21, అక్టోబర్ 2021, గురువారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*467వ నామ మంత్రము* 21.10.2021


*ఓం సూక్ష్మరూపిణ్యై నమః*


తెలియశక్యముకానంత సూక్ష్మరూపము గలిగిన జగన్మాతకు నమస్కాము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సూక్ష్మరూపిణీ* యను ఐదక్షరముల(పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం సూక్ష్మరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు పరబ్రహ్మతత్త్వము తెలియు దిశగా తమ సాధనాపటిమను కొనసాగించి, ఆ పరబ్రహ్మస్వరూపిణిని తెలియుటకు ప్రయత్నించి తరింతురు.


ఆత్మతత్త్వము అన్నిటికంటె సూక్ష్మమైనది అని శృతివాక్యములందు తెలియజేయబడినది. అంతేగాదు ఆ ఆత్మతత్త్వము నిత్యమైనది. అణువుకంటె అణువైనది. పరమాత్మ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మరూపమైన ఆత్మరూపంలో అనంతకోటి జీవరాశులలో నెలకొనియున్నది. ఈ దేహము అనిత్యము. ఆత్మ నిత్యము, సత్యము. పాత వస్త్రమును విసర్జించి, క్రొత్త వస్త్రమును ధరించినటులు, శుష్కించిన ఒక దేహమును విడచి, వేరొక క్రొత్త దేహములో ప్రయాణించుచూ, నిత్యము, సత్యమై భాసిల్లుచున్నది ఆత్మ. ఆత్మలకు ఆత్మయై, పరమాత్మయైన పరమేశ్వరి ఆ విధముగా సూక్ష్మరూపిణీ యని అనబడుచున్నది.


ఒకానొక హోమమునకు సూక్ష్మమను సంజ్ఞకలదు. అందుచే అమ్మవారు సూక్ష్మమనెడు హోమస్వరూపురాలు పరమేశ్వరి. మూలాధారమునందు అగ్నిగలదు. అట్టి మూలాధారమందు శాస్త్రోక్తమైన అక్షరములతో పండ్రెండు విధములుగా చేయబడు హోమమునకు సూక్ష్మమని పేరు. అట్టి సూక్ష్మమను హోమస్వరూపురాలు పరమేశ్వరి గనుక *సూక్ష్మరూపిణీ* యని అనబడినది. అమ్మవారికి స్థూలము, సూక్ష్మము, పరము అను మూడురూపములు గలవు. మనకంటికి కనబడే పరమేశ్వరి స్వరూపము స్థూలరూపము. పంచదశీ మంత్రము అమ్మవారి సూక్ష్మరూపము. అందుకే అమ్మవారు *మూలమంత్రాత్మికా* యనియు, *మూలకూటత్రయకళేబరా* యనియు చెప్పబడినది.


పంచదశీ మంత్రం *క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం* అయితే ఇందులో మొదటి ఐదు బీజాక్షరములు *క ఏ ఈ ల హ్రీం* అనునది *వాగ్భవకూటము* (అమ్మవారి ముఖకమలము). తరువాత ఆరు బీజాక్షరములు *హ స క హ ల హ్రీం* అనునది *కామ రాజకూటము* (అమ్మవారి కంఠం దిగువభాగం నుండి కటిప్రదేశం వరకు). చివరి నాలుగు బీజాక్షరములు *స క ల హ్రీం* అనునది *శక్తికూటము* (అమ్మవారి కటిప్రదేశం దిగువభాగం నుండి పాదములవరకు). అనగా పంచదశీ మంత్రంలో మూడు శివశక్తులు గలవు. పంచదశీ మంత్రం అమ్మవారి సూక్ష్మరూపమును చెప్పుచున్నది *(మూలకూటత్రయ కళేబరా - 89వ నామ మంత్రము)* అని కూడా అమ్మవారు అనబడుచున్నది. ఆ విధంగా అమ్మవారు మూడు కూటముల సూక్ష్మరూపిణిగా *కూటస్థా* యనియు, *సూక్ష్మరూపిణీ* యనియు అనబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సూక్ష్మరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: