21, అక్టోబర్ 2021, గురువారం

కామ్రేడ్ కామేశం"

 * "కామ్రేడ్ కామేశం" *


కామ్రేడ్ కామేశం ఆవేశంతో ఊగిపోతున్నాడు.


పక్కింటి వాళ్ళు చెత్త తీసుకొచ్చి వీళ్ళ ఇంటి వారగా వేస్తున్నారు ప్రతిరోజు. చాలా సార్లు చెప్పి చూసాడు. ఐనా ఫలితం కనపడలేదు.


వీరావేశంతో బైటకు వచ్చి "పక్కింటి వాళ్ళ దౌర్జన్యం నశించాలి" అంటూ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.


ఆ వీధిలో ఉండేవారికి ఇది విచిత్రంగా తోచింది. ఏదైనా తేడా వస్తే పోట్లాడుకుంటారు కానీ ఇలా రాజకీయ నాయకుల్లాగా 'నశించాలి' అంటూ నినాదాలేఁవిటి?' అనుకున్నారు అంతా.


కొందరు బుగ్గన, మరికొందరు ముక్కున వేలేసుకున్నారు కూడా.


ఐనా కా.కా. తగ్గడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యంలాగే పక్కింటివాళ్ళు కూడా చలనం లేకుండా ఉన్నారు.


అరిచి అరిచి గొంతు నెప్పు పుట్టిన కా.కా. ఆ రోజుకి విశ్రమించాడు. మర్నాడు ఉదయం మళ్ళీ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి నినాదాలు అందుకున్నాడు. ఐతే ఈ సారి ఎదురింటివారిని కూడా కలిపాడు.


"పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నశించాలి" అంటూ. 


బ్రేక్ ఫాస్ట్ దిట్టంగా తగిలించినట్లున్నాడు, మధ్యాహ్నం రెండింటి వరకు నినాదాలు ఇస్తూనే ఉన్నాడు .... అంతవరకు ఆ చేతిని అలా పిడికిలి బిగియించి పైకెత్తుతూనే ....


భోజనాల వేళకు లోపలకెళ్ళాడు. కాసేపటికి మళ్ళీ వచ్చాడు. నినాదాల జోరు, హోరు పెరిగాయి.


ఐనా కూడబలుక్కున్న ప్రభుత్వం, యాజమాన్యంలాగానే పక్కింటి, ఎదురింటివాళ్ళు కూడా చలించలేదు.


ఆ రోజుకి తన నిరశన ఆపాడు కా.కా.


మరునాడు ఉదయం చూసేసరికి ఆ వీధిలోని వారంతా చెత్త తీసుకువచ్చి కా.కా. ఇంటి దగ్గరే పడేసి వెళ్ళినట్లున్నారు, ఇంటి ముందు అంతా వాసనొస్తోంది.


కా.కా.కి కడుపు రగిలింది. నినాదాల రూపు మారింది. డోర్ నంబర్ చెప్పి మరీ 'నశించాలి' అంటూ నినదించడం మొదలు పెట్టాడు, పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి ....


అలా ఆ రోజంతా గడిచింది. సాయం సంధ్య వేళ ఆ వీధిన సైకిలు మీద వెళ్తున్న పంతులు గారు కా.కా.ని చూసి "ఎందుకయ్యా అలా అందరు నశించాలి' అని అరుస్తున్నావు?" అని అడిగారు.


అప్పుడు కా.కా. విషయం చెప్పి 'నశించాలి' అన్నాడు, పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి ....


"నీ 'నశించాలి' అనే నినాదం ఆపి 'సృష్టించాలి' అనే నినాదం అందుకో. పరిస్థితి మారుతుంది" అన్నారు పంతులు గారు.


"మాకు నశించాలి అన్న ఒకే ఒక్క నినాదం నేర్పారు. అందుకే అది తప్ప ఇంకోటి నానోట రాదు" అన్నాడు కా.కా. చెయ్యి పైకెత్తుతూ ....


"ఇలా అందరు నశించిపోతే నువ్వెక్కడివే ఎలా ఉంటావ్? ఆలోచించుకో" అన్నారు పంతులు గారు.


ఆలోచనలో పడ్డాడు కా.కా.


'ఈ పంతులు గారు చెప్పింది ఏదో కొత్తగా ఉంది, పరీక్షిద్దాం' అనుకున్నాడు కా.కా.


"ఐతే అది ఎలా?" అని అడిగాడు కా.కా.


అప్పుడు పంతులు గారు ఈ విధంగా చెప్పారు ....


"చూడబ్బాయ్ .... నాశనం కోరుకోవడం మన సాంప్రదాయం కాదు .... "


"బూజు పట్టిన సాంప్రదాయాలు నశించాలి" అన్నాడు కా.కా. ఆవేశంగా పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తుతూ ....


"నీ నినాదాలు కాసేపు ఆపితే వివరంగా విషయం చెబుతా" అన్నారు పంతులు గారు.


"సరే చెప్పండి" అన్నాడు కా.కా.


"ప్రతీది అలా నశించకూడదయ్యా. ప్రకృతి ధర్మం ప్రకారం ఏది ఎప్పుడు నశించాలో అప్పుడే నశిస్తుంది. ఈ లోగా నువ్వు అన్నీ నశించాలి అని అంటే అది ప్రకృతి విరుధ్ధం" అన్నారు పంతులు గారు.


"అన్నీ ప్రకృతిపరంగానే నశించేట్లైతే నేను 'నశించాలి' అంటే మాత్రం నష్టం ఏమిటి?" అని అడిగాడు కా.కా. లాజిక్ తీస్తూ.


"ఔను కదా, మరి ప్రకృతిపరంగానే నాశనం అయ్యేవాటిని 'నశించాలి' అరవడం వల్ల ఉపయోగం ఏమిటి, కంఠశోష తప్ప?" అని అడిగారు పంతులు గారు.


కా.కా. ఆలోచనలో పడ్డాడు, ఈ పంతులు గారు ఏదో మెలికేసాడు అనుకుంటూ


"మరి సృష్టించడం మాకు తెలీదే, ఎలాగా?" అని అడిగాడు కా.కా.


"అలా అడిగావు బాగుంది. చెబుతా విను. ఈ వీధిలోని వాళ్ళంతా చెత్తను ఇలా ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. మునిసిపాలిటీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి చెత్త తీసుకువెళ్తారు. అలా ఎవరికీ క్రమశిక్షణ లేకుండా పోయింది .... " అంటూ చెప్పడం ఆపారు పంతులు గారు.


"నన్ను వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టమంటారా, ఐతే?" అని అడిగాడు కా.కా.


"నీకా శ్రమ అవసరం లేదు. ఒకవేళ నువ్వు వాళ్ళను క్రమశిక్షణలో పెట్టాలన్నా వాళ్ళు ఉండరు .... " అంటూ ఆగారు పంతులు గారు.


"ఐతే క్రమశిక్షణ .... " అంటూ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తాడు కా.కా.


"ఆగాగు .... నీ నినాదం ఏమిటో నాకు తెలుసు. కానీ వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టాలంటే ముందు నువ్వు క్రమశిక్షణలో ఉండాలి" అన్నారు పంతులు గారు.


"అదెలా కుదరతుంది?" అనడిగాడు అదేంటో తెలియని కా.కా.


"ఐతే నీ బతుకంతా పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి 'నశించాలి' అని అరవడమే సరిపోతుంది. కొంత కాలానికి నీ చెయ్యి ౙండా కఱ్ఱలాగా అలా గాలిలోనే ఉండిపోతుంది. సమాజంలో మార్పు రావాలంటే నినాదాల వల్ల రాదు బాబు. స్వయంగా చేసి చూపించడంవల్ల వస్తుంది" అంటూ హితబోధ చేసారు పంతులు గారు.


"ఐతే నన్నేం చెయ్యమంటారు?" అని అడిగాడు కా.కా. .... పంతులు గారు చెప్పిన దానిలో నిజం ఉందేమో అని అనుమానం వచ్చి ....


"రేపటినుండి మీ ఇంట్లో చెత్తను ఒక డబ్బాలో వేసి, పక్కింటి చెత్తను, ఎదురింటి చెత్తను, అలాగే ఈ వీధిలో వాళ్ళ ఇళ్ళ ముందు ఉండే చెత్తను డబ్బాలో వేసుకుని తీసుకెళ్ళి పక్క వీధిలో ఉన్న మునిసిపాలిటీ చెత్త కుండీలో వెయ్యి" అన్నారు పంతులు గారు.


"అందరు వాళ్ళింటి చెత్త అంతా తీసుకొచ్చి నా డబ్బాలోనే వేస్తే?" అని అనుమానం వెలిబుచ్చాడు కా.కా.


పంతులు గారు నవ్వి "చూడు బాబు, ఎప్పుడైనా సానుకూల ధృక్పధంతో పని మొదలు పెడితే అన్నీ చక్కగా నడుస్తాయి. శంకలతో మొదలు పెడితే మూలశంకలా పీడిస్తూనే ఉంటుంది" అన్నారు పంతులు గారు.


"కానీ .... " మళ్ళీ శంకతో ఆగిపోయాడు కా.కా.


"నీ అనుమానం నాకు అర్ధం అయింది. ఒక రోజు వేస్తారు, రెండు రోజులు వేస్తారు. మూడో రోజునుండి ఎవరి చెత్త వాళ్ళే తీసుకువెళ్ళి పక్క వీధిలో ఉన్న మునిసిపాలిటీ చెత్త కుండీలో వేస్తారు. కావాలంటే నేను కూడా నీకు సాయంగా వస్తా" అన్నారు పంతులు గారు.


"మీరా? పెద్దవారు, మీకెందుకండి శ్రమ? నేనంటే కుఱ్ఱవాణ్ణి .... " అంటూ పంతులు గారిని వారించబోయాడు కా.కా.


"అదే నాయనా స్ట్రాటజీ .... నీతో పాటు నేను కూడా ఒక డబ్బాలో చెత్త వేసుకుంటూ, ఆ డబ్బాని సైకిల్ మీద పెట్టుకుని తీసుకువెళ్తుంటే చూసేవాళ్ళకు కొంచెమైనా అపరాధ భావన ఏర్పడుతుంది. అందులోనుండే పరివర్తన వస్తుంది" అన్నారు పంతులు గారు.


"ఆహా .... భలే ఐడియా గురువు గారు. పంతులు గారికి జై .... " అంటూ చెయ్యి పైకి ఎత్తబోయాడు.


"నువ్వు నినాదాలు కాకుండా నిజాయితీకి నిదర్శనంగా నిలవాలి. అప్పుడే సమాజంలో మార్పు ఏర్పడుతుంది. అది వీధిలో చెత్త కావచ్చు, సమాజంలోని చెత్త కావచ్చు" అన్నారు పంతులు గారు.


కామేశం ఇంట్లోకి వెళ్ళాడు డబ్బా తీసుకు రావడానికి.


పంతులు గారు సైకిల్ స్టాండు వేసి, ఆ చుట్టుపక్కల ఉన్న చెత్తను ఒక చోటకు చేర్చడం మొదలు పెట్టారు.


*************************** (శుభం)


రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

తేది 19-10-2021

హిందూ కుటుంబాల

 హిందూ కుటుంబాల అశాంతికి కారణం..!?


1.ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా వచ్చింది. అయన నిజ జీవితంలో, ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు.

ఈసినిమాకథలో "హీరోయిన్ తో పాటు, ఇద్దరమ్మాయిలను, ఒక రాజకీయ నాయకుడి కొడుకు బలత్కారం చేయబోతే.. 

రౌడీ నాయకుడిని ఎదిరించి,

అమ్మాయిలు కోర్టుకు వెళ్తారు. వాళ్ల తరఫున న్యాయవాదిగా నటించాడు పవన్ కళ్యాణ్."


ఈ సినిమా మొత్తంలో, పవన్ కళ్యాణ్ చేసే ఆర్గుమెంట్ యొక్క గొప్పతనాన్ని గ్రహించడమే ప్రధాన అంశం. ఈ కేసులో నేరారోపణ అయిన వ్యక్తి తరఫున నటుడు ప్రకాష్ రాజ్ వాదిస్తాడు.

వాదనలో భాగంగా, అమ్మాయిలను ప్రకాష్ రాజ్ *గుచ్చి గుచ్చి అడుగుతూ...* "ఎప్పుడైనా శృంగారంలో నీవుపాల్గొన్నవా?" అని ఒకమ్మాయిని అడుగుతాడు... 

అమ్మాయి చివరికి, అనేక గందరగోళాలల తర్వాత, *"నేను,* నా బాయ్ ఫ్రెండ్ తో, *ఇష్టంతో పాల్గొన్నాను"* అంటుంది.


2.వారం రోజుల క్రితం, మార్క్సిస్ట్ విమర్శకుడు కే.కే. రంగనాథాచార్యులు మరణించాడు. ఆయన శిష్యుడైన, *ఆంధ్రజ్యోతి సంపాదకుడు*, కే. శ్రీనివాస్ ఆయన స్మృతి వ్యాసం రాస్తూ... "రంగనాథాచార్యులు సంప్రదాయాలను తిరస్కరించాడు".. అని,

 అతనిలోని ఇదే గొప్పక్వాలిటీ, *అదే తనని ఆకర్షించింది* అన్నట్టుగా, వ్యాసం మొదలు పెట్టాడు.


ఈ రెండు విషయాలు *మనకేం నేర్పిస్తున్నాయో* విజ్ఞులైన వాళ్లంతా ఆలోచించాలి.


1.సినిమా చూసిన *ఆడపిల్లలు* పవన్ కళ్యాణ్ *సినిమాలో చెప్పినట్టుగా చేస్తే, తప్పేముంది అనుకోవడం* ......సమాజంలో ఏ రకమైన, ఎటువంటి సందేశం ఇచ్చే విధంగా ఉందో, ఒక్కసారి ఆలోచించండి. 

2.సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక రచయిత, మేధావిగా చెప్పుకునే వ్యక్తి, "సంప్రదాయం తిరస్కరించడం, గొప్ప అభ్యుదయమనీ సమాజానికి *చెప్పాలని ప్రయత్నించడం"* 

*ఎలాంటి ఆలోచనలు కల్పిస్తుందో,* ఒక్కసారి ఆలోచించండి.


మనం రామాయణం, మహాభారతం... ఈ ప్రపంచానికి *కుటుంబవ్యవస్థను , రాజనీతిని ఇచ్చిందని మురిసిపోతాం.* సౌదీ అరబియాలో రామాయణం పాఠ్యపుస్తకాల్లో కి ఎక్కిందని ఆనందపడిపోతున్నాం. 

మరి *మన దగ్గర కుటుంబాలు శాంతిగా ఉన్నాయా..?* 


ఇటీవల *వార్తల్లో ..*

తండ్రిని చంపిన కొడుకులు, భార్య భర్తల మధ్యహత్యలు ..అన్నదమ్ముల మధ్య హత్యలు, అన్నాచెల్లెళ్ల మధ్య హత్యలు ,

అత్తా కోడళ్ళ మధ్య హత్యలు... 

*ఇదంతా సీరియల్స్ ప్రభావమా ! లేక

*సినిమాల ప్రభావమా...! లేక

*ఇంకా వేటి ప్రభావం*❓❓


ఈ దేశంలో ఒక పదేళ్లలో కోట్లమంది యువకులు ఏ దేశాల్లో లేనంతగా పెరిగిపోతారు. *వాళ్ల మీద ఎవరి ప్రభావం ఉంటుంది..?*

a.రాణా ప్రతాప్, శివాజీ, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ,ఉద్యమ సింగ్ , *వివేకానంద వంటి వాళ్ళ ప్రభావం ఉందా..*

లేక 

b.జూనియర్ ఎన్టీఆర్ ..మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ..విరాట్ కోహ్లీ, ఏ ఆర్ రెహమాన్... 

వీళ్ళ ప్రభావం ఉందా? ఆలోచించండి.


మన యువత *పొద్దున లేచినప్పటి నుంచి,* 1.బూతులు ..రోతలు ..వెగటు పుట్టించే వెకిలి కార్యక్రమాలు..వంటి వినోద కార్యక్రమాలు చూడడం ఎవరు ఆపగలరు.!? 

2.అతి చౌకగా దొరికే ఇంటర్నెట్ రకరకాల సైట్లు, దుర్మార్గపు కార్యక్రమాలు చేసి, యువతను ధ్వంసం చేసే వారిపట్ల నియంత్రణ లేనటువంటి వ్యవస్థ... మన యువతను ఎటు వైపు తీసుకెళ్తున్నాయి.

ఇది 

*మనం తక్షణం, ఆలోచించాల్సిన విషయం.*


*చిన్న పిల్లలు* కూడా, రోజుకు గంటల తరబడి ఇలాంటి దృశ్యాలుచూడడం వల్ల, మానసిక మైనటువంటి నేరస్తులుగా, మారుతున్నారు. నాలుగేళ్ళ పిల్లవాడు రోజూ అనేకసార్లు 

టీవీలలో వేల సార్లు హత్యలు ... అత్యాచారాలు చూస్తున్నాడు.. ఇటీవలకాలంలో అత్యాచారాలు చేసిన వాళ్లలో మైనర్లు ఉండడం మనం చూశాం.


*ఫ్రాన్స్ యథార్థ విషాద కథ:*

 1914 - 1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో, ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. 

అదే ఫ్రాన్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధంలో *ఘోరంగా ఓడిపోయింది.* 


మొదటి ప్రపంచ యుద్ధంలో విజయగర్వంతోనున్న ఫ్రాన్స్ లో, 1926లో టెలివిజన్ వచ్చింది. దానితోపాటు జూదగృహాలు, క్యాషినోస్... క్లబ్బులు ,పబ్బులు విపరీతంగా తెరుచుకున్నాయి. 

*దాంతో ప్రజలు అన్ని రకాల దురలవాట్లకు బానిసలు అయిపోయారు.*

వాళ్లలో దేశం పట్ల అభిమానం నశించింది. 

ఆ తర్వాత జాతీయత కోల్పోయి 

దేశం పతనం వైపు అడుగులు వేసింది. 


1945 లో చాలస్ డిగొల్.. ఫ్యాన్స్ అధ్యక్షుడు అయ్యాక చేసిన *మొట్టమొదటి పని -*

ఆ దేశంలో *థియేటర్లు కూల గొట్టించాడు.* బార్లు ,పబ్బులు ,క్లబ్బులు *మూసివేయించాడు.* ఫ్రాన్స్ పై యువతరంలో గొప్ప గౌరవభావాన్ని, జాతీయతను రగిలించాడు. 

ఆ తర్వాత దేశం బీ ఫ్రెంచ్ & బై ఫ్రెంచ్... అనే స్థాయికి వెళ్లింది.


ఇప్పుడు 

మన దేశంలో

*హిందూయువత కూడా,*

ప్రాన్స్ ఎదుర్కొన్న ప్రమాదంలో పడింది. 


యువకులు ఒకరకంగా భ్రష్టమార్గంలో ప్రయాణిస్తుంటే;

మహిళలు, వృద్ధులు, 

ఇంకా చెప్పాలంటే,

*అన్ని వయసుల వాళ్లు*,

*ఏదో రకమైన దురలవాట్లకు బానిసలవుతున్నారు.*


ఇవన్నీ దురలవాట్లు అని మనం అంటే- *వామపక్షవాదులు* ఏది అలవాటు ..ఏది దురలవాటు ...అన్న దానిపై మొదట చర్చ జరగాలంటారు. 


ఇక యువతీ యువకులకు *అనేక పోర్న్ సైట్స్... విశృంఖల సినిమాలు...* అందు బాటులోకి వచ్చాయి. ఈ దుష్పరిణామాల ప్రభావం... కుటుంబాలపై పడింది.

(దీని ఫలితాలు మరో పదేళ్లు పోతేగాని మనకు అర్థం కావు.)

అందుకే,

మనం సంప్రదాయాలు, శాస్త్రాలు, గురువులు, ఇతిహాసాలు ,ఆచారాలు ,కట్టుబాట్లు, నమ్మకాలు రోజురోజుకు డొల్లతనంగా కనిపిస్తుంది. కనుకనే, హిందూ కుటుంబంలో శాంతి లేదు..


ప్రతివారూ ఆస్తులు, సంపాదన, కెరీరిజం పేరుతో.. *తమ సంతానాన్ని యంత్రాల్లా* తయారు చేస్తున్నారు. 


*"తక్కువ సంతానం - ఎక్కువ సంపాదన",*

 ఇప్పుడు హిందూ జాతికి ప్రమాదంగా మారింది. 

ఉన్న ఇద్దరినీ విదేశాలకు పంపడం.. ఒక వర్గం చేస్తే... 

వారిని అనుకరిస్తూ, 

*డబ్బు లేని వారు కూడా*, లక్షలు లక్షలు పెట్టి చదివించాలనే తాపత్రయం, వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నది. 

*ఈ క్రమంలో* వారి యువతలో అధికభాగం, అజ్ఞానంతో, 

విపరీతమైన వృధా ఖర్చు చేస్తూ, 

*తాగుబోతులుగా* మారిపోతున్నారు. 

హైదరాబాదులో అధిక సంపాదనకల్ల software ఉద్యోగులు, ఎక్కువమంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయంపై tv లో కూడా live చర్చ జరిగింది  

ఫలితంగా వారి

కుటుంబాలు ధ్వంసమై పోతున్నాయి.


అసలు కథ ఇక్కడే మొదలవుతుంది... 

డ్రైవర్లుగా ,పనివాళ్లుగా ,వంటవాళ్ళుగా ,అటెండర్లుగా... 

*ధనికుల ఇళ్ళల్లో పని చేయడానికి ఒక వర్గం ప్రజలు* చేరుతున్నారు. 

తదనంతర కాలంలో ఏం జరుగుతుందో మన కళ్ళతో చూస్తున్నాం. 


ఇక మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థ ఉన్న వాళ్ల *ఆడపిల్లల్ని* కళాశాలల్లో..పాఠశాలల్లో ట్రాప్ చేసి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్నారు. 

వీళ్ళు కష్టపడి, సంపాదించుకున్న *సంపదంతా,* 

ఒక్క క్షణంలో వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.


ఇక *అవసరంలేని ఆర్భాటాలతో,* రకరకాల కార్యక్రమాలు చేసి, అప్పులపాలవుతున్నారు ఇంకొందరు. 


అలాగే  

ఏ రాజకీయ వ్యవస్థ దేశానికి మేలు చేస్తుందో ఆలోచించే *సాధారణ పరిజ్ఞానం కూడా,*

 *మన కుటుంబాల్లో ఉండడం లేదు.* 


*ఇక ఆధ్యాత్మిక రంగం* పుచ్చి పోయింది.

*పూర్వం* ప్రతి కుటుంబానికి కుల గురువు ఉండేవాడు. లేదా పురోహితులు ఉండేవాడు. వాళ్లతో చర్చించి, ఎంత అవసరమో అంతే స్థాయిలో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ, ధర్మబద్ధంగా శాంతిగా ప్రజలు జీవించారు. 

*ఇప్పుడు* 

1 స్వామీజీ లంతా ఎవరి దారి వారిదే.. 

2 టీవీ ల్లో దర్శనంఇచ్చే మహా మహా పండితులు, అనేక రకాలవివాదాస్పద విషయాలు,

 ప్రజలకు బోధించి, సరైన జ్ఞానం ఇవ్వకుండా..  

భ్రష్టులను తయారు చేస్తున్నారు. 

3.ఇక ఉపాసకుల పేరుతో, జ్యోతిష్యుల పేరుతో మరికొందరు ఇంకో దారిలో ఉన్నారు.


మరోవైపు మన హిందువులు పన్నులు చెల్లిస్తూ, నడిపిస్తూ ఉన్న వ్యవస్థల్ని, *ఒక వర్గం* ప్రజలు హాయిగా అనుభవిస్తున్నారు. 


*రాజకీయ అవ్యవస్థలన్నీ* మనకు తెలియనివి కావు. *లౌకికవాదం అనే ముసుగు తొడుక్కుని,* వారి ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు. 


దురాశ, అజ్ఞానం, తెలియని తనం, 

సోమరితనం వీటన్నింటి కారణంగా,

*సగటు హిందువు*,

 తన కుటుంబంలో 

సరైన పాత్ర పోషించే లేకపోతున్నాడు.


మనకు తెలియకుండా

మన హిందూ కుటుంబాల్లో ప్రవేశిస్తున్న *పాశ్చాత్యీకరణ..* కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నది. 


*మరోవైపు* చదువుకున్న వాళ్ళు.. 

వైట్ కాలర్ మనస్తత్వంతో 

*సంపాదన ప్రెస్టేజ్ గా భావించి,* 

జీవితమంతా అదే maniaలో బతికేస్తున్నారు.


ఉమ్మడి కుటుంబ జీవన.. సంబంధబాంధవ్యాలు.. 

కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల,

*ఎన్నో కుటుంబాలు* పెళ్లి తర్వాత,

 విడాకుల వైపు మళ్లుతున్నాయి.


అందుకే ఇటీవల కాలంలో కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినప్పుడు, ఓవైసీ గణాంకాలు చెప్తూ, *"హిందూ కుటుంబాల్లో ఉన్నంత విడాకుల రేటు, ముస్లిం కుటుంబాల్లో లేదు"* అన్నాడు.


ఈ విచ్ఛిన్నం కావడానికి కారణాలను 

మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది.  

హిందూ కుటుంబాల్లో అశాంతికి కారణం 

మనం వెంటనే కనిపెట్టాలి.


మనకు

 1.హిందూ దేవాలయాల్లో కౌన్సెలింగ్ లేదు.. 

2 టీవీలో సీరియల్ తప్ప, ఇంకేమీ లేవు. 

3 సినిమాల్లో.. క్రైం..ద్రోహం.. అత్యాచారం..హింస.. శరీరక ప్రేమ.. ఇవే ప్రధాన విశేషాలు. 

ఇలాంటి అద్భుతాలు చెప్పే సినిమానటులు, ఇవాళ మనకు సెలబ్రిటీలు, ఆరాధ్యులు.

ఒక 

స్వామీజీని, సినిమా నటిని, 

ఒకచోట కూర్చోబెట్టి, ఓటింగ్ జరిగితే.... 

ఓట్లన్నీ ఆమెకే పడుతాయి. 


మనకు మంచి చెడ్డ నేర్పించాల్సిన *మీడియా,* 

రాజకీయ అంశాలను, వివాదాస్పద అంశాలను,

 తన వ్యక్తిగత స్వార్థంతో, వండి ఓర్చి,

మనకదించి,  

ఏది న్యాయం ఏది అన్యాయమో?

తెలియకుండా చేస్తున్నది. 


మన కుటుంబాల్లో, ఇలాంటి కౌన్సిలింగ్ లేని కారణంగా, 

విశ్వవిద్యాలయాల్లో *చదువుకుంటున్నాం అనేవాళ్ళు*,

"హిందూ మత ఆఛార, సంప్రదాయాలను, తిరస్కరించాలి" అనే భావాన్ని సులభంగా తలపై మోస్తున్నారు. 


మనం చెప్పే సద్గుణ సంపదంతా,

*ఈ దుష్ట శక్తులు,*

 తమ అందమైన ముఖాలతో,

తమ అబద్దపు వాదనలతో,

 ఒక్క క్షణంలో ధ్వంసం చేస్తున్నారు. 


*సోషల్ మీడియా* ఒక విప్లవం అని మనం అనుకుంటున్నాం... 

దానితో పాటుగా, 

మోయలేనంత విజ్ఞానం అజ్ఞానంతో కలిసి,

 మన మెదళ్ళలోకి ఎక్కుతుంది.  


జ్ఞానం అజ్ఞానాలను వేరుచేసే *హంసను,*

మనం తక్షణం పట్టుకుని రాకపోతే, అతి త్వరలోనే

మన హిందూ కుటుంబవ్యవస్థ, పైకి కనిపించే మేడిపండు మాత్రమే అవుతుంది .


(సీతా నవమి సందర్భంగా.. 

కుటుంబ వ్యవస్థ పై ఆవేదనతో... 

ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు- డా. భాస్కర యోగి వ్యాసం)

సంస్కృత మహాభాగవతం*

 *21.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*


*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*యద్యసౌ ఛందసాం లోకమారోక్ష్యన్ బ్రహ్మవిష్టపమ్|*


*గురవే విన్యసేద్దేహం స్వాధ్యాయార్థం బృహద్వ్రతః॥12885॥*


బ్రహ్మచారి వేదములకు నివాసస్థానమైన బ్రహ్మలోకమును పొందగోరినచో, అతడు జీవితాంతము నిష్ఠతో బ్రహ్మచర్య వ్రతమును పాటించవలెను. వేదాధ్యయనము కొరకు అతడు తన జీవితమును అంతయును ఆచార్యుని సేవలలోనే గడుపవలెను.


*17.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేషు మాం పరమ్|*


*అపృథగ్ధీరుపాసీత బ్రహ్మవర్చస్వ్యకల్మషః॥12886॥*


అట్టి నైష్ఠిక బ్రహ్మచారి పాపరహితుడై బ్రహ్మవర్చస్సుతో వెలుగొందును. అతడు అగ్నియందును, గురువునందును, తనయందును, సకలప్రాణుల యందును నేనే (పరమాత్మయే) విరాజిల్లుచున్నట్లు భావించుచు అభేదబుద్ధితో నన్నే ఉపాసించవలయును.


*17.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*స్త్రీణాం నిరీక్షణస్పర్శసంలాపక్ష్వేలనాదికమ్|*


*ప్రాణినో మిథునీభూతానగృహస్థోఽగ్రతస్త్యజేత్॥12887॥*


అగృహస్థుడు అనగా బ్రహ్మవ్రతధీరుడు (బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్న్యాసి) స్త్రీలను చూడరాదు, స్పృశింపరాదు. వారితో సంభాషింపరాదు. పరిహాసము లాడరాదు. మైథునక్రియలోనున్న పశుపక్ష్యాదులవైపు కన్నెత్తియైనను చూడరాదు.


*17.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*శౌచమాచమనం స్నానం సంధ్యోపాసనమార్జవమ్|*


*తీర్థసేవా జపోఽస్పృశ్యాభక్ష్యాసంభాష్యవర్జనమ్॥12888॥*


*17.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*సర్వాశ్రమప్రయుక్తోఽయం నియమః కులనందన|*


*మద్భావః సర్వభూతేషు మనోవాక్కాయసంయమః॥12889॥*


ఉద్ధవా! బాహ్యాభ్యంతర శౌచము, ఆచమనము, స్నానము, సంధ్యోపాసనము, ఋజువర్తనము, పుణ్యతీర్థములను సేవించుట, గాయత్ర్యాది మంత్రములను జపించుట, స్పృశింపరాని వస్తువులను, భక్షింపగూడని పదార్థములను, సంభాషింపరాని మాటలను వర్జించుట, సకల ప్రాణుల యందును దైవభావమును కలిగియుంఢుట, మనోవాక్కాయముల నిగ్రహించుట (త్రికరణశుద్ధిగా సంయమనము పాటించుట) - ఈ నియమములు చతురాశ్రమములవారును పాటింపదగినవి.


*17.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*ఏవం బృహద్వ్రతధరో బ్రాహ్మణోఽగ్నిరివ జ్వలన్|*


*మద్భక్తస్తీవ్రతపసా దగ్ధకర్మాశయోఽమలః॥12890॥*


ఈ నియమములను పాటించునట్టి దీక్షాదక్షుడైన బ్రాహ్మణుడు అగ్నివలె తేజరిల్లును. తీవ్రతపఃప్రభావమున అతని కర్మసంస్కారములు అన్నియును దగ్ధములైపోవును. అంతట అతడు అంతఃకరణ శుద్ధి గలిగి నాయందు అనన్యభక్తుడై, నిర్మలతేజోవిరాజమానుడగును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*467వ నామ మంత్రము* 21.10.2021


*ఓం సూక్ష్మరూపిణ్యై నమః*


తెలియశక్యముకానంత సూక్ష్మరూపము గలిగిన జగన్మాతకు నమస్కాము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సూక్ష్మరూపిణీ* యను ఐదక్షరముల(పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం సూక్ష్మరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు పరబ్రహ్మతత్త్వము తెలియు దిశగా తమ సాధనాపటిమను కొనసాగించి, ఆ పరబ్రహ్మస్వరూపిణిని తెలియుటకు ప్రయత్నించి తరింతురు.


ఆత్మతత్త్వము అన్నిటికంటె సూక్ష్మమైనది అని శృతివాక్యములందు తెలియజేయబడినది. అంతేగాదు ఆ ఆత్మతత్త్వము నిత్యమైనది. అణువుకంటె అణువైనది. పరమాత్మ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మరూపమైన ఆత్మరూపంలో అనంతకోటి జీవరాశులలో నెలకొనియున్నది. ఈ దేహము అనిత్యము. ఆత్మ నిత్యము, సత్యము. పాత వస్త్రమును విసర్జించి, క్రొత్త వస్త్రమును ధరించినటులు, శుష్కించిన ఒక దేహమును విడచి, వేరొక క్రొత్త దేహములో ప్రయాణించుచూ, నిత్యము, సత్యమై భాసిల్లుచున్నది ఆత్మ. ఆత్మలకు ఆత్మయై, పరమాత్మయైన పరమేశ్వరి ఆ విధముగా సూక్ష్మరూపిణీ యని అనబడుచున్నది.


ఒకానొక హోమమునకు సూక్ష్మమను సంజ్ఞకలదు. అందుచే అమ్మవారు సూక్ష్మమనెడు హోమస్వరూపురాలు పరమేశ్వరి. మూలాధారమునందు అగ్నిగలదు. అట్టి మూలాధారమందు శాస్త్రోక్తమైన అక్షరములతో పండ్రెండు విధములుగా చేయబడు హోమమునకు సూక్ష్మమని పేరు. అట్టి సూక్ష్మమను హోమస్వరూపురాలు పరమేశ్వరి గనుక *సూక్ష్మరూపిణీ* యని అనబడినది. అమ్మవారికి స్థూలము, సూక్ష్మము, పరము అను మూడురూపములు గలవు. మనకంటికి కనబడే పరమేశ్వరి స్వరూపము స్థూలరూపము. పంచదశీ మంత్రము అమ్మవారి సూక్ష్మరూపము. అందుకే అమ్మవారు *మూలమంత్రాత్మికా* యనియు, *మూలకూటత్రయకళేబరా* యనియు చెప్పబడినది.


పంచదశీ మంత్రం *క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం* అయితే ఇందులో మొదటి ఐదు బీజాక్షరములు *క ఏ ఈ ల హ్రీం* అనునది *వాగ్భవకూటము* (అమ్మవారి ముఖకమలము). తరువాత ఆరు బీజాక్షరములు *హ స క హ ల హ్రీం* అనునది *కామ రాజకూటము* (అమ్మవారి కంఠం దిగువభాగం నుండి కటిప్రదేశం వరకు). చివరి నాలుగు బీజాక్షరములు *స క ల హ్రీం* అనునది *శక్తికూటము* (అమ్మవారి కటిప్రదేశం దిగువభాగం నుండి పాదములవరకు). అనగా పంచదశీ మంత్రంలో మూడు శివశక్తులు గలవు. పంచదశీ మంత్రం అమ్మవారి సూక్ష్మరూపమును చెప్పుచున్నది *(మూలకూటత్రయ కళేబరా - 89వ నామ మంత్రము)* అని కూడా అమ్మవారు అనబడుచున్నది. ఆ విధంగా అమ్మవారు మూడు కూటముల సూక్ష్మరూపిణిగా *కూటస్థా* యనియు, *సూక్ష్మరూపిణీ* యనియు అనబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సూక్ష్మరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *20.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*


*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*రేతో నావకిరేజ్జాతు బ్రహ్మవ్రతధరః స్వయమ్|*


*అవకీర్ణేఽవగాహ్యాప్సు యతాసుస్త్రిపదీం జపేత్॥12879॥*


ఏవిధముగను రేతఃపతనమును కానీయరాదు. పూర్తిగా బ్రహ్మచర్యవ్రతమును పాటించవలెను. స్వప్నస్ఖలనము జరిగినచో స్నానమాచరించి, ప్రాణాయామ పూర్వకముగా గాయత్రీ జపమును చేయవలెను.


*17.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*అగ్న్యర్కాచార్యగోవిప్రగురువృద్ధసురాఞ్శుచిః|*


*సమాహిత ఉపాసీత సంధ్యే చ యతవాగ్జపన్॥12880॥*


బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై ఉభయ సంధ్యాసమయముల యందును అగ్నికార్యములను చేయవలెను. సూర్యమండల మధ్యవర్తియగు భగవంతుని ఉపాసించవలెను. ఆచార్యులను, గోవులను, బ్రాహ్మణోత్తములను, గురువులను, వృద్ధులను, దేవతలను సేవింపవలెను. త్రిసంధ్యలయందును మౌనముగా గాయత్రిని జపింపవలయును.


*17.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ఆచార్యం మాం విజానీయాన్నావన్మన్యేత కర్హిచిత్|*


*న మర్త్యబుద్ధ్యాసూయేత సర్వదేవమయో గురుః॥12881॥*


ఆచార్యుని నా స్వరూపముగా (భగవత్స్వరూపునిగా) ఎఱుంగవలెను. ఆయనను కించపరచరాదు. గురువు సర్వదేవతాస్వరూపుడు. ఆయనను సాధారణ మానవునిగా భావించి, దోషములెంచరాదు.


*17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*సాయం ప్రాతరుపానీయ భైక్ష్యం తస్మై నివేదయేత్|*


*యచ్చాన్యదప్యనుజ్ఞాతముపయుంజీత సంయతః॥12882॥*


కావున, ప్రాతఃకాలమునందును, సాయంకాలమునందును లభించిన భిక్షాన్నమును, నిషిద్ధములుగాని ఇతర పదార్థములను మొదట గురుసమక్షమున ఉంచవలెను. ఆయన ఆజ్ఞయైన పిదప వినయముతో వాటిని స్వీకరింపవలెను.


*17.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*శుశ్రూషమాణ ఆచార్యం సదోపాసీత నీచవత్|*


*యానశయ్యాసనస్థానైర్నాతిదూరే కృతాంజలిః॥12883॥*


ఆచార్యుడు ఎచటికైనను వెళ్ళుచున్నప్పుడు శిష్యుడు ఆయనవెంట నడువవలెను. శయనించునప్పుడు అప్రమత్తతో ఆయనకు చేరువగా శయనింపవలెను. విశ్రాంతి తీసికొనుచున్నప్పుడు పాదసేవలు చేయవలెను. కూర్చొని యున్నప్పుడు భృత్యునివలె కృతాంజలియై ఆయన ఆజ్ఞకొరకు నిరీక్షించుచుండవలెను. ఈ విధముగా వినమ్రతతో సర్వదా గురుశుశ్రూషలయందే నిరతుడై యుండవలెను.


*17.30 (ముప్పదియవ శ్లోకము)*


*ఏవంవృత్తో గురుకులే వసేద్భోగవివర్జితః|*


*విద్యా సమాప్యతే యావద్బిభ్రద్వ్రతమఖండితమ్॥12884॥*


విద్యాభ్యాసము ముగియునంత వరకును శిష్యుడు సకల భోగములను విసర్జించి, బ్రహ్మచర్యవ్రత దీక్షతో గురుకులము నందే నివసింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

ప్రతిఫలం

 *💥#ప్రతిఫలం.....!!💦🎊* 

   🕉️🌞🌎🏵️🌼🚩

*ఒకసారి, ఒక బిచ్చ గాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు, చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించి ఉండటంగమనించాడు.* 


*ఈ వ్యక్తి చాలా ధన వంతుడని, అతను భావించాడు. కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానంచేస్తాడు అనుకొని అతను దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు.* 


*ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి,"మీరుఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా.... మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా?" అని అడిగాడు ఆ వ్యక్తి.* 


*ఆ బిచ్చగాడు, "సార్, నేను బిచ్చగాడిని, నేను ప్రజలను డబ్బును మాత్రమే అడగగలను. కానీ నేను ఎవరికైనా,... ఏదైనాఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు.?"* 


*ఆ మాట విన్న ఆ వ్యక్తిఇలా జవాబిచ్చాడు బిక్షగాడితో, "మీరు ఎవరికీ ఏమీ ఇవ్వ లేనప్పుడు, అప్పుడు మీరుకూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా.నేను ఒక వ్యాపార వేత్తని అంతేకాక లావా దేవీలను మాత్రమే నమ్ముతాను.మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే, నేను కూడా చేయగలను మీకు ప్రతి ఫలంగా ఏదైనా ఇవ్వ డానికి" అనడం జరిగింది.* 


                  *అప్పుడే, రైలు ఒక స్టేషన్‌కు రావడం జరిగింది. ఆ వ్యాపార వేత్త ట్రైన్ దిగి వెళ్లి పోయాడు.* 


            *బిచ్చగాడు ఆ వ్యాపార వేత్తచెప్పినదాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు.అతనిమాటలు ఎలా గోలా బిచ్చగాడి హృదయాన్ని చేరు కున్నాయి.* 


                    *ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలే నందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొంద లేను అనిఅనుకొంటూ... ఆలోచించడం *మొదలు పెట్టాడు. కానీ నేను బిచ్చగాడిని, ఎవరికైనా ఇవ్వడానికి ఏమీ నా దగ్గర విలువై నది లేదు కదా.....!!.* 

*అయినా ఎంతసేపు* *నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా.... ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమి బాగా లేదు . అని* *లోతుగా ఆలోచించిన తరువాత, భిక్షగాడు దానం అడిగే దాని కన్నా ముందు ఏదైనా తన వద్ద* *వుంటే, అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించు కున్నాడు.*


*కానీ ఇప్పుడు వున్న ప్రశ్న ఏమిటంటే, అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వ గలడు? రోజంతా దీని గురించే ఆలోచిస్తూ గడిచింది. కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు.* 


*మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్న ప్పుడు, అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వుల మీద పడ్డాయి. అతనికి ఒక ఆలోచన వచ్చి, వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకొన్నాడు.* 


              *అతనికి ఈ ఆలోచన నచ్చి.....వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు. భిక్షాటన చేయడానికి రైలు ఎక్కడు.* 


*ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు, అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు. ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు.* 


*ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజూ కొన్ని పువ్వులు తెచ్చుకుని, భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు.* 


*కొద్ది రోజుల్లోనే అతను చాలా మంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని అతడు గ్రహించాడు.అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపే వాడు.అతనికిపువ్వులు ఉన్నంత వరకు, చాలా మంది అతనికి భిక్ష పెట్టేవారు.కానీఅతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు, అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు.ఇలా ప్రతి రోజూ కొనసాగుతూ ఉండేది.* 


*ఒక రోజు అతను భిక్షాటనచేస్తున్నప్పుడు, అదే వ్యాపారవేత్త రైలులో కూర్చుని ఉండడం చూశాడు, అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు.* 


*భిక్షగాడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి, "ఈ రోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను " అన్నాడు.* 


                 *అప్పుడా వ్యాపారవేర్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో, ఆ బిచ్చ గాడు అతనికి ప్రతిగా కొన్నిపువ్వులుఇచ్చాడు. ఆ వ్యాపార వేత్తకు బిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది. మరియు బాగా ఆకట్టుకున్నాడు.* 


*అతను, "వావ్! ఈ రోజు మీరు కూడా నాలాగే వ్యాపార వేత్తగా మారారు అని అతన్ని అభినందించి." బిచ్చ గాడి నుండి పువ్వులు తీసుకొని, అతను ప్రక్క స్టేషన్‌లో దిగిపోయాడు.* 


*మళ్ళీ మరోసారి, ఆ వ్యాపార వేత్త మాటలు బిచ్చగాడి హృదయం లోకి చేరు కున్నాయి. అతనుఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండటంప్రారంభించాడు.* 


*అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించటం ప్రారంభిం చాయి,అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చు కోగల విజయానికి బాటని కనుకొన్నానని అతను భావించాడు.* 


*అతను వెంటనే రైలు నుండిదిగి ఉత్సాహంగా ఆకాశంవైపు చూస్తూ.... చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు, “నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను ఇప్పుడు వ్యాపారిని, నేను కూడా ఆ పెద్దమనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధన వంతుడిని కాగలను" అని అనడం జరిగింది.* 


*అక్కడున్న ప్రజలు అతడిని చూసి, బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు.మరుసటి రోజు నుండి ఆ బిచ్చ గాడు మళ్లీ ఆ స్టేషన్‌లో కనిపించ లేదు.* 


              *నాలుగు సంవత్సరాల తరువాత, సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి, "మీరునన్నుగుర్తించారా?" అని అడిగాడు.* 


*మరొక వ్యక్తి "లేదు! బహుశా మనం మొదటి సారి కలుస్తున్నామేమో." అని అనడం జరిగింది.* 


*మొదటి వ్యక్తి మళ్లీ అన్నాడు, "మనం మొదటిసారి కలుసు కోవడం కాదు...., ఇది మూడోసారి" అన్నాడు.* 


*రెండవ వ్యక్తి," అవునా....సరే, నాకు గుర్తులేదు. మనం ఎప్పుడు కలుసు కున్నాము?" అని అడగడం జరిగింది.* 


              *అప్పుడా మొదటి వ్యక్తి నవ్వి, "మనం ఇంతకు ముందు ఒకే రైలులో రెండుసార్లు కలుసు కున్నాము. నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చ గాడిని, రెండవ సమావేశంలో 'నేను నిజంగా బిజినెస్ మ్యాన్' అని మీరు నన్ను మెచ్చు కొన్నారు అది కూడా నేనే"......!!* 


*ఫలితంగా, ఈ రోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు.... అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను."* 


*"మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు ... దాని ప్రకారం "మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకుఏదైనా లభిస్తుంది" అని.* 


*ఈలావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దానిని బాగా అనుభూతి చెందాను, అంతకు మునుపు నేను ఎప్పుడూ.... నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకొనే వాణ్ని , నేను దాని కంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు.* 


                *కానీ..... నేనుమిమ్మల్ని రెండోసారికలిసినప్పుడు, నేను...ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు.మీకు ధన్యవాదాలు, ఆ రోజు నుండి, నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నేను వ్యాపార వేత్తగా మారాను, నేను ఇకపై బిచ్చగాడిని కాదు.”అని ఆ వ్యాపార వేత్తతో అనడం జరిగింది.* 


*బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం, అతను బిచ్చగాడుగానే ఉన్నాడు. మరియు తనను తాను వ్యాపార వేత్తగా భావించి నప్పుడు, అతను ఒకవాపారవేత్త గా ఎదగడం జరిగింది.* 

                    

    *"కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకో.......* 

 *నీ కలలను సాకారం చేసుకో"....!!* 


🕉️🌞🌎🏵️🌼🚩

శ్రీమద్వాల్మీకి రామాయణం



ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                ----------------------- 


యావత్ స్థాస్యన్తి గిరయః 

               సరితశ్చ మహీతలే I 

తావత్ రామాయణకథా 

               లోకేషు ప్రచరిష్యతి ॥ 

             - అని బ్రహ్మదేవుని మాట! 

      అంటే, పర్వతాలూ నదులూ భూతలమందు ఉన్నంతకాలమూ రామాయణ కథ లోకాలలో వ్యాపించియుంటుంది అని అర్థం. 

      మానవుని జీవన విధానాన్ని వైదికశాస్త్రపరంగా వివరించేది శ్రీమద్వాల్మీకీ రామాయణం. 

      వేదార్థానికి పరిపుష్టి కూర్చడానికై రచింపబడిన రామాయణం ఏ విషయాన్నైనా ఆయా సందర్భాలలో చక్కని కథాభాగంగా వివరిస్తూ, 

      మనకి కావలసిన కార్యాలకు సంబంధించి సందేశాల రూపంలో మార్గాన్ని సూచిస్తుంది. 

      సమస్యలకి పరిష్కారంగా మాత్రమే కాక, అసలు సమస్యనే నివారించే విధంగా వ్యక్తికీ, సమాజానికీ అన్ని కాలాలలోనూ పూర్తిగా అవుసరమైనది. 

      గణితం, భౌతిక, జీవశాస్త్రాలూ, అర్థ, భౌగోళిక, చరిత్ర, పరిపాలన, విజ్ఞాన, వైద్యశాస్త్రాలనేవి - ఒక్కొక్కరూ ఒక్కొక్క విషయంలో మాత్రమే నిష్ణాతులయ్యే అవకాశం ప్రస్తుత విద్యావ్యవస్థలో మనకి కనిపిస్తుంది. 

      అదీకూడా, అనేక పరిశోధనలు చేస్తూ, వచ్చే ఫలితాలు పాతపరిశోధనల ఫలితాలతో విభేదిస్తూ ముందుకువెళ్ళే వ్యవస్థే మనకి తెలుసు. 

      పరమాణు నమూనా - ఎలక్ట్రాన్ విషయాలకి సంబంధించి రూథర్ ఫర్డ్, థామ్సన్, నీల్స్ బోర్, సోమర్ ఫీల్డ్ వంటి శాస్త్రవేత్తలు ఒకరి తరువాత ఒకరు భిన్న నిర్వచనాలనివ్వడమే దీనికి గొప్ప ఉదాహరణ. 

      కానీ శ్రీమద్వాల్మీకి రామాయణం ఏ విషయమైనాసరే, దానిపై ప్రత్యేకంగా పరిశోధనతో ముందుకు వెళ్ళవలసిన అవుసరంలేక, ఆ విషయంమీద ఆదర్శంగా కనిపించే విధానంతో, విషయాన్ని లోతుగా సమగ్రంగా వివరిస్తూ, అన్ని విద్యావిషయాలనీ అందిస్తుంది. 

      మానవుని జీవితంలో, పుట్టిన దగ్గరనుంచీ జీవితకాలమంతా దైనందిక జీవితంలో, 

      వ్యక్తిగా - సమాజపరంగానూ, ప్రకృతికి చెందిన భౌతిక విషయాలకీ, మానసిక ఆలోచనకి సంబంధించి సమగ్రంగా సమాచారాన్ని విశ్లేషించే ఆదికావ్యం శ్రీమద్వాల్మీకి రామాయణం. 


    ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే అంశంలోని

      ప్రస్తుత విద్యావిషయాలలో గణితం, చరిత్ర, సాంకేతికవిద్య, వైద్యంవంటివాటికి సంబంధించి ఒక్కొక్క విషయానికి ఆ గ్రంథం ఏ విధమైన సందేశం ఇస్తుందో ఒక్కోరోజు ఒక్కొక్క విషయమై పరిశీలిద్దాం. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం