16, ఆగస్టు 2020, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*65వ నామ మంత్రము* 16.8.2020

*ఓం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః*

భండాసురుని వధించుటకు ఉద్యుక్తులైన శక్తిసేనలను కలిగియున్న పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా* యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః* యని ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను నిరుపమానమైన భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని ఉపాసించు సాధకులకు ఐహిక, ఆముష్మికములైన సర్వశివములు అమ్మ కరుణచే లభిస్తాయి.

భండుడు అను అసురుని సంహరించుటకై పూనుకొనిన బ్రహ్మాది శక్తులతోడను ఇతర సేనలతోడను కూడియున్నది జగన్మాత.

శ్రీమాత భండాసురుని సంహరింపబూనియున్నది. అందులకై బ్రహ్మాది శక్తులతోడను, ఇతరములైన సేనలతోడను సన్నద్ధురాలై యున్నది.

*భణ్ణతి శుభాకాంక్షతి ఇతి భణ్డః* - శుభమును కాంక్షించే వాడు జీవుడు. జీవుడు సహజముగా శుభమును కాంక్షించేవాడు. భడి - కళ్యాణే - ధాతువునకు అచ్ ప్రత్యయము.

జీవుని అజ్ఞాన బంధము *భండస్య అసూన్ రాతి ప్రాణాన్ గృహ్ణతి ఇతి భణ్డాసురః* అనగా జీవునియొక్క సహజమైన చైతన్యమును హరించేది అజ్ఞాన బంధము.

జీవుడు అజ్ఞానముచే ఆవృతుడై తాను ఆత్మ అనే విషయాన్ని మరచిపోయి అనాత్మయైన శరీరమే తాను అనే భావంతో సంసార బంధంతో చిక్కుకొని యున్నాడు. మనయందున్న అజ్ఞాన భావాలే అసురులు. ప్రజ్ఞాన భావాలే దేవతలు. ఈ రెంటికి మనలో యుద్ధం జరుగుతునే యున్నది. ఆత్మ సంబంధమైన విజ్ఞానము. అహంకార సంబంధమైనది అసురస్వభావాలు. రెండిటికీ సంఘర్షణ దైవాసుర సంగ్రామము.

పరాశక్తి, అజ్ఞాన బంధములైన రాక్షస ప్రవృత్తులను తొలగించే శక్తుల తోడనూ, సత్య - సదాచారాది సైనిక గణములతోడను విరాజిల్లు చున్నది. అమ్మను ఆశ్రయించిన వారికి సంసార దుఃఖాలు ఉండవు అని సారాంశము. ఈ దేవ దానవ సంఘర్షణలో మూలకారకులగు వారు కూడా రంగంలో దిగవలసి యుంటుంది. అజ్ఞానానికి మూలకారణమగు అహంకార స్వరూపముగా గల భండాసురుని బంధించటానికి జ్ఞాన భావాలకు ప్రత్యేకమైన శక్తిసేనతో సన్నద్ధురాలైన చైతన్య స్వరూపిణి శ్రీలలితాదేవి అని అర్థం గ్రహించాలి.

ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: