21, అక్టోబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం*

 *20.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*


*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*రేతో నావకిరేజ్జాతు బ్రహ్మవ్రతధరః స్వయమ్|*


*అవకీర్ణేఽవగాహ్యాప్సు యతాసుస్త్రిపదీం జపేత్॥12879॥*


ఏవిధముగను రేతఃపతనమును కానీయరాదు. పూర్తిగా బ్రహ్మచర్యవ్రతమును పాటించవలెను. స్వప్నస్ఖలనము జరిగినచో స్నానమాచరించి, ప్రాణాయామ పూర్వకముగా గాయత్రీ జపమును చేయవలెను.


*17.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*అగ్న్యర్కాచార్యగోవిప్రగురువృద్ధసురాఞ్శుచిః|*


*సమాహిత ఉపాసీత సంధ్యే చ యతవాగ్జపన్॥12880॥*


బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై ఉభయ సంధ్యాసమయముల యందును అగ్నికార్యములను చేయవలెను. సూర్యమండల మధ్యవర్తియగు భగవంతుని ఉపాసించవలెను. ఆచార్యులను, గోవులను, బ్రాహ్మణోత్తములను, గురువులను, వృద్ధులను, దేవతలను సేవింపవలెను. త్రిసంధ్యలయందును మౌనముగా గాయత్రిని జపింపవలయును.


*17.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ఆచార్యం మాం విజానీయాన్నావన్మన్యేత కర్హిచిత్|*


*న మర్త్యబుద్ధ్యాసూయేత సర్వదేవమయో గురుః॥12881॥*


ఆచార్యుని నా స్వరూపముగా (భగవత్స్వరూపునిగా) ఎఱుంగవలెను. ఆయనను కించపరచరాదు. గురువు సర్వదేవతాస్వరూపుడు. ఆయనను సాధారణ మానవునిగా భావించి, దోషములెంచరాదు.


*17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*సాయం ప్రాతరుపానీయ భైక్ష్యం తస్మై నివేదయేత్|*


*యచ్చాన్యదప్యనుజ్ఞాతముపయుంజీత సంయతః॥12882॥*


కావున, ప్రాతఃకాలమునందును, సాయంకాలమునందును లభించిన భిక్షాన్నమును, నిషిద్ధములుగాని ఇతర పదార్థములను మొదట గురుసమక్షమున ఉంచవలెను. ఆయన ఆజ్ఞయైన పిదప వినయముతో వాటిని స్వీకరింపవలెను.


*17.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*శుశ్రూషమాణ ఆచార్యం సదోపాసీత నీచవత్|*


*యానశయ్యాసనస్థానైర్నాతిదూరే కృతాంజలిః॥12883॥*


ఆచార్యుడు ఎచటికైనను వెళ్ళుచున్నప్పుడు శిష్యుడు ఆయనవెంట నడువవలెను. శయనించునప్పుడు అప్రమత్తతో ఆయనకు చేరువగా శయనింపవలెను. విశ్రాంతి తీసికొనుచున్నప్పుడు పాదసేవలు చేయవలెను. కూర్చొని యున్నప్పుడు భృత్యునివలె కృతాంజలియై ఆయన ఆజ్ఞకొరకు నిరీక్షించుచుండవలెను. ఈ విధముగా వినమ్రతతో సర్వదా గురుశుశ్రూషలయందే నిరతుడై యుండవలెను.


*17.30 (ముప్పదియవ శ్లోకము)*


*ఏవంవృత్తో గురుకులే వసేద్భోగవివర్జితః|*


*విద్యా సమాప్యతే యావద్బిభ్రద్వ్రతమఖండితమ్॥12884॥*


విద్యాభ్యాసము ముగియునంత వరకును శిష్యుడు సకల భోగములను విసర్జించి, బ్రహ్మచర్యవ్రత దీక్షతో గురుకులము నందే నివసింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: