🪷 *బుధవారం - జూన్ 5, 2024*🪷
_*🚩వైశాఖ పురాణం🚩*_
_*27 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*కలిధర్మములు - పితృముక్తి*
☘☘☘☘☘☘☘☘☘
నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి, మహామునీ ! ఈ వైశాఖమాసముననుత్తములగు తిధులేవి ? దానములలో నుత్తమ దానములేవి ? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి ? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను.
అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా ! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని ఏకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలన ఫలితము , అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము , దానము , తపము , హోమము , దేవతార్చన , సత్ర్కియలు , హరికథాశ్రవణము ఇవన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.
పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు , గోహత్య , కృతఘ్నత , తల్లిదండ్రులకు ద్రోహము చేయుట , తనకు తానే అపకారము చేసికొనుట , మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలవవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము , సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు , ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు ? ఎవరునుండరని భావము.
దరిద్రులు , ధనవంతులు కుంటివారు , గ్రుడ్డివారు , నపుంసకులు , విధవలు , విధురులు(భార్యలేనివారు), స్త్రీలు , పురుషులు , బాలురు , యువకులు , వృద్ధులు , రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు , చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిథిని చెప్పుదును వినుము.
మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.
ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.
అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు , దానధర్మములులేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.
ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిశ్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిశ్నమును , నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును , జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.
ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను , జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.
భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను , శిష్యుడు గురువును , సేవకుడు యజమానిని , పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు ఇంకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు , గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు , ధర్మప్రవక్తలు , జటాధారులు , సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని , తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను , గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.
జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు , నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా , ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు , ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను , నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా ! వేదములయందు చెప్పిన క్రియలను , శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ , శాస్త్రచర్చ , యాగ దీక్ష , కొద్దిపాటి వివేకము , తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.
ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.
ధర్మవర్ణుడును దీనులై , యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను ? మీరే వంశము వారు ? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు ఓయీ ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు , శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా ? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను ఇది యొకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును ఈ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన ఈ గడ్డికి అంకురములులేవు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ ఎలుక మిగిలిన ఈ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది , చీకటితో నిండినది.
కావున నాయనా ! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచు చున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికి ఈ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనే నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు ఇందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశ్వమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము , శ్రాద్దము మున్నగునవి చేయవచ్చును. ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.
తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువ మంది యున్న ప్రయోజనమేమి ? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి ? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను ఈ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.
ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై ఇట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము , నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును , పితృదేవతలను , ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.
ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా ! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా ! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని ఎట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా ! విష్ణుకథలయందనురక్తి , స్మరణము , సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని , భారతము గాని ఇంటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము , కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము , తులసి , గోవు ఉన్నఇంటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని ఇచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును , శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.
ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.
_*వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం*_
🌷 *సేకరణ*🌷
🌹🌷🪷🪷🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🙏🪷🌷🪷🌷🪷🌷🪷🙏