23, మార్చి 2026, సోమవారం

రామాయణం - 10)

  శ్రీరామ  (17 )


               ( వాల్మీకి రామాయణం  - 10)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏




ఆ తరువాత విశ్వామిత్రుని ఆశ్రమానికి ప్రయాణం చేస్తున్న ఆ ముగ్గురిని త్రోవలో "తాటకి" అనే వేయి ఏనుగుల బలంగల రాక్షసి ఎదుర్కొంది.

తాటకిని సంహరించమని రామునికి చెప్పాడు విశ్వామిత్రుడు.

"తాటకి" స్త్రీగదా! సంహరించవచ్చునా!  అని సందేహిస్తున్నాడు రాముడు.

"ఈ తాటకి యజ్ఞములను నశింపజేసే దుష్టాత్మురాలు. దేవ బ్రాహ్మణ హితం కోసం, సందేహించకుండా ఈ రాక్షసిని వధించు" 

అన్నాడు విశ్వామిత్రుడు.

పితృవాక్యపాలకుడైన రాముడు తన స్వంత  ఆలోచనలకు తావివ్వకుండా విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.


శ్లో// పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్/

వచనం కౌశికస్యేతి కర్తవ్య మవిశంకయా//


(మా నాన్నగారు మీరు ఏమి చెబితే అది చేయమని మాకు ఆజ్ఞ ఇచ్చారు.

ఆయన ఆజ్ఞ పాటించడమే మా ధర్మం.

అందువలన మీరు చెప్పినట్లు నిస్సందేహంగా తాటకిని సంహరిస్తాను) 


విశ్వామిత్రుని ఆదేశానుసారం రాముడు ఆ రాక్షసిని సంహరించాడు.

తాటకి సంహారానికి దేవతలు, దేవేంద్రుడు,విశ్వామిత్రుడు,సంతోషించారు.

దేవేంద్రుని సూచనను అనుసరించి,

విశ్వామిత్రుడు, తన వద్ద ఉన్న దివ్యాస్త్రాల నన్నింటినీ రామునకు ఉపదేశించాడు.


" ఓ రామా ! స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చో. నా అస్త్రసంపదనంతా నీకు ఇస్తున్నాను, స్వీకరించు "

అని,

ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్రాలను,

ఇంద్రుని వజ్రాయుధాన్ని, శివుని త్రిశూలాన్ని,

బ్రహ్మాస్త్రాన్ని, ఐషీకాస్త్రాన్ని,

మోదకి,శిఖిరి, అనే గదలను,

గాంధర్వాస్త్ర, మానవాస్త్రాలను,

ఇంకా వేలకొలది తన అధీనంలో ఉన్న అస్త్రాలనన్నింటినీ సాంగోపాంగంగా, ప్రయోగ, ఉపసంహారాలతో సహా రామునికి ధారపోసాడు.

ఆ అస్త్రదేవతలంతా రాముడికి నమస్కరించి,

" ఓ రామా ! మేమందరము నీ కింకరులము " అన్నారు.

రాముడు వారినందరిని ఆదరంగా స్ప్రశించి, "మీరందరూ ఎల్లప్పుడూ నా మనస్సులో సంచరించుచుందురు గాక" అని ఆజ్ఞాపించాడు.


ఆ తరువాత అనేక గాధలు,ఆ యా ప్రాంత విశేషాలు చెబుతూ విశ్వామిత్ర మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి,రామ లక్ష్మణులతో కలిసి,

 ' సిద్ధాశ్రమము ' అని పిలువబడే తన ఆశ్రమంలో ప్రవేశించాడు.


ఈ ఆశ్రమము ఎవరిదని శ్రీరాముడు ప్రశ్నించగా ,

విశ్వామిత్ర మునీంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు.

" పూర్వము కశ్యప మహర్షి ఈ ఆశ్రమంలో తపస్సు చేసి శ్రీమహావిష్ణువు తనకు పుత్రుడుగా  జన్మించే వరం పొందాడు.

ఆ మహర్షి అభీష్టానుసారం విష్ణువు  " వామనుడు " గా  అదితి గర్భంలో  జన్మించి, బలిచక్రవర్తిని నిర్జించి త్రిలోక సామ్రాజ్యాన్ని ఇంద్రుని వశం చేశాడు.

అప్పటినుండి ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం అనే పేరుతో పిలువబడుతోంది.

ఈ ఆశ్రమంలోనే నేను తపస్సు చేసుకుంటూ, ప్రస్తుతం ఈ యాగాన్ని. తలపెట్టాను"

అని చెప్పి, తన యాగరక్షణకేతించిన రామలక్ష్మణులను అక్కడ ఉన్న మునులకు పరిచయం చేసాడు.


అప్పుడు ఆ ఆశ్రమవాసులైన మునులందరూ, విశ్వామిత్రుని,రామలక్ష్మణులను పూజించారు.


మౌనవ్రతధారియై విశ్వామిత్రమహర్షి నియమ,నిష్ఠలతో కూడిన యజ్ఞదీక్షలో వెంటనే ప్రవేశించాడు.


తాము చేయవలసిన పని సవివరంగా చెప్పమని రామ లక్ష్మణులు అడుగగా, ఆ మునీశ్వరులు అందరూ ఇలా అన్నారు:

"రామ లక్ష్మణులారా! నేడు మొదలు, ఆరు ఆహోరాత్రములు  మీరు యాగ రక్షణ చేయవలెను.

విశ్వామిత్రమహర్షి దీక్షలో వున్నారు కాబట్టి మౌనం పాటిస్తారు".


శ్లో//తౌ తు తద్వచనం శ్రుత్వా రాజ పుత్రౌ యశస్వినౌ/

అనిద్రౌ షడహోరాత్రం  తపోవన మరక్షతాం//

(కీర్తిమంతులైన ఆ రామ లక్ష్మణులు,వారు చెప్పిన విధంగా, ఆరు, రేయింబవళ్లు, నిద్రపోకుండా ఆ తపోవనాన్ని రక్షించారు).


ఆరవ దినమున మారీచుడు, సుబాహువు, అనే ఇద్దరు రాక్షసులు, వేలకొలది  రాక్షసానుచరులతో కూడి ఆకాశమార్గాన వచ్చి, యజ్ఞాశాలలో రక్తవర్షాన్ని కురిపించారు.


వెంటనే రాముడు మానవాస్త్రాన్ని ప్రయోగించాడు.


శ్లో// స తేన పరమాస్త్రేణ మానవేన సమాహత:/

సంపూర్ణం యోజన శతం క్షిప్త: సాగర సంప్లవే//


( గొప్పదైన ఆ మానవాస్త్రం చేత కొట్టబడిన, మారీచుడు, నూరు యోజనముల దూరంలో సముద్రజలములలో పడ్డాడు).


పిమ్మట రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి, సుబాహువును సంహరించాడు.


తరువాత వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి,మిగిలిన రాక్షసులనందరిని సంహరించాడు.


శ్లో//స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన:/

ఋషిభి: పూజిత స్తత్ర యథేన్ద్రో విజయే పురా//

(యజ్ఞములను నశింపజేసే ఆ రాక్షసుల నందరిని, ఆ విధంగా సంహరించిన రాముని, ఋషులందరు, విజయం సాధించిన ఇంద్రుని, పూర్వము దేవతలు పూజించినట్లు, పూజించారు).


ఎంతో సంతోషం పొందిన విశ్వామిత్ర మహర్షి, రామునితో ఇలా అన్నాడు:


శ్లో//కృతార్థో౽స్మి మహాబాహో కృతం గురు వచ స్త్వయా/

సిద్ధాశ్రమ మిదం సత్యం కృతం రామ మహా యశ://

(ఓ మహాబాహూ!నేను తలపెట్టిన పని పూర్తి అయినది. నీవు నీ తండ్రి వచనమును చక్కగా పాటించినావు.

గొప్ప యశశ్శాలివైన ఓ రామా!నీవు ఈ సిద్ధాశ్రమము యొక్క పేరు నిలబెట్టావు).


                   శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

23-3-'26

అజాగ్రత్తగా ఉన్నవారివల్ల

  శ్రీరామ (120)


                          శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏




శ్లో // షడిమే షట్సు జీవంతి సప్తమో నోపలభ్యతే /

చౌరాః ప్రమత్తే జీవంతి వ్యాధితేషు చికిత్సకాః /

ప్రమదాః కామయానేషు యజమానేషు యాజకాః /

రాజా వివదమానేషు నిత్యం మూర్ఖేషు పణ్డితాః //

(మహాభారతం - విదురనీతి)


(నిత్యమూ,

దొంగలు అజాగ్రత్తగా ఉన్నవారివల్ల జీవిస్తారు.

వైద్యులు వ్యాధిగ్రస్తులవల్ల జీవిస్తారు.

వెలయాండ్రు కాముకులవల్ల జీవిస్తారు.

పురోహితులు పూజలు, యాగాలు,మొదలైనవి చేసేవారివల్ల జీవిస్తారు.

వివాదలతో చీలిపోయిన ప్రజలవల్ల నాయకులు జీవిస్తారు.

తెలివితక్కువ వారివల్ల తెలివిగలవారు జీవిస్తారు)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

23-3-'26.

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 59*


*పరిణతిమతీం చతుర్ధా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీమ్।*

*పంచాశదర్ణకల్పితమదశిల్పాం త్వాం నమామి కామాక్షి॥*


*భావము :*


*జ్ఞానులైన వారి సుషుమ్నా నాడిలో నాలుగు స్థానములుగాను, షట్చక్రములలోని ఏబది వర్ణములుగా ప్రకలితమై, వారిచే అనేక పదములుగా బహిర్గత మవుతున్న కామాక్షీ దేవికి నా నమస్కృతులు.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత ।

కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ।। 25 ।।



ప్రతిపదార్థ:



సక్తాః — ఆసక్తి/మమకారంతో; కర్మణి — కర్తవ్య కర్మలు; అవిద్వాంసః — అజ్ఞానులు; యథా — ఎట్లయితే; కుర్వంతి — చేస్తారు; భారత — భరత వంశీయుడా (అర్జునా); కుర్యాత్ — చేయవలెను; విద్వాన్ — విద్వాంసులు (జ్ఞానులు); తథా — అదే విధముగా; అసక్తః — ఆసక్తిరహితుడవై; చికీర్షుః — ఆశించి; లోక-సంగ్రహమ్ — లోక హితము కోసము.

  

 తాత్పర్యము : 


అజ్ఞానులు కర్మ ఫలముల యందు ఆసక్తి/మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా, ఓ భరత వంశీయుడా, జ్ఞానులు కూడా (లోకహితం కోసం), జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి.


  

 వివరణ:


ఇంతకు పూర్వం, 3.20వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, 'లోక-సంగ్రహం ఏవాపి సంపశ్యన్' అంటే 'జనుల సంక్షేమం దృష్ట్యా' అనే పద ప్రయోగం చేసాడు. ఈ శ్లోకం లో, లోక-సంగ్రహం చికీర్షు, అంటే 'ప్రపంచ సంక్షేమం కోరి' అని. ఈ విధంగా, జ్ఞానులు మానవ జాతి ప్రయోజనం కోసం ఎప్పుడూ కర్మలు చేయాలని శ్రీ కృష్ణుడు మరొకసారి ఉద్ఘాటించాడు.


ఇంకా, ఈ శ్లోకంలో 'సక్తాః అవిద్వాంసః' అన్న పదాలు, శారీరక దృక్పథంలోనే ఉండి, ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలిగున్నా, శాస్త్రవిహిత వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉన్న జనుల కోసం వాడబడింది. వారు అజ్ఞానులు/అవివేకులు అనబడుతారు ఎందుకంటే, వారికి పుస్తక జ్ఞానం ఉన్నా, వారు భగవత్ ప్రాప్తియే అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోరు. అలాంటి అమాయకులు, బద్ధకము, శంక లేకుండా, తమ కర్తవ్యమును జాగ్రత్తగా శాస్త్రోక్తము గా నిర్వర్తిస్తారు. వైదిక ధర్మాలను, కర్మ కాండలను చేయటం వలన వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం వస్తుందని వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఉన్నతమైన భక్తి యందు శ్రద్ధ కలగకుండానే, అలాంటి వ్యక్తులకు విహిత కర్మల పట్ల ఉన్న నమ్మకాన్ని పోగోడితే, వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పబడింది :


తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా ।

మత్కథాశ్రవణాదౌ వా శ్రద్ధా యావన్న జాయతే


(11.20.9)


‘ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలుగనంత వరకు, భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకు, కర్మలను ఆచరిస్తూనే ఉండవలెను.’


ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో, అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో, భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా, సమాజానికి ఆదర్శం చూపటానికి చేయాలి. అంతేకాక, ప్రస్తుతం అర్జునుడున్న పరిస్థితి ఒక ధర్మ యుద్ధం. కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ వీరునిగా తన కర్తవ్యం నిర్వహించాలి.

తెలుగు సంవత్సరాల

 *తెలుగు సంవత్సరాల పేర్లు-వాటి అర్థాలు*🙏 ఈ సంవత్సరం 40వది

*(1) 1987 ఉగాది - ప్రభవ అంటే*... ప్రభవించునది... అంటే... పుట్టుక.

*(2) 1988 ఉగాది - విభవ* - వైభవంగా ఉండేది.

*(3)1989 ఉగాది - శుక్ల*... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

*(4) 1990 ఉగాది - ప్రమోదూత*... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.

*(5) 1991 ఉగాది - ప్రజోత్పత్తి*... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

*(6) 1992 ఉగాది - అంగీరస*... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

*(7) 1993 ఉగాది - శ్రీముఖ*... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

*(8) 1994 ఉగాది - భావ*.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

*(9) 1995 ఉగాది - యువ*.... యువ అనేది బలానికి ప్రతీక.

*(10) 1996 ఉగాది - ధాత*... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

*(11)1997 ఉగాది - ఈశ్వర*... పరమేశ్వరుడు.

*(12) 1998 ఉగాది - బహుధాన్య*... సుభిక్షంగా ఉండటం.

*(13) 1999 ఉగాది - ప్రమాది*... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

*(14) 2000 ఉగాది - విక్రమ*... విక్రమం కలిగిన వాడు.

*(15) 2001 ఉగాది - వృష* ... చర్మం.

*(16) 2002 ఉగాది - చిత్రభాను*... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

*(17) 2003 ఉగాది - స్వభాను*... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

*(18) 2004 ఉగాది - తారణ*... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

*(19) 2005 ఉగాది - పార్థివ*... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

*(20) 2006 ఉగాది - వ్యయ*... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

*(21) 2007 ఉగాది - సర్వజిత్తు*.... సర్వాన్ని జయించినది.

*(22) 2008 ఉగాది - సర్వధారి*..సర్వాన్ని ధరించేది.

*(23) 2009 ఉగాది - విరోధి*.... విరోధం కలిగినట్టువంటిది.

*(24)2010 ఉగాది - వికృతి*... వికృతమైనటువంటిది.

*(25) 2011 ఉగాది - ఖర*.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

*(26) 2012 ఉగాది - నందన* ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

*(27) 2013 ఉగాది - విజయ*... విశేషమైన జయం కలిగినది.

*(28)2014 ఉగాది - జయ*.... జయాన్ని కలిగించేది. 

*(29) 2015 ఉగాది - మన్మథ*... మనస్సును మధించేది.

*(30) 2016 ఉగాది - దుర్ముఖి*... చెడ్డ ముఖం కలది.

*(31)2017 ఉగాది - హేవిలంబి*... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

*(32) 2018 ఉగాది - విలంబి*... సాగదీయడం.

*(33) 2019 ఉగాది - వికారి*.... వికారం కలిగినది.

*(34)2020 ఉగాది ( carona year శార్వరి... రాత్రి*

*(35) 2021ఉగాది - ప్లవ*... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.

*(36) 2022 ఉగాది - శుభకృత్*... శుభాన్ని చేసి పెట్టేది.

*(37) 2023 ఉగాది - శోభకృత్*... శోభను కలిగించేది.

*(38). 2024 ఉగాది - క్రోధి*... క్రోధాన్ని కలిగినది.

*(39). 2025 ఉగాది -విశ్వావసు*... విశ్వానికి సంబంధించినది.

*(40) 2026 ఉగాది - పరాభవ*... అవమానం.

*(41)2027 ఉగాది - ప్లవంగ*... కోతి, కప్ప.

*(42) 2028 ఉగాది - కీలక*.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

*(43) 2029 ఉగాది - సౌమ్య*... మృదుత్వం.

*(44) 2030 ఉగాది - సాధారణ*... సామాన్యం.

*(45) 2031 ఉగాది - విరోధికృత్*... విరోధాలను కలిగించేది.

*(46) 2032 ఉగాది - పరీధావి*... భయకారకం.

*(47) 2033 ఉగాది - ప్రమాదీచ*... ప్రమాద కారకం.

*(48)2034 ఉగాది - ఆనంద*... ఆనందమయం.

*(49)2035 ఉగాది - రాక్షస*... రాక్షసత్వాన్ని కలిగినది.

*(50) 2036 ఉగాది - నల్ల*.... నల్ల అనే పదానికి రూపాంతరం.

*(51)2037 ఉగాది - పింగళ*... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

*(52) 2038 ఉగాది - కాలయుక్తి*... కాలానికి తగిన యుక్తి.

*(53)2039 ఉగాది - సిద్ధార్థి*... కోర్కెలు సిద్ధించినది.

*(54) 2040 ఉగాది - రౌద్రి*... రౌద్రంగా ఉండేది.

*(55) 2041 ఉగాది - దుర్మతి*... దుష్ట బుద్ధి.

*(56)2042 ఉగాది - దుందుభి* ... వరుణుడు.

*(57)2043 ఉగాది - రుధిరోధ్గారి*... రక్తాన్ని స్రవింప చేసేది.

*(58) 2044 ఉగాది - రక్తాక్షి*.. ఎర్రని కన్నులు కలది.

*(59) 2045 ఉగాది - క్రోదన*... కోప స్వభావం కలది.

*(60) 2046 ఉగాది - అక్షయ*... నశించనిది

🙏

రామాయణం

 శ్రీరామ  (16 )


               ( వాల్మీకి రామాయణం  - 9 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (22-3-'26  ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)


 శ్రీమహావిష్ణువు రామ ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నాలుగు రూపములు ధరించి దశరథ మహారాజుకు పుత్రులుగా అవతరించాడు.

జగత్తంతా ఆనందంలో మునిగిపోయింది.

అయోథ్యా ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు.

పదకొండు రోజులు గడిచినవి.


శ్లో// అతీత్యైకాదశాహం తు  నామకర్మ తథాకరోత్/

జ్యేష్ఠం 'రామం' మహాత్మానం, "భరతం" కైకయీ సుతమ్/

సౌమిత్రిం "లక్ష్మణ" మితి "శత్రుఘ్న" మపరం తథా/

వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా//


( పదకొండు దినముల తరువాత ఎంతో వేడుకతో దశరథ రాకుమారులకు నామకరణం జరిగింది.

పరమ ప్రీతితో రాజపురోహితుడైన వసిష్ఠుడు,

అందరిలోకి జ్యేష్ఠుడైన కౌసల్యా తనయునకు "రాముడు"

అని,

కైకేయి పుత్రునికి "భరతుడు" అని,

సుమిత్రా పుత్రులకు "లక్ష్మణుడు" "శత్రుఘ్నుడు" 

అని నామకరణం చేశాడు.

ఆ తరువాత వారందరికీ దశరథమహారాజు,యథా కాలంలో "అన్నప్రాసన" "చౌలము" విద్యాభ్యాసము, "ఉపనయనము"  మొదలైన సంస్కారములన్నీ యథావిధిగా జరిపించాడు.

బ్రహ్మచర్య దీక్షతో, వారందరూ అచిరకాలంలోనే సకల విద్యలు అభ్యసించారు.


శ్లో//సర్వే వేదవిదః శూరా స్సర్వే లోకహితే రతాః/

సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః//

(ఆ దశరథ పుత్రులందరూ  వేదవేత్తలయ్యారు.

అందరూ గొప్ప శూరులు,యుద్ధనిపుణులూ అయినారు.

అందరూ జ్ఞాన సంపన్నులైనారు.

అందరూ సద్గుణములతో కూడిన వారయ్యారు.

అందరూ ప్రజల క్షేమమందు ఆసక్తులుగా ఉన్నారు)


వారికి దాదాపు పదహారు సంవత్సరాల వయస్సు వచ్చింది.

తండ్రి అయిన దశరధమహారాజు, పుత్రుల వివాహం జరిపిస్తే బాగుంటుందనుకున్నాడు.

ఒక రోజు, మంత్రులతోను, పురోహితులతోను, బంధువులతోను, ఆ విషయం చర్చిస్తున్నాడు.

సరిగ్గా అదే సమయంలో బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు.

విశ్వామిత్రుని రాకకు ఆనందభరితుడైన దశరథుడు ఆ మహర్షిని అర్ఘ్య,  పాద్య,  ఆచమన,  ఆసనాదులు సమర్పించి పూజించాడు.

"మీ రాకతో నా జన్మ ధన్యమైనది.

రాజర్షి అయిన మీరు సాటిలేని తపస్సు చేసి

"బ్రహ్మర్షి " అయ్యారు.

మీరు అన్నివిధాలా నాకు పూజ్యులు.

"మీరు వచ్చిన కార్యం ఎటువంటిదైనా నేను  

నెరవేరుస్తాను " అని మాట ఇస్తున్నాను,

అన్నాడు దశరథుడు.

ఆ మాటలకు  విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషించాడు.

 తాను కొన్ని నియమములు పాటిస్తూ చేస్తున్న ఒక యజ్ఞానికి, మారీచ,సుబాహువులనే ఇద్దరు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారనీ,

యాగ నియమానుసారం తాను వారిపై కోపగించి శపించకూడదని,

అందువల్ల ఆ రాక్షసులను సంహరించడానికి. "రాముని"  తనతో పంపమని కోరాడు.

అంతకుముందు విశ్వామిత్రుడు ఏమి అడిగినా ఇస్తానన్న దశరథ మహారాజు,

పుత్ర ప్రేమతోనూ, బాల్యంలో ఉన్న రాముడు రాక్షసులతో యుద్ధం చేయలేడనే ఉద్దేశంతోనూ, విశ్వామిత్రునితో  రాముని పంపటానికి  అంగీకరించ లేదు.

అప్పుడు విశ్వామిత్ర మహర్షి ,

"నీవనుకుంటున్నట్లు రాముడు సామాన్య మానవుడు కాదు" అన్నాడు.

శ్లో//అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్/

వశిష్ఠశ్చ మహాతేజా యేచేమే తపసి స్థితాః// 

(మహాత్ముడు, సత్యపరాక్రముడు అయిన రాముని గురించి నాకు తెలుసు. మహాతేజశ్శాలి అయిన వశిష్ఠ మహాఋషికి తెలుసు.ఈ సభలోనున్న ఇతర మహాఋషులకు తెలుసు).


రాముని తత్త్వం తల్లిదండ్రులయిన కౌసల్య, దశరధులతో సహా సామాన్యులెవరికి  తెలియదు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకు భూమి మీద అవతరించిన  శ్రీ మహావిష్ణువే రాముడు అని, 

యజ్ఞ యాగాదులు చేయడం, సంరక్షించడం, ఆ ధర్మరక్షణలోని భాగం అన్న విషయం కేవలము మహాఋషులకు మాత్రమే తెలుసు.


దండకారణ్యములో రావణాసురుడు సీతాదేవిని,అపహరించినప్పుడు కూడా,


శ్లో//ప్రహృష్టా వ్యధితాశ్చాసన్ సర్వే తే పరమర్షయః/

దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్య వాసిన:/

రావణస్య వినాశం చ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా//

(దండకారణ్యములో ఉన్న మహర్షులు సీతాపహరణం చూచి బాధ పడ్డారు.అయితే అందువలన రావణుడి వినాశం సమీపించిందని సంతోషించారు)



ఈ విధంగా కేవలం ఋషులకు మాత్రమే  రాముడి అవతార రహస్యం తెలుసు.

అందువల్ల వసిష్ఠ మహర్షి,  ప్రతిజ్ఞా భంగం చేయరాదని దశరథుని హెచ్చరించి, విశ్వామిత్రుని ప్రభావం మహారాజుకు తెలియజేశాడు.

రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు.

ఆ విధంగా వసిష్ఠమహర్షి నచ్చచెప్పిన తరువాత రామ,లక్ష్మణులను, దశరథుడు విశ్వామిత్రునితో పంపాడు.


ఒకటిన్నర యోజనముల దూరం నడచి సరయూనది దక్షిణ తీరం చేరుకున్న పిమ్మట,  విశ్వామిత్ర మహర్షి పరమప్రీతితో రామునకు, "బల" ," అతిబల"  అనే రెండు మంత్రాలను  ఉపదేశించారు.

ఆ మంత్ర ప్రభావంతో, ఆకలిదప్పులు, శ్రమ, వ్యాధి మొదలైన వాటిని అధిగమించవచ్చు.

ఆరోజు రాత్రి తృణశయ్యలపై ఆ సరయూతీరంలో వారు శయనించారు.

రాత్రి గడచి తెల్లవారుచున్నది.

రామాయణం, ఉత్తమ గురు, శిష్య, సంప్రదాయం ఎలా ఉండాలో మనకు తెలియజేస్తుంది.

శిష్యుడు గురువు ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తూ,గురుసేవ చేస్తూ, వినయంగా సందేహాలను విన్నవిస్తూ, గురువునుండి విద్యను గ్రహించాలి.

గురువు శిష్యులను కంటికి రెప్పలా కాపాడుతూ, క్షణ,క్షణము వారికి కర్తవ్యబోధ చేస్తూ, తాను నేర్చిన విద్యలన్నీ వారికి ఉపదేశించి ఉత్తములుగా తీర్చిదిద్దాలి.

తండ్రి ఆజ్ఞానుసారం రామ లక్ష్మణులు రాజకుమారులైనా పాదచారులై, కటిక నేలమీద శయనిస్తూ, గురువైన విశ్వామిత్రునికి శుశ్రూష చేశారు.


విశ్వామిత్రుడు శిష్యులను కంటికి రెప్పలా కాపాడుతూ, క్షణ,క్షణము వారికి కర్తవ్యబోధ చేస్తూ, తాను నేర్చిన విద్యలన్నీ వారికి ఉపదేశించి ఉత్తములుగా తీర్చిదిద్దాడు.


శిష్యులయెడ  గురువుయొక్క కర్తవ్యాన్ని తెలియజేసే ఈ క్రింది శ్లోకం  రామాయణ కావ్యానికి తలమానికం లాంటిది.


శ్లో// కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే/

ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్//


( కౌసల్యాదేవి సుపుత్రుడవైన ఓ రామా !  ప్రాతస్సంధ్యాకాలం  ప్రారంభమైనది. 

ఓ నరశార్దూలా ! నిద్రనుండి మేల్కొనుము.

ఈ సంధ్యాసమయంలో చేయవలసిన దైవకార్యాలు నిర్వర్తించడం  ఇప్పుడు నీ కర్తవ్యం)


ఈ విధమైన గురు, శిష్య, సంప్రదాయం సర్వ శ్రేయస్సులను మనకు ప్రసాదిస్తుంది.


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

23-3-'26.

దివ్యమైన జీవితం!*

  


            *దివ్యమైన జీవితం!*

                  ➖➖➖🙏


*మనం జీవించాల్సింది ‘దీర్ఘ’ జీవితం కాదు ‘దివ్య’ మైన జీవితం !*

```

చాలా మంది ఆరోగ్యం కోసం పొద్దున్నా సాయంత్రం నడవడం చేస్తుంటారు, కొంతమంది వ్యాయామశాలకి వెళ్లి రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు, కొంతమంది ఆసనాలు అవీ వేస్తుంటారు, కొంత మంది అలాటివి ఏమీ చేయకుండా రకరకాల ఖరీదైన పళ్ళు, పళ్ళ రసాలు, ఇంకా ఏవేవో ఎవరి స్థాయికి తగ్గవి వాళ్ళు తిని తాగుతూ ఉంటారు.


ఇలా రకరకాలుగా ఆరోగ్యం కోసం ఏవేవో చేస్తుంటారు. ఇలా ఎవరు ఏమి చేసినా ఆరోగ్యం తో దీర్ఘమైన జీవితం గడుపుదామనే తప్ప వాళ్ళు కోరుకునే ఆ ఆరోగ్యం.. ఆ దీర్ఘమైన జీవితం ఎందుకోసమో వాళ్ళకే తెలియదు.


అటువంటి కార్యక్రమాలు అన్నీ కొంతమంది ఆరోగ్యం కోసం శ్రద్ధ తో చేస్తారు, కొంత మంది శారీరక ఆకర్షణ కోసం చేస్తారు, కొంత మంది సరదాకోసం చేస్తారు, కొంతమంది అలవాటుగా చేస్తారు, కొంతమంది అవతల వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళని చూసి చేస్తారు, కొంత మంది ఆడంబరం కోసం చేస్తారు .. కాని ఎవరు అలా రకరకాలు గా వ్యాయామాలు చేసి ఆరోగ్యవంతమైన శరీరం తో ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటున్నారో వాళ్ళు అలా ఆరోగ్యంతో బ్రతికున్నంత కాలం ఏమి చేయాలని అనుకుంటున్నారో అన్నది చాలా ముఖ్యం.


ఆరోగ్యంతో ఎక్కువ కాలం బ్రతకాలి అనుకునేవాళ్లు ఆ దీర్ఘాయుషుని మంచి, మానవత్వంతో, నిరంతరం సత్కార్యాలు చేస్తూ తోటి మానవాళికి…. తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ నిస్వార్ధంగా ఉంటూ సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ఆరోగ్యానికి ఆ జీవితానికి ఒక పరమార్ధం సిద్ధిస్తుంది.


మనం ఆరోగ్యంగా ఎన్ని ఏళ్ళు బ్రతికాము అన్నది కాదు కావాల్సింది ఉన్నన్నాళ్ళు పదిమందికి ఆదర్శంగా బ్రతికామా లేదా అన్నది కావాలి.


లేకపోతే మనతో పాటు ఆకులు అలములు తింటూ దీర్ఘమైన జీవితం గడిపే జంతువులకి మనకి పెద్ద తేడా ఏమీ ఉండనట్టే లెక్క.


అందుకే మనం ఆరోగ్యం కాపాడుకునేది భోగవంతమైన దీర్ఘజీవితం గడపడం కోసం కాదు ఆదర్శవంతమైన ఒక ‘దివ్యమైన జీవితం’ గడపడం కోసం!✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


     శ్లో𝕝𝕝 *యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః!* 

            *ప్రణమామి తమాదిత్యం బహిరన్త స్తమోపహమ్!!*


తా𝕝𝕝 *ఎవడు ఈ జగత్తును సృష్టించి,పోషిస్తున్నాడో, లయం కూడా చేస్తున్నాడో..*


[ *సకల చరాచర జగత్తూ సృష్టి స్థితి లయలూ ఎవరి ఆధీనంలో ఉన్నవో.*.]


*వెలుగులకే వెలుగై, జగత్ చక్షువై ప్రకాసిస్తూన్నాడో, ఆ సూర్యుని ప్రార్థిస్తూ, ఆతడు నాలోపల, బయట ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని, తమోగుణాన్ని, తొలగించి అనుగ్రహహించమని నమస్కరించుచున్నాను*.


✍️🌹💐🪷🙏

మన గుడి : నెం 1424

 🕉 మన గుడి : నెం 1424


⚜ తమిళనాడు : తిరుమజపాడి


⚜ శ్రీ వైద్యనాథస్వామి ఆలయం



💠 తిరుమజపాడి వైద్యనాథస్వామి ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని అరియలూరు జిల్లాలో తిరుమజపాడి వద్ద ఉన్న ఒక హిందూ దేవాలయం . 

ఈ ఆలయం శివునికి , వైద్యనాథ స్వామిగా, అతని భార్య పార్వతిని సుందరాంబికై అని పిలుస్తారు. 

ఈ ప్రదేశం యొక్క చారిత్రక పేరు మజువాడి. 


💠 చంద్రుని వ్యాధిని నయం చేసిన దేవుడు కాబట్టి, మీరు ఇక్కడకు వచ్చి పూజిస్తే, మీ చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.


💠 దేవతను సుందరాంబిక పేరు ప్రకారం, దేవత అందం మన మనస్సులను ఆకర్షిస్తుంది. 

ఇక్కడికి వచ్చే భక్తులు స్వామిని వస్త్రం, సంపంగి మాలతో, సుందరాంబికను మామిడి రంగు పట్టు చీర, ఎర్ర గులాబీ మాలతో పూజిస్తే, వారు కోరుకున్న వరం పొందుతారని నమ్ముతారు


💠 తమిళ శైవులైన నయనారులు తిరుజ్ఞానసంబందర్ , తిరునావుక్కరసర్ మరియు సుందరార్‌ల ప్రారంభ మధ్యయుగ తేవారం పద్యాలలో కీర్తింపబడిన 275 పాదల్ పెత్ర స్థలాలలో ఇది ఒక శివ స్థలము


💠 ఈ ఆలయం ప్రతి సంవత్సరం నిర్వహించే " నందికేశ్వరర్ తిరుకల్యాణం " (మార్చి/ఏప్రిల్) కు ప్రసిద్ధి చెందింది. 

తిరుమలపడి ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.


🪔 ఆలయ చరిత్ర:


💠 తిరువైయారు నివాసి అయిన శిలాధ మహర్షి శివుని కొరకు సంతానం కోసం తపస్సు చేశాడు. పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తే తన కోరిక నెరవేరుతుందని, యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నప్పుడు తనకు ఒక సంతానం లభిస్తుందని ఒక స్వరం ఆ మహర్షితో చెప్పింది. 

ఆ బాలుడిని కేవలం 16 సంవత్సరాలు మాత్రమే దీర్ఘాయువుతో పెంచమని అతనికి సలహా ఇవ్వబడింది. 


💠 శిలాధుడు ఆ పెట్టెను కనుగొన్నాడు మరియు దానిని తెరిచినప్పుడు, 3 కళ్ళు, 4 భుజాలు మరియు చంద్రవంక తలపై ఉన్న ఒక బిడ్డను కనుగొన్నాడు.

ఆ పెట్టెను మూసివేసి మళ్ళీ తెరిచి, సాధారణ మానవ రూపంలో ఉన్న ఒక బిడ్డను కనుగొన్నాడు.


💠 ఆ బిడ్డకు జపేసర్ అని పేరు పెట్టాడు. జపేసర్ 14 సంవత్సరాల వయస్సుకు చేరుకున్నాడు, జీవితాంతం రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. 


💠 తన తండ్రి వేదనను తెలుసుకుని, జపేసర్ తిరువైయారులోని ఆయన తీర్థ చెరువుపై ఒక కాలు మీద నిలబడి తపస్సు ప్రారంభించాడు.

 జపేసర్ నెమ్మదిగా ఆ చెరువులోని జీవులు అతన్ని తినేయడం ప్రారంభించాయి. 

జపేసర్ ఆ ప్రమాదంతో నిరుత్సాహపడలేదు. 

అతని తపస్సుకు చలించిన శివుడు, అతనికి పూర్తిగా స్వస్థత చేకూర్చి దీర్ఘాయుష్షును ప్రసాదించాడు. తరువాత, జపేసర్ తిరుమళపడిలో సుయసాంబికయిని వివాహం చేసుకున్నాడు. 

వివాహం తర్వాత కూడా జపేసర్ తన తపస్సును కొనసాగించాడు మరియు శివ గణాలకు అధిపతిగా మరియు కైలాస మొదటి ద్వారం వద్ద మొదటి భద్రతా అధిపతిగా మరియు నంది దేవుడిగా పేరు పొందాడు.


💠 చోళులు, పాండ్యులు, పల్లవులు, హొయసలులు, విజయనగర రాజులు మరియు మరాఠా పాలకులు ఈ ఆలయ అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించారు. 

తూర్పు ముఖంగా ఉన్న రాజగోపురం 7 అంతస్తులు మరియు మరొక గోపురం 5 అంతస్తులు. 


💠 శ్రీ జూర హరహరర్ కోసం ఒక ప్రత్యేకమైన మందిరం ఉంది. దేవునికి నైవేద్యంగా ఉడికించిన బియ్యం ,వేడి రసం సమర్పించే వారికి అధిక జ్వరం తొలగిపోతాయని నమ్ముతారు.


💠 నంది ఇక్కడ వివాహం చేసుకున్నారని నమ్ముతారు. 

నంది ఇక్కడ నందియంపెరుమాన్

అనే పేరుతో మానవ రూపంలో దర్శనమిస్తాడు.


💠 వివాహం కోరుకునే వారు ఇక్కడ జరిగే నంది వివాహాన్ని చూస్తే త్వరలో వివాహం చేసుకుంటారని చెబుతారు.


💠 ఈ ఆలయంలో పాలాంబికకు ప్రత్యేక మందిరం కూడా ఉంది. 

ఈ ఆలయంలో తన వివాహ రూపంలో ఉన్న స్వామిని చూడటానికి వచ్చిన అంబిక, స్వామివారి అందానికి ముగ్ధురాలై ఈ ఆలయంలోనే బస చేసింది.


💠 తూర్పు ముఖంగా ఉన్న ఆలయాలలో, అయన్ వైద్యనాథ్ మరియు అన్న సుందరాంబిక నైవేద్యాలు సమర్పిస్తుండగా, పాలాంబిక దక్షిణ ముఖంగా ఉన్న ఆలయములో నైవేద్యాలు సమర్పిస్తారు.


💠 ఈ ఆలయంలో కాత్యాయిని దేవి కూడా నెమలి రథంపై దర్శనమివ్వడం గమనార్హం.


💠 ఈ ఆలయంలో, గణేశుడు దక్షిణం ముఖంగా కనిపిస్తాడు. అదనంగా, నాలుగు వేదాలను సూచించే నాలుగు నంది దేవతలకు ఈ ఆలయంలో నైవేద్యాలు సమర్పిస్తారు.


💠 బాలాంబిక మరియు సుందరాంబిక అనే రెండు అంబికా మందిరాలు ఉన్నాయి.

 

💠 చక్రవర్తి శిబి చక్రవర్తి నవగ్రహ దోషం కూడా తొలగిపోయిన ప్రదేశం ఇదేనని చెబుతారు. 

శనివారం ఈ గుంటల ముందు నువ్వుల నూనె దీపం వెలిగించి పూజిస్తే, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.


💠 ఇక్కడ ఒకే రాయితో తయారు చేయబడిన సోమస్కంద విగ్రహం మరియు ఎద్దుపై కూర్చున్న దక్షిణామూర్తి, శిల్పం యొక్క అందాన్ని వివరిస్తాయి. 


💠 ఈ ఆలయంలో తూర్పు ముఖంగా 7 అంతస్తులతో కూడిన రాజగోపురం ఉంది. 

ప్రవేశ ద్వారంలోకి ప్రవేశించిన తర్వాత మనం ధ్వజస్తంభం, నంది మరియు ఒక బలిపీఠం చూడవచ్చు. 

రెండవ గోపురం దాటిన తర్వాత అలంగార మండపం అనే మహల్ ఉంది. అక్కడ 2 నంది మందిరాలు ఉన్నాయి. 


💠 గర్భగుడి చుట్టూ అఘోర వీరపతిరర్, వినాయకుడు, మురుగన్ ఉన్నారు. 

మూడవ ప్రవేశ ద్వారం తరువాత, మనం మహా మండపానికి చేరుకోవచ్చు.


💠 చిదంబరం నుండి తిరుమజపాడికి దూరం 108 కి.మీ


రచన


©️ Santosh Kumar

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*688 వ రోజు*

అనుశాసనిక పర్వము పంచమాశ్వాసము 

యోగము

పార్వతీ ! ఇక యోగమార్గము గురించి వివరిస్తాను. ఈ దేహము, ఇంద్రియములు, మనసు, బుద్ధీ, ఆత్మ ఇవన్నీ ఒకటే కాని వేరు కాదు అనుకోవడమే యోగము. ప్రతిరోజూ అగ్నిహోత్రము చెయ్యడం, అధికంగా మాట్లాడకుండా ఉండడం, సత్వగుణము కలిగి ఉండడడం, అర్హులైన వారికి దానంచెయ్యడం, వేదాభ్యాసంచెయ్యడం, ఎల్లప్పుడూ శుచిగా ఉండడం, సత్యముపలకడం, వీటిని అనుసరించడం వలన మానవుడిలోని పాపాలునశిస్తాయి . శుచిగాశుభ్రంగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనముమీద కూర్చోవాలి. నడుము దగ్గర నుండి తల వరకు నిటారుగా కూర్చోవాలి. ఇంద్రియములను మనస్సును ఏకం చెయ్యాలి. మనస్సును ఆత్మలో లీనముచెయ్యాలి. ప్రాణ, ఆపాన వాయువులను క్రమబద్ధం చెయ్యాలి. మానవుడు మనసును ఈ దశకు రాగానే ఇష్టం వచ్చినట్లు పోనీయరాదు. ప్రాణవాయువు ఆపానవాయువుతో కూడి ఊర్ధ్వ ముఖంగా పయనించి శిరస్సు దగ్గరకు చేరుతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతుంది. ఈ యోగమును అనుసరించడానికి సోమరితనము, పరధ్యానము, అత్యాశ, ఇతరులపట్ల ఆదరం లేకపోవడం, రోగములు, స్వప్నములు, లోభత్వము, భయము, కామము, క్రోధము, సుఖములు అనుభవించాలన్న కోరిక, చంచలత్వము మొదలైన దుష్టగుణములు అత్యంత విరోధములు. పైన చెప్పిన గుణములు ఉన్నవారు యోగాభ్యాసానికి అర్హులు కారు. ఈ యోగాభ్యాసమును నిష్ఠతో చేసిన అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలడు. యోగి ఎక్కువగా నిద్ర పోకూడదు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండ కూడదు. ఎక్కువగా తిన కూడదు. అలాగని అసలు తినకుండా ఉండ కూడదు. మితభోజనం, మితనిద్ర యోగికి యోగసిద్ధి కలిగిస్తుంది. యోగధర్మము ఇదే " అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు..

పరమాత్మలో లీనం

పార్వతీదేవి " మీ దయ వలన సాంఖ్యము, యోగము గురించి తెలుసుకున్నాను. భక్తులు పర్మమాత్మలో లీనం కావడానికి ఎటువంటి పరిచర్యలు చేయాలి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవతలకు కాని మానవులకు కాని పరమాత్మ గురించి తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే సాంఖ్యము, యోగము రెండూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మను నేనే. నేను సనాతుడను, అవ్యయుడిని, సత్యమే నాస్వరూపము. నా దయలేనిది ఎవరూ నన్ను దర్శించలేరు. నన్ను చేరుకోవడానికి మంత్రము, జపము, నిరంతర పరమాత్మచింతన, స్తోత్రములు, నమస్కారములు ఇవన్నీ నిష్టతో చేసిన పరమాత్మను చేరుకోవచ్చును. పూర్వము నేను నాలుగు ఆశ్రమముల గురించి పాశుపత్రవ్రతము గురించి నలుగురు విప్రులకు బోధించాను. వారు దానిని తమ శిష్యులకు బోధించారు. అలా లోకమంతా వ్యాపించింది. సకల శుభములు కలగడడానికి, శుచిగా ఉండడానికి, నా స్వరూపమైన లింగార్చనకు నేను విభూతిని రూపొందించాను. యోగులు ఆ విభూతిని, శరీరము అంతా అలముకొని, కపాలము చేత బూని, తలగొరిగించుకుని, భిక్షాటన చేస్తూ, మనోనిగ్రహంతో మెలగుతూ, నా మీదనే మనసు నిలిపి, ఇతరకోరికల మీదకు మనసు పోనీయక పరమానందకరమైన అనుభూతిని అనుభవిస్తారు. కేవలం ఈ ప్రకారం సంగమును విడిచిన యోగులు నా సాయుజ్యమును పొందగలరు. నిరాకారంగా నిస్సంగంగా నన్ను పూజించుట కొరకు నేను మూడు లోకములలో ఏ ఆకారము లేని శివలింగాలను స్థాపించాను. ఆ లింగములను నా స్వరూపంగా పూజిస్తే నేను వారికి ప్రసన్నుడను ఔతాను. ఆ లింగములను ఎవరికి ఎలా తోచినట్లు అలా పూజ చేయవచ్చు. వారివారి శక్తిని అనుసరించి పూజించవచ్చు. పాలతో, నేతితో, నీటితో ఆ లింగములను అభిషేకించ వచ్చు. నాకు మారుగా ఆ లింగములను గంధము, పుష్పములు, ధూపము, దీపము, నైవేద్యము శక్తికి తగిన విధంగా ఆరాధించ వచ్చు. ఆ లింగములను పూజించిన నన్ను పూజించినట్లే.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కాశిపుర వర్ణన

  🙏కాశిపుర వర్ణన🙏🙏



 సీ. కాశీపురమ్మును గాంచిన చాలును

                  తొలగిపోవును కదా ! దురిత రాశి

      విశ్వేశ్వరస్వామి విశ్వమున్ గాచును

                 కనినంత పాపముల్ కరిగిపోవు

      అన్నపూర్ణమ్మయు న్నాహార మిడునిల

                 సకల జనాళికి సాకుచుండి

      గలగలపారెడు గంగానదీమాత

                 పాపాళి నెల్లను పరిహరించు

 తే. కాలభైరవుడు మనల కనికరించ

యెప్పుడండగ డుంఠి విఘ్నేశు డుండు

కరుణతోవిశాలాక్షియు కాచు మనల

       వరములకు నిలయము గదా వారణాసి 🙏🙏


సాహితీశ్రీ ,,జయలక్ష్మి

రామాయణ

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*ఇంటింటా రామాయణ దివ్యకథా పారాయణం*

*

         *5 వ రోజు*

     🌸 *మహిమాన్విత* *సుంద‌ర‌కాండ‌*🌸


               ***

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ****

మనోజవం 

మారుతతుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |

వాతాత్మజం 

వానరయూథ ముఖ్యం

శ్రీరామ దూతం 

శరణం ప్రపద్యే||


(మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.)

                 ***


సీతాన్వేష‌ణ సంక‌ల్ప దీక్ష‌తో ఆంజ‌నేయుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం ఎక్కి ఉత్సాహంతో కాసేపు విహ‌రించాడు. మ‌హా వేగంతో ఆకాశంలోకి ఎగిరేందుకు ప‌ట్టుకోసం భూమిపై కాలు పెట్టి అదిమితే అది ఎక్క‌డ కుంగుతుందో న‌ని మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తాన్ని ఆపుగా చేసుకున్నాడు. త‌ల‌పైకి ఎత్తి చూశాడు. విశాల ఆకాశం ప్రేర‌ణ‌నిచ్చింది. మ‌హోత్సాహం ఆవ‌హించింది. 

తూర్పుకు తిరిగాడు. సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి న‌మ‌స్క‌రించాడు. శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని శ‌రీరంలోకి ఆవ‌హింప‌చేసుకున్నాడు. 

వాన‌ర‌సేన‌వైపు తిరిగాడు, మిత్రులారా రామ‌కార్యార్థం వెడుతున్నాను. రామ‌బాణం ఎంత వేగంగా వెడుతుందో అంతే వేగంతో లంక‌లో ప్ర‌వేశిస్తాను. అక్క‌డ సీత‌మ్మ‌వారు లేక‌పోతే దేవ‌లోకం వెళ‌తాను. అక్క‌డా ఆ మ‌హాత‌ల్లి క‌నిపించ‌క‌పోతే రావ‌ణాసురుణ్ణే బంధించి ఈడ్చుకువ‌స్తాను . లేదంటే లంకాన‌గ‌రాన్నే పెళ్ల‌గించి తీసుకువ‌స్తాను చూస్తుండండి అంటూ 

ఒళ్లువిరిచి, దేహాన్ని సాగ‌దీసి,చేయి ముందుకు సాచి...*జై శ్రీ‌రామ్* అంటూ మ‌హేంద్ర‌గిరిని కాలితో గ‌ట్టిగా అదిమి హ‌నుమ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లేచాడు.  

వాన‌ర సేన హ‌నుమ‌కు,శ్రీ‌రామ చంద్ర‌మూర్తికి జేజేలు ప‌లుకుతున్న‌ది. హ‌నుమ మ‌హేంద్ర‌గిరినుంచి పైకి లేస్తుంటే ఆ ఊపుకు మ‌హేంద్ర‌గిరి ఊగిస‌లాడింది. చెట్లు ఆ మ‌హోధృత గాలికి పుష్ఫ వ‌ర్షం కురిపించాయి. వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా మారింది.జీవ‌కోటికి ఏదో తెలియ‌ని ఆనందం. విష‌ప్రాణులు భ‌యంతో విల‌విల‌లాడి పోయాయి. అలా స‌ముద్రం మీద మ‌హావేగంతో హ‌నుమంతుడు లంకాన‌గ‌రంవైపు దూసుకుపోతున్నాడు. స ముద్రంపై ప‌డిన హ‌నుమంతుడి నీడ, స‌ముద్రంలో గాలివాటుకు పోతున్న నౌక‌లా క‌నిపిస్తున్న‌ది. స‌ముద్రం అల్ల‌క‌ల్లోల‌మౌతున్న‌ది. రెక్క‌ల ప‌ర్వ‌తంలా దూసుకుపోతున్నాడు మ‌న హ‌నుమ‌. దేవ‌త‌లు హ‌నుమ‌నుచూసి *విజ‌యోస్తు విజ‌యోస్తు* అని దీవిస్తున్నారు. 


*సాగ‌రుడి సాయం*


స‌ముద్రుడు త‌ల పెకి ఎత్తి చూశాడు. రామ‌కార్యార్థి అయిన హ‌నుమ‌కు ఏదో ఒక ర‌కంగా స‌హాయం చేయాల‌నుకున్నాడు. అప్పుడు స‌ముద్రంలోనే దాగి ఉన్న మైనాకుడ‌నే ప‌ర్వ‌తాన్ని పిలిచి, ఈ స‌ముద్రం నుంచి పైకి లేచి నువ్వు హ‌నుమ‌కు ఆతిథ్యం , కాసేపు విశ్రాంతి నివ్వు అలా రామ‌కార్యంలో త‌రిద్దాం అన్నాడు స‌ముద్రుడు. మైనాకుడు ఆకాశ‌వీధికి పెరుగుతూ వెళ్లి హ‌నుమ‌కు అడ్డంగా నిలిచాడు,విశ్రాంతి ఇవ్వాల‌న్న సంక‌ల్పంతో. హ‌నుమ త‌న‌కు ఏదో అడ్డుగా నిలిచింద‌ని భావించి గుండెతో మైనాకుడిని ఒక్క గుద్దు గుద్దాడు. దానితో క‌ల‌వ‌ర‌ప‌డిన మైనాకుడు నిజ‌రూపం లో ఎదురుగా నిలిచి , త‌న శిఖ‌రంపై విశ్రాంతి తీసుకోమ‌న్నాడు. హ‌నుమ సంతోషించాడు.కానీ రామ‌కార్యార్థినై సంక‌ల్ప‌దీక్ష‌తో వెళుతున్నాను. విశ్రాంతి కిది స‌మ‌యం కాదు అని చెప్పి మైనాకుడి తృప్తి కోసం అత‌నిని చేతితో స్పృశించి ప్ర‌భంజ‌న వేగంతో హ‌నుమంతుడు ముందుకు దూసుకుపోతున్నాడు. హ‌నుమ దీక్ష‌కు దేవ‌త‌లు ముచ్చ‌ట‌ప‌డ్డారు.

గంధ‌ర్వ దేవ‌తాగ‌ణాలు హ‌నుమ శక్తిసామ‌ర్థ్యాలు ప‌రీక్షించాల్సిందిగా నాగ‌మాత సుర‌ను కోరారు. ఆమె భారీ కాయంతో హ‌నుమ మార్గానికి అడ్డుప‌డింది. హ‌నుమా ఈరోజు నువ్వు నాకు ఆహారం. నువ్వు మ‌ర్యాద‌గా నా నోట్లోకి ప్ర‌వేశించు అని గ‌ద్దించింది. అప్పుడు హ‌నుమంతుడు, విన‌యంతో అమ్మా నేను రామ‌కార్యార్థినై వెళుతున్నాను. సీతామాత జాడ తెలుసుకుని వ‌చ్చిన త‌ర్వాత నీకు ఆహారం అవుతాను అన్నాడు. సుర‌న ఒప్పుకోలేదు. స‌రే నా దేహానికి స‌రిప‌డినంత‌గా నీ నోరు తెరువు అన్నాడు. సుర‌న నోరు పెద్ద‌ది చేస్తున్న‌ది. హ‌నుమ త‌న దేహాన్ని పెంచుతూ పోతున్నాడు. ఇలా ఇద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు. ఒక ద‌శ‌లో హ‌నుమ ఉన్న‌ట్టుండి త‌న దేహాన్ని బొట‌న వేలి స్థాయికి త‌గ్గించి సుర‌న నోట్లో కి ప్ర‌వేశించి క్ష‌ణ‌కాలంలో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అమ్మా- నీవు చెప్పిన‌ట్టే చేశాను. ఇక వెళ్లిరానా అన్నాడు. ఆంజ‌నేయుని సూక్ష్మ‌బుద్ధికి సంత‌సించి నాయానా నీకు కార్య‌సిద్ధి క‌లుగుతుంది, సీతారాముల‌ను క‌లుపుతావు అని ఆశీర్వ‌దించి మార్గం సుగ‌మం చేసింది.

అలా గ‌గ‌న‌త‌లంలో స‌ముద్రంపై దూసుకుపోతున్న హ‌నుమ నీడ‌ను ఛాయాగ్రాహిణి అనే స‌ముద్రంలోని రాక్ష‌సి సింహిక చూసింది. త‌న‌కు భ‌లే ఆహారం దొరికింద‌ని అనుకునుంది. నోరుతెరిచి హ‌నుమ నీడ ఆధారంగా త‌న నోట్లోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇది గ‌మ‌నించాడు హ‌నుమ‌. దేహాన్ని మ‌రింత పెంచినా ప్ర‌యోజ‌నం లేక పోయింది. వెంట‌నే సూక్ష్మ‌రూపియై సముంద్రంలోని సింహిక‌ను ఢీకొట్టి దాని ప్రాణాలు తీశాడు. సింహిక మృత‌క‌ళేబ‌రం సముద్రంపై తేలుతుంటే దేవ‌తలు సంతోషంతో పుష్ప‌వృష్టి కురిపించారు. ఈ విధంగా ధైర్యం, విశాల‌దృష్టి, బుద్ధి, చాక‌చ‌క్యం ప్ర‌ద‌ర్శించిన హ‌నుమ‌కు ఎదురులేద‌ని దేవ‌తలు దీవించారు. అంత‌లోనే హ‌నుమ‌కు ద‌క్షిణ‌తీరంలో ప‌ర్వ‌త పంక్తులు హ‌నుమంతుడికి క‌నిపించాయి. లంకాన‌గ‌రానికి ద‌గ్గ‌ర‌లోని త్రికూట‌గిరి శిఖ‌రం మీద దిగాడు. ఇంత దూరం స‌ముద్రంపై ఎగిరివ‌చ్చినా ఏమాత్రం అలిసిపోలేదు. సాయం సంధ్యా వంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించాడు.


*లంకాన‌గ‌ర ప్ర‌వేశం*:


త్రికూట‌గిరినుంచి లంకాన‌గ‌రాన్ని చూశాడు హ‌నుమంతుడు. బ‌హు సుంద‌రంగాఉంది. అంతేకాదు చీమ‌కూడా న‌గ‌రంలో ప్ర‌వేశించ‌డానికి వీలులేకుండా రాక్ష‌సులు కాప‌లాకాస్తున్నారు. సూక్ష్మ‌రూపి అయి వాన‌ర రూపంలోనే లంక‌లో ప్ర‌వేశించి సీతామాత జాడ తెలుసుకోవాల‌నుకున్నాడు. చిన్న‌వాన‌రంగా లంక‌లో ప్ర‌వేశించ‌డానికి రాజ‌ద్వారం చేరుకున్నాడు. ఇంత‌లో లంకిణి అనే రాక్ష‌సి ఎదురుగా నిలిచి వ‌నాల‌లో తిరిగే నీకు ఇక్క‌డేం ప‌ని అని గ‌ద్దించింది. త‌న అనుమ‌తి లేకుండా లోప‌లికి ప్ర‌వేశించ‌డం కుద‌ర‌ద‌ని చెప్పింది. లోప‌ల ఉన్న వ‌నాల‌ను స‌ర‌స్సుల‌ను ప‌క్షుల‌ను చెట్ల ను ఆ న‌గ‌ర సౌంద‌ర్యాన్ని ఒక్క‌సారి చూసి వ‌చ్చేస్తాన‌న్నాడు. లంకిణి కుద‌ర‌ద‌న్న‌ది. నేను లంక‌ను కాప‌లా కాస్తుంటాను. న‌న్ను గెలిస్తే కాని నువ్వు లోప‌లికి అడుగు పెట్ట లేవు అంటూ హ‌నుమ‌ను ఒక్క దెబ్బ కొట్టింది. హ‌నుమ వెంట‌నే కుడిచేయి పైకిఎత్తి పిడికిలి బిగించాడు. కానీ కుడిచేతితో కొడితే లంకిణి చ‌నిపోతుంది. స్త్రీ క‌దా అని ఆలోచించి ఎడ‌మ చేతితో ఒక్క గుద్దు గుద్దాడు.ఆమె క‌ళ్లుతేలేసి కింద‌ప‌డింది. అప్పుడు లంకిణి, నాయ‌నా నువ్వు న‌న్ను గెలిచావు. ఒక వాన‌రుడు వ‌చ్చి న‌న్ను గెలిచిన నాడు రావ‌ణాసురుడి అంత్య‌కాలం స‌మీపించిన‌ట్టు అని బ్ర‌హ్మ‌గారు నాకు చెప్పారు. ఇప్పుడు లంకా న‌గ‌రం భ‌విష్య‌త్తు, రాక్ష‌సుల భ‌విష్య‌త్తు నాకు అర్ధ‌మై పోయింది. 

ఇక ద్వారం తెరుస్తున్నాను.ద్వ‌రాంగుండానే వెళ్లు సీత‌మ్మ‌ను క‌నిపెట్టు అని చెప్పింది.కానీ హ‌నుమ రాజ‌ద్వారం గుండా ప్ర‌వేశించ‌కుండా ఎడ‌మ కాలులోప‌లికి పెట్టి ప్రాకారం మీదినుంచి లంకాన‌గ‌రంలోకి కిందికిదూకాడు. అప్ప‌టికే రాత్రి అయింది. చంద్రుడి వెలుగులో లంకానగరం మరింత శోభాయమానంగా క‌నిపిస్తున్న‌ది.


*అంతఃపురంలో సీతాన్వేషణ*

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ .. అన్నిచోట్లా సీతను వెదికాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రిస్తున్న స్త్రీలలో మండోదరిని చూసి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ తెలియ‌క చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టప‌డ‌ లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని బాధ‌ప‌డ్డాడు. ప్రాణ‌త్యాగం చేసుకుందామ‌ని కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.


నమోస్తు రామాయ సలక్ష్మణాయ,

 దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, 

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, 

నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు.

 దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించాల‌ని ప్రార్థించి సీతాన్వేషణకు చివ‌రి ప్ర‌య‌త్నంగా అశోకవనంలో అడుగుపెట్టాడు.


*అశోకవనంలో*

*సీతమ్మ దర్శనం*


అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రములైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. అక్క‌డ‌ అతి మనోహరమైన ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు.


అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన ఒక స్త్రీని చూశాడు.. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.


*త్రిజటాస్వప్నం*

అశోక‌వ‌నానికి రావ‌ణుడు వ‌చ్చాడు. సీతమ్మ‌ను బెదరించి, తనకు వశంకావాల‌ని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పం కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మం కావ‌డం తథ్యమని రావణుడికి గట్టిగా చెప్పింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.


వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన క‌ల గురించి ఇలా చెప్పింది 

"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.ఇంకో వైపు, "ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుతున్న‌ట్టుంది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలం త్రాగుతూ, పిచ్చివారివలె లంకలో గంతులు వేస్తున్నారు.....ఇలాంటి దృశ్యాన్ని నేను క‌ల‌లో చూశాను అని త్రిజట చెప్పిందది. ఇది లంక‌కు రాబోయే చేటుకాలాన్ని సూచిస్తున్న‌ద‌ని హెచ్చ‌రించింది.

ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

త్రిజ‌ట త‌న స్వ‌ప్న వృత్తాంతాన్ని వివ‌రించ‌డం హ‌నుమ చెట్టుపై నుంచి విన్నాడు.ఇక ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌నుకున్నాడు. అయితే ఒక్క‌సారిగా ఆమెకు కనిపిస్తే కంగారుప‌డుతుంద‌ని, కేక‌లు వేస్తే కాగ‌ల కార్యం చెడిపోతుంద‌ని గ్ర‌హించాడు. నెమ్మ‌దిగా రామ‌క‌థా గానం చెట్టుపైనుంచే ప్రారంభించాడు.

    

ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతాన్ని, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

 *శ్రీరామ సుందర రూప వర్ణనం*

హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. "రాముడు ఆజానుబాహుడు. కమల పత్రాక్షుడు. రూప దాక్షిణ్య సంపన్నుడు. శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మ రక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు. సమ విభక్తములైన శరీరాంగములు కలవాడు. దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠము కలవాడు. ఉత్తముడు, వీరుడు. నల్లనివాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు - అట్టి రామలక్ష్మణులు నీ కోసం దుఃఖిస్తున్నారు త‌ల్లీ . సుగ్రీవునితో చెలిమి జేసి, నిన్ను వెదక‌టానికి నలువైపులా వానరులను పంపారు. ఓ సీతా దేవీ! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇక్క‌డినుండి తీసుకువెళ‌తాడు, మ‌న‌స్సు దిట‌వుచేసుకుని ఉండు" - అని హనుమంతుడు చెప్పాడు.


*హనుమంతుడికి* 

*చూడామణి ఇచ్చిన సీత* :

శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని అన్నాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకుంటే తాను బ్రతుకనని చెప్పింది. ఆ మ‌హాస‌ముద్రాన్ని దాటడం హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్పఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.


అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి -యుద్ధానికి కాదు,పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెకు న‌చ్చ చెప్పాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.


*యత్ర యత్ర రఘునాథ కీర్తనం*

*తత్ర తత్ర కృత మస్తకాంజలిం|*

*బాష్ప‌వారి పరిపూర్ణ లోచనం*

*మారుతిం నమత* *రాక్షసాంతకం||*


          **

*బుద్ధిర్బలం యశో ధైర్యం* *నిర్భయత్వమరోగతా|*

*అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||*

( ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.)

   ***

     *(సుంద‌ర‌కాండ‌- సీతాద‌ర్శ‌న‌ఘ‌ట్టం స‌మాప్తం)*


----------