(ఏప్రిల్ 30 శ్రీ శ్రీ జయంతి)
( సేకరణ )
“మహాప్రస్థానా”నికి యోగ్యతాపత్రం రాస్తూ “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ” అన్నాడు చలం. అసలు ఎవరీ శ్రీశ్రీ. తెలుగులో కవిత్వం పేరెత్తగానే అందరి తలలూ ఆయనవైపెందుకు తిరుగుతాయి? “రెండు శ్రీల ధన దరిద్రుడు - కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ” అని వేటూరి సంస్మరించుకున్న ఆ ఘనసముద్రంలో ఉన్న రత్నమాణిక్యాలేమిటి? వాటి కాంతుల ధగధగలు ఎలా ఉంటాయి? ఇవన్నీ తెలుసుకుంటూ, ఆ రత్నపుకాంతులు చూసుకుంటూ పదండి ముందుకు, పదండి త్రోసుకు, పదండి పోదాం పైపైకి!
“ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!”. ఇంత బలంగా మనకోసం మనల్నే తిట్టిన మొదటికవి “శ్రీశ్రీ”నే అయ్యుంటాడేమో! తన కవితాధాటికి ఆ ఎముకులు కుళ్ళిన వారు, వయస్సు మళ్ళిన వారు కూడా నెత్తురు మండుతున్న, శక్తులు నిండుగా ఉన్న సైనికులుగా మారాలని కవి ఆక్రోశం అయ్యుంటుంది.
ఇది చదువుతున్నంతసేపు “విరామ మెరుగక మ్రోగే ఆ మరో ప్రపంచపు కంచు నగారా” మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
శ్రీశ్రీ తానెవరో చెబుతూ...
“భూతాన్ని,
యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని” అనగానే, నువ్వు విప్లవకవివి; ఇలా యజ్ఞోపవీతాలు గట్రా అనకూడదంటూ కస్సుమన్నారు కొందరు.
అసలు ఆయన “స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం” అన్న సంగతి వాళ్ళకేం తెలుసు.
అందుకే వాళ్ళకు అర్థమయ్యేలా శ్రీశ్రీ ఉధృతి పెంచి...
“నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం!” అని ఢంకా బజాయిస్తాడు.
ఇంతకీ మీరేం చేశారు? అని అడిగితే...
“నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!” అన్నాడు. అంతేనా అంటే? కాదుట…
“నేను సైతం
భువనఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!” అన్నాడు ఆవేశంగా ఆకాశం వైపు చూస్తూ.
ఏంటండీ ఆ చూపు అని అడిగితే? అటు చూడు అన్నాడు. అక్కడ…
“యముని మహిషపు లోహఘంటలు
మబ్బుచాటున
ఖణేల్ మన్నాయి!
నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు
ఉరికి పడ్డాయి!”. భయంవేసింది.
ఏంటండీ ఇంత భయం కలుగుతుందీ, ఈ కొత్తరకం కవిత్వం వింటుంటే? అని అడిగితే... ఆయన నవ్వేసి, లేకపోతే ఇంకా ఆ పాతపద్ధతుల్లోనే ఎంతకాలమోయ్ కవిత్వాన్ని మురగబెడతారు? అంటూ...
“కదిలేదీ కదిలించేదీ
మారేదీ మార్పించేదీ
పాడేదీ పాడించేదీ
పెనునిద్దుర వదలించేదీ
మునుముందుకు సాగించేదీ
పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ
కావాలోయ్ నవకవనానికి” అని ఉపదేశం చేస్తాడు..
అసలు కవిత్వానికి ఎలాంటి కవితా వస్తువులు తీసుకోవాలండి అని అడిగామా…
“కుక్కపిల్లా
అగ్గిపుల్లా
సబ్బుబిళ్ళా
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!” అంటాడు.
ఆయనకు “ప్రపంచ మొక పద్మవ్యూహం!
కవిత్వ మొక తీరని దాహం!”
అందుకే “ఓ కవితా! ఓ కవితా” అని ఆయన గొంతెత్తి పాడితే… కవిసమ్రాట్ కళ్ళ నీళ్లు పెట్టుకుని ఈ కవిని కౌగిలించుకున్నాడట.
“పొలాలనన్నీ - హలాలదున్నీ - ఇలాతలంలో హేమం పిండే” విరామమెరుగక పరిశ్రమించే కర్షకవీరుల ఘర్మజలానికి ఖరీదు లేదంటాడీ కవి.
కూటికోసం కూలికోసం, పట్టణంలో బ్రదుకుదామని తల్లిమాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి కష్టం మనకు కష్టం కలిగించేంతల్లా చెప్పి, చివరికి అతను మరణిస్తే పల్లెటూళ్ళో ఉన్న అతని తల్లికి పాడుకలలో పేగు కదిలిందంటాడు.
ఈ ప్రపంచంలో ఉన్న మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం అంటాడు.
“మనదీ ఒక బ్రదుకేనా?
కుక్కలవలె, నక్కల వలె!
మనదీ ఒక బ్రదుకేనా!
సందులలో పందులవలె!” అని ఛీత్కారంగా చూస్తాడు.
అసలు ఈ ప్రపంచంలో సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కడికీ ఒక్కోరకం సమస్యంటాడు.
రాక్సీలో హాలీవుడ్ హీరోయిన్ నార్మా షేరర్ సినిమాకి వెళ్ళాలా? లేక బ్రాడ్వేలో కాంచనమాల సినిమాకి వెళ్ళాలా? అని ఒక విద్యార్థికి సమస్యైతే, ఉడుపీ శ్రీకృష్ణవిలాస్‌లో బాదం హల్వా తినాలా లేక సేమ్యా ఇడ్లీ తినాలా? అన్నది ఒక ఉద్యోగికి సమస్యై కూర్చుంటుందంటాడు. ఇక చివరిగా…
“ఇటు చూస్తే అప్పులవాళ్లూ
అటు చూస్తే బిడ్డల ఆకలి!
ఉరిపోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపోవడమో-
సమస్యగా ఘనీభవించిం
దొక సంసారికి!” అంటూ ముక్తాయింపునిస్తాడు.
“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…” అని ఏడు ఏడు పద్నాలుగు ముక్కల్లో మనిషి స్వభావాన్ని చెప్పేస్తాడు. అంతే కాదు,
“ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం” అని “చరిత్ర” చరిత్రని, తిరుగులేని ఋషివాక్యంలా చెప్పి నిట్టూర్పు విడుస్తాడీ మహాకవి.
“తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీ లెవ్వరు?” అన్న ప్రశ్నలతో మనల్ని నీళ్ళునమిలిస్తాడు.
మీరు మరీ ఇంతల్లా అవతలివారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే… ఇక మీతో ఎవరుంటారండీ? అని అడిగితే…
“పోనీ
పోనీ
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్, పోనీ
పోతే
పోనీ!
రానీ
రానీ
వస్తేరానీ!
కష్టాల్, నష్టాల్
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!” అని నిర్లక్ష్యంగా చూస్తాడు.
పతితులను, బాధాసర్పష్టులను చూసి కరిగిపోయి “దగాపడిన తమ్ములార! ఏడవకం డేడవకండి!” అని ఊరడిస్తాడు. జగన్నాథ రథచక్రాల్! మీకోసం వస్తున్నాయని ధైర్యాన్నిస్తాడు.
“పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!” అంటూ చిన్నపిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దుచేస్తాడు.
“ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే-
అనురాగపు టంచులు చూస్తాం,
ఆనందపు లోతులు తీస్తాం.” అని అద్వైతంగా పాడుకుంటాడు.
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి, తలవంచుకు వెళ్లిపోయిన తన నేస్తం కొంపెల్ల జనార్థనరావుకోసం ఈ నిరాశామయలోకంలో కదనశంఖం పూరించాడు. ఈ మహాప్రస్థానం లిఖించాడు.
“ఈ కత్తి
బూజుపట్టిన భావాలకి
పునర్జయం ఇవ్వడానికి కాదు
కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని
సమూలచ్ఛేదం చెయ్యడానికి
ఇది
సమానధర్మాన్ని స్థాపిస్తుంది
నవీన మార్గాన్ని చూపిస్తుంది” అంటూ తన కవన ఖడ్గం ఏం చెయ్యబోతుందో, ఈ ఖడ్గసృష్టికి కారణామేమిటో వివరిస్తాడు.
“చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుడెచ్చట?
ఏవితల్లీ: నిరుడు కురిసిన
హిమ సమూహములు?” అని వేదనగా అడుగుతాడు. కానీ ఈ ఆవేదనతో పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపలేక...
“జడిగొల్పే దుఃఖంలో
తడియకుండ గొడుగులేదు” అని ఉన్నమాట చెప్పేస్తాడు.
“ఇంకా చెప్పాలంటే
ఎందరో మహానుభావులు
బ్రతుకునించి పారిపోయి
తమ వెనుకనె దాగువారు” అని ఈసడిస్తాడు.
“పాతపీపా పీతపాపా
పాడుకుంటూ తిరుగుతాయట
కొత్తగొంతుక చెవిని పడితే
గుడ్లు నిప్పులు చెరుగుతాయట
నన్ను తిట్టినతిట్లతోనే
మల్లెపూవుల మాలకట్టెను
నాకు వ్రాసిన ప్రేమలేఖలు
పోస్టుచేయుట మానివేసెను” అని “మంచి ముత్యాలసరాలు” విసురుతాడు.
“శరచ్చంద్రిక”లకు ముగ్ధుడవుతూ…
“ఇదిగో జాబిల్లీ నువ్వు
సముద్రంమీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే” అని చందమామతో సరదా సంభాషణ చేస్తాడు.
“ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది
ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది” అని “జేమ్స్ జాయిన్” కవితకు అనువాదపు ప్రేమగీతాలల్లుతాడు.
ఇక సిప్రాలి దగ్గరకు వచ్చేసరికి, తన అరివీరభయంకర విప్లవరూపాన్ని కొంత శాంతింపజేసి, సరదా దారి తొక్కుతాడు. సిప్రాలి అంటే... సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరుక్కులు.
సిరిసిరిమువ్వలన్నీ కందపద్యాలు. ఛందస్సుల సంకెళ్ళు త్రెంచినవాడుగా, తన కవిత్వాన్నే ఒక ఛందుస్సుగా మార్చినవాడుగా వినుతికెక్కిన శ్రీశ్రీ, ఇలా సరదాగా కందాలు రాయడం మొదలు పెడుతూ…
“మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్లు సిరిసిరిమువ్వా!” అని పకపకమంటాడు.
“మీసాలకు రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే!
సీసా లేబిల్ మార్చే
స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరి మువ్వా!” అని శ్రీరంగనీతులు చెబుతాడు.
ఇంకొకచోట మేము ఎలాంటి వారిమో తెలుసా?
“ఇస్పేటు జాకీలం
ఎగేసిన బాకీలం
మృత్యువు సినీమాలో
మూడు భాషల టాకీలం
భగవంతుని టోపీలం
కవిత్రయపు కాపీలం
గోరంతల కొండతలం
ఒకటికి రెండింతలం” అంటాడు.
కవిత్వం ఎలా ఉండకూడదో చెబుతూ…
“ప్రపంచాన్ని చూడలేని
కవిత నిజం చూపదు
ఇసకలోన తల దూర్చిన
ఉష్ట్రపక్షి బాపతు” అంటాడు.
“ప్రజాస్వామ్య పార్టీల్లో
ప్రజలకు తావెప్పుడు
నేతి బీరకాయలోన
నేయి పుట్టినప్పుడు” అని ఒకచోట,
“కొంతమంది కుర్రవాళ్ళు
పుట్టుకతో వృద్ధులు
పేర్లకీ పకీర్లకీ పు
కార్లకీ నిబద్ధులు” అని ఇంకొకచోట. అచ్చమైన నిజాలను ప్రాసక్రీడలాడుతూ చెబుతాడు.
అలాగే ఆదిభట్ల నారాయణదాసుగారి గురించి…
“హరికథా పితామహుడగు
ఆదిభట్ల దాసు
సంగీతం సాహిత్యం
సరితూచిన త్రాసు” అంటూ భక్తిపూర్వకమైన ప్రాసక్రీడ ఆడతాడు.
ఇక శ్రీశ్రీ“పంచపదులు”కూడా పసందైనవే…
“అరిచే కుక్కలు కరవవు
కరిచే కుక్కలు మొరగవు
కరవక మొరిగే కుక్కలు తరమవు
అరవక కరిచే కుక్కలు మరలవు
అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు” అని శునకోపాఖ్యానం చెబుతాడు.
ఆయనకి సాక్షి వ్యాసాలంటే ఎంత అభిమానమో మరొక పంచపదిలో చెబుతాడు.
“లక్ష్మీ నరసింహారావు పానుగంటి
సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి
ఎంచేతంటే వాటిలో పేనులాంటి
భావానికాయన ఏనుగంటి
రూపాన్నియ్యడం నేను గంటి” అని నమస్కరించుకుంటాడు.
ఇక లిమఋక్కులలో, నేను ఎవరో తెలుసా?…
“ముసలివాణ్ణి
కాను అసలు వాణ్ణి
పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి
పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి
అందుకున్న ఆకాశపు కొసలవాణ్ణి” అని బుసకొడతాడు.
“సినారె
బళారె
అన్నిట్లో హుషారె
సినిమా రె
డీమేడ్ సరుక్కీ తయారె” అంటూ నారాయణరెడ్డి గారి మీద చతురోక్తి విసురుతాడు.
“వెయ్యి పడగలు
లక్ష పిడకలు
లక్క పిడతలు
కాగితపు పడవలు
చాదస్తపు గొడవలు” అంటూ ఒకవైపు విశ్వనాథని వెటకారం చేసినా, మరోవైపు...
“మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద” అని విశ్వనాథకు నిలువెత్తు నమస్కారం కూడా చేస్తాడు.
ఇక శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు కూడా చాలానే ఉన్నాయి. “పాడవోయి భారతీయుడా” అనే పేరుతో వాటిని పుస్తకంగా కూడా తీసుకువచ్చాడు.
ఈ పుస్తకాన్ని తనకు సినిమా రచయితగా అవకాశం రావడానికి కారకులైన మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి అంకితం ఇచ్చాడు. శ్రీశ్రీకి పాటల రచయితగా మొదటి సినిమా... ఆహుతి అనే డబ్బింగ్ చిత్రం.
ఆయన రాసిన మొదటి పాట పల్లవి…
“ప్రేమయే జనన మరణ లీల
మృత్యుపాశమే అమరబంధమౌ
యువప్రాణుల మ్రోల!”.
“కుమారి మొల్ల” సినిమాలో ఒక సందర్భంకోసం శ్రీశ్రీగారొక దత్తపది రాయాల్సి వచ్చింది.
తెనాలి రామలింగడు మొల్లతో “అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు”అనే నాలుగు మాటలిచ్చి రామాయణపరంగా అర్థమొచ్చేటట్టు ఒక పద్యం చెప్పమంటాడంటాడు. అయితే అప్పు అంటే ఋణం, నిప్పు అంటే అగ్ని, మెప్పు అంటే ప్రశంస, చెప్పు అంటే పాదరక్ష అనే అర్థాలు రాకూడదంటాడు. ఇది శ్రీశ్రీ గారు కల్పించిన సన్నివేశమే. అందుకు మొల్ల ఇచ్చే సమాధానాన్ని శ్రీశ్రీ గారు ఇలా కంద పద్యంగా చెప్పారు…
“‘అప్పు’డు మిథిలకు జని నే
‘నిప్పు’డు కావించు వింత నిచ్చటి ప్రజ తా
‘మెప్పు’డును కాంచబోరని
‘చెప్పు’చు రాఘవుడు విరిచె శివకార్ముకమున్”
“ప్రపంచం” అనే సినిమాలోని ఒక పాటలో, సంసారం ఎలా ఉండాలో చెబుతూ…
“బండికి ఉండేటి రెండు చక్రాల్లాగా
తాపీగా సాగాలి సంసారం
కొరడాతో తోలేటి కరమం లేకుండానే
సాఫీగా సాగాలి సంసారం” అని తాపీగా, సాఫీగా, విన్నవాళ్ళకు హాయికలిగేలా రాశారు.
ఈ సినిమాలో చిన్న విశేషం ఏమిటంటే… ఇందులో సర్కస్ ఎనౌన్సర్‌గా శ్రీశ్రీ సుమారు రెండున్నర నిమిషాల పాటు కనపడతారట.
ఆత్రేయ గారు డైరెక్ట్ చేసిన “వాగ్ధానం” సినిమాకు శ్రీశ్రీ కూడా పాటలు రాశారు. అందులో రేలంగి పాత్ర పాడే హరికథ “శ్రీ నగజా తనయం సహృదయం” అనే శ్లోకంతో మొదలవుతుంది. అది ఏ పూర్వకవో రాసిన వినాయక ప్రార్థనట. ఇక పాట చివర్లో వచ్చే కందపద్యం పోతన భాగవతం లోనిదట. అయితే…“ఫెళ్ళుమనె విల్లు - గంటలు ఘల్లుమనె” అనే పద్యం కరుణశ్రీ గారిది. వారి అనుమతితోనే ఆ పద్యం వాడుకున్నప్పటికీ, ఆ విషయం ఆ సినిమా పాటల పుస్తకంలో ప్రస్తావించకపోవడం పొరపాటని, అందుకు కరుణశ్రీ గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానని అంటారు శ్రీశ్రీ.
ఇక తొలితరం వీణ పాటలలో ఒకటైన, భార్యాభర్తలు సినిమాలోని…
“ఏమని పాడెదనో ఈ వేళ
మానసవీణ మౌనముగా నిదురించిన వేళకి” అనే పాట శ్రీశ్రీ కలం మ్రోగించినదే,
“జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలి మేడలై కూలిన వేళ” అని అక్కినేని మంచిమనిషిగా మారినా, మారలేదనుకుని కృష్ణకుమారి వేదనాలాపన చేస్తుంది.
కృష్ణకుమారి వేదనకు, అనుమానానికి కారణం ఉంది. అంతకుముందు అక్కినేని…
“ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే” అని ఎంతోమంది అమ్మాయిలతో కలిసి “జోరుగా హుషారుగా షికారు” చేసిన విషయం ఆవిడకు తెలుసు. అదన్నమాట సంగతి.
కానీ తన “మాంగల్య బలా”న్ని బలంగా నమ్మిన మహానటి మాత్రం...
“ఆకాశ వీధిలో అందాల జాబిలీ
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగేనే
సయ్యాటలాడెనే” అని అక్కినేనితో కలిసి ప్రేమపరవశంతో పాడుకుంటుంది.
ఇక “వెలుగు నీడలు” ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయని, అధైర్యం వలదనీ జగ్గయ్య భార్యయైన సావిత్రికి చెబుతూ…
“కల కానిది విలువైనది
బ్రతుకూ కన్నీటిధారలలోనే
బలిచేయకు” అంటాడు అక్కినేని.
అంతకుముందే గిరిజతో కలిసి…
“హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో” అని పాడుకుంటాడు.
అసలు భాగ్యం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఎలావుంటుందో తెలియాలంటే “డాక్టర్ చక్రవర్తిని” అడగాలి.
“నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” అంటాడాయన. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే...
“మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” అన్నది ఆయన ఉద్దేశ్యం.
అలాగే వేరేచోట...
“నా హృదయంలో నిదురించే చెలీ!
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే
నన్ను దోచినావే” అని ఎంతో “ఆరాధన”గా పాడుకుంటాడు అక్కినేని.
శ్రీశ్రీని ఎవరో అడిగారట “ఆ నిదురించే చెలి” ఎవరని? “కమ్యూనిజం” అని జవాబిచ్చారట శ్రీశ్రీ.
అన్ని పాటలూ అక్కినేనికేనా అంటే… సర్లేకానీ అని...
“ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ
ఏమంది సత్యభామ?” అని నందమూరితో అడిగించి,
“ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది” అని అంజలీదేవితో జవాబు చెప్పించారు.
అసలు శ్రీశ్రీ తలచుకుంటే ఎన్టీయార్‌తో యముడిమీదే తిరుగుబాటు చేయించగలరు.
“సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం
నరలోకమున కార్మిక శక్తికి
తిరుగే లేదని చాటిద్దాం”అని ఆ నందమూరి అందగాడితో పాటలు పాడించనూ గలరు.
ఈ మహాకవి అంతటి శక్తిమంతుడైనా, మనబోటివాళ్ళ దగ్గరకు వచ్చేసరికి…
“ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజము మరచి నిదురపోకుమా” అని జాగ్రత్తలు చెబుతుంటారు.
ఆయన మాత్రం ఈ “మనుషులు మారాలి!” అని నిత్యం తాపత్రయపడుతుంటారు.
“చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో
శోకమనే పడవలో
ఏ దరికో.. ఏ దెసకో” అని వ్యధతో పాడుకుంటూ ఎక్కడెక్కడికో వెళిపోతుంటారు.
అసలు మనిషంటేనే మణిదీపం అంటారు. అతని మనసే నవనీతం అంటారు.
“ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన” అని ఉద్బోధిస్తారు.
“అందరి కోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరు కలిసి
సహకారమే మన వైఖరియైతే
ఉపకారమే మన ఊపిరి ఐతే..” అంటూ ఆ మంచిరోజులు రావాలంటే ఏంచెయ్యాలో కూడా ఆయనే చెబుతారు.
ఆ తరువాత…
“పాడవోయి భారతీయుడా - ఆడి
పాడవోయి విజయగీతికా!” అని ఉత్సాహాన్నిస్తూ…
“స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసీ
సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటె పొరపాటోయి” అని విషయం వివరిస్తూ,
“ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా” అని దిశా నిర్దేశం చేస్తారు.
కొంచెం ఈ కాలం నుండి అలా వెనక్కు వెళితే, అక్కడ…
“ఎవ్వరికోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే” అని అభిమన్యుడు,
“చెలుని కోసం ఈ మందహాసం
గడుసరి ఏమని వివరించను” అని ఉత్తర యుగళగీతం పాడుకుంటుంటారు.
ఎక్కడైనా చక్కటి వెన్నెలలో ఇద్దరూ అమ్మాయిలే కూర్చుని కనబడితే… ఒకరిని వీణ వాయించమని చెప్పి, ఇంకొకరితో...
“పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
ఈ వసంత యామినిలో
ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ” అంటూ పాట పాడిస్తారు.
“బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుకా” అని రాసి వీటూరి గారు రాసి అలా ప్రక్కకు వెళ్ళగానే…
“ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే” అని మిగతాది రాసుకు వెళిపోతారు.
మీరు ఇంత పేరుమోసిన విప్లవకవికి కదా జావళీల సంగతేమన్నా తెలుసా అని అడిగితే…
అప్పటికప్పుడు ఎల్. విజయలక్ష్మిని రప్పించి
“నిను జేర మనసాయె రా - నా స్వామి
చనువార దయసేయరా” అని ఆమెతో గజ్జెలు గలగలలాడిస్తారు.
“మగువ కోర మొగమాటమేలరా
బిగువ మాని జవరాలి నేలరా” అంటూ శృంగారం ఒలికింపజేస్తారు.
మాకోసం ఇంకేమన్నా చేసిపెట్టండి సార్! అని అడిగితే...
సూపర్ స్టార్‌ను పిలిపించి “తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా” అంటూ స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం పంపించి, ఈయన వెళ్ళి తెలుగువాళ్ళు ఎప్పుడూ చూడని నేషనల్ అవార్డ్ పట్టుకొచ్చి ఇస్తారు.
ఇన్ని చేసిన శ్రీశ్రీ గారి కోసం చాలా గొప్పవాళ్ళు ఇంకా గొప్పగా ఎన్నో అన్నారు. వారిలో..
“రెండు శ్రీలు ధరించి
రెండు పెగ్సు బిగించి
వరలు శబ్ద విరించి” అన్న ఆరుద్ర గారికి ఒక నమస్కారం,
“శ్రీశ్రీ మొదలంటా మనిషి - చివర్లో ఋషి - మధ్యలోనే కవి - ఎప్పటికీ ప్రవక్త” అన్న వేటూరి గారికి మరొక నమస్కారం చేసి...
తెలుగులో నవకవితకు శ్రీరస్తు వ్రాసిన ఈ వ్యాస కథానాయకుడు శ్రీ “శ్రీశ్రీ” గారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ స్వస్తి!
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐