23, మార్చి 2026, సోమవారం

రామాయణం - 10)

  శ్రీరామ  (17 )


               ( వాల్మీకి రామాయణం  - 10)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏




ఆ తరువాత విశ్వామిత్రుని ఆశ్రమానికి ప్రయాణం చేస్తున్న ఆ ముగ్గురిని త్రోవలో "తాటకి" అనే వేయి ఏనుగుల బలంగల రాక్షసి ఎదుర్కొంది.

తాటకిని సంహరించమని రామునికి చెప్పాడు విశ్వామిత్రుడు.

"తాటకి" స్త్రీగదా! సంహరించవచ్చునా!  అని సందేహిస్తున్నాడు రాముడు.

"ఈ తాటకి యజ్ఞములను నశింపజేసే దుష్టాత్మురాలు. దేవ బ్రాహ్మణ హితం కోసం, సందేహించకుండా ఈ రాక్షసిని వధించు" 

అన్నాడు విశ్వామిత్రుడు.

పితృవాక్యపాలకుడైన రాముడు తన స్వంత  ఆలోచనలకు తావివ్వకుండా విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.


శ్లో// పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్/

వచనం కౌశికస్యేతి కర్తవ్య మవిశంకయా//


(మా నాన్నగారు మీరు ఏమి చెబితే అది చేయమని మాకు ఆజ్ఞ ఇచ్చారు.

ఆయన ఆజ్ఞ పాటించడమే మా ధర్మం.

అందువలన మీరు చెప్పినట్లు నిస్సందేహంగా తాటకిని సంహరిస్తాను) 


విశ్వామిత్రుని ఆదేశానుసారం రాముడు ఆ రాక్షసిని సంహరించాడు.

తాటకి సంహారానికి దేవతలు, దేవేంద్రుడు,విశ్వామిత్రుడు,సంతోషించారు.

దేవేంద్రుని సూచనను అనుసరించి,

విశ్వామిత్రుడు, తన వద్ద ఉన్న దివ్యాస్త్రాల నన్నింటినీ రామునకు ఉపదేశించాడు.


" ఓ రామా ! స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చో. నా అస్త్రసంపదనంతా నీకు ఇస్తున్నాను, స్వీకరించు "

అని,

ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్రాలను,

ఇంద్రుని వజ్రాయుధాన్ని, శివుని త్రిశూలాన్ని,

బ్రహ్మాస్త్రాన్ని, ఐషీకాస్త్రాన్ని,

మోదకి,శిఖిరి, అనే గదలను,

గాంధర్వాస్త్ర, మానవాస్త్రాలను,

ఇంకా వేలకొలది తన అధీనంలో ఉన్న అస్త్రాలనన్నింటినీ సాంగోపాంగంగా, ప్రయోగ, ఉపసంహారాలతో సహా రామునికి ధారపోసాడు.

ఆ అస్త్రదేవతలంతా రాముడికి నమస్కరించి,

" ఓ రామా ! మేమందరము నీ కింకరులము " అన్నారు.

రాముడు వారినందరిని ఆదరంగా స్ప్రశించి, "మీరందరూ ఎల్లప్పుడూ నా మనస్సులో సంచరించుచుందురు గాక" అని ఆజ్ఞాపించాడు.


ఆ తరువాత అనేక గాధలు,ఆ యా ప్రాంత విశేషాలు చెబుతూ విశ్వామిత్ర మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి,రామ లక్ష్మణులతో కలిసి,

 ' సిద్ధాశ్రమము ' అని పిలువబడే తన ఆశ్రమంలో ప్రవేశించాడు.


ఈ ఆశ్రమము ఎవరిదని శ్రీరాముడు ప్రశ్నించగా ,

విశ్వామిత్ర మునీంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు.

" పూర్వము కశ్యప మహర్షి ఈ ఆశ్రమంలో తపస్సు చేసి శ్రీమహావిష్ణువు తనకు పుత్రుడుగా  జన్మించే వరం పొందాడు.

ఆ మహర్షి అభీష్టానుసారం విష్ణువు  " వామనుడు " గా  అదితి గర్భంలో  జన్మించి, బలిచక్రవర్తిని నిర్జించి త్రిలోక సామ్రాజ్యాన్ని ఇంద్రుని వశం చేశాడు.

అప్పటినుండి ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం అనే పేరుతో పిలువబడుతోంది.

ఈ ఆశ్రమంలోనే నేను తపస్సు చేసుకుంటూ, ప్రస్తుతం ఈ యాగాన్ని. తలపెట్టాను"

అని చెప్పి, తన యాగరక్షణకేతించిన రామలక్ష్మణులను అక్కడ ఉన్న మునులకు పరిచయం చేసాడు.


అప్పుడు ఆ ఆశ్రమవాసులైన మునులందరూ, విశ్వామిత్రుని,రామలక్ష్మణులను పూజించారు.


మౌనవ్రతధారియై విశ్వామిత్రమహర్షి నియమ,నిష్ఠలతో కూడిన యజ్ఞదీక్షలో వెంటనే ప్రవేశించాడు.


తాము చేయవలసిన పని సవివరంగా చెప్పమని రామ లక్ష్మణులు అడుగగా, ఆ మునీశ్వరులు అందరూ ఇలా అన్నారు:

"రామ లక్ష్మణులారా! నేడు మొదలు, ఆరు ఆహోరాత్రములు  మీరు యాగ రక్షణ చేయవలెను.

విశ్వామిత్రమహర్షి దీక్షలో వున్నారు కాబట్టి మౌనం పాటిస్తారు".


శ్లో//తౌ తు తద్వచనం శ్రుత్వా రాజ పుత్రౌ యశస్వినౌ/

అనిద్రౌ షడహోరాత్రం  తపోవన మరక్షతాం//

(కీర్తిమంతులైన ఆ రామ లక్ష్మణులు,వారు చెప్పిన విధంగా, ఆరు, రేయింబవళ్లు, నిద్రపోకుండా ఆ తపోవనాన్ని రక్షించారు).


ఆరవ దినమున మారీచుడు, సుబాహువు, అనే ఇద్దరు రాక్షసులు, వేలకొలది  రాక్షసానుచరులతో కూడి ఆకాశమార్గాన వచ్చి, యజ్ఞాశాలలో రక్తవర్షాన్ని కురిపించారు.


వెంటనే రాముడు మానవాస్త్రాన్ని ప్రయోగించాడు.


శ్లో// స తేన పరమాస్త్రేణ మానవేన సమాహత:/

సంపూర్ణం యోజన శతం క్షిప్త: సాగర సంప్లవే//


( గొప్పదైన ఆ మానవాస్త్రం చేత కొట్టబడిన, మారీచుడు, నూరు యోజనముల దూరంలో సముద్రజలములలో పడ్డాడు).


పిమ్మట రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి, సుబాహువును సంహరించాడు.


తరువాత వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి,మిగిలిన రాక్షసులనందరిని సంహరించాడు.


శ్లో//స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన:/

ఋషిభి: పూజిత స్తత్ర యథేన్ద్రో విజయే పురా//

(యజ్ఞములను నశింపజేసే ఆ రాక్షసుల నందరిని, ఆ విధంగా సంహరించిన రాముని, ఋషులందరు, విజయం సాధించిన ఇంద్రుని, పూర్వము దేవతలు పూజించినట్లు, పూజించారు).


ఎంతో సంతోషం పొందిన విశ్వామిత్ర మహర్షి, రామునితో ఇలా అన్నాడు:


శ్లో//కృతార్థో౽స్మి మహాబాహో కృతం గురు వచ స్త్వయా/

సిద్ధాశ్రమ మిదం సత్యం కృతం రామ మహా యశ://

(ఓ మహాబాహూ!నేను తలపెట్టిన పని పూర్తి అయినది. నీవు నీ తండ్రి వచనమును చక్కగా పాటించినావు.

గొప్ప యశశ్శాలివైన ఓ రామా!నీవు ఈ సిద్ధాశ్రమము యొక్క పేరు నిలబెట్టావు).


                   శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

23-3-'26

కామెంట్‌లు లేవు: