30, జూన్ 2026, మంగళవారం

తేనె మనిషికి




       తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు. 


        ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా , ఔషధాలకి అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది . చలువ చేస్తుంది . ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది . నేత్రములకు మంచిది . చర్మానికి కాంతిని కలిగించును . శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును . ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు. 


                  స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు , ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . 


                సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును . 


                   పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము , పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . 


              Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును . 


                    సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. 


              ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం . ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును . ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. 


             ఈవిధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు . 


             సంపూర్ణం     


  

        

 Mm

దివ్యమైన సున్నిపిండి -

 శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి -


కావలసిన పదార్దాలు -

• పచ్చ పెసలు - 1 కిలొ .

• బావంచాలు - 100 గ్రాములు .

• వట్టి వేళ్లు - 100 గ్రాములు .

• కచ్చురాలు - 100 గ్రాములు .

• మంజిష్ట - 100 గ్రాములు .

• మంచి పసుపు - 100 గ్రాములు .

• కస్తూరి పసుపు - 100 గ్రాములు .

• ఉలవలు - 100 గ్రాములు .

• బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .

• కరక్కాయ బెరడు - 100 గ్రాములు .

• ఉసిరికాయ బెరడు - 100 గ్రాములు .

• తానికాయ బెరడు - 100 గ్రాములు .

• ఎండు ఖర్జూరాలు - 100 గ్రాములు .

• కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు

* సుగంధపాల వ్రేళ్లు - 100 గ్రాములు .* తుంగ గడ్డలు - 100 గ్రాములు .* దానిమ్మ పండ్ల బెరడు - 100 గ్రాములు .* ఎండు గులాబీ రేకులు - 100 గ్రాములు . * మరువము - 100 గ్రాములు . * ధవనము - 100 గ్రాములు . * జాపత్రి - 100 గ్రాములు . * యాలుకలు - 100 గ్రాములు . * కురువేరు - 100 గ్రాములు . * తులసి ఆకులు - 100 గ్రాములు .

తయారీ విధానం -

పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో

పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి.


వాడేవిధానం -

 

స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .


ఉపయోగాలు -


• ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును .

• శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి .

• చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును .

• మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .

• చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .

• శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును.

• శరీరానికి మంచి తేజస్సు కలుగును.

• సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .



యోగవాసిష్ఠ రత్నాకరము*

  0026 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము


ఒకటవ అధ్యాయము 


రాఘవ వైరాగ్య వర్ణనము


పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,


శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన అవధూత సూర్య నారాయణ స్వామి మఠం 


1-68


దహనైకార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః సంసారాబ్దా విహోహ్యాన్తే కించిత్తేషు నరం విదుః. 


కేవలము దహనము కొఱకు యోగ్యము లైనట్టి శరీరములను కట్టెలనేకము లీ సంసారమను సముద్రమున కొట్టుకొని పోవుచున్నవి. అందొకానొక కట్టె మనుజుడని చెప్పబడుచున్నది.


1-69


బద్దాస్థా యే శరీరేషు బద్దాస్థా యే జగత్థ్సితౌ 

తన్మోహమదిరోన్మత్తాన్‌ ధిగ్‌ధిగస్తు పునః పునః. 


ఎవరు శరీరములందును, 

జగత్స్థితి

యందును అవి సత్యములని, చిరకాల ముండునవి యని విశ్వాసము గలిగియుందురో, అజ్ఞానమను కల్లుత్రాగి ఉన్మత్తులైయున్నట్టి జనులకు మరల మరల ధిక్కారమగు గాక! 


1-70


నాహం దేహస్య నో దేహో మమనాఽయమహం తథా 

ఇతి విశ్రాన్తచిత్తా యే తే మునే పురుషోత్తమాః. 


ఓ మునీంద్రా! 'జడమగు ఈ దేహము నేను కాను, నేను దానికి సంబంధించినవాడను కాను, నాకు దేహము లేదు' అని విచారించి ఆత్మయందు విశ్రాంతి నొందువారే మనుజులలో నుత్తములు.

శ్రీమద్భగవద్గీత

 *🌹🧘587 శ్రీమద్భగవద్గీత   - అథ షోడశోధ్యాయః - దైవాసురసంపద్విభాగయోగః 🧘‍♀️🌹*

ఓం శ్రీ పరమాత్మనే నమః  


ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని !

మామప్రాప్తైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ !! 20


ఆసురీం - యోనిం - ఆపన్నాః - మూఢాః - జన్మని - జన్మని

మాం - అప్రాప్య - ఏవ - కౌంతేయ - తతః - యాంతి - అధమాం - గతిం


కౌంతేయ - అర్జునా, ఆసురీం - రాక్షససంబంధమైన, యోనిం - జన్మమును, ఆపన్నాః - పొందిన, మూఢాః - మూర్ఖమానవులు, జన్మజన్మని - ప్రతి జన్మమందును, మాం - నన్ను, అప్రాప్య ఏవ - పొందకనే, తతః - అంతకంటెను, అధమాం - అధమమైన, గతిం - గతిని, యాంతి - పొందుచున్నారు.


ఓ అర్జునా ! ఈ రాక్షసప్రకృతిగల మూడులు, నన్ను పొందకయే, ప్రతిజన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైనగతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు.


సశేషం 


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన అవధూత సూర్య నారాయణ స్వామి మఠం 

ఆధ్యాత్మిక అమృతవాహిని (భక్తి) గ్రూప్ లో చేరడానికి క్రింది నెంబర్ కి *ఓం* అని పెట్టండి.


Message ఓం నమో భగవతే వాసుదేవాయ నమః on WhatsApp. https://wa.me/917382593697