🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
A wonderful new idea for implementing in school by Subramanyam Valluri garu with graceful acknowledgement.
🌷🌷🌷
నిన్న మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను చాలా రోజుల తరువాత. వాడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది.
నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ "ఏరా, మీ స్కూల్లో ఇదొక్కేటేనా బెంచి కూర్చోవడానికి"
"కాదు తాతగారు, ఆ బెంచ్ *'స్నేహితుల బెంచి'* అన్నాడు నా మనవడు నాతో.
నేను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా?"
నా మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాతాగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి, వాళ్ళతో జతకట్టడానికి, స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి, ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు.
నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన ఎవరిదో కానీ అనుకుని, మావాడిని అడిగాను "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?"
"కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నాతో నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు.
"నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు అన్నాడు.
తరువాత వాడు వాడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి.
నేను చేరిన కొత్తలో మా టీచర్ పిల్లందరిని క్లాస్ లో ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు నేనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు.
ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి, జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది.
నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాను నేను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరు లేరు. ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో.
*సుబ్రహ్మణ్యం వల్లూరి.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి