2, మే 2023, మంగళవారం

ఆర్య చాణక్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 48*


"మహాజనులారా ! రండి. మా గురుదేవుల వారి అత్యద్భుత శక్తి సామర్థ్యాలను గ్రహించండి. వారి రక్షణ పొంది మీకు గల దీర్ఘరోగాలనుండీ భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి పొందండి. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించండి. రండి. కదలిరండి... వేలాదిగా తరలి రండి ... గురుదేవుల వారి దర్శనం చేసుకుని తరించండి..." అంటూ నడివీధి మధ్యన నిలచి బిగ్గరగా ప్రచారం ప్రారంభించాడు ఒక శిష్యుడు. జనం క్రమక్రమంగా అతని చుట్టూ మూగి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. 


"మా గురువుగారి పేరు జీవసిద్ధి. వారు అఖండ ప్రజ్ఞావంతులు. దైవాంశ సంభూతులు. ఆయనతో దేవుడు మాట్లాడుతుంటాడు. దుఃఖ పీడితులకు తరుణోపాయాన్ని ఆ దేవుడే మా గురువర్యులకు తెలియజేస్తుంటాడు." అని చెప్పాడతడు ఉద్విగ్న స్వరంతో. 


జనం ఆశ్చర్యపోతూ "మీ గురువుగారితో దేవుడు మాట్లాడుతుంటాడా ? ఆయన అంతటి మహిమాన్వితుడా ? ఆ మాట నమ్మేదెట్లా ?" అనడిగారు. 


"ఇక్కడే ! ఇప్పుడే ! మీ అందరి సమక్షంలో గురుదేవుల మహత్తుని నిరూపిస్తా... అగ్నిగుండం ఏర్పాటు చేయించండి ..." అన్నాడా శిష్యుడు గంభీరంగా. 


ఆ వింత ఏమిటో చూద్దామనుకుని కొందరు అప్పటికప్పుడే అక్కడే అగ్ని గుండాన్ని ఏర్పాటు చేశారు. అగ్ని గుండంలో చండ్ర నిప్పులు కణకణమండుతున్నాయి. 


"రండి... నా అరికాళ్ళను ఎవరైనా పరీక్షించండి" అన్నాడా యువకుడు. 


జనంలో నుంచి ఎవరో వెళ్లి అతని పాదాలను చేతులతో తాకి, పరీక్షించి ...

"అందరిలాగే... మామూలు పాదాలే..." అని ప్రకటించాడు. 


"ఇప్పుడు నేను ఇందరి సమక్షంలో ఆ అగ్నిగుండం మీద నుంచి సురక్షితంగా నడిచి మా గురుదేవుల మహత్యాన్ని నిరూపిస్తాను" అని ప్రకటించి, ఆ శిష్యుడు తలెత్తి ఆకాశం వైపు చూస్తూ... 

"జై గురుదేవా ! ఈ పరీక్ష నాకు కాదు. మీకే... దూకనా ? ఈ అగ్నిగుండంలో దూకనా ?" అని అరిచాడు. 


అతడు ఆకాశంలో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి అందరూ తలెత్తి ఆకాశం వైపు ఉత్కంఠంగా చూశారు. వాళ్ళ కళ్ళకి ఎవ్వరూ కనిపించలేదు. ఆ క్షణంలోని ఆ శిష్యుడు తన అరచేతులకి అంటి ఉన్న 'మండూకవసతో కలిపిన తైలాన్ని' అరికాళ్ళకు చాలా వేగంగా, నేర్పుగా రాసుకున్నాడు. అరక్షణంలో జరిగిన మోసాన్ని ఎవ్వరూ గమనించలేదు. 


"అగ్నిలో దూకడానికి అనుమతించారా గురుదేవా ! సరే ... " అంటూ అతడు తలదించి "గురుదేవుల అనుమతి లభించింది. ఇక చూడండి మహత్తు... జై గురుదేవా.... !" అని అరుస్తూ అతడు నిప్పుల మీద కాళ్ళూ పెట్టాడు. అందరూ గుడ్లప్పగించి చూడసాగారు.


"జై గురుదేవా ! జై జై గురుదేవా !" అని స్మరిస్తూ అతడు నెమ్మదిగా ఒక్కొక్క అడుగే నిప్పుల మీద వేస్తూ, ముఖంలో ఏ మాత్రం భయం, బాధ లేకుండా అగ్నిగుండంమీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ నడుచుకుంటూ వచ్చి తన కాళ్లు ఒకదాని తర్వాత మరొకటి పైకెత్తి అరికాళ్ళను ప్రదర్శించాడు. అతడి అరికాళ్ళు నిప్పుల్లో కాలిన సూచనలేవీ లేకుండా మామూలుగా, సహజంగా కనిపించాయి. 


అతడు తన పాదాలను మార్చి మార్చి చూపిస్తూ "చూశారా ! చూస్తున్నారా ! నాకీ ' అగ్నిగమన ' సిద్ధిని నేర్పిన వారు మా గురుదేవులు జీవసిద్ధి మహాశయులు. వారి మహత్తు అపారం. వారి హృదయం దయాసముద్రం. ఆర్తులు, రోగార్తులంతా వారిని ఆశ్రయించండి. వారి అనుగ్రహాన్ని పొందండి. జై జీవ సిద్ధి గురుదేవా !" అని అరిచాడు. 


"జై .... జీవసిద్ది గురుదేవులకు జై !" అని అరుస్తూ, ఉత్సాహంతో నినాదాలు చేసుకుంటూ జనం తండోపాతండాలుగా జీవసిద్ధి ఆశ్రమంవైపు పరుగులు తీశారు. 


(ఇంకా ఉంది)...🙏


సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹

కామెంట్‌లు లేవు: