భాస్కర శతకము

 భాస్కర శతకము చంపకమాల, ఉత్పలమాల వంటి వృత్త చెందస్సులో వ్రాసిన పద్యాలు.  ఇప్పటి వాడుక తెలుగు కన్నా కొంచం ప్రౌఢంగా వుంటాయని చెప్పవచ్చు.  ఇవి సుమతి, వేమన శతకాల లాగా సరళంగా వుండవు.  కానీ చక్కని నీతులు ఇందులో పొందుపరచి వున్నాయి.  పిల్లలకి ఈ శతకం నేర్పటం వలన తెలుగు భాషలోని ప్రౌఢత్వాన్ని కొంత తెలియపరచ వచ్చు.  ఇవి వృత్త చెందస్సులో వున్నందువలన శతకకారునికి ప్రతి పద్యంలో కావలసినంత నిడివి ఉన్నందువల్ల చక్కటి ఉపమానాలతో పద్యాల గమనం సాగుతుంది. ఇక చదవండి  

శ్రీగలభాగ్యశాలికడఁ జేరఁగ వత్తురు తారుదారె దూ
 రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి రత్ననిలయం డనికాదె సమస్తవాహినుల్
సాగరుఁ జేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కరా.

అదర మింత లేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికిన్
భేదముచేయుటన్ దనదుపేర్మికిఁ గీడగు మూలమె ట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనజుండు గుణాడ్యుఁడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా.


అడిగిన యట్టి యాచకులయాశ లెఱుంగక లోభవర్తియై
కడపిన దర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె
య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చుటనైన లేఁగలన్
గడువఁగ నీనిచోఁగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా.

అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెం డనన్
 మొదటికిమోసమౌఁ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే
 పిదికినఁగాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా.

అనఘునికైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరిచినంతలో
మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైనఁ దప్పవు యథార్థము తా నది యెట్టులన్నచో
 నినుమునుగూర్చి యగ్నినలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా.

ఒరిగిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
బెగయెఁగ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా!  

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!  

తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకి చేకొనన్
వలయు నటైన దిద్దు కొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడు నప్పుడు చేత నద్దముం
గలిగిన చక్కఁ జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!  

ఉరుగుణవంతుఁ డొండు తనకొండపకారము సేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొక పట్టున నైనను గీడుఁ జేయఁ గా
నెఱుఁగడు నిక్కమే కద; యదెట్లనఁ గవ్వము బట్టి యెంతయున్
దరువఁగఁ జొచ్చినం బెరుఁగు తాలిమి నీయదె వెన్న, భాస్కరా!  

బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!  

సన్నుత కార్య దక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొక మేలొపరించు; సత్వ సం
పన్నుడు భీముడా ద్విజుల ప్రాణము కావడే ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా!  

పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వాని యెడ దొడ్డగ చూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె
ర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా!  

దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు, ప్ర
త్యక్షము; వాగులున్ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!

తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి; తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా!  

ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చింమట కేమి ఫలంబు భాస్కరా!  
ఇంకా వున్నాయి 

కామెంట్‌లు లేవు: