_*🚩వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము🚩*_
🕉🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️
*కుమార జననము*
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను ఇంటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును , ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.
పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.
శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.
హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఈయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.
లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు , విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు , మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు , మునులు , షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.
హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని ఇంటను , రాత్రులయందు సరస్తీరముల యందు , పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.
ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.
వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా ! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి శివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.
శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.
అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును , ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.
బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.
ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా ! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము , పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.
పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.
రాజా ! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను , వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున *వైశాఖమాస వ్రతము* అన్ని పాపములను పోగొట్టును , మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను , పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు , భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి , దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.
*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏