21, ఆగస్టు 2026, శుక్రవారం

చంపేంత కసి...

 గురువును చంపేంత కసి...

పదో తరగతి వయసులోనే ఎందుకు.?


రూపా రెడ్డి హత్య నన్ను వెంటాడుతున్న ప్రశ్నలు...

మన పిల్లలను మనం ఏ దిశలో తీసుకెళ్తున్నాం.?


– వెంకటేశ్వరరావు ఉమ్మిడిశెట్టి

నేషనల్ మీడియా జర్నలిస్ట్


కొన్ని వార్తలు రాసి పక్కన పెట్టేయొచ్చు...


కొన్ని వార్తలు చదివి మరచిపోవచ్చు...


కానీ కొన్ని ఘటనలు మాత్రం మనసులో ప్రశ్నగా మిగిలిపోతాయి.


నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు కూడా అలాంటి ఘటనగానే నాకు అనిపించింది.


పోలీసులు వెల్లడించిన వివరాలు విన్న తర్వాత ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా కలచివేసింది...


“పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో కత్తులు ఎందుకొచ్చాయి?”


ఇంకా బాధ కలిగించే విషయం...


గురువుగా విద్యాబుద్ధులు చెప్పిన వ్యక్తిపైనే ఆమె వద్ద చదువుకున్న పదో తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం.


ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీగా చదివి ముందుకు వెళ్లిపోవాల్సిన ఘటన కాదు.


ఇది మన కుటుంబ వ్యవస్థను ప్రశ్నిస్తోంది.


ఇది మన విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తోంది.


ఇది మన పిల్లల పెంపకాన్ని ప్రశ్నిస్తోంది.


ఇది మన సమాజాన్ని ప్రశ్నిస్తోంది.


పదో తరగతి వయసులో హత్య ఆలోచన ఎలా వచ్చింది?


పదో తరగతి...


ఒక విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన దశ.


ఈ వయసులో పిల్లలు భవిష్యత్తు గురించి కలలు కనాలి.


డాక్టర్ కావాలని...


ఇంజనీర్ కావాలని...


పోలీస్ కావాలని...


సైన్యంలో చేరాలని...


తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని...


కలలు కనే వయసు ఇది.


అలాంటి వయసులో...


డబ్బు కావాలి... అందుకోసం ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన ఎలా వచ్చింది?


ఇది ఒక్కరోజులో పుట్టిన ఆలోచనా?


లేక చాలా కాలంగా పెరుగుతున్న ఏదో ఒక మానసిక పరిస్థితికి ఇది చివరి రూపమా?


డబ్బుపై ఆకర్షణ...


జల్సాలపై ఆసక్తి...


మద్యం వంటి అలవాట్లు...


బైకులపై మోజు...


కోపం...


తప్పు స్నేహాలు...


ఇవన్నీ ఒక బాలుడి ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేయగలవు?


మన పిల్లల మార్కులు మనకు తెలుసు... వారి మనసులు తెలుసా?


పిల్లల మార్కులు తగ్గితే మనం వెంటనే గమనిస్తాం.


ర్యాంకు తగ్గితే ఆందోళన చెందుతాం.


చదువులో వెనుకబడితే పాఠశాలకు వెళ్లి మాట్లాడతాం.


కానీ...వారి ప్రవర్తనలో మార్పు వస్తే గమనిస్తున్నామా?


వాళ్లు ఎవరితో స్నేహం చేస్తున్నారు?


ఎక్కడికి వెళ్తున్నారు?


ఎవరితో తిరుగుతున్నారు?


ఎందుకు తరచూ డబ్బు అడుగుతున్నారు?


వారి ఫోన్‌లో ఏం చూస్తున్నారు?


వారి మాటల్లో, ఆలోచనల్లో కోపం పెరుగుతోందా?


మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారా?


ఈ ప్రశ్నలను మనం ఎంతవరకు అడుగుతున్నాం?


మార్కులు తగ్గితే గమనిస్తున్నాం...


మరి విలువలు తగ్గితే?


పిల్లలకు ఖరీదైన విద్య ఇస్తున్నాం... కానీ జీవితం నేర్పుతున్నామా?


పిల్లలకు మంచి పాఠశాల కావాలి.


మంచి కాలేజీ కావాలి.


మంచి ఉద్యోగం కావాలి.


మంచి భవిష్యత్తు కావాలి.


ఇవన్నీ కోరుకోవడంలో తప్పు లేదు.


కానీ...వారికి మంచి మనిషిగా ఎలా జీవించాలో కూడా నేర్పుతున్నామా?


డబ్బు సంపాదించడం ఎలా అనేది నేర్పుతున్నాం.


డబ్బు కోసం ఏం చేయకూడదో కూడా నేర్పుతున్నామా?


గెలవడం ఎలా అనేది చెబుతున్నాం.


ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలో చెబుతున్నామా?


కోపం రావడం సహజమే.


ఆ కోపాన్ని ఎలా నియంత్రించాలో నేర్పుతున్నామా?


స్వేచ్ఛ ఇస్తున్నాం.


బాధ్యతను కూడా నేర్పుతున్నామా?


ఒకప్పుడు కుటుంబం ఒక పాఠశాల... ఇప్పుడు?


ఒకప్పుడు పిల్లల పెంపకంలో కుటుంబం పెద్ద పాత్ర పోషించేది.


తాతయ్యలు, అమ్మమ్మలు కథలు చెప్పేవారు.


మంచి–చెడు గురించి మాట్లాడేవారు.


మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు పిల్లలకు పరిచయం చేసేవారు.


పెద్దలను గౌరవించడం...


చిన్నలను ప్రేమించడం...


ఇతరుల బాధను అర్థం చేసుకోవడం...


తప్పు చేస్తే ఒప్పుకోవడం...


ఇవి జీవితంలో భాగమని చెప్పేవారు.


ఇప్పుడు పిల్లలకు సమయం ఇస్తున్నామా?


లేక...వారికి వస్తువులు ఇస్తూ, సమయాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నామా?


ఖరీదైన ఫోన్ కొనివ్వగలుగుతున్నాం.


ఖరీదైన విద్య అందించగలుగుతున్నాం.


అవసరమైన ప్రతిదీ కొనివ్వగలుగుతున్నాం.


కానీ...వారి పక్కన కూర్చొని 

“నీ మనసులో ఏముంది?” అని అడగడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం?


పాఠశాల బాధ్యత కూడా అంతే ముఖ్యం


పాఠశాల అంటే కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు కాదు.


అది వ్యక్తిత్వాన్ని నిర్మించే స్థలం.


ఒక విద్యార్థి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తే...


కొత్త స్నేహాలు ఏర్పడితే...


అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే...


మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావం కనిపిస్తే...


కోపం, అసహనం పెరిగితే...


పాఠశాల కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.


అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలి.


ఎందుకంటే...


ఒక విద్యార్థిని పరీక్షలో ఫెయిల్ కాకుండా కాపాడటం ఎంత ముఖ్యమో... అతను జీవితంలో తప్పు దారిలోకి వెళ్లకుండా కాపాడటం అంతకంటే ముఖ్యం.


ఇంతకీ రూపా రెడ్డి కేసులో ఏం జరిగింది?


ఇప్పుడు అసలు కేసు వివరాల్లోకి వస్తే...


నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారించామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


ఈ కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు ఎస్పీ వెల్లడించారు.


రూపా రెడ్డి హత్యకు గురైన తర్వాత ఆమె చివరిసారిగా తన పిన్నితో మాట్లాడిన సమయంలో “బాబు” అని సంబోధించినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్‌లో కూడా ఆమె విద్యార్థులను అదే విధంగా పిలుస్తుండటంతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.


హత్య అనంతరం స్కూల్‌కు నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు. స్కూల్ తిరిగి ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులను పోలీసులు విచారించారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.


ఆ ఐదుగురిలో ఇద్దరు విద్యార్థులు ఇటీవల డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు.


రూ.1.54 లక్షల నగదు.. అక్కడే అనుమానం


విచారణలో నిందితుల్లో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు పోలీసులు గుర్తించారు.


అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చారని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.


అయితే ఆ నగదు నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.


పరీక్షల్లో ఆ రక్తం రూపా రెడ్డికి చెందినదేనని నిర్ధారణ అయినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


దీంతో దర్యాప్తులో కీలక ఆధారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు.


హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చడంతో కోపం?


నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్‌లో ఉండేవాడు.


అతనికి మద్యం అలవాటు, బైకులపై మోజు ఉండేదని పోలీసులు గుర్తించారు.


అతని బ్యాగులో నగదు, ఫోన్‌ను గుర్తించిన రూపా రెడ్డి అతడిని మందలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చినట్లు వెల్లడించారు.


ఆ ఘటన తర్వాత రూపా రెడ్డిపై ఆ విద్యార్థికి కోపం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.


నెల రోజుల క్రితమే గోవాకు వెళ్లిన నిందితుడు


పోలీసుల ప్రకారం నిందితుల్లో ఒకరు నెల రోజుల క్రితం గోవాకు వెళ్లాడు.


ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రూపా రెడ్డి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.


హత్యకు ఐదు రోజుల ముందే ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు.


రూపా రెడ్డి ఇంట్లో స్కూల్ ఫీజులకు సంబంధించిన డబ్బు ఉంటుందని నిందితులకు తెలుసని పోలీసులు తెలిపారు.


మాస్కులు వేసుకుని ఇంట్లోకి.. గుర్తుపట్టడంతో దాడి


ఈ నెల 11న స్కూల్ ముగించుకుని రూపా రెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి ఆమె ఇంటి వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో వారిలో ఒకరి మాస్క్ కిందపడిపోయిందని, దీంతో అతడిని రూపా రెడ్డి గుర్తించినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.


ఆమె తమను గుర్తించిందనే భయంతో ఆమెపై కత్తితో 27 సార్లు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


అనంతరం కిందపడిపోయిన ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకుని, నగదుతో కలిసి అక్కడి నుంచి పరారైనట్లు ఎస్పీ తెలిపారు.


నిందితుల నుంచి స్వాధీనం


నిందితుల నుంచి:


- రూ.1.54 లక్షల నగదు

- ఒక ఐఫోన్

- రూపా రెడ్డికి చెందిన ఫోన్


స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువెనైల్ జస్టిస్ కోర్టు ముందు హాజరుపరుస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


మళ్లీ అదే ప్రశ్న...


కేసు దర్యాప్తు వివరాలు ఇప్పుడు మనకు తెలిసాయి.


పోలీసులు తమ పని చేశారు.


నిజానిజాలు న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది.


చట్టం తన పని చేస్తుంది.


కానీ సమాజం తన పని ఎప్పుడు చేస్తుంది?


పదో తరగతి వయసులోనే ఒక బాలుడి ఆలోచనలు ఇంతటి నేరం వైపు ఎందుకు వెళ్లాయి?


ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఆ ఇద్దరు బాలుర వద్ద వెతికితే సరిపోదు.


కుటుంబంలో వెతకాలి.


పాఠశాలలో వెతకాలి.


స్నేహ వాతావరణంలో వెతకాలి.


మన సమాజంలో వెతకాలి.


పిల్లలు నేరం చేసిన తర్వాత వారిని నిందించడం చాలా సులువు.


కానీ...వాళ్లు నేరం చేసే స్థితికి చేరుకునే ముందే వారి చేతిని పట్టుకోవడమే అసలైన బాధ్యత.


రూపా రెడ్డి మరణం ఒక కుటుంబానికి తీరని విషాదం.


ఇద్దరు బాలలపై హత్య ఆరోపణలు వారి కుటుంబాలకు మరో విషాదం.


కానీ ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్ న్యూస్‌గా చూసి మర్చిపోతే...


మనం అసలు పాఠాన్ని కోల్పోయినట్టే.


మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాదు... ఆ భవిష్యత్తును మంచి మనుషులుగా నిర్మించాల్సిన బాధ్యత కూడా మనదే.


–వెంకటేశ్వరరావు ఉమ్మిడిశెట్టి

నేషనల్ మీడియా జర్నలిస్ట్

కామెంట్‌లు లేవు: