23, అక్టోబర్ 2021, శనివారం

చిట్టికథ

 ✍️...నేటి చిట్టికథ


----మహాభారతము నుండి....



ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది.


 స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. 


ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. 


గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు.


 అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.


ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయంగా అడిగాడు. 


అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.


ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”


గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”


ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”


గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”


ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”


గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”


ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”


గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”


ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”


గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”


ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”


గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”


ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”


గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”


ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”


గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”


ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”


గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”


ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”


గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”


ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”


గౌతముడు: “గోలోకం?”


ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”


గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”


ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”


ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు.


 “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు.


 సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.


🪴🪴🪴🪴🪴🪴🪴

ఏ కవి ఏ గ్రంథం వ్రాశాడోనని

 ఏ కవి ఏ గ్రంథం వ్రాశాడోనని చెప్పాలంతే.

............................................................


(1) విక్రమార్కచరిత్ర గ్రంథకర్త ఎవరు ?


(అ) మడికిసింగన

(ఆ) అనంతుడు

(ఇ) జక్కన

(ఈ విన్నకోట పెద్దన


(2) పాండురంగ మహత్మ్యం గ్రంథకర్త ఎవరు ?


(అ) అయ్యలరాజు తిప్పయ్య

(ఆ) తాళ్ళపాక తిరువెంగళప్ప

(ఇ) తెనాలి రామలింగడు

(ఈ) తెలగాచార్యుడు


(3) త్రిపురాంతకోదాహారణం గ్రంథకర్త ఎవరు ?


(అ) రావిపాటి త్రిపురాంతకుడు

(ఆ) రావిపాటి గణపారాధ్యుడు

(ఇ) రావిపాటి అమరేశ్వరుడు

(ఈ) రావిపాటి శర భాంకుడు


(4) మరుత్తరాట్చరిత్ర గ్రంథకర్త ఎవరు ?


(అ) శివదేవయ్య

(ఆ) శ్రీనాథుడు

(ఇ) మంచన

(ఈ) నన్నేచోడుడు


(5) శుకసప్తతి గ్రంథకర్త ఎవరు ?


(అ) అయ్యలరాజు నారాయణామాత్యుడు

(ఆ) గౌరన

(ఇ) పాలవేకరి కదిరీపతి

(ఈ) కందుకూరి రుద్రకవి


(6) సుభద్రకళ్యాణం గ్రంథకర్త ఎవరు ?


(అ) తాళ్ళపాక వెంగమాంబ

(ఆ) కుమ్మరిమొల్ల

(ఇ) తాళ్ళపాక తిమ్మక్క

(ఈ) గంగాంబ


(7) బారిష్టర్ పార్వతీశం గ్రంథకర్త ఎవరు ?


(అ) నోరినరసింహాశాస్త్రి

(ఆ) మండపాక పార్వతిశాస్త్రి

(ఇ) మొక్కపాటి నరసింహశాస్త్రి

(ఈ) కాళోజి నారాయణరావు


(8) త్వమేవా అహం ( త్వమేవాహం) గ్రంథకర్త ఎవరు ?


(అ) శ్రీ శ్రీ

(ఆ) భమిడిపాటి కామేశ్వరరావు

(ఇ) తాపీధర్మారావు

(ఈ) ఆరుద్ర


(9) సాక్షి గ్రంథకర్త ఎవరు ?


(అ) పానుగంటి లక్ష్మీనరసింహారావు

(ఆ) ఉన్నవ లక్ష్మీనారాయణ

(ఇ) పింగళి లక్ష్మీకాంతం

(ఈ) ద్వార కానాథశాస్త్రి


(10) వాసవి మహత్మ్యం / వైశ్యపురాణం గ్రంథకర్త ఎవరు ?


(అ) ఆరవీటిరాజుల కాలంలోనున్న భాస్కరాచార్యుడు

(ఆ) పెదకోమటి వేముడు

(ఇ) అవచిదేవయ్యశెట్టి

(ఈ) గాజులలక్ష్మినరసింహశెట్టి

................................................................................................................. జి.బి.విశ్వనాథ.గోరంట్ల, అనంతపురం జిల్లా.9441245857.

అంతమంది దేవతలు

 🕉 హిందువులకు అంతమంది దేవతలు ఎందుకున్నారు.. అలా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా ? 🕉


👉 మన భారతదేశంలో ఎన్నో కుల మతాలకు నిలయం.

ఈ విధంగా ఒక్కో మతం వారు ఒక్కో దేవున్ని పూజిస్తారు. 

ముస్లిములు అల్లాను ప్రార్థిస్తే,

 క్రైస్తవులు ఏసుప్రభు కొలుస్తారు. 

బౌద్ధులు బుద్ధుడిని ప్రార్థిస్తారు. 

కానీ హిందువులు మాత్రం ఆంజనేయ స్వామి, శివుడు, నారాయణుడు, శ్రీరాముడు, అమ్మవారు అంటూ వివిధ దేవతలను పూజిస్తారు.


👉 ఈ విధంగా హిందువులు మాత్రమే ఇంత మంది దేవతలను పూజించడానికి కారణం ఏమిటి ? అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం దొరకదు. 

అయితే పురాణాల ప్రకారం మనకు ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం...


👉 హిందువులు అంతమంది దేవుళ్లను ఎందుకు పూజిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా... తల్లి తన బిడ్డకు ఆకలి వేస్తే చేతిలో గరిట పట్టుకుని అన్నపూర్ణాదేవిగా మారి తన బిడ్డ ఆకలి తీరుస్తుంది.

 అదేవిధంగా తన బిడ్డ అల్లరి చేస్తే ఆదిపరాశక్తిగా మారుతుంది. 

చదువుల విషయంలో తన బిడ్డకు చేదోడువాదోడుగా ఉంటూ సరస్వతిగా, డబ్బులు అవసరమైతే లక్ష్మీదేవిగా మారుతుంది. 

ఈ విధంగా మన కళ్ళ ఎదురుగా ఉన్న తల్లి అనేక రూపాలలో కనిపిస్తుంటే ఈ సృష్టిని సృష్టించిన ఆ భగవంతుడు తన బిడ్డల కోసం ఎన్ని రూపాలలోనైనా దర్శనమిస్తాడు కదా.


👉 మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లోకధర్మం కోసం ధర్మాన్ని నిలబెట్టి, శత్రుసంహారం చేయడం కోసం ఒక్కో యుగంలో ఒక్కో అవతారం అంటే కృష్ణుడు గాను, నారాయణుడు గాను, శ్రీ హరి గాను, నరసింహ స్వామి గాను వివిధ రూపాలలో అవతారమెత్తారు కనుక హిందువులు ఒకే దేవుడిని వివిధ రూపాలలో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఈ విధంగా దేవుడు సృష్టించిన ఈ బిడ్డలను రక్షించడం కోసం భగవంతుడు అనేక రూపాలలో ఉండటం వల్లే హిందూమతంలో ఇంతమంది దేవతలు ఉన్నారు. 

ప్రకృతిలో ప్రతి దానిని పూజించే హిందువులకు ఎందుకు అంత మంది దేవతలు ఉన్నారని అడిగితే అది అర్థం లేని ప్రశ్నగానే మిగులుతుంది అని చెప్పవచ్చు.http://t.me/manasamskruthi

నైవేద్యము

 🌿🌿🌿🌿🌿🌿🌿


ఒక దేవాలయంలో బ్రాహ్మణుడు ప్రతిరోజు బిక్షాటన చేసుకొని వచ్చి, వచ్చిన ద్రవ్యముతో భగవంతునికి నైవేద్యము పెట్టేవాడు..


🌸🌿🌸🌿🌸


ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచేవాడు .అలా కాలము గడుచుతున్న సమయంలో ఒక రోజు ఒక కోటీశ్వరుడు దేవాలయమునకు వచ్చాడు. ఆ కోటీశ్వరుడిని చూడగానే బ్రాహ్మణుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది .కోటీశ్వరుడు దేవాలయమునకు వచ్చాడు కదా.. ఈరోజు ఈయన వేసే ధనముతో రేపు స్వామి వారికి మంచి భోజనం పెడదాము అని మనసులో అనుకున్నాడు బ్రాహ్మణుడు. 


 కోటీశ్వరుడు లోపలికి రాగానే యోగ సమాచారాలను కనుక్కుని ఆయన పేరుమీద అర్చన చేసి మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆయన వేసే దక్షణ కోసము ఎదురు చూస్తున్నాడు బ్రాహ్మణుడు.


 అప్పుడు ఆ కోటీశ్వరుడు జేబులో చేయిపెట్టి 2000 రూపాయల నోటు తీసాడు బయటకి.మళ్ళీ జేబులో చేయి పెట్టి 500,100,50,20,10,5 నోట్లు తీసాడు వరుసగా బయటకి. అప్పుడు బ్రాహ్మణుడు మనసులో అనుకుంటాడు 2685 రూపాయలు ఇస్తున్నాడు ఈయన. కాబట్టి స్వామివారికి 4 రోజులు మంచిమంచి నైవేద్యము చేసి పెట్టవొచ్చు అనుకుంటాడు.మళ్ళీ కోటీశ్వరుడు జేబులో చేయిపెట్టి రెండు రూపాయల బిళ్ళ బయటకు తీసి మిగతా ధనాన్ని అంతా జేబులో పెట్టుకొని రెండు రూపాయలు బ్రాహ్మణుడి చేతికి ఇచ్చి కాళ్ళు మొక్కి పోతాడు.


 ఆ రెండు రూపాయల బిళ్ల ను చూడగానే బ్రాహ్మణుడికి మూర్చ వచ్చి కిందపడతాడు.


  ఈ విషయాన్ని గమనించిన భగవంతుడు మారు 

వేషము లో వచ్చి బ్రాహ్మణుడి ముఖం పై నీళ్ళు చిలకరించి లేపి ఏమైంది స్వామి అని అడుగుతాడు బ్రాహ్మణుడిని.( మారువేషంలో వున్న భగవంతుడు)


 అప్పుడు ఆ బ్రాహ్మణుడు జరిగిందంతా పూర్తిగా వివరిస్తాడు .


 అప్పుడు మారు వేషం లో వున్న భగవంతుడు ఇలా చెబుతాడు..


 భగవంతుని దృష్టిలో అందరూ సమానమే కాని ధనము ఉండి కూడా దాన ధర్మములు చేయనివాడు మళ్లీ జన్మలో కాకిగా పుడతాడు. ధాన ధర్మాలు చేస్తూ కాలము గడిపేవాడు దేవాలయాలలో గోమాతగా పుడుతాడు.అంతే కాని వాళ్ళు ఇంత ఇస్తారు.. వీళ్ళు ఇంత ఇస్తారు అనే ఆలోచన పెట్టుకోకు స్వామి అని వెళ్లి పోతాడు.


ఈ కథలో సారాంశం ఏమిటంటే ఎవరిమీద ఆశ పెట్టుకోకు ఇచ్చేవాడు ఇస్తాడు ఇవ్వనివాడు ఇవ్వడు అంతేకాని ఎవరినీ నిందించకు అని అర్థము .


అన్నింటినీ ఆ భగవంతునికే వదిలేయి. ఆయనే చూసుకుంటాడు.

శ్రీమద్వాల్మీకి రామాయణం



ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                --------------------


    2. సార్వభౌమత్వము - సామ్రాజ్య విధానము 


ప్రస్తుత సామ్రాజ్యవాదం 


    ప్రస్తుత ప్రపంచంలో, స్వార్థంతో ఒక ప్రభుత్వం 

  - ఇతర దేశాలపై దాడిచేసి, 

  - వలస రాజ్యాలనేర్పరచి, 

  - తమ జాతిలో అల్పులైనవారిని కూడా ఉన్నతాధికారులను చేసి, 

  - వారి పరిపాలన ద్వారా అనేక విధాలుగా ఆ దేశాల ప్రజల ధన మాన ప్రాణాలను కొల్లగొట్టటం నేటి సామ్రాజ్యవాదం.  

    బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పాలించడం వీటికి ఒక గొప్ప ఉదాహరణ. 


    వ్యాపార విస్తరణ పేరుతోనూ, మానవ వనరులు సంపదలు ఉపయోగించుకుంటూనూ, ఇతర దేశాల సంపద దోచుకొనడం మరొక విధమైనది. దీనిని మనం ప్రస్తుతం చూస్తున్నాం. 


రామాయణం - ఇక్ష్వాకు వంశ సార్వభౌమత్వం 


    వాల్మీకి రామాయణంలో, ఈ భూమండలమంతా ఇక్ష్వాకు వంశీయులది అని పేర్కొనబడింది. 

    అయోధ్య కేంద్రంగా ప్రత్యక్ష పరిపాలన అందిస్తూ సార్వభౌమత్వాన్ని వారు కలిగియున్నారు. 

     కానీ వారంతటవారు ఇతర రాజ్యాలపై ఆధిపత్యానికి ఎప్పుడూ సంకల్పించలేదు. 


శ్రీరాముని పరిపాలన. 

     

    శ్రీరాముడు - 

* తనంతట తాను ఏ దేశము మీదా దండయాత్ర చేయలేదు. 

   ఆయా దేశాల రాజ కుటుంబీకుల సభ్యులుగానీ, మహర్షులుగానీ కలసినమీదటనే, ఆయా దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకున్నాడు. 

* కిష్కింధను గానీ, లంకను గానీ, ఏ ఇతర రాజ్యాలనుగానీ కొల్లగొట్టలేదు. 

* వారి భూములను ఆక్రమింపలేదు. 

* ఆ రాజ్యములలో తనవారిని ఉద్యోగాలలో నియమింపలేదు. 

* కప్పములు కోరలేదు. 

* పరిపాలనాధికారములందు జోక్యము కలిగించుకోలేదు. 

* ఒక్కసారియైన వారి రాజధానీ నగరములలో ప్రవేశింపలేదు. 

* ఆ రాజ వంశములకు చెందినవారినే ప్రభువులను గావించాడు. 


భారతీయత 


    సర్వ శక్తిమంతులుగా ఉంటూ, 

    దురాక్రమణలు చేయక - చేయబడక, 

    ఇతర దేశాలపై నియంత్రణ - పరిపాలనాధిపత్యాలు లేకుండా, 

    సర్వస్వతంత్ర దేశంగా, 

    ప్రపంచదేశాలకు మార్గదర్శిగా, 

    సార్వభౌమత్వాన్ని కలిగి ఉండడమే "భారతీయత" అనేది శ్రీమద్రామాయణం ద్వారా తెలుస్తుంది కదా! 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

స్నేహితుల బెంచి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

A wonderful new idea for implementing in school by Subramanyam Valluri garu with graceful acknowledgement.

            🌷🌷🌷

నిన్న మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను చాలా రోజుల తరువాత. వాడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది.


నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ "ఏరా, మీ స్కూల్లో ఇదొక్కేటేనా బెంచి కూర్చోవడానికి"


"కాదు తాతగారు, ఆ బెంచ్ *'స్నేహితుల బెంచి'* అన్నాడు నా మనవడు నాతో.


నేను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా?"


నా మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాతాగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి, వాళ్ళతో జతకట్టడానికి, స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి, ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు.


నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన ఎవరిదో కానీ అనుకుని, మావాడిని అడిగాను "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?"


"కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నాతో నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు.

"నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు అన్నాడు.


తరువాత వాడు వాడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. 


నేను చేరిన కొత్తలో మా టీచర్ పిల్లందరిని క్లాస్ లో ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు నేనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు.


ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి, జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది.


నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాను నేను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరు లేరు. ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో.


 *సుబ్రహ్మణ్యం వల్లూరి.*

ప్రశ్నావళి

 వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?

________________________________


(1) దారుకావనం మహాబుుషులకు సపత్నులకు సత్ పురుషులకు ఆలవాలం. ఈ దారుకావనంలో బిక్షాటన చేసిన దెవరు ?


(అ) బిక్షాటన ప్రవృత్తిగా గల పరమశివుడు

(ఆ) ఒకసంవత్సర విదేశీయానంలో నున్న అర్జునుడు

(ఇ) మాయావేషంలో రాక్షసులను మభ్యపెట్టిన ఇంద్రుడు

(ఈ) బ్రహ్మచర్యవ్రతంలోనున్న బుుష్యశృంగుడు.


(2) కిరాతార్జునీయకథను సంస్కృతంలో వ్రాసినవాడు భారవి. కిరాతార్జునీయంలో శివుడు అర్జునునకు ఇచ్చిన అస్త్రమేది ?


(అ) భైరవాస్త్రం

(ఆ) నాగాస్త్రం

(ఇ) పాశుపతాస్త్రం

(ఈ) ప్రమదగణాస్త్రం


(3) ముసిడిచౌడయ్య కథగల గ్రంథమేది ?


(అ) బసవపురాణం

(ఆ) పండితారాధ్యచరిత్ర

(ఇ) వృషాధిపశతకం

(ఈ) అనుభవసారం


(4) వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?


(అ) మహకవి కాళిదాసు

(ఆ) వీరభద్రవిజయ గ్రంథకర్తైన పోతనామాత్యుడు

(ఇ) పిల్లలమర్రి పిన వీరభద్రుడు

(ఈ) శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి బానయ.బానయ పంచతంత్రగ్రంథాన్ని వ్రాసి లక్ష్మినారాయణ పండితులకు అంకితమిచ్చాడు.ఆ బానయే వాణి నా రాణి అన్నాడా


(5) విరాటపర్వంలో ద్రౌపతిని వేధించినవాడెవరు ?


(అ) కీచకుడు

(ఆ) జరాసంధుడు

(ఇ) మాలాకారుడు (దండలు కూర్చువాడు) మోదకుడు

(ఈ) గజవాహిణి అధికారైన అహోబలుడు


(6)ఉత్తరభారతంలోని మధురానగర నిర్మాత ఎవరు ?


(అ) వసుదేవుడు

(ఆ) కంసుడు

(ఇ) భరతుడు

(ఈ) శత్రుఘ్నుడు


(7) మత్స్యయంత్రమును భేదించినవాడెవరు ?


(అ) శ్రీకృష్ణుడు

(ఆ) భీమసేనుడు

(ఇ) ఇంద్రుడు

(ఈ) అశ్వత్థామ


(8) మత్స్యయంత్రాన్ని భేదించినవాడెవరు ?


(అ) కార్త్యవీర్యుడు

(ఆ) పాండవమధ్యముడు

(ఇ) కృపి

(ఈ) కృపాచార్యుడు


(9) రెండుసార్లు తాత్కాలికంగా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ?


(అ) రాజగోపాలాచారి

(ఆ) ఐ.కే.గుజ్రాల్

(ఇ) జవహార్ లాల్ నెహ్రు

(ఈ) గుల్జారిలాల్ నందా


(10) స్వతంత్రభారతానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు ?


(అ) లార్డ్ మౌంట్ బాటెన్

(ఆ) జనరల్ కరియప్ప

(ఇ) రాజగోపాలాచారి

(ఈ) సర్డార్ వల్లభాయ్ పటేల్


_____________________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. గోరంట్ల, అనంతపురం జిల్లా.


  జవాబులను 


 


వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?

________________________________


(1) దారుకావనం మహాబుుషులకు సపత్నులకు సత్ పురుషులకు ఆలవాలం. ఈ దారుకావనంలో బిక్షాటన చేసిన దెవరు ?


(అ) బిక్షాటన ప్రవృత్తిగా గల పరమశివుడు✅

(ఆ) ఒకసంవత్సర విదేశీయానంలో నున్న అర్జునుడు

(ఇ) మాయావేషంలో రాక్షసులను మభ్యపెట్టిన ఇంద్రుడు

(ఈ) బ్రహ్మచర్యవ్రతంలోనున్న బుుష్యశృంగుడు.


(2) కిరాతార్జునీయకథను సంస్కృతంలో వ్రాసినవాడు భారవి.కిరాతార్జునీయంలో శివుడు అర్జుననకు ఇచ్చిన అస్త్రమేది ?


(అ) భైరవాస్త్రం

(ఆ) నాగాస్త్రం

(ఇ) పాశుపతాస్త్రం✅

(ఈ) ప్రమదగణాస్త్రం


(3) ముసిడిచౌడయ్య కథగల గ్రంథమేది ?


(అ) బసవపురాణం✅

(ఆ) పండితారాధ్యచరిత్ర

(ఇ) వృషాధిపశతకం

(ఈ) అనుభవసారం


(4) వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?


(అ) మహకవి కాళిదాసు

(ఆ) వీరభద్రవిజయ గ్రంథకర్తైన పోతనామాత్యుడు

(ఇ) పిల్లలమర్రి పిన వీరభద్రుడు✅

(ఈ) శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి బానయ.బానయ పంచతంత్రగ్రంథాన్ని వ్రాసి లక్ష్మినారాయణ పండితులకు అంకితమిచ్చాడు.ఆ బానయే వాణి నా రాణి అన్నాడా


(5) విరాటపర్వంలో ద్రౌపతిని వేధించినవాడెవరు ?


(అ) కీచకుడు✅

(ఆ) జరాసంధుడు

(ఇ) మాలాకారుడు (దండలు కూర్చువాడు) మోదకుడు

(ఈ) గజవాహిణి అధికారైన అహోబలుడు


(6)ఉత్తరభారతంలోని మధురానగర నిర్మాత ఎవరు ?


(అ) వసుదేవుడు

(ఆ) కంసుడు

(ఇ) భరతుడు

(ఈ) శత్రుఘ్నుడు✅


(7) మత్స్యయంత్రమును భేదించినవాడెవరు ?


(అ) శ్రీకృష్ణుడు✅

(శ్రీకృష్ణుడు మద్రరాజు ప్రకటించిన స్వయంవరంలో పాల్గొని, మత్స్యయంత్రాన్ని భేదించి లక్షణను పరిణయమాడాడు.)

(ఆ) భీమసేనుడు

(ఇ) ఇంద్రుడు

(ఈ) అశ్వత్థామ


(8) మత్స్యయంత్రాన్ని భేదించినవాడెవరు ?


(అ) కార్త్యవీర్యుడు

(ఆ) పాండవమధ్యముడు✅

(ఇ) కృపి

(ఈ) కృపాచార్యుడు


(9) రెండుసార్లు తాత్కాలికంగా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ?


(అ) రాజగోపాలాచారి

(ఆ) ఐ.కే.గుజ్రాల్

(ఇ) జవహార్ లాల్ నెహ్రు

(ఈ) గుల్జారిలాల్ నందా✅


(10) స్వతంత్రభారతానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు ?


(అ) లార్డ్ మౌంట్ బాటెన్

(ఆ) జనరల్ కరియప్ప

(ఇ) రాజగోపాలాచారి✅

(ఈ) సర్డార్ వల్లభాయ్ పటేల్


_____________________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. గోరంట్ల, అనంతపురం జిల్లా.

అగ్నిమ‌హాపురాణం టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు

 


అగ్నిమ‌హాపురాణం, ఉత్త‌ర హ‌రివంశం గ్రంథాల‌ను ఆవిష్క‌రించిన టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి


           టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ముద్రించిన అగ్నిమ‌హాపురాణం(ప్ర‌థ‌మ భాగం), ఉత్త‌ర హ‌రివంశం (ప్ర‌థ‌మ, ద్వితీయ సంపుటాలు) గ్రంథాల‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్ర‌వారం తిరుమ‌లలోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆవిష్క‌రించారు.


           ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ స‌నాత‌న హైందవ ధ‌ర్మ వ్యాప్తిలో భాగంగా ఇతిహాసాల‌ను, పురాణాల‌ను స‌ర‌ళ‌మైన తెలుగులోకి అనువ‌దించి సామాన్య పాఠ‌కులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు. అగ్నిమ‌హాపురాణంలో మొత్తం 383 అధ్యాయాల్లో 11 వేల‌కు పైగా శ్లోకాలు ఉన్నాయ‌ని, ప్ర‌థ‌మ భాగంలో 209 ఆధ్యాయాల్లో 5,780 శ్లోకాలు ఉన్నాయ‌ని తెలిపారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం సంస్కృత‌ విశ్రాంతాచార్యులు డా. కె.ప్ర‌తాప్ తెలుగులోకి చ‌క్క‌గా అనువ‌దించార‌ని వివ‌రించారు. అదేవిధంగా శ్రీ నాచ‌న సోమ‌న ర‌చించిన ఉత్త‌ర హ‌రివంశం గ్రంథంలో ఆరు ఆశ్వాసాలు ఉన్నాయ‌ని, వీటిని రెండు సంపుటాలుగా శ్రీ కృష్ణ‌దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యం తెలుగు విశ్రాంతాచార్యులు డా. తుమ్మ‌పూడి కోటేశ్వ‌ర‌రావు తెలుగులోకి అనువ‌దించార‌ని చెప్పారు. ఈ రెండు గ్రంథాల‌ను జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేసిన పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌కు, ఇత‌ర పండిత ప‌రిష‌త్ పెద్ద‌ల‌కు కృత‌జ్ఞ‌తాభినందనలు తెలియ‌జేశారు.


            టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు పూర్వ‌ ప్ర‌త్యేకాధికారి డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య మాట్లాడుతూ భ‌గ‌వంతుడు వేదాల్లో చెప్పిన విష‌యాల‌ను అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా విశ‌దీక‌రించేందుకు 18 పురాణాలను వేద‌వ్యాసుల వారు ర‌చించార‌ని చెప్పారు. అగ్నిపురాణంలోని అంశాల‌ను అగ్నిదేవుడు వ‌శిష్టుడికి చెప్పారని, మాన‌వ‌జీవితం సార్థ‌క‌మ‌య్యేందుకు కావాల్సిన అన్ని విష‌యాలు ఇందులో ఉన్నాయ‌ని వివ‌రించారు. ఈ గ్రంథంలో శ్లోకాల‌కు తాత్ప‌ర్యం, విశేషాంశాల‌ను తెలియ‌జేశామ‌న్నారు. టిటిడిలో పురాణాల అనువాదం ఒక మ‌హాయ‌జ్ఞంలా జ‌రుగుతోంద‌ని చెప్పారు. మ‌హాభార‌తానికి అనుబంధంగా ఉన్న గ్రంథం ఉత్త‌ర హ‌రివంశం అన్నారు.


           ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌, పండిత ప‌రిష‌త్ స‌భ్యులు డా. కొంపెల్ల రామ‌సూర్య‌నారాయ‌ణ‌, డా. శ్రీ‌పాద స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి, డా. శ్రీ‌పాద సుబ్ర‌మ‌ణ్యం, డా. ధూళిపాళ ప్ర‌భాక‌ర కృష్ణ‌మూర్తి, డా. తూమాటి సంజీవ‌రావు, డా. సాయిరాం సుబ్ర‌మ‌ణ్యం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. రేమెళ్ల రామకృష్ణ శాస్త్రి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, డా. స‌ముద్రాల ద‌శ‌ర‌థ్, డా.ఎన్.నరసింహాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


------------------------------------------------------  


టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.