21, అక్టోబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం*

 *21.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*


*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*యద్యసౌ ఛందసాం లోకమారోక్ష్యన్ బ్రహ్మవిష్టపమ్|*


*గురవే విన్యసేద్దేహం స్వాధ్యాయార్థం బృహద్వ్రతః॥12885॥*


బ్రహ్మచారి వేదములకు నివాసస్థానమైన బ్రహ్మలోకమును పొందగోరినచో, అతడు జీవితాంతము నిష్ఠతో బ్రహ్మచర్య వ్రతమును పాటించవలెను. వేదాధ్యయనము కొరకు అతడు తన జీవితమును అంతయును ఆచార్యుని సేవలలోనే గడుపవలెను.


*17.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేషు మాం పరమ్|*


*అపృథగ్ధీరుపాసీత బ్రహ్మవర్చస్వ్యకల్మషః॥12886॥*


అట్టి నైష్ఠిక బ్రహ్మచారి పాపరహితుడై బ్రహ్మవర్చస్సుతో వెలుగొందును. అతడు అగ్నియందును, గురువునందును, తనయందును, సకలప్రాణుల యందును నేనే (పరమాత్మయే) విరాజిల్లుచున్నట్లు భావించుచు అభేదబుద్ధితో నన్నే ఉపాసించవలయును.


*17.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*స్త్రీణాం నిరీక్షణస్పర్శసంలాపక్ష్వేలనాదికమ్|*


*ప్రాణినో మిథునీభూతానగృహస్థోఽగ్రతస్త్యజేత్॥12887॥*


అగృహస్థుడు అనగా బ్రహ్మవ్రతధీరుడు (బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్న్యాసి) స్త్రీలను చూడరాదు, స్పృశింపరాదు. వారితో సంభాషింపరాదు. పరిహాసము లాడరాదు. మైథునక్రియలోనున్న పశుపక్ష్యాదులవైపు కన్నెత్తియైనను చూడరాదు.


*17.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*శౌచమాచమనం స్నానం సంధ్యోపాసనమార్జవమ్|*


*తీర్థసేవా జపోఽస్పృశ్యాభక్ష్యాసంభాష్యవర్జనమ్॥12888॥*


*17.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*సర్వాశ్రమప్రయుక్తోఽయం నియమః కులనందన|*


*మద్భావః సర్వభూతేషు మనోవాక్కాయసంయమః॥12889॥*


ఉద్ధవా! బాహ్యాభ్యంతర శౌచము, ఆచమనము, స్నానము, సంధ్యోపాసనము, ఋజువర్తనము, పుణ్యతీర్థములను సేవించుట, గాయత్ర్యాది మంత్రములను జపించుట, స్పృశింపరాని వస్తువులను, భక్షింపగూడని పదార్థములను, సంభాషింపరాని మాటలను వర్జించుట, సకల ప్రాణుల యందును దైవభావమును కలిగియుంఢుట, మనోవాక్కాయముల నిగ్రహించుట (త్రికరణశుద్ధిగా సంయమనము పాటించుట) - ఈ నియమములు చతురాశ్రమములవారును పాటింపదగినవి.


*17.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*ఏవం బృహద్వ్రతధరో బ్రాహ్మణోఽగ్నిరివ జ్వలన్|*


*మద్భక్తస్తీవ్రతపసా దగ్ధకర్మాశయోఽమలః॥12890॥*


ఈ నియమములను పాటించునట్టి దీక్షాదక్షుడైన బ్రాహ్మణుడు అగ్నివలె తేజరిల్లును. తీవ్రతపఃప్రభావమున అతని కర్మసంస్కారములు అన్నియును దగ్ధములైపోవును. అంతట అతడు అంతఃకరణ శుద్ధి గలిగి నాయందు అనన్యభక్తుడై, నిర్మలతేజోవిరాజమానుడగును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: