16, ఏప్రిల్ 2026, గురువారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 15 ఏప్రిల్ 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *58వ భాగం*``


*శ్రీ అనంత పద్మనాభ వ్రతము*```


వామనావతార కథ చెప్పిన తర్వాత సూత మహాముని శౌనకాదులను చూసి “మునులారా! నారాయణుడు భక్త సులభుడు. తనను నిరంతరం భక్తి శ్రద్థలతో కొలిచే భక్తులను తప్పక ఆదుకుంటాడు. పద్మనాభుడైన నారాయణుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక వ్రతము ఉంది.


అదే అనంత పద్మనాభ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినవారికి ఆయురారోగ్య భోగభాగ్యములు లభిస్తాయి. మరణానంతరం శ్రీహరి సన్నిధి లభిస్తుంది. ఈ వ్రతము భాద్రపద శుద్ద చతుర్దశి నాడు ఆచరిస్తారు. అందువలన ఈ చతుర్దశిని అనంత చతుర్దశి అని, పద్మనాభ చతుర్దశి అని కూడా పిలుస్తారు. దేశీయ, ప్రాంతీయ భేదాలను అనుసరించి వివిధ ప్రాంతాల్లో కదళీ చతుర్థి, అఘోర చతుర్థి అని, పాలీ చతుర్థి అని పిలుస్తుంటారు.


నారాయణునికి ఉన్న అనేక నామాలతో అనంత అనే నామము ఒకటి. అనంతుడు అన్న పదానికి ఆది అంతము లేని వాడని, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడని అర్ధాలు ఉన్నాయి. ఈ అనంత పద్మనాభ వ్రతము కామ్యవ్రతము. అనగా మనం కోరుకున్న కోరికలను ఈ వ్రతము ఆచరించడం ద్వారా నెరవేర్చుకోవచ్చును.


ఈ వ్రతాన్ని త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు ఆచరించ కూడదు. పూర్ణిమ తిథితో కలసి ఉండే చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలి. ఈ వ్రతములో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి.


1. యమునా జల పూజ

2. అనంత పద్మనాభ స్వామి పూజ

3. ప్రతిసర పూజ


ఈ మూడు ప్రధాన ఘట్టాలకు సంబంధించిన కథలు చెబుతాను.


1. యమునానది తీరంలో ముత్రా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాధవ శర్మ అనే పండితుడి ఇంటిలో ‘బహుళ’ అనే గోమాత ఉంది. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఆ గోవు యమునానదీ పరిసర ప్రాంతాల్లో గల వనంలో గడ్డి మేస్తుంటే ఒక పులి వచ్చి చంపబోయింది. ‘బహుళ’ ఆ పులికి ‘తన దూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు తనని చంపి తినమని’ అని వేడుకుంది.


మొదట ఒప్పుకోకపోయినా, ‘బహుళ’ మాటలలోని నిజాయితి, అమ్మదనం చూసి పులి అక్కడే వేచి ఉంటానని, తొందరగా రమ్మని ‘బహుళ’ను వదలి వేసింది. 


‘బహుళ’ ఇంటికి వెళ్లి తన దూడకు కడుపునిండేలా పాలిచ్చి, మంచి బుద్దులు చెప్పి పులి దగ్గరకు తిరిగి వచ్చింది.


ఈ లోపల పులికి ఏనుగుకి పోరాటం జరిగి ఏనుగు చేత గాయపడి పులి చనిపోయే స్థితిలో ఉంది. మాట నిలబెట్టుకుని తిరిగి వచ్చిన ఆవుని చూసిన పులికి అంత్యదశలో పూర్వజన్మ జ్ఞానము కలిగింది. ‘బహుళ’ను చూసి “మాట నిలబెట్టుకుని తిరిగి వచ్చిన నీవు ప్రశంసనీయురాలివి. భాద్రపద శుద్ద చతుర్దశి నాడు సత్య పాలన వలన నీకు శుభము కలిగింది.


ఈ భాద్రపద శుద్ద చతుర్దశి నాడు గోదానం చేసినవారి ఇళ్ళలో పశుసంపదకు ఎటువంటి హాని జరుగదు. ఈ నా మాటకు యమునా నదీజలాలే సాక్షి. యమునా నది జలాలు ఈనాడు చేసే అనంత పద్మనాభ వ్రతములో పూజినీయత పొంది పూజించ బడతాయి” అని ప్రాణాలు వదిలింది. 


ఆనాటి నుండి అనంత పద్మనాభ వ్రతములో యమునానది జలపూజ భాగమైంది.


అనంత పద్మనాభ వ్రతానికి చెందిన రెండవ కధ వినండి..


2. ధర్మరాజు జూదంలో సమస్తం ఓడిపోయి తమ్ములతో, ద్రౌపదితో పన్నెండేళ్ళ ఆరణ్యవాసం చేస్తున్నాడు. వారిని చూడటానికి శ్రీకృష్ణుడు అరణ్యానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి నమస్కరించి “కృష్ణా! మేము ఈ అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతున్నాము. ఈ కష్టాలు పోయి అరణ్యవాసం చక్కగా జరిగే మార్గము ఏమైనా వుంటే చెప్పుము” అని కోరాడు.


శ్రీకృష్ణుడు పాండవులను చూసి “ధర్మరాజా! సమస్త పాపాలు నశింపచేసి, కష్టాలు తొలగింపచేసి సమస్త సంపదలు, సుఖాలు ఇచ్చే వ్రతము ఒకటి ఉంది. అదే అనంత పద్మనాభ వ్రతము. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయాలి. త్వరలో వచ్చే భాద్రపద మాసంలో ఈ వ్రతము చేయండి. మీరు సకల కష్టాల నుండి బయటపడతారు” అని చెప్పాడు.


ధర్మరాజు కృష్ణుడిని “ఎవరీ అనంతుడు. బ్రహ్మా, ఆదిశేషుడా లేక సాక్షాత్తు నారాయణుడా?” అని ప్రశ్నించాడు.


“ధర్మరాజా! అనంతుడు ఎవరో కాదు. నేనే! నా కాల స్వరూపమే అనంతుడు. అనంతుడైన నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం, భూభారం తగ్గించడం కోసం దేవకీ వసుదేవులకు జన్మించాను.సృష్టి స్థితి లయకారకులైన హరిహరబ్రహ్మాది స్వరూపాలు నావే! నేనే విశ్వమంతా వ్యాపించి అనంతుడిగా ఉంటాను. కనుక అనంత పద్మనాభుడిగా నన్ను కొలిచి పూజించుము. 


నా హృదయంలో పద్నాలుగురు ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్త ఋషులు, భూర్భువశ్లోకాదులు నివసించి ఉన్నారు. సృష్టి సమస్తము అనంత పద్మనాభ స్వరూపమే" అని ఉపదేశించి అనంత పద్మనాభ వ్రత విధానానికి సంబంధించిన కథను వివరించి చెప్పాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: