26, మే 2022, గురువారం

మహాస్వామి

 మహాస్వామి వారి అన్నపూర్ణావతారం


పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.


సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు.


వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.


రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.


వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.


మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.

మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.


“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”


“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”

మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.


ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన; మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.


“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.


“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.


పరమాచార్య స్వామి వారు వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం