కువ ఉంటున్న రోజులివి.


పోతే, ఇలా ఇప్పుడు అప్పుడు అంటూ పోలికలు చేసుకోడం, ఆ రోజులే బాగున్నాయి, అవి మళ్ళీ వస్తే బాగుండును అని అనుకోడానికి తప్ప ఈ రాతల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నిజంగానే టైమ్ మెషిన్

ఎక్కి వెనక్కి వెళ్లినా, ఇప్పుడు మనకున్న రోగాలతో, సుఖాలు మరిగిన కాయాలతో, ఒక్కరోజు దాటి ఉండలేము. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో, నేటి ఉరుకుల పరుగుల జీవనంలో అప్పట్లా ఉండడం అస్సలు కుదరదు అనుకోండి. ఏదో కాస్త ఇలా పోల్చుకుంటూ ఆ రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆ ఘనమైన గతాన్ని తలుచుకుంటూ, తృప్తి పడడమే మిగిలింది మనకి.


 ఇప్పుడు మానవ సంబంధాలు తగ్గిపోయి యాంత్రికంగా అయిపోతున్నాం, చుట్టూ గిరి గీసుకుని ఉండిపోతున్నాం. ఇదివరకటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, తోడబుట్టిన వారిలో కూడా నెమ్మదిగా కనుమరుగు అవుతున్న రోజులివి.

మన జనరేషన్ మాత్రమే అనుభవించిన అనుభవిస్తున్న - కాలంతో పరుగు తీయలేక నిస్సహాయంగా వెళ్లబుచ్చుతున్న నగ్న సత్యాలు.

ఏమంటారు కాదంటారా??

కామెంట్‌లు లేవు: