1, మే 2023, సోమవారం

కావేరి నుండి నేరుగా వచ్చారు


ఇవాళ చాలా గొప్ప సృజన సదాశివబ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారి ఆరాధన ఉత్సవము మీరు చాలా సంవత్సరములు సుమారుగా మీరు కూడా కాశీలోని త్రిలింగ స్వామి వారి వలె రెండు మూడు వందల సంవత్సరములు జీవించి అటుపట వీరు సజీవ సమాధి అయినారని తెలుస్తున్నది ఒకచోట సజీవ సమాధి అయిన తరువాత కూడా మరలా వీరు భక్తులకు దర్శనం ఇచ్చి భారతదేశంలో మరొక రెండు మూడు చోట్ల వీరు సజీవ సమాధిని తీసుకున్నారని పెద్దలు చెబుతారు వీరు శ్రీశ్రీశ్రీ శంకర భగవత్ పాదాచార్య పరంపరాగత శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠ పరంపరకు చెందిన శ్రీ పరమశివేంద్ర సరస్వతి మహా స్వామి వారి వద్ద ఆశ్రమ స్వీకారము చేసినారు నేటికీ వారి జీవ సమాధులను దర్శించిన భక్తులకు అనేక అనుభూతులు కలుగుచున్నవి వారు స్మరణ మాత్రముతోనే భక్తులకు ఐహిక ఆముష్మిక సత్ఫలితములు కలుగుతాయని అనేకమంది విశ్వాసము మరియు అనుభవము


కావేరి నుండి నేరుగా వచ్చారు


కొన్ని సంవత్సరాల క్రితం, నేను మ బావగారు శ్రీ ఆత్మనాథన్ తో కలిసి ఒరిరిక్కై వెళ్లాను. అక్కడ కడుతున్న పరమాచార్య మణిమండపం విశేషాలను చూడాలన్న కోరిక నాకు. పల్లవుల కాలం నాటి శిల్ప లోకంలో ఉలి చేసే సంగీతాన్ని వినాలని వెళ్ళిన నాకు నిరాశే ఎదురయ్యింది. అక్కడ ఏమీ లేదు. ఆదివారం మధ్యాహ్నం కావడం వల్లనేమో అక్కడ కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారు కూడా భోజన విరామానికి వెళ్ళారు. అంత పెద్ద స్థలం అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న కొట్టాలు మాత్రమే ఉన్నాయి.


ఇంత పెద్ద స్థలంలో, అత్యంత అద్భుతంగా ఉన్న శిల్ప సౌందర్యం, సుశిక్షితులైన శిల్పాచార్యుల శిల్ప విన్యాసం, ఈ కార్యానికి సహకరిస్తున్న అతి సామాన్య జనం గురించి ఒకసారి తలచుకోగానే, పరమాచార్య స్వామివారి విశ్వరూపం నా కళ్ళ ఎదుట మెదిలింది. మొదటి సారి నేను స్వామివారిని దర్శించుకున్న సంఘటన జ్ఞాపకం వచ్చి ఆ అనుభావాన్ని మరలా అనుభూతి చెందాను.


అది 1940వ సంవత్సరం. నా పెద్ద అన్నయ్య తిరువలుళుందూర్ లో ఉండేవారు. అక్కడ ఉన్న రిషభ కట్టంలో మహాస్వామివారు స్నానమాచరిస్తున్నారని తెలుసుకుని నా స్నేహితురాలు భవాని మామితో కలిసి అక్కడకు వెళ్లాను. మేము హడావిడిగా మాయవరం కావేరీ నది ఒడ్డుకు చేరుకోగానే, స్వామివారు అటువైపున ఉన్న ఒడ్డుపై కనబడ్డారు. అక్కడ ఎక్కువమంది భక్తులు ఉన్నారు. అంత రద్దీలో మామి నా చేయి పట్టుకుని నది దాటించారు. స్వామివారి చుట్టూ ఉన్న ఆ భక్తుల గుంపును మేము చేరుకున్నాము - అంతే!! ఒక్క క్షణం స్వామివారు మొత్తం గుంపును కలియచూసి, మేనా ఎక్కి వెళ్ళిపోయారు.


మేము బాధతో, దిగులుగా ఇంటికి చేరుకున్నాము. మా నాన్నగారు ఆ మామితో నన్ను స్వామివారు ఉంటున్న గ్రామానికి పంపించారు.


మేము ఆ గ్రామం చేరుకొని, స్వామివారు ఉంటున్న ఇంటి మధ్యలో ఉన్న విశాల ప్రాంగణంలోకి ప్రవేశించాము. అప్పటికే పూజ అయిపొయింది. స్వామివారు ఆ ఆవరణం పక్కగా ఉంది కొందరితో మాట్లాడుతున్నారు. మేము స్వామివారికి పంచాంగ నమస్కారం చేసి నిలబడగానే, స్వామివారి శిష్యులొకరు, “మీరు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగారు. మేము సమాధానం చెప్పడానికి నోరు తెరవబోయేంతలో “మాయవరం నుండి, కావేరి నుండి నేరుగా వచ్చారు” అని స్వామివారే చెప్పారు.


నా ఆశ్చర్యానికి మాటలులేవు. దాదాపు వంద మంది స్వామివారి చుట్టూ ఉండగా అప్పుడే అక్కడకు వచ్చి గుంపు బయటే ఉండిపోయిన ఇద్దరు ఆడవాళ్ళని ఎలా గుర్తుపట్టగలిగారు? అప్పటికే మేనా ఎక్కారు. ఇది ఎలా సాధ్యం? ఆ పారవశ్యానికి కలిగిన ప్రకంపనలతో కనీసం మాట్లాడడానికి కూడా కావడం లేదు. నేను అలా నిశ్చేష్టురాలై చూస్తూ ఉంటే, మామి మా విషయాలు స్వామివారికి తెలిపింది. మా ఆయన, మా మామగారి గురించి అడిగి, ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపారు. ఈనాటికి అప్పటి ప్రకంపనలు అలాగే ఉన్నాయి.


స్వామివారి ప్రథమ దర్శనం తరువాత పద్దెనిమిదేళ్ళకు ఇలాంటిదే మరొక సంఘటన జరిగింది. అప్పుడు మేము వేలూరులో ఉండేవాళ్ళం. ఒకసారి నా భర్తతో, “కళ్ళనిండుగా, ప్రశాంతంగా పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కోరికగా ఉందని” నా భర్తకు తెలిపాను. అందుకు వారు, “సరే నువ్వు ఇవ్వాళే వెళ్లి నాలుగు రోజులపాటు అక్కడే ఉండి మనస్సు నిండుగా స్వామివారిని దర్శించుకో. నాలుగు రోజుల తరువాత నేను కార్యాలయం పనిపై చెన్నై రావాల్సిఉంది. తిరుగుప్రయాణంలో నేతోపాటు చెన్నై వస్తాను” అని తెలిపారు. ఆనందంతో నేను బయలుదేరాను.


అప్పుడు మహాస్వామివారు చెన్నై సంస్కృత కళాశాల ఆవరణంలో మకాం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయమే వెళ్లి, పూజ చూసి, తీర్థం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసేదాన్ని. మరలా సాయంత్రం వెళ్లి, పూజ చూసి, స్వామివారు చెప్పే ఉపన్యాసాన్ని విని తిరిగొచ్చేదాన్ని.


భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండడంతో, నేను స్వామివారి దగ్గరకు వెళ్లి, నమస్కరించి ఆశీస్సులు పొందలేకపోయేదాన్ని. నేను వేలూరుకు వెళ్ళిపోవాల్సిన రోజు కూడా వచ్చింది. సాయంత్రం పూజ సమయానికి వచ్చే మావారికి నన్ను కనుక్కోవడం ఇబ్బందిగా ఉంటుందని, అక్కడ ఉన్న పెద్ద పందిరి కింద అందరికీ చివర్లో నిలుచుని ఉన్నాను. నిస్పృహతో, కొద్ది ఆశతో వేదికవైపు చూస్తున్నాను.


నా భర్త వచ్చి, “కళ్ళనిండుగా స్వామివారిని దర్శించుకున్నవా?” అని నన్ను అడిగారు. నేను కొంచం నిరాశగా, “అవును. కళ్ళ నిండా దర్శనం, చెవుల నిండా మాటలు అయ్యాయి కాని ఒక్కసారి కూడా స్వామివారి దగ్గరకు వెళ్లి నమస్కారం చేయలేకపోయాను” అని చెప్పాను.


“ఒకవారం రోజులపాటు పరమాచార్య స్వామివారు దృష్టి దీక్షణీయంలో ఉన్నావు. స్వామివారి కరుణలో తడిసిపోయావు. ఇంకా నీకు కొరతగా ఉందా? స్వామివారే నిన్ను చూసి, తమని తాము పరిచయం చేసుకుని ‘ఎలా ఉన్నావు?’ అని అడగాలనుకుంటున్నావా? నువ్వేమైనా అంత ప్రముఖ వ్యక్తివా? నీది కేవలం ఆశ కాదు, అత్యాశ” అని అన్నారు నా భర్త.


“వెళ్దాం పద, మనం ఈ రాత్రికే వేలూరు చేరుకోవాలి” అని తొందరపెట్టసాగారు నా భర్త. ఎవరో మా వారిని భుజం తట్టి “మీరు పద్మనాభన్ కదూ? పరమాచార్య స్వామివారు మిమ్మల్ని, అనుత్తమ గారిని ముందుకు రమ్మన్నారు” అని తెలిపారు.


అక్కడున్న అందరూ దారి వదలడంతో ఆశ్చర్యంతో ముందుకు వెళ్ళాము. మేము స్వామివారికి నమస్కరించి లేచి నిలబడగానే, నన్ను చూసి నవ్వి మొదలుపెట్టారు, “మాయవరంలో మీ నాన్నగారు . . .” వెంటనే నేను నా అతితెలివితో స్వామివారి మాటలకూ అడ్డుపడుతూ, “ఇప్పుడు మా నాన్నగారు శరీరంతో లేరు” అన్నాను. దాంతో స్వామివారు, “కాదు, కాదు, ఇప్పుడు కాదు, అప్పట్లో జరిగిన విషయం. అప్పుడు మీరందరూ మీ అన్నగారి ఇంట్లో సీమంతం అన్న వార్తతో నా వద్దకు వచ్చారు” అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. శరీరం మొత్తం పరవశంలో మునిగిపోయింది.


తరువాత స్వామివారు మా ఆయన్ని, “ఏమిటోయ్! మీ ఇంట్లో భిక్ష చేశాను గుర్తుందా?” అని అడిగారు. “స్వామివారు ఇలా అడిగితే, నేను ఏమని సమాధానం చెప్పగలను” అన్నారు నా భర్త. వెంటనే స్వామివారు పెద్దగా నవ్వి శిష్యునితో ప్రసాదం పళ్ళెం తెమ్మన్నారు. విభూతి, కుంకుమ, మంత్రాక్షతలు ఉన్న వెదురు తట్టను తెచ్చారు. ఒక పండును తెమ్మని సైగచేశారు స్వామివారు. ఒక బత్తాయి పండు తెచ్చారు. దాన్ని స్వామివారు అటు ఇటు తిప్పి చూసి, ఒకసారి గుండెలపై ఉంచుకుని పళ్ళెంలో ఉంచారు.


“ఇద్దరూ కలసి దీన్ని స్వీకరించండి” అని ఆజ్ఞాపించారు.


మేము ఇద్దరమూ స్వామివారికి నమస్కరించి లేవగానే, “అనుత్తమ, తృప్తిగా ఉందా?” అని అడిగారు. నా కళ్ళు వర్షించాయి. నాలుక పైదవడకు అతుక్కుపోయింది. స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నాము. 


వేలమంది దాసానుదాసులు ఉన్న ఒక మహాత్ముడు, భువిపై నడయాడే దేవుడు, కనీసం శ్రీవారి సన్నిధిలో నిలబడడానికి కూడా అర్హత ఉందొ లేదో తెలియని ఒక సాధారణ మహిళకు సంబంధించిన ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటనను గుర్తుచేసుకున్నారు. మరి ఆ మహిళ హృదయాన్ని ఎలా ఆవిష్కరించగలం? ఆ పరవశం, అనుభూతి ఇప్పటికి మదిలో తాజాగా ఉంది.


[‘అనుత్తమ’ అన్న కలంపేరుతో శ్రీమతి రాజేశ్వరి పద్మనాభన్ గారు 1960 - 90లలో ఎన్నో తమిళ కాల్పనిక రచనలు చేసిన రచయిత్రి]


--- అనుత్తమ, ‘జ్ఞాన ఆలయం’ పత్రిక నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: