21, అక్టోబర్ 2021, గురువారం

కామ్రేడ్ కామేశం"

 * "కామ్రేడ్ కామేశం" *


కామ్రేడ్ కామేశం ఆవేశంతో ఊగిపోతున్నాడు.


పక్కింటి వాళ్ళు చెత్త తీసుకొచ్చి వీళ్ళ ఇంటి వారగా వేస్తున్నారు ప్రతిరోజు. చాలా సార్లు చెప్పి చూసాడు. ఐనా ఫలితం కనపడలేదు.


వీరావేశంతో బైటకు వచ్చి "పక్కింటి వాళ్ళ దౌర్జన్యం నశించాలి" అంటూ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.


ఆ వీధిలో ఉండేవారికి ఇది విచిత్రంగా తోచింది. ఏదైనా తేడా వస్తే పోట్లాడుకుంటారు కానీ ఇలా రాజకీయ నాయకుల్లాగా 'నశించాలి' అంటూ నినాదాలేఁవిటి?' అనుకున్నారు అంతా.


కొందరు బుగ్గన, మరికొందరు ముక్కున వేలేసుకున్నారు కూడా.


ఐనా కా.కా. తగ్గడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యంలాగే పక్కింటివాళ్ళు కూడా చలనం లేకుండా ఉన్నారు.


అరిచి అరిచి గొంతు నెప్పు పుట్టిన కా.కా. ఆ రోజుకి విశ్రమించాడు. మర్నాడు ఉదయం మళ్ళీ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి నినాదాలు అందుకున్నాడు. ఐతే ఈ సారి ఎదురింటివారిని కూడా కలిపాడు.


"పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నశించాలి" అంటూ. 


బ్రేక్ ఫాస్ట్ దిట్టంగా తగిలించినట్లున్నాడు, మధ్యాహ్నం రెండింటి వరకు నినాదాలు ఇస్తూనే ఉన్నాడు .... అంతవరకు ఆ చేతిని అలా పిడికిలి బిగియించి పైకెత్తుతూనే ....


భోజనాల వేళకు లోపలకెళ్ళాడు. కాసేపటికి మళ్ళీ వచ్చాడు. నినాదాల జోరు, హోరు పెరిగాయి.


ఐనా కూడబలుక్కున్న ప్రభుత్వం, యాజమాన్యంలాగానే పక్కింటి, ఎదురింటివాళ్ళు కూడా చలించలేదు.


ఆ రోజుకి తన నిరశన ఆపాడు కా.కా.


మరునాడు ఉదయం చూసేసరికి ఆ వీధిలోని వారంతా చెత్త తీసుకువచ్చి కా.కా. ఇంటి దగ్గరే పడేసి వెళ్ళినట్లున్నారు, ఇంటి ముందు అంతా వాసనొస్తోంది.


కా.కా.కి కడుపు రగిలింది. నినాదాల రూపు మారింది. డోర్ నంబర్ చెప్పి మరీ 'నశించాలి' అంటూ నినదించడం మొదలు పెట్టాడు, పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి ....


అలా ఆ రోజంతా గడిచింది. సాయం సంధ్య వేళ ఆ వీధిన సైకిలు మీద వెళ్తున్న పంతులు గారు కా.కా.ని చూసి "ఎందుకయ్యా అలా అందరు నశించాలి' అని అరుస్తున్నావు?" అని అడిగారు.


అప్పుడు కా.కా. విషయం చెప్పి 'నశించాలి' అన్నాడు, పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి ....


"నీ 'నశించాలి' అనే నినాదం ఆపి 'సృష్టించాలి' అనే నినాదం అందుకో. పరిస్థితి మారుతుంది" అన్నారు పంతులు గారు.


"మాకు నశించాలి అన్న ఒకే ఒక్క నినాదం నేర్పారు. అందుకే అది తప్ప ఇంకోటి నానోట రాదు" అన్నాడు కా.కా. చెయ్యి పైకెత్తుతూ ....


"ఇలా అందరు నశించిపోతే నువ్వెక్కడివే ఎలా ఉంటావ్? ఆలోచించుకో" అన్నారు పంతులు గారు.


ఆలోచనలో పడ్డాడు కా.కా.


'ఈ పంతులు గారు చెప్పింది ఏదో కొత్తగా ఉంది, పరీక్షిద్దాం' అనుకున్నాడు కా.కా.


"ఐతే అది ఎలా?" అని అడిగాడు కా.కా.


అప్పుడు పంతులు గారు ఈ విధంగా చెప్పారు ....


"చూడబ్బాయ్ .... నాశనం కోరుకోవడం మన సాంప్రదాయం కాదు .... "


"బూజు పట్టిన సాంప్రదాయాలు నశించాలి" అన్నాడు కా.కా. ఆవేశంగా పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తుతూ ....


"నీ నినాదాలు కాసేపు ఆపితే వివరంగా విషయం చెబుతా" అన్నారు పంతులు గారు.


"సరే చెప్పండి" అన్నాడు కా.కా.


"ప్రతీది అలా నశించకూడదయ్యా. ప్రకృతి ధర్మం ప్రకారం ఏది ఎప్పుడు నశించాలో అప్పుడే నశిస్తుంది. ఈ లోగా నువ్వు అన్నీ నశించాలి అని అంటే అది ప్రకృతి విరుధ్ధం" అన్నారు పంతులు గారు.


"అన్నీ ప్రకృతిపరంగానే నశించేట్లైతే నేను 'నశించాలి' అంటే మాత్రం నష్టం ఏమిటి?" అని అడిగాడు కా.కా. లాజిక్ తీస్తూ.


"ఔను కదా, మరి ప్రకృతిపరంగానే నాశనం అయ్యేవాటిని 'నశించాలి' అరవడం వల్ల ఉపయోగం ఏమిటి, కంఠశోష తప్ప?" అని అడిగారు పంతులు గారు.


కా.కా. ఆలోచనలో పడ్డాడు, ఈ పంతులు గారు ఏదో మెలికేసాడు అనుకుంటూ


"మరి సృష్టించడం మాకు తెలీదే, ఎలాగా?" అని అడిగాడు కా.కా.


"అలా అడిగావు బాగుంది. చెబుతా విను. ఈ వీధిలోని వాళ్ళంతా చెత్తను ఇలా ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. మునిసిపాలిటీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి చెత్త తీసుకువెళ్తారు. అలా ఎవరికీ క్రమశిక్షణ లేకుండా పోయింది .... " అంటూ చెప్పడం ఆపారు పంతులు గారు.


"నన్ను వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టమంటారా, ఐతే?" అని అడిగాడు కా.కా.


"నీకా శ్రమ అవసరం లేదు. ఒకవేళ నువ్వు వాళ్ళను క్రమశిక్షణలో పెట్టాలన్నా వాళ్ళు ఉండరు .... " అంటూ ఆగారు పంతులు గారు.


"ఐతే క్రమశిక్షణ .... " అంటూ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తాడు కా.కా.


"ఆగాగు .... నీ నినాదం ఏమిటో నాకు తెలుసు. కానీ వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టాలంటే ముందు నువ్వు క్రమశిక్షణలో ఉండాలి" అన్నారు పంతులు గారు.


"అదెలా కుదరతుంది?" అనడిగాడు అదేంటో తెలియని కా.కా.


"ఐతే నీ బతుకంతా పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి 'నశించాలి' అని అరవడమే సరిపోతుంది. కొంత కాలానికి నీ చెయ్యి ౙండా కఱ్ఱలాగా అలా గాలిలోనే ఉండిపోతుంది. సమాజంలో మార్పు రావాలంటే నినాదాల వల్ల రాదు బాబు. స్వయంగా చేసి చూపించడంవల్ల వస్తుంది" అంటూ హితబోధ చేసారు పంతులు గారు.


"ఐతే నన్నేం చెయ్యమంటారు?" అని అడిగాడు కా.కా. .... పంతులు గారు చెప్పిన దానిలో నిజం ఉందేమో అని అనుమానం వచ్చి ....


"రేపటినుండి మీ ఇంట్లో చెత్తను ఒక డబ్బాలో వేసి, పక్కింటి చెత్తను, ఎదురింటి చెత్తను, అలాగే ఈ వీధిలో వాళ్ళ ఇళ్ళ ముందు ఉండే చెత్తను డబ్బాలో వేసుకుని తీసుకెళ్ళి పక్క వీధిలో ఉన్న మునిసిపాలిటీ చెత్త కుండీలో వెయ్యి" అన్నారు పంతులు గారు.


"అందరు వాళ్ళింటి చెత్త అంతా తీసుకొచ్చి నా డబ్బాలోనే వేస్తే?" అని అనుమానం వెలిబుచ్చాడు కా.కా.


పంతులు గారు నవ్వి "చూడు బాబు, ఎప్పుడైనా సానుకూల ధృక్పధంతో పని మొదలు పెడితే అన్నీ చక్కగా నడుస్తాయి. శంకలతో మొదలు పెడితే మూలశంకలా పీడిస్తూనే ఉంటుంది" అన్నారు పంతులు గారు.


"కానీ .... " మళ్ళీ శంకతో ఆగిపోయాడు కా.కా.


"నీ అనుమానం నాకు అర్ధం అయింది. ఒక రోజు వేస్తారు, రెండు రోజులు వేస్తారు. మూడో రోజునుండి ఎవరి చెత్త వాళ్ళే తీసుకువెళ్ళి పక్క వీధిలో ఉన్న మునిసిపాలిటీ చెత్త కుండీలో వేస్తారు. కావాలంటే నేను కూడా నీకు సాయంగా వస్తా" అన్నారు పంతులు గారు.


"మీరా? పెద్దవారు, మీకెందుకండి శ్రమ? నేనంటే కుఱ్ఱవాణ్ణి .... " అంటూ పంతులు గారిని వారించబోయాడు కా.కా.


"అదే నాయనా స్ట్రాటజీ .... నీతో పాటు నేను కూడా ఒక డబ్బాలో చెత్త వేసుకుంటూ, ఆ డబ్బాని సైకిల్ మీద పెట్టుకుని తీసుకువెళ్తుంటే చూసేవాళ్ళకు కొంచెమైనా అపరాధ భావన ఏర్పడుతుంది. అందులోనుండే పరివర్తన వస్తుంది" అన్నారు పంతులు గారు.


"ఆహా .... భలే ఐడియా గురువు గారు. పంతులు గారికి జై .... " అంటూ చెయ్యి పైకి ఎత్తబోయాడు.


"నువ్వు నినాదాలు కాకుండా నిజాయితీకి నిదర్శనంగా నిలవాలి. అప్పుడే సమాజంలో మార్పు ఏర్పడుతుంది. అది వీధిలో చెత్త కావచ్చు, సమాజంలోని చెత్త కావచ్చు" అన్నారు పంతులు గారు.


కామేశం ఇంట్లోకి వెళ్ళాడు డబ్బా తీసుకు రావడానికి.


పంతులు గారు సైకిల్ స్టాండు వేసి, ఆ చుట్టుపక్కల ఉన్న చెత్తను ఒక చోటకు చేర్చడం మొదలు పెట్టారు.


*************************** (శుభం)


రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

తేది 19-10-2021

1 కామెంట్‌:

కాంత్ చెప్పారు...

లగే రహో మున్నాభాయ్ లో గాంధీగిరి నా? ఇలాటివి సినిమాలలో/కథల్లో బావుంటాయి. నిజ జీవితంలో జరగడం కల్ల