🙏మహాకవి భర్తృహరి 🙏
యోగి కవి భర్తృహరి గురించి: సంస్కృత సాహిత్యంలో యోగికవి భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకకర్తగా, ‘మహాభాష్య’ వ్యాఖ్యానకర్తగా, ‘వాక్యపదీయం’ అనే గ్రంథం రచించిన వైయాకరణుడిగా సుప్రసిద్ధుడు. ‘భర్తృహరి’ అనే పదానికి దేవుని భక్తితో ఆరాధిస్తూ దేవునికే తన జీవితాన్ని అంకితం చేసినవాడని అర్థం- అని పండితవాక్కు.
భర్తృహరి సంస్కృత కవి. ఇతను 5వ శతాబ్దికి చెందినవాడు. సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి.
"సుభాషిత త్రిశతి" లేక "సుభాషిత రత్నావళి" అనేది, కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినది. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయములగు చారిత్రికాధారములు దొరకలేదు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానావిధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తనభార్య దుశ్శీలముచే సంసారమునకు ఇష్టపడక, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వనప్రస్థుడయ్యెనని ఒక ప్రతీతి ఉంది. ఈ విక్రమార్కుడే 'విక్రమ శకాబ్దమునకు' మూల పురుషుడు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి అతనికి జీవితమున ఆశాభంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మదృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును.
పూర్వ సంఘటనలను తెలియజేసిన ఒక గ్రంథములో భర్తృహరి భార్య పేరు అనంగసేన అని యున్నది.
భర్తృహరి భార్య పద్మాక్షి అని యింకొక కథ ఉంది.
భర్తృహరి తల్లి సుశీల, ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమునకు అధికారియై దానిని తన సోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాథ.
ఇంకొక గ్రంథమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు, ఇతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడు అను ముగ్గురు కుమారులును, మైనావతి యను కుమార్తె యునుగా నలుగురు సంతాన మనియును దెలియవచ్చును.
చంద్రగుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు, వారికి యధాక్రమమున వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.
ఇట్టి గాథల పరంపరను బట్టి కవి చరిత్రను నిర్థారించుట ఎంత కష్టమో చదువరులు ఊహించవచ్చును. కాని పై గాథలనుండి ఈ కవి మహారాజు అని, ఇహపర సౌఖ్యములను విడిచి విరాగియై సన్యాసమును స్వీకరించినాడని, గొప్ప విద్వాంసుడనీ, కవి అనీ, యోగి అనీ తెలియుచున్నది.
భర్తృహరి ఈ త్రిశతికి సంధాత మాత్రమే కాని రచయిత కాడని కొందరనుచున్నారు. ఈ త్రిశతి లోని శ్లోకములు ఎక్కువగా భాసుని నాటకాదులందు గాన వచ్చుచున్నవి. కావున నట్లనుట యుక్తముగా దోచుచున్నది. కొన్ని శ్లోకములను ఇతర గ్రంథముల నుండి సంధానించి మరికొన్నింటిని నాతడు రచియించి యీ త్రిశతిని గూర్చి యుండవచ్చును.
సముద్ర గుప్తుడి పుత్రుడైన రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి (క్రీ.శ.375-415) ఆ స్థానంలోని నవ రత్నాలలో ఒకడుగా మహా కవి కాళిదాసు ఉండేవాడు. అతడి ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంలోని అయిదవ అంకంలో 12వ శ్లోకం ‘భవన్తి నమాస్త రవః.. వైష పరోపకారిణం’ భర్తృహరి విరచిత ‘నీతి శతకం’లో 61వ శ్లోకంగా కనిపిస్తుంది. క్రీ.శ. 6వ శతాబ్దం వాడైన విష్ణుశర్మ రచన ‘పంచతంత్రం’లో – భర్తృహరి ‘నీతిశతకం’లోని 85వ శ్లోకమైన ‘గజ భుజంగ విహంగమ బంధనం’ కనబడుతుంది. కనుక భర్తృహరి, కవి కాళిదాసుకు తక్షణకాలం వాడు, విష్ణుశర్మ పూర్వుడు అనీ, అంటే క్రీ.శ.5వ శతాబ్దానికి చెందినవాడనీ రూఢీ అవుతోంది.
క్రీ.శ.691లో భారతదేశానికి వచ్చిన చైనా దేశీయుడు ‘ఇత్సింగ్’ నలందాలో విద్యార్థిగా ఉంటూ భర్తృహరిని బౌద్ధ సన్యాసిగా పేర్కొన్నాడు. భర్తృహరి శాస్త్ర గ్రంథాలపై అతడు ప్రసంగిస్తూ-భర్తృహరి మానవనీతి సూత్రాలనూ రచించాడనీ తెలిపాడు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ