16, ఏప్రిల్ 2026, గురువారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 15 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           1️⃣9️⃣6️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *196 వ రోజు*                   

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*విజయవార్తను విరాటునికి తెలుపుట*```


దక్షిణ గోగ్రహణంలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన విరాటుని ఉత్తర గోగ్రహణం విషయం కలవర పరచింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణాది మహా వీరులతో దండెత్తి వచ్చిన సుయోధనుని ఎదిరించడానికి బృహన్నల సారథ్యంలో వెళ్ళిన ఉత్తరుని తలచుకుని పరితపించాడు. వెంటనే సేనలను ఉత్తరకుమారునికి సహాయంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఉత్తరకుమారుని క్షేమం తెలుసుకుని రమ్మని వార్తాహరులను పొమ్మని ఆజ్ఞాపించాడు. అంతలో అక్కడకు వచ్చిన వార్తా హరులు ఉత్తరకుమారుని విజయవార్త చేరవేసారు. విరాటుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్ళవెంట ఆనంద బాష్పాలు రాలాయి. "ఏమి మన ఉత్తరుడు కుఱుసైన్యాలను గెలిచాడా. వెంటనే నగరమంతా చాటింపు వేయించండి. సువాసినులను, బ్రాహ్మణులను ఉత్తరునికి స్వాగతం చెప్పటానికి పంపండి" అని విరాటుడు ఉత్సాహంగా చెప్పాడు. కంకుభట్టుని చూసి "కంకా! ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడదామా" అన్నాడు. 


ధర్మరాజు "మహారాజా! తమరు ఆనందంలో ఉన్నారు. నేను ఈ రోజు మీతో ఆడి గెలవగలనా" అన్నాడు. 


విరాటుడు పెద్దగా నవ్వి "సైరంధ్రీ! పాచికలు తీసుకురా" అని అక్కడ ఉన్న ద్రౌపదిని ఆజ్ఞాపించాడు.

```

*విరాటుడు ధర్మరాజు మిదకు పాచికలు విసరుట*```


ఆట ప్రారంభం అయింది విరాటుడు ధర్మరాజుతో "కంకా! అశేషమైన కుఱుసైన్యాలను జయించి నా కుమారుడు మా వంశ ప్రతిష్ఠ కాపాడాడు. అతని బాహుబలం ఎంత గొప్పదో కదా" అన్నాడు. 


ధర్మరాజు "బృహన్నల రథసారధిగా వుండగా విజయము సాధించటము పెద్దవిశేషము కాదు కదా" అన్నాడు. 


విరాటుడు ఆ మాటలకు ఆగ్రహించి 

"కంకుభట్టా! నా కుమారుని విజయాన్ని సందేహిస్తున్నావా? ఇంత వరకు నీవు ఏమి మాట్లాడినా సహించాను ఇక మీదట అలా కాదు" అన్నాడు. 


కాని కంకుభట్టు అంతంటితో వదల లేదు "ఒక్క కౌరవ సేనే కాదు. దేవతలు, రాక్షసులు కలసి వచ్చినా బృహన్నల రధ సారధ్యం వహిస్తుండగా ఉత్తరుని జయించడం ఎవరికీ సాధ్యం కాదు" అన్నాడు. 


విరాటుడు కోపం పట్ట లేక పోయాడు "కంకూ! ఇక చాలు నీవు ఎన్నో వింతలు చెప్పగా విన్నాను. ఒక పేడి అదియూ, సారధి శత్రువులను జయించడమా! నా కుమారుని విజయాన్ని ఎందుకు అంగీకరించవు. ఇక నీ మూర్ఖపు మాటలు కట్టి పెట్టు విప్రుడా" అన్నాడు. 


కాని ధర్మరాజు ఆపకుండా "అవును విరాటరాజా! బృహన్నలకు యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటుంది. ఉత్తరుని సారధిగా చేసి కౌరవసేనను జయించి గోవులను మరలించాడు. నా మాట అసత్యం కాదు. బృహన్నల విజయ వార్తను నగరంలో చాటించు" అన్నాడు. 


విరాటుడిక ఆగలేక "ఆ పేడిని నా ముందు పొగుడుతావా" అంటూ పాచికలను ధర్మరాజుపై విసిరాడు. 


అందులో ఒక పాచిక ధర్మరాజు నుదిటిపై బడి గాయం చేసింది. ధర్మరాజు అక్కడే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి తల వంచాడు. 


ద్రౌపది వెంటనే పరుగున వచ్చి ధర్మరాజు నుదిటి మీద స్రవిస్తున్న రక్తాన్ని తన పైట కొంగుతో అదిమింది. పక్కనే బంగారు కలశంలో ఉన్న నీటితో తన పైట తడిపి తుడిచింది. 


ఇదిచూసి విరాటుడు "సైరంధ్రీ! అతని రక్తం నేలపై పడకుండా అలా తుడుస్తున్నావేంటి అన్నాడు.


"మహారాజా! ఉన్నత వంశ సంజాతుడైన ఈ బ్రాహ్మణుని రక్తం ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని రోజులు ఈ దేశంలో వర్షాలు పడవు. మన దేశానికి కలుగబోయే కీడుని నివారించడానికే అలా చేసాను” అన్నది సైరంధ్రి.```


               *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 15 ఏప్రిల్ 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *58వ భాగం*``


*శ్రీ అనంత పద్మనాభ వ్రతము*```


వామనావతార కథ చెప్పిన తర్వాత సూత మహాముని శౌనకాదులను చూసి “మునులారా! నారాయణుడు భక్త సులభుడు. తనను నిరంతరం భక్తి శ్రద్థలతో కొలిచే భక్తులను తప్పక ఆదుకుంటాడు. పద్మనాభుడైన నారాయణుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక వ్రతము ఉంది.


అదే అనంత పద్మనాభ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినవారికి ఆయురారోగ్య భోగభాగ్యములు లభిస్తాయి. మరణానంతరం శ్రీహరి సన్నిధి లభిస్తుంది. ఈ వ్రతము భాద్రపద శుద్ద చతుర్దశి నాడు ఆచరిస్తారు. అందువలన ఈ చతుర్దశిని అనంత చతుర్దశి అని, పద్మనాభ చతుర్దశి అని కూడా పిలుస్తారు. దేశీయ, ప్రాంతీయ భేదాలను అనుసరించి వివిధ ప్రాంతాల్లో కదళీ చతుర్థి, అఘోర చతుర్థి అని, పాలీ చతుర్థి అని పిలుస్తుంటారు.


నారాయణునికి ఉన్న అనేక నామాలతో అనంత అనే నామము ఒకటి. అనంతుడు అన్న పదానికి ఆది అంతము లేని వాడని, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడని అర్ధాలు ఉన్నాయి. ఈ అనంత పద్మనాభ వ్రతము కామ్యవ్రతము. అనగా మనం కోరుకున్న కోరికలను ఈ వ్రతము ఆచరించడం ద్వారా నెరవేర్చుకోవచ్చును.


ఈ వ్రతాన్ని త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు ఆచరించ కూడదు. పూర్ణిమ తిథితో కలసి ఉండే చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలి. ఈ వ్రతములో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి.


1. యమునా జల పూజ

2. అనంత పద్మనాభ స్వామి పూజ

3. ప్రతిసర పూజ


ఈ మూడు ప్రధాన ఘట్టాలకు సంబంధించిన కథలు చెబుతాను.


1. యమునానది తీరంలో ముత్రా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాధవ శర్మ అనే పండితుడి ఇంటిలో ‘బహుళ’ అనే గోమాత ఉంది. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఆ గోవు యమునానదీ పరిసర ప్రాంతాల్లో గల వనంలో గడ్డి మేస్తుంటే ఒక పులి వచ్చి చంపబోయింది. ‘బహుళ’ ఆ పులికి ‘తన దూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు తనని చంపి తినమని’ అని వేడుకుంది.


మొదట ఒప్పుకోకపోయినా, ‘బహుళ’ మాటలలోని నిజాయితి, అమ్మదనం చూసి పులి అక్కడే వేచి ఉంటానని, తొందరగా రమ్మని ‘బహుళ’ను వదలి వేసింది. 


‘బహుళ’ ఇంటికి వెళ్లి తన దూడకు కడుపునిండేలా పాలిచ్చి, మంచి బుద్దులు చెప్పి పులి దగ్గరకు తిరిగి వచ్చింది.


ఈ లోపల పులికి ఏనుగుకి పోరాటం జరిగి ఏనుగు చేత గాయపడి పులి చనిపోయే స్థితిలో ఉంది. మాట నిలబెట్టుకుని తిరిగి వచ్చిన ఆవుని చూసిన పులికి అంత్యదశలో పూర్వజన్మ జ్ఞానము కలిగింది. ‘బహుళ’ను చూసి “మాట నిలబెట్టుకుని తిరిగి వచ్చిన నీవు ప్రశంసనీయురాలివి. భాద్రపద శుద్ద చతుర్దశి నాడు సత్య పాలన వలన నీకు శుభము కలిగింది.


ఈ భాద్రపద శుద్ద చతుర్దశి నాడు గోదానం చేసినవారి ఇళ్ళలో పశుసంపదకు ఎటువంటి హాని జరుగదు. ఈ నా మాటకు యమునా నదీజలాలే సాక్షి. యమునా నది జలాలు ఈనాడు చేసే అనంత పద్మనాభ వ్రతములో పూజినీయత పొంది పూజించ బడతాయి” అని ప్రాణాలు వదిలింది. 


ఆనాటి నుండి అనంత పద్మనాభ వ్రతములో యమునానది జలపూజ భాగమైంది.


అనంత పద్మనాభ వ్రతానికి చెందిన రెండవ కధ వినండి..


2. ధర్మరాజు జూదంలో సమస్తం ఓడిపోయి తమ్ములతో, ద్రౌపదితో పన్నెండేళ్ళ ఆరణ్యవాసం చేస్తున్నాడు. వారిని చూడటానికి శ్రీకృష్ణుడు అరణ్యానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి నమస్కరించి “కృష్ణా! మేము ఈ అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతున్నాము. ఈ కష్టాలు పోయి అరణ్యవాసం చక్కగా జరిగే మార్గము ఏమైనా వుంటే చెప్పుము” అని కోరాడు.


శ్రీకృష్ణుడు పాండవులను చూసి “ధర్మరాజా! సమస్త పాపాలు నశింపచేసి, కష్టాలు తొలగింపచేసి సమస్త సంపదలు, సుఖాలు ఇచ్చే వ్రతము ఒకటి ఉంది. అదే అనంత పద్మనాభ వ్రతము. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయాలి. త్వరలో వచ్చే భాద్రపద మాసంలో ఈ వ్రతము చేయండి. మీరు సకల కష్టాల నుండి బయటపడతారు” అని చెప్పాడు.


ధర్మరాజు కృష్ణుడిని “ఎవరీ అనంతుడు. బ్రహ్మా, ఆదిశేషుడా లేక సాక్షాత్తు నారాయణుడా?” అని ప్రశ్నించాడు.


“ధర్మరాజా! అనంతుడు ఎవరో కాదు. నేనే! నా కాల స్వరూపమే అనంతుడు. అనంతుడైన నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం, భూభారం తగ్గించడం కోసం దేవకీ వసుదేవులకు జన్మించాను.సృష్టి స్థితి లయకారకులైన హరిహరబ్రహ్మాది స్వరూపాలు నావే! నేనే విశ్వమంతా వ్యాపించి అనంతుడిగా ఉంటాను. కనుక అనంత పద్మనాభుడిగా నన్ను కొలిచి పూజించుము. 


నా హృదయంలో పద్నాలుగురు ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్త ఋషులు, భూర్భువశ్లోకాదులు నివసించి ఉన్నారు. సృష్టి సమస్తము అనంత పద్మనాభ స్వరూపమే" అని ఉపదేశించి అనంత పద్మనాభ వ్రత విధానానికి సంబంధించిన కథను వివరించి చెప్పాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

బ్రహ్మచారి

 **బ్రహ్మచారి* : సదా బ్రహ్మమందు ఎవరి మనస్సు సంచరిస్తూ ఉంటుందో వారు బ్రహ్మచారి.అంతే కాని పెళ్లి కానివారు అని చెబుతుంటారు.పెళ్లి మాత్రం చేసుకోకుండా తక్కిన కార్యక్రమాలు చేసేవారు బ్రహ్మచారులు కానేకారు. బ్రహ్మచర్యం అనేది నాలుగు ఆశ్రమాలలో మొదటిది. వేద జ్ఞానాన్ని అభ్యసిస్తూ, మనోవాక్కాయ కర్మలతో పవిత్రంగా జీవించేవారిని బ్రహ్మచారులు అంటారు. బ్రహ్మచారులు ప్రధానంగా నిష్ఠ, కాల పరిమితిని బట్టి రకాలుగా ఉంటారు. *ముఖ్యమైన రకాలు:* నైష్ఠిక బ్రహ్మచారి (ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటించేవారు), మరియు ఉపేతక బ్రహ్మచారి (విద్య పూర్తయ్యే వరకు పాటించేవారు). 

శాస్త్రమ్ ప్రకారం బ్రహ్మచారులు మరికొన్ని రకాలుగా కూడా వర్గీకరించబడ్డారు:

 *సావిత్ర:* ఉపనయన  తర్వాత, కనీసం మూడు రోజులు బ్రహ్మచర్యం పాటించే బ్రహ్మచారి.

 *ప్రాజాపత్య:* దీక్ష తర్వాత కనీసం ఒక సంవత్సరం పాటు కఠినంగా బ్రహ్మచర్యాన్ని పాటించేవారు.

 *బ్రహ్మ-బ్రహ్మచారి:* వేద అధ్యయనం కోసం కొంతకాలం బ్రహ్మచారిగా ఉండేవారు.

 *అస్ఖలిత బ్రహ్మచారి* : మనస్సు, శరీరం ద్వారా ఎటువంటి కామ వికారాలకు లోనుకాకుండా స్థిరమైన బ్రహ్మచర్యం పాటించేవారు. 

 *ముఖ్యమైన విభజన* :

 *నైష్ఠిక బ్రహ్మచారి* : జీవితాంతం వివాహం చేసుకోకుండా సత్య, శౌచ, నియమాలతో గడిపేవారు.

 *ఉపేతక / గృహస్థ-బ్రహ్మచారి* : చదువు పూర్తయ్యాక గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేవారు. 

పంచాంగం

 



🌸శ్రీ రామ స్తుతి 🙏

 🌸శ్రీ రామ స్తుతి 🙏

సీ. సాకేత రామయ్య! స్వామివి నీవయ్య !

               మముకావ రావయ్య మౌనమేల

     తాటకమర్ధనా ! తాపస పూజితా !

                పరమాత్మ ! శ్రీరామ ! పాహి పాహి !

     ఆశ్రితజనపోష ! యఖిలేశ ! రఘువీర !

                సత్యపరాక్రమా ! శరణు శరణు !

     వైకుంఠపురి వాస ! వైజయంతీధరా !

               మైథిలీప్రాణేశ ! మహిత తేజ !

తే.ధర్మ సంస్థాపనము సేయ ధరను నున్న

    ఆదినారాయణా ! నీకు ననవరతము

    నతుల నర్పింతు భక్తితో నతులితముగ

    రమ్యగుణగణశోభితా రామచంద్ర !


జయలక్ష్మి