: పోతన అక్షర చిత్రం!
శ్రీమన్నారాయణుని వైభవం!
ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.
సహజ పాండిత్యమండితుడైన పోతన
మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.
శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!
సకలభువన సమన్విత చరాచర ప్రకృతి
యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!
పరికింపుడు.
"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/
పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/
సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/
వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"
--నారాయణశతకం:బమ్మెఱపోతన;
అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.
చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,
భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.
ఇగో ఇలాగ,
"సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. , దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా, పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!
మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.
స్వస్తి!
పోతనగారి పద్యంలోని పోతనగారి విశ్వరూపసందర్శనను అత్యద్భుతమైన రీతిలో వర్ణించారు శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు. 🙏🙏🙏🙏
🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి