🌹సర్వారుణా🌹
ఆ పరాశక్తి అరుణారుణ అని చెప్పుకున్నాం.
అమ్మ అంతా అరుణమే, ఆమె శరీర చాయ ఎరుపు.
ధరించే ఆభరణాలు ఎర్రవి. కురువింద మణులు పొదగబడిన కిరీటము ఎరుపు.
పద్మరాగమణీ దర్పణాన్ని మించిన తరళమైన చెక్కిళ్ళు,
ఎర్రని రత్నహారాలు ధరించి మనలను ఆశీర్వదిస్తుంది.
మాణిక్యమకుటాల వంటి మోకాళ్ళు అందంగా అమిరాయి.
జపాకుసుమాలు, కౌసుంభము వంటి ఎర్రని పుష్పాలు ఇష్టంగా ధరించి ఆనందపడుతుంది.
ఎర్రని కాంతి వలయంతో ఆ నిజారుణ ప్రభాపూర మెరిసిపోతూ ఉంటుంది.
ఎర్రని రంగుతో భాసించే వస్త్రాలు ధరించి మనలను తరిపింపచేస్తుంది.
ఆరుద్ర పురుగుల ఎరుపులో వున్న తూణీరము వంటి పిక్కలు కలిగినది.
లలితమ్మ అంతా ఎర్రెర్రని ఎరుపే, ఆ సర్వారుణ కు వందనం. 🌹
🌹అనవద్యాంగీ🌹
ఈ నామమును అనవద్యాంగీ అని పలకాలి. నింద లేని అంగములు కలది అని అర్ధం.
ఆ శ్రీదేవి అంగములు అన్నీ చక్కనివి, నిండైనవి. ఆ అవయవ సౌష్టవము లోపమెన్నలేనిది.
ఏ అవయవము ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అదే విధంగా ఉన్నది.
కను ముక్కు తీరు అంటామే అదీ. అమ్మకి ఏ చిన్న అవయవము లోనూ లోపము లేదు.
ఆ దేవి మహా లావణ్య శేవధి కదా, ఏ అంగము లోనూ లోపము వుండనే ఉండదు.
ఏ అవయవ అమరికకూ నింద లేదు, అంటే, వంక లేదు.
ఆపాదమస్తకమూ ఏ విధము గానూ వంక పెట్టలేని, లోపం చూపలేని, నింద చేయలేని
అంగములు కల, ఆ అనవద్యాంగి కి వందనం. 🌹
🌹సర్వాభరణ భూషితా 🌹
ఆ శ్రీ మహారాజ్ఞి సర్వాభరణ భూషిత. అంటే, ఏ అవయవమునకు ఏ ఆభరణం పెట్టుకోవాలో,
ఆ విధంగా అన్ని ఆభరణములనూ అతిశయంగా ధరించిన శ్రీదేవి.
తలపై చూడామణి నుంచి కాలి వేళ్ళకు గల మెట్టెల దాకా సౌభాగ్య చిహ్నాలైన
అన్ని ఆభరణములనూ ఆమె అలంకరించుకుని వుంటుంది.
సౌభాగ్యవతి ఏ ఆభరణములను పెట్టుకోవాలో, ఆ యా ఆభరణాలన్నీ అలంకారప్రాయంగా
వేసుకున్నది. ప్రతి ఆభరణము ఒక్కొక్క అంగానికి అమరి, తాము ప్రకాశాన్నీ,
శోభనూ పొందుతూ ఆ తల్లిని సేవించుకుంటున్నాయి.
ఆ అమ్మ పెట్టుకున్న ఎన్నో నగలు ఇప్పుడు ఎంతో మందికి తెలియవు.
ఉదాహరణకు, ఇడా, పింగళా నాడులను సూచిస్తూ తలపై ఎడమ వైపున చంద్రవంకనూ,
కుడివైపున సూర్యబింబాన్నీ పెట్టుకుంది.
మధ్యలో సుషుమ్నను సూచిస్తూ నాగరాన్ని పెట్టుకుంది.
ముత్తైదువులకు తప్పనిసరిగా ఉండవలసిన పంచ మాంగల్యాలనూ ధరించింది.
కాలికి పసుపు, మధురంగా మోగే మువ్వల మంజీరాలు, మెట్టెలు,
రెండు చేతుల నిండా ఘల్లు ఘల్లుమనే గాజులు,
పాపిట నిండుగా ఎర్రని సిందూరము, తలలో సువాసన భరితమైన పువ్వులు,
చెవులకు దుద్దులు, కంటికి కాటుక, ముక్కుకు ముక్కెర, ఇతర నాసాభరణాలు,
నల్లపూసలు, వివాహసమయంలో భర్త కట్టిన మంగళసూత్రము, వీటిని పంచ మాంగళ్యాలంటారు.
కామేశ్వరి ఆపాదమస్తకమూ అన్ని ఆభరణములనూ ధరించి నిండుగా వున్న సువాసినీమూర్తి.
అన్ని ఆభరణములనూ అందముగా అలంకరించుకున్న ఆ సనాతని, ఆ పెద్దఇల్లాలు,
ఆ అపరాజిత, ఆ సర్వమంగళ, ఆ సర్వాభరణ భూషిత కు వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹