ఆ రోజు ఆదివారం...
అరవింద కి ఆదివారం ఇంకా ఎక్కువ పని.....
భర్తకి సెలవు...
పిల్లలు చిన్న వాళ్ళు..
మూడో సంవత్సరం నిండుతున్న పాప, బాబుకి సంవత్సరంన్నర...
భర్త శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్తేనే హాయిగా ఉంటుంది అరవిందకి...
రోజూ తొమ్మిది కల్లా భర్తకి కేరేజ్ కట్టి ఇచ్చి పంపిస్తే, సాయంత్రం 6 అవుతుంటే ఇంటికి వస్తాడు...
పిల్లలతో ఏదో అవస్థ పడినా...ప్రాణానికి ప్రశాంతత ఉంటుంది...
శ్రీరామ్ ఇంట్లో ఉంటే, ఇక్కడ పుల్లతీసి అక్కడ పెట్టడు...
తాను ఆఫీస్ కి వెళ్లి సంపాదించే మహారాజులా భావిస్తాడు...
ఇంటికి వస్తే భార్య అగ్గగ్గలాడుతూ ఉండాలి...
ఆఫీస్ నుండి రాగానే చేతిలో బాగ్ తీసుకోవాలి...
మంచినీళ్లు ఇవ్వాలి....
తరువాత అతను ఫ్రెష్ అయ్యి కూర్చుని, అడిగితే కాఫీ గానీ టీ గానీ ఇవ్వాలి...
అతను ఫ్యాన్ కింద కూర్చుని టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటాడు...
ఇంక అరవింద రాత్రికి వంట పనులు చేసుకోవాలి...పిల్లల్ని సముదాయించుకుంటూ...
పిల్లలు గొడవ చేసినా ఏడ్చినా చిరాకు పడతాడు...
పెళ్లి అయ్యాకా, 'అతని స్వభావం ఇదీ' అని తెలిసాక అరవింద అతనికి అనుగుణంగా సర్దుకుపోవడం మొదలు పెట్టింది...
ఆదివారం అతను ఇంకా లేజీ గా ఉంటాడు....
దగ్గరుండి అన్నీ సమకూర్చాల్సి వస్తుంది...బాత్రూం లో టవల్ పెట్టడం దగ్గరనుండీ...
చెడ్డవాడు కాదుగానీ, అతను పెరిగిన విధానమో ఏమో గానీ తను "మగవాడు" అనే అహం ఉంటుంది...
స్నేహంగా ఉండటం తెలీదో, ఇష్టం ఉండదో గానీ మొత్తానికి ఉండడు...
వాళ్ళమ్మకి నలుగురూ మగపిల్లలే...ఆడపిల్లల కష్టాలు తెలియకపోవడానికి అదీ ఒక కారణమేమో...
ఆదివారం ఆ హడావిడి లో ఉండగా, అరవింద
తండ్రి వాళ్ళింటికి వచ్చాడు...
అరవింద తండ్రిని చూసి ఉబ్బి తబ్బిబ్బయిపోయింది...
'నాన్నగారూ అంటూ' హాల్లోకి వచ్చింది..
అంతా బావున్నారా...అమ్మ ఎలా ఉంది...చెల్లి తమ్ముడు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు కురిపించింది...
ఆ ఆ అంతా బాగానే ఉన్నామమ్మా అని కూర్చున్నారు ఆయన...
ఎలా ఉన్నారు అల్లుడుగారూ అని పలకరించారు శ్రీరామ్ ని ...
బాగానే ఉన్నాను అన్నాడు ముభావంగా
చదువుతున్న పేపర్ పక్కన పెట్టి శ్రీ రామ్...
"ఈ రోజు మీరు కూడా ఇంట్లో ఉంటారు కదా అందరినీ చూసినట్టు ఉంటుందని వచ్చాను" అని సంజాయిషీ ఇచ్చినట్టు చెప్పారు ఆయన...
'కాఫీ ఇవ్వనా నాన్నగారూ అంది' అరవింద...
వద్దమ్మా...పొద్దున ఒకసారి తాగాను..
ఈ డయాబిటీస్ వచ్చాకా ఆ చేదు కాఫీ ఒకసారి తప్ప తాగలేకపోతున్నాను..అన్నారు
ఆయన చిన్నగా నవ్వుతూ....
ఇప్పుడే వస్తాను నాన్నా అని వంటింట్లోకి వెళ్ళింది అరవింద...
శ్రీరామ్ కి 9 కల్లా టిఫిన్ చేయాలి...
పని చేసుకుంటూ నాన్నగారు ఎందుకొచ్చారబ్బా అనుకుంది మనసులో...
ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది....
ఇప్పుడు మల్కాజగిరి నుండి కూకట్ పల్లి రావాల్సిన అవసరం ఏమైఉంటుంది అనుకుంది....
తండ్రి మాటలు వినపడితే వంటింటి తలుపు దగ్గర నిలబడింది...
నీతో మాట్లాడదామని వచ్చాను బాబూ...
అర్చనకి పెళ్లి కుదిరినట్టు నీకు తెలుసు కదా...ఒక లక్ష రూపాయలు అవసరం పడ్డాయి...
మన శివా కి జాబ్ వచ్చింది కదా టీ సి ఎస్ లో...
వాడు చేరగానే
నేను ఓ రెండు నెలల్లో ఇచ్చేస్తాను అంటున్నారు ఆయన...
శ్రీ రామ్ వెంటనే...నా దగ్గర లేదండీ...
మొన్ననే మా నాన్నగారు కావాలంటే ఇచ్చేసాను అంటున్నాడు...
అరవిందకి దుఃఖం వచ్చింది....
మొన్న అమ్మ చెప్పింది...చెల్లెలి పెళ్లికి కి కొంచెం డబ్బు తక్కువయ్యింది అని...
కానీ ఈ రోజు తన తండ్రి నిస్సహాయం గా తన ఇంటికి వచ్చి లేదనిపించుకోవడం చాలా బాధనిపించింది....
శ్రీ రామ్ తన దగ్గర ఉండి లేదంటున్నాడని తెలుసు అరవిందకి....
మనసులో శ్రీ రామ్ అంటే ఏహ్యభావం కలిగింది...కానీ..
తను ఏం చేయగలదు...
ఇంతలో తండ్రి లేచి నిలబడి...సరే బాబూ...ఒకసారి అందరూ ఇంటికి వచ్చి వెళ్ళండి...
నీకు వీలవకపోతే అరవిందా పిల్లలనైనా పంపించు ఓ నాలుగు రోజులు ఉండి వస్తారు...
అమ్మా అరవిందా వెళ్ళొస్తానమ్మా అన్నారు...అక్కడే ఆడుకుంటున్న పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ...
అరవింద వంటింట్లోంచి బయటికి వచ్చి...టిఫిన్ అయిపోవచ్చింది నాన్నా.. తిని వెళ్ళండి అంది...
వద్దమ్మా...వెళ్ళొస్తా...
అని బయటికి నడిచారు..
అరవింద తానూ వెనక వెళ్ళింది గుమ్మం వరకూ...
తండ్రి చెప్పులు వేసుకుని వెనకకి తిరిగి వెళ్తుంటే...ఆయన కనపడేవరకు అక్కడే నిలబడి చూసి లోపలికి వచ్చింది....
శ్రీరామ్ టీవీ చూస్తూనే ఉన్నాడు అభావంగా....
అరవింద లోపలికి వెళ్ళి పెసరట్లు ప్లేట్ లో పెట్టుకుని వచ్చి శ్రీరామ్ కి ఇచ్చింది...
అది తీసుకుంటూ...
ఇంత పొద్దున్నే మీ నాన్నగారు వస్తేనే నాకు డౌట్ వచ్చింది...
ఇలాంటిదేదో ఉంటుందని...
అల్లుడికి ఇవ్వాల్సింది పోయి... అల్లుడినే అడగడం...అన్నాడు...
కొడుకు చదువు ఇంకా అవలేదు... అయ్యాకా ఉద్యోగం...ఉద్యోగం వచ్చాకా జీతం...
ఏమో పరిస్థితులు ఎలా మారతాయో
ఎవరికి తెలుసు అన్నాడు...
అరవింద అంది కొంచెం రోషంగా... "మీరైతే లేదని బాగానే చెప్పారుగా అని"...
"మరి చెప్పక ..ఇక్కడేమన్నా నా దగ్గర రాశులు పోసి ఉన్నాయా ఇవ్వడానికి"...అన్నాడు శ్రీరామ్...
అరవింద లోపలికి వెళ్ళిపోయింది...
అందరికీ పౌరుషాలు రోషాలకి తక్కువ లేదు
అని గొణుక్కున్నాడు శ్రీరామ్...
ఆరోజు అలా ఏదోలా, భారంగా... అరవిందకి...
ఎప్పటిలాగానే, శ్రీరామ్ కీ గడిచాయి...
మర్నాడు భర్త ఆఫీస్ కు వెళ్ళగానే, పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది అరవింద దేవుడికి దణ్ణం పెట్టుకుని , కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని వద్దామని...
గుడిలో దర్శనానంతరం అక్కడ మండపంలో కూర్చుంది...
పిల్లలు కింద ఆడుతుంటే చూస్తూ....
ఇంతలో ఎవరో అరవిందా అని పిలిచినట్లయి పక్కకు చూసింది...
"నేను అరవిందా కార్తీక్ ని" అన్నాడు కార్తీక్ చంద్ర...
నువ్వా కాదా అని డౌట్ వచ్చింది సుమా...అన్నాడు నవ్వుతూ..
అరవింద కూడా ఆశ్చర్యం గా చూసి నవ్వుతూ...ఎన్ని ఏళ్ళయింది నిన్ను చూసి...
ఏం చేస్తున్నావు...ఎక్కడున్నావు...
ఇక్కడున్నావు ఏంటి...అంది ప్రశ్నల వర్షం కురిపిస్తూ...
కార్తీక్ అక్కడే కూర్చుంటూ...నేను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాను...ఇక్కడికి వచ్చి ఓ పది నెలలు అవుతోంది....
ఢిల్లీ నుండి వచ్చాను ఇక్కడ జాబ్ వస్తే....
ఈ ఏరియా లో మా మామయ్య ఉంటాడు...ఈ మధ్య ఆరోగ్యం బాలేదంటే చూసిపోదామని వచ్చాను...
సరే తిరిగి వెళ్తుంటే ఈ గుడి కనిపించింది...ఒకసారి దర్శనం చేసుకుని వెళదాం అని వచ్చాను...తరువాత ఇక్కడనుండి ఆఫీస్ కి వెళ్ళాలి...
కొంచెం లేట్ వస్తానని చెప్పాలే అన్నాడు నవ్వుతూ...
ఇంక నీ గురించి చెప్పు...
మాస్టారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు...
శివా, అర్చన ఎలా ఉన్నారు అని అడిగాడు...
నాన్నగారు రిటైర్ అయ్యి రెండేళ్లు అవుతోంది...
శివ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇక్కడే సి.బి. ఐ.టి లో...
చెల్లెలు డిగ్రీ అయిపోయింది...పెళ్లి కుదిరింది...వచ్చే నెల పెళ్లి...
ఇదిగో నేను...అదిగో నా పిల్లలు...
మావారు కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్...
నేను హౌస్వైఫ్ ని...
ఇదీ నా జీవితం అంది...
అదేంటి అరవిందా.. అంత తెలివైన దానివి...ఇలా హౌస్ వైఫ్ లా ఉండిపోవడం ఏంటి...
మాథ్స్ ఎంత బాగా చేసేదానివి...అన్నాడు కార్తీక్...
ఇంటర్ చదువుతున్నప్పుడు కార్తీకచంద్ర అరవిందా వాళ్ళ నాన్నగారి దగ్గర ట్యూషన్ కి
వెళ్ళేవాడు...
అరవింద వాళ్ళ నాన్నగారు కొంతమంది తెలివైన పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీస్ తో ఐ ఐ టి మాథ్స్ కి మాత్రమే కోచింగ్ ఇచ్చేవారు...
అందులో కార్తీక్ ఒక్కడు...
ఆయన తెల్లవారుజామున లేచి ఓ మెరికల్లాంటి పదిమంది పిల్లలకి ట్యూషన్ చెప్పి తను 9 గంటల కల్లా ఆఫీస్ కి వెళ్లిపోయేవారు...ఆయన స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ చేసేవారు...
ఆయనకి చిన్నప్పటినుండి మాథెమాటిక్స్ చాలా ఆసక్తి...
ఆయన చదివింది డిగ్రీ అయినా ఆయన తెలివి తేటలు ఆయనకు దేవుడిచ్చిన వరం...
ఆయన ఐ ఐ టి కి కోచింగ్ ఇస్తున్నారంటే ఆయన తెలివి తేటలు అంచనా వేయొచ్చు...
అప్పుడు అరవింద కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేది అప్పుడు.....
తానూ పొద్దున లేచి కూర్చుని పిల్లలందరితో పాటూ నేర్చుకునేది...
తరువాత కార్తీక్ కి ఐ ఐ టి ఢిల్లీ లో సీట్ రావడం... తరువాత ఇదే కలవడం...
అరవింద ని ఇంజనీరింగ్ చదివించలేక బి. ఎస్సీ మాథెమాటిక్స్ చదివించి పెళ్లి చేశారు...
అరవింద నవ్వి మా ఆర్ధిక పరిస్థితులు బట్టి నా చదువు...
నా తరువాత ఇంకా ఇద్దరున్నారని నేను అడజస్ట్ అవాల్సి వచ్చింది...
నా పెళ్ళికి బాగానే ఖర్చు అయ్యింది...
అర్చన అప్పటికి 9th లో...శివా ఇంటర్ లో ఉన్నారు...
నాన్నగారి పెన్షన్ మీద, ఇంటిలో ఒక వాటా అద్దెమీద సాగుతోంది వాళ్ళ సంసారం...
నాన్నగారు మాథ్స్ ఒక్కటీ చెప్పగలరు...
ఆ ఒక్క సబ్జెక్ట్ కీ ఇప్పుడు పిల్లలు రావడం లేదు కార్తీక్..మన అప్పటిలా కాదు...
అన్నీ ఒకచోట చెప్పే దగ్గరికి వెళ్తున్నారు...
వాళ్ళకి టైం కూడా ఇంపార్టెంట్ కదా...
పైగా అప్పటిలా నాన్నగారు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవలేకపోతున్నారు...
సిలబస్ మారుతుంది...
పాటర్న్ మారుతుంది కదా...
అప్పుడు ఆయన యంగ్ కాబట్టి అన్నింటిలో ఆక్టివ్ గా ఉండేవారు...
ఇప్పుడు ఆయన వలన కావడం లేదు...
శివా కి కూడా నాన్నగారు ఇంజనీరింగ్ చదివించడానికి లోన్ తీసుకున్నారు...వాడికి లక్కీ
గా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది...
ఇంకో మూడు నెలలైతే వాడు జాబ్ లో జాయిన్ అవుతాడు..
నాన్నగారికి హెల్ప్ అవుతాడు అనిపిస్తోంది....
అరవింద ఆగింది...
కార్తీక్ అన్నాడు...చెప్పు అరవిందా...మాస్టారికి ఇప్పుడు ఇబ్బందిగా ఉందా అన్నాడు...
అంటే, చెల్లి పెళ్లి దగ్గరపడుతోంది...
నీకు తెలుసు కదా ...ఆడ పిల్ల పెళ్లి అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయో...
పెళ్లికి కొంత తక్కువ పడింది...
దానికి ఆయన కొంచెం ఆందోళన పడుతున్నారు..
నాకు అనిపిస్తూ ఉంటుంది చంద్రా... నేను మగపిల్లాడినై ఉంటే..ఏదో విధంగా నాన్నగారికి సహాయ పడేదాన్ని...
కంప్యూటర్ కోర్సెస్ ఏవో కొన్ని నేర్చుకుంటే నాకు ఇప్పుడూ ఉద్యోగం వస్తుంది...
కానీ మా ఆయనకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు...
లేకపోతే అమ్మా వాళ్ళింటికి దగ్గరలో ఇల్లు తీసుకుంటే...
పిల్లల్ని అమ్మదగ్గర వదిలి నేను జాబ్ చేయొచ్చు...
అలా చేసి ఉంటే నాకంటూ డబ్బులు ఉండేవి...
నేను ఏదో కొద్దో గొప్పో సాయం చేసేదాన్ని....
ఈ విషయం లో తనతో ఘర్షణ పడి నేను ఎలా జాబ్ చేయగలను చెప్పు...
నాన్నగారికి బోలెడు సమస్యలు ఇప్పటికే...
మళ్లీ నేనో సమస్య కాకూడదు అని సర్దుకుపోతూ ఉన్నాను...
ఏంటో నాకు నా ఫీలింగ్స్ ఎవరికీ చెప్పుకునే దారి లేక...
నువ్వు అడగగానే నా బాధలు అన్నీ చెప్పేసాను...ఏమీ అనుకోకు అంది పేలవంగా నవ్వుతూ....
నీ గురించి చెప్పు ...అంది అరవింద...
నేను అహ్మదాబాద్ ఐ ఐ టి లో చదువు అయ్యాకా...అక్కడే ఎం.టెక్ చేసాను...
US ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు...అమ్మా, నాన్న గారిని వదిలి వెళ్లాలనిపించలేదు...
అక్కకి పెళ్లి అయిపోయింది....
నాకూ అయింది... తను డాక్టర్...
అందరం ఇక్కడే కలిసి ఉంటున్నాం అన్నాడు...చాలా సంతోషం కార్తీక్...
నాన్నగారికి చెప్తా...సంతోషిస్తారు అంది...
లేదు లేదు నేనే వెళ్తాను..వెళ్లి సర్ప్రైజ్ ఇస్తా నువ్వు చెప్పకు అన్నాడు నవ్వుతూ...
మాస్టారి ఫోన్ నెంబర్ ఇవ్వు... అలాగే అడ్రస్ కూడా...
నీ ఫోన్ నెంబర్ ఇవ్వు...అన్నాడు...
అరవింద అన్ని డీటెయిల్స్ ఇచ్చింది....
అరవింద ఫోన్ నెంబర్ చూసి అదేంటి నువ్వు
లాండ్ లైన్ నెంబర్ ఇచ్చావు అన్నాడు...
"నేను సెల్ ఫోన్ మైంటైన్ చేయడం లేదు" అంది నవ్వుతూ...
కార్తీక్ అదేంటి ఇంకా నీ లాంటి వాళ్ళు ఉన్నారా అన్నాడు ఆశ్చర్యం గా...
అరవింద పరిస్థితి అర్ధమవుతోంది అతనికి...
మీ హస్బెండ్ ఎక్కడ పనిచేస్తారు...? అని అడిగాడు...
అరవింద కంపెనీ పేరు చెప్పగానే, అతని భ్రుకుటి ముడి పడింది... పేరేంటి అన్నాడు...
పేరు చెప్పగానే ఐ సీ అన్నాడు...
సరే అరవిందా... నిన్ను ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది...
నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను రా అన్నాడు కార్తీక్...
వద్దు కార్తీక్ ఇక్కడే చాలా దగ్గర ఇల్లు...వాకబుల్ డిస్టెన్స్...నువ్వు వెళ్లిపో...
నేను వెళ్తానులే అంది అరవింద...
సరే మరి...నువ్వేం వర్రీ ఆవకు...అన్ని సమస్యలు సర్దుకుంటాయి అన్నాడు...
పిల్లలిద్దరినీ కాసేపు ఎత్తుకుని...ముద్దు చేసి తను బయలుదేరాడు కార్తీక్ చంద్ర...
రెండు రోజుల తరువాత శ్రీ రామ్ ఆఫీస్ నుండి వచ్చి... అరవిందా అరవిందా..అని హడావిడి గా పిలిచి, "నువ్వు చెప్పలేదేంటి ఎప్పుడూ నాకు అన్నాడు"
అరవింద చేతులు పట్టి ఊపుతూ...
"ఏంటి" అంది ... అయోమయంగా అరవింద...
అదే మా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ...మా బాస్,
మీ అందరికీ తెలుసని...అన్నాడు ఎక్సయిటింగ్ గా...
ఎవరిగురించి చెప్తున్నారు అంది..?
అదే కార్తీక్ చంద్ర గారి గురించి...ఆయన కింద మేం వందమంది పనిచేస్తాం...
మా అందరికీ బాస్ ఆయన...
ఆయన మామయ్య గారి దగ్గరే చదువుకున్నారట కదా...
నిన్ను అర్చననీ నా సిస్టర్స్ అన్నారు...అన్నాడు...
మీరు నిదానంగా చెప్పండి...నాకు అర్ధం కావడం లేదు...
కార్తీకచంద్ర మా ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గర చదువుకున్నాడు...
అది తెలుసు నాకు అంతే...
తను మీ బాస్ అని నాకు తెలియదు అంది అరవింద సిన్సియర్ గా...
కూర్చో చెప్తా ....అన్నాడు శ్రీరామ్...
ఇవాళ ఆఫీస్ కి వెళ్లిన గంటకి కార్తీక్ చంద్ర గారినుండి కాల్ వచ్చింది...
నేను ప్రాజెక్ట్ గురించి అడుగుతారేమో అని వెళ్ళాను...
చూస్తే అక్కడ ఆయన కేబిన్ లో మీ నాన్నగారు ఉన్నారు...
నేను షాక్ అయి ఉండగా....ఆయన "ఇతనేనా మాస్టారూ" అని అడిగారు నన్ను చూపించి...
మామయ్యగారు అవునన్నారు...
అప్పుడు చెప్పారు ఆయన...
శ్రీ రామ్ ...ఈయన మా మధుసూదన్ మాస్టారు....
ఈయన వలనే నాకు ఐ ఐ టి లో సీట్ వచ్చింది ...
నా ఈ పొజిషన్ కి మాస్టారే కారణం...
నాకు ఒక వారం క్రితమే తెలిసింది ఈయన ఆచూకీ...
ఈ రోజు మన ఆఫీస్ చూపిద్దామని తీసుకొచ్చాను...
ఇప్పుడు చెప్పారు మా అల్లుడు కూడా ఈ ఆఫీస్ లో పని చేస్తాడని...
పేరడిగి నిన్ను పిలిపించాను....
అయితే నువ్వు మా అరవింద హస్బెండ్ వి మాట...
నాకు అరవింద, అర్చనలు దేవుడిచ్చిన చెల్లెళ్లు...
మాస్టారూ ...అరవింద ఆ రోజుల్లో మా కంటే చిన్నదైనా మా అందరితో సమానంగా మాథ్స్ చేసేది...
తరువాత ఏం చదివింది అని అడిగారు...
మమయ్యగారు చెప్పారు నీ గురించి...
ఏంటి మాస్టారు అంత తెలివైన అమ్మాయిని ఇంకా చదివించక పోయారా అని అన్నారు...
అప్పుడు అర్చన, శివ చిన్న పిల్లలుఅని చెప్పారు....
మీ అందరి గురించి ఎంత గొప్పగా చెప్పారో...
తరువాత నేను నా సీట్ కి వెళ్ళిపోయాను...మామయ్య గారిని ఒక అరగంట తర్వాత, తన కార్ లో డ్రైవర్ నిచ్చి ఇంటికి పంపించారు....
మామయ్య గారితో ఇంకేం మాట్లాడారో...అన్నాడు శ్రీరామ్....
అవునా...ఇంత జరిగిందా అనుకుంది మనసులో అరవింద...
ఆరోజు తన భర్త చేసే ఆఫీస్ పేరు చెప్పగానే కార్తీక్
ఫేస్ లో కలిగిన మార్పులు గుర్తొచ్చాయి..అరవిందకి...
అందుకా ఇంత మార్పు శ్రీ రాం లో అనుకుంది...
ఈ రోజు రాత్రి వంట చెయ్యకు...
బయట భోజనం చేసి వద్దాం అన్నాడు...
నేను వంట చేసేసాను...తరువాత ఎప్పుడైనా వెళదాం లెండి అంది...
సర్లే అయితే అన్నాడు శ్రీరామ్....
ఉరుముల్లేని వర్షం లా ఉంది శ్రీ రామ్ తనమీద చూపిస్తున్న ప్రేమ...అనుకుంది...మనసులో...!
ఎక్కడా సంతోషం గా అనిపించలేదు...
కానీ శ్రీరామ్ ప్రవర్తన లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది...
మర్నాడు శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేసింది అరవింద...
ఏమయ్యింది నాన్నగారూ అని అడిగింది...
ఆయన చెప్పారు ...రెండురోజుల క్రితం కార్తీక్ వచ్చాడమ్మా భార్యను తీసుకుని మనింటికి...
నేను ఆశ్చర్యపోయాను....
ఇక్కడే మీ ఆయన చేసే కంపెనీ లోనే చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాడు...
భార్య అపోలో లో గైనకోలజిస్ట్ ట...
మమ్మల్నదరినీ భార్యకి పరిచయం చేశాడు..
నా వలనే తను పైకి వచ్చానని భార్యకి చెప్పాడు...
ఆ అమ్మాయి కూడా నవ్వుతూ చాలా విధేయత గా ఉంది....
మన అందరి వివరాలు తెలుసుకున్నాడు...
తమ్ముడి జాయిన్ అవబోయే ఆఫీస్ గురించి...అన్ని వివరాలు తెలుసుకున్నాడు...
మీ అమ్మకి నాకు బట్టలు పెట్టి కాళ్లకు దణ్ణం పెట్టాడు...
ఈ రోజుల్లో అంత గుర్తుపెట్టుకొని రావడం చాలా అరుదు...
నువ్వు కలిసావని చెప్పాడు...
అర్చన పెళ్లికి వస్తానన్నాడు....
అమ్మా...ఇంకో గొప్ప విషయం...
3 లక్షలకు చెక్కు ఇచ్చి...మాస్టారు ఇది అప్పుగానే ఇస్తున్నాను...మీ అభిమానం తెలుసు నాకు...
శివ ఉద్యోగంలో సెటిల్ అయ్యాకా నిదానంగా నాకు తీర్చవచ్చు అన్నాడు...
తమ్ముడితో...శివా...ఇది నీ బాధ్యత...
నాన్నగారిది కాదు...
అలా అని నీకు బరువు, బంధనం కాదు..అని...
ఒక కొడుకుగా చెల్లెలికి పెళ్లికి చేసే సాయం అనుకోండి మాస్టారూ...
వద్దనద్దు అన్నాడు...
ఇంకెక్కడా డబ్బుకి ప్రయత్నించకండి అని కూడా అన్నాడు...
కాదనలేకపోయాను...నిజంగా ఇప్పుడు అవసరమే కదా...
వెళ్తూ... రేపు కార్ పంపిస్తాను ఇంటికి...మీరు అందులో మా ఆఫీస్ కి రండి...
నా దగ్గర కూర్చుని జస్ట్ అబ్ జెర్వ్ చేయండి...ఏమీ మాట్లాడకండి...
నేను ఏమీ తెలియనట్టు అడిగినా సమాధానం చెప్పండి..
తమాషా చూపిస్తా అన్నాడు...
అలా అల్లుడి గారి ఆఫీస్ కి వెళ్ళాను...
మిగిలిన సంగతి నీకు తెలిసిందే....
మాటల్లో అల్లుడు గారి గురించి చెప్పాడు...
శ్రీరామ్ తెలివైన వాడట...పని బాగా చేస్తాడట...
మిగిలిన విషయాలు కూడా అన్నీ సర్దుకుంటాయి చూడండి మాస్టారూ అన్నాడు...
నిజంగా దేవుడి లీల కాకపోతే...ఇలా సహాయం నాకు దొరుకుతుంది అనుకోలేదు....
ఇక నిశ్చింతగా అర్చన పెళ్లి జరుగుతుంది అని నమ్మకం కలిగింది...
వాళ్ళింటికి కూడా తనే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు...
అదిరా జరిగిన సంగతి అన్నారు ఆయన...
చాలా సంతోషం నాన్నా...
నేను ఏమీ చెయ్యలేకపోయానే అని చాలా మధన పడుతున్నాను...
మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది..
ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసింది...
సాయంత్రం ఇంటికి వచ్చాడు శ్రీరామ్...చేతిలో ఏదో పాకెట్ ఉంది...
అతను ఫ్రెష్ అయ్యాకా...కూర్చుని
అరవిందా ...వంటింట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి రా అన్నాడు...
అరవింద అలాగే వచ్చింది...
కూర్చో అన్నాడు...మాట్లాడకుండా కూర్చుంది...
లేచి కింద అరవింద కాళ్ళ దగ్గర కూర్చున్నాడు...
"అయ్యో అదేంటి అంది అరవింద" కంగారుగా...
పర్లేదు...నే చెప్పేది విను...
నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు...
కార్తీక్ చంద్ర మీకు తెలుసు అన్నప్పటి నుండి నాలో మార్పు ఏదో వచ్చిందని...
నిజమే...!
అయితే అది నా స్వార్ధం తో వచ్చిన మార్పు కాదు...
అతనివలన నాకు కెరీర్ పరంగా లాభాలు ఉంటాయని కాదు...
నేనూ రెండు రోజులనుండీ ఆలోచిస్తున్నాను...
నేను ఒకలాంటి వాతావరణం లో పెరిగాను....
నాన్నగారు ఎప్పుడూ అమ్మమీద అధికారం చేలాయించేవారు...
అమ్మ నాన్నగారంటే భయపడుతూ అగ్గగ్గలాడుతూ ఉండేది...
అది తప్పని మాకు తెలీదు...తరువాత ముగ్గురు వదినలు వచ్చారు...
వాళ్ళనీ అన్నయ్యలు అలాగే చూసేవారు...
అదే పద్ధతి అనుకున్నాను నేనూ...
మగవాడికి అహం ఉండాలన్నట్టు ఉండేవారు నాన్నగారు...
ఇప్పటికీ మా నాన్నగారు వస్తే మా వదిన లు లేచి నిలబడతారు...
ఆయన ఎదురుకుండా కూర్చోరు....
అది తప్పు...తండ్రీ కూతుళ్ళ అనుబంధం ఉండాలి అని ఇప్పుడు అర్ధమవుతోంది నాకు...
మీ నాన్నగారికి మొన్న నేను లక్ష రూపాయలు ఇవ్వలేదు...ఎందుకంటే నాకు అంతవరకూ ఆయనంటే చిన్న చూపు...
మీ శివా కి అపోయింట్మెంట్ క్యాన్సల్ అయితే ఎలా ఇస్తారు తిరిగి అన్న కుళ్ళు ఆలోచన...
అంతే గానీ నా భార్యకి తండ్రి...ఆయనకి ప్రస్తుతం నేను తప్ప ఎవరు సహాయం చేస్తారు అన్న ఆలోచన లేదు నాకు...
ఇప్పుడు వస్తూ వస్తూ మీ నాన్నగారికి ఫోన్ చేసి ....ఇప్పుడు ఇస్తాను లక్ష రూపాయలు అంటే...ఆయన ఎంతో మార్ధవంగా చెప్పారు...
కార్తీకచంద్ర 3 లక్షలు తను అడగకుండానే ఇచ్చాడని...
అవసరమైతే తప్పకుండా తీసుకుంటా బాబూ..ఏమీ అనుకోవద్దని...
నాకు మెత్తగా చెంప మీద కొట్టినట్టే అయింది..
నాకు సొంత మామగారి మీద లేని నమ్మకం అతనికి ఉంది కదా అనిపించింది...మామయ్య గారు,
కార్తీకచంద్ర నా బాస్ అయినందు వలన, నేను ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేస్తాను అన్నాననీ ...అనుకుని ఉండొచ్చు...
కానీ అంత పెద్ద పోస్ట్ లో కార్తీకచంద్ర లోని వినయం..విధేయత.. ఒద్దిక చూశాకా ఆశ్చర్యం వేసింది...
అతని ముందు నేను అన్నివిధాలా తక్కువే...
అయినా ఎంత అహం నాలో...?
మీ నాన్నగారు, తన శిష్యులు అంత పెద్ద హోదాలో ఉన్నా ఎంత నిరాడంబరత...?
కార్తీకచంద్ర ఇప్పటికీ తన ఉన్నతికి కారణమైన మీ నాన్నగారిని మరచిపోకుండా గుర్తుపెట్టుకోవడం...
ఎంత డౌన్ టూ ఎర్త్ ఉన్నాడు అతను...
అసలు నువ్వు ఎంత తెలివైనదానివి...?
నాకు కార్తీకచంద్ర చెప్పేవరకూ తెలీదంటే...నేను ఎంత మూర్ఖుణ్ణి...
నా దగ్గర ఉన్న విలువైన వజ్రం విలువ ఎవరో చెప్తే కానీ తెలుసుకోలేకపోయానే అన్న బాధ నాకు తొలిచేస్తోంది...
అతనితో సమానంగా మాథ్స్ చేసేదానివంటే...
నిన్ను మీ నాన్నగారు స్థోమత లేక చదివించలేదు గానీ...
నిన్ను చదివించి ఉంటే ఇలా నా భార్యగా ఉండేదానివా...
నాచేత అణచబడేదానివా...?
ఇలా ఒక సామాన్య గృహిణి లా ఉండేదానివా...?
ఎక్కడో ఉండేదానివి...లక్షల్లో జీతం తీసుకుంటూ...
మీరంతా చాలా గొప్పవాళ్ళు...పరిస్థితులకి
అనుగుణంగా సర్దుకుని బ్రతుకుతున్నారు అంతే..
.
ఈ కార్తీకచంద్ర ఈ ఆఫీస్ లోనే శాశ్వతంగా ఉండడు...
అంత పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నతనికి ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి...
అలాంటి వాళ్లు ఎదుగుతూనే ఉంటారు...
కానీ నాలో మంచి మార్పు అంటూ వస్తే అతనే కారణం...
అతని గతం నాకు తెలియకపోతే నేను మారేవాడిని కాను...ఎందుకంటే అతను ఒక సంవత్సరం గా నా బాస్...
ఇది నిజంగా సహజంగా నాలో నా ఆలోచనల్లో వచ్చిన మార్పు...
స్వార్ధం తో వచ్చింది కాదు...నన్ను నమ్ము..
నేను బాగా ఆలోచించాను విందా...
నేనో నిశ్చయానికి వచ్చాను...
మనం మీ నాన్నగారి ఇంటికి దగ్గరలో ఇల్లు తీసుకుని వెళ్లిపోదాం...
మన చైత్ర ని ఈ సంవత్సరంలో నర్సరీ లో ఎలాగూ వేయాలి...
నువ్వు వేద్ ని అత్తయ్యగారి దగ్గర వదిలి నీ కిష్టమైన చదువు చదువుకో...
నువ్వు టీచర్ కావాలనుకుంటే బి. యి.డి చదువు....
లేకపోతే నీకేది ఇష్టమైతే అది...నాకు తెలీదు...
నువ్వు కూడా జాబ్ చేద్దువుగానీ...
నువ్వు కూడా ఆర్ధికంగా నిలదొక్కు కుంటే...నువ్వూ మీ పేరెంట్స్ కి సహాయం చేయొచ్చు...
నువ్వు ఇలా ఇంటికి పరిమితం అయిపోకూడదు అరవిందా...
నన్ను క్షమించు అంటూ అరవింద ఒడిలో తల పెట్టుకున్నాడు...
తన చేతిలో ఉన్న పాకెట్ అరవింద కిస్తూ ఇది మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోను...అన్నీ మరచిపోయి ఇది తీసుకో...అన్నాడు...!
అరవింద కళ్లనుండి కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ...
లేవండి...అంది..
మనలో ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవడాలు లేవు అంది నవ్వుతూ...
నన్ను అర్థం చేసుకున్నారు అంతే చాలు...అంది అరవింద...
మా జీవితాల్లోకి నిజంగా కార్తీక చంద్రుడిలా వచ్చి చల్లని వెలుగుని నింపావు కదా కార్తీక్... అనుకుంది మనసులో...
అలా తల్లి తండ్రులని ఎప్పుడూ చూడని పిల్లలు
ఆశ్చర్యం గా చూస్తూ...ఏం జరుగుతోందా అన్నట్టు
దగ్గరికి వచ్చారు...
అరవింద తన రెండు చేతులతో ముగ్గురినీ ఒకేసారి దగ్గరకు తీసుకుంది...
*సేకరణ* : వాట్సాప్ పోస్ట్.
***************************