16, ఆగస్టు 2020, ఆదివారం

*పురాతనమైన ద్వారకాతిరుమల*

*శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిజరూప దర్శనం*

*స్థలపురాణం*

కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రదేశాన్ని విదర్భ దేశమంటారని పురాణాల వలన తెలుస్తోంది. ఖండేరాయుని కైకలూరు శిలాశాసనం వలన కూడ ఈ విషయం స్పష్టమౌతోంది. విశేషంగా దర్భలు లభించే ప్రదేశం కాబట్టి దీన్ని విదర్భ అని పిలిచేవారని కొన్ని గ్రంధాలు వ్రాస్తున్నాయి. ఈ ప్రాంతానికే తరువాత కాలంలో వెలనాడు, వేగినాడు అనే పేర్లు స్థిరపడ్డాయి.

*ఆలయ తూర్పు గాలిగోపురం*

త్రేతాయుగం లో ఆది శేషుడు శ్రీ హరి హరులను గూర్చి ఇంద్రకీలాద్రి కి పట్టిసాద్రి కి మధ్యభాగ మైన ఈ ప్రదేశం లో ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సు కు మెచ్చి హరి హరులు ప్రత్యక్ష మయ్యారు. ఏం కావాలో కోరుకొమ్మన్నారు శివకేశవులు. తన శిరసుపైనుండేలా వారిరువురిని అర్థించాడు శేషుడు. అనుగ్రహించారు హరిహరులు. శేషుడు పర్వతాకారాన్ని ధరించాడు. రమణీయమైన ఆ శేషాచలం మీద ఓ పెద్ద కుంకుడు చెట్టు మొలిచింది. దాని తొర్రలో శేషుడు తన అంశతో నివసించసాగాడు . అతన్ని అనుగ్రహించడానికి భక్తజన పరాధీనుడైన శ్రీ హరి శ్రీ వేంకటేశ్వరుడై ఒక పుట్టలో నివాసమేర్పరుచుకున్నాడు. శ్రీ మల్లిఖార్జునుడై శంకరుడు పర్వతాగ్రాన కొలువుతీరాడు. ఆ శైష శైల మే ఈనాడు శేషాద్రి గా, శేషాచలం గా, శేషశైలం గా, అనంతగిరి గా అనేక నామాల తో కీర్తింబడుతోంది.

*ద్వారక మహర్షి*

ద్వారకుడనే మహర్షి ఈ పవిత్ర ప్రదేశం లో దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఈయన ధర్మపత్ని సునంద. ఈ దంపతులు శ్రీ వేంకటేశ్వరుని పాదసేవకే అంకితమై, నిరంతర గోవింద నామ స్మరణ తో వేంకటేశ్వరుని ధ్యానించేవారు. భక్త సులభుడైన ఆ శ్రీనివాసుడు మహర్షి దంపతుల భక్తి కి ముగ్ధుడైన వారిని కటాక్షించి , ప్రత్యక్షమయి వరం కోరుకోమన్నాడు. ఎల్లప్పుడూ శ్రీవారి పాదాలను సేవించుకొనే మహద్భాగ్యాన్ని కల్గించమని ద్వారక మహర్షి ప్రార్ధించాడు. అనుగ్రహించాడు శ్రీ లక్ష్మీనాథుడు. సమీపమందలి వల్మీకం లో శ్రీ స్వామి విగ్రహాన్ని దర్శించి. ఆశ్రయించి. సేవించి , తరించాడు ద్వారకమహర్షి. ఈ దివ్యక్షేత్రం లో శ్రీ స్వామి వారి పాదాలు వల్మీకము లోనుండి ద్వారక మహర్షిచే పూజించబడుచుండుట వలన భక్తులకు శ్రీ స్వామి వారి దివ్యరూపము నాభి వరకు మాత్రమే దర్శనీయ మగుచుండును. ఇట్లు ద్వారకమహర్షి వలన స్వయం వ్యక్తుడై శ్రీ శ్రీనివాసప్రభువు వెలసిన ఈ క్షేత్రము ద్వారకా తిరుమల గా , చిన్న తిరుపతిగా , ప్రసిద్దికెక్కింది.

ఇది ద్వారకాతిరుమల శ్రీనివాసుని ప్రపత్తి శ్లోకం. ఈ క్షేత్రమునందు స్వయంవ్యక్త మూర్తి ని సేవించడం వలన మోక్షాన్ని,ప్రతిష్టిత మూర్తిని సేవించడం వలన ధర్మ,అర్థ, కామాలను సాధించవచ్చని విజ్ఞుల చెపుతున్నారు.

గాలిగోపురం లోపలి గోడపై కన్పించే ఒక కుడ్యచిత్రం
క్షేత్ర ప్రత్యేకత :

ఇచ్చట స్వామిని సేవించు కొను భక్తులకు స్వామివారి పాదసేవ దుర్లభ మగుట వలన సర్వాంగ పరిపూర్ణుడగు శ్రీ శ్రీనివాసుని మంగళ రూపాన్ని మహర్షులు వైఖానసాగమానుసారంగా స్వయంవ్యక్తమగు ధృవమూర్తికి వెనుక భాగాన ప్రతిష్ఠించారు. ఇట్లు ఒకే విమానము క్రింద ఇద్దరు ధృవమూర్తులుండుట ఈ క్షేత్రప్రత్యేకత గా చెప్పబడుచున్నది. అంతేకాకుండా ఈ క్షేత్రము లో స్వామి దక్షిణాభిముఖులై యుండుట మరొక ప్రత్యేకత. ఈ ఆలయమునందు ఇద్దరు ధృవమూర్తులుండుటచే ఏడాదికి రెండు సార్లు తిరుక్కళ్యాణ మహోత్సవములు జరుగుట కూడ ఒక ప్రత్యేకత గా నే చెప్పవచ్చును. స్వయంవ్యక్తమూర్తి కి వైశాఖ మాసం లోను, ప్రతిష్ఠంచబడిన స్వామికి ఆశ్వయుజ మాసం లోను కళ్యాణమహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి..
వాగ్గేయకారుడు అన్నమయ్య విగ్రహం
ద్వారకా తిరుమల క్షేత్రకథ శ్రీ బ్రహ్మ పురాణం లో ప్రస్తావించబడింది. త్రేతాయుగం లో శ్రీరామచంద్రుని పితామహుడైన (తాతగారు ) అజమహారాజు ఆయన ధర్మపత్ని ఇందుమతీదేవి కలసి ద్వారకా తిరుమల లోని శ్రీ పద్మావతీ శ్రీనివాసులను వధూవరులుగా అలంకరించి, కళ్యాణ వేడుకలు జరిపించినట్లు శ్రీ బ్రహ్మపురాణం లో విపులంగా వర్ణించబడింది. అంతేకాదు . శ్రీరాముని తండ్రియైన దశరథమహారాజు, స్వయం గా శ్రీరామచంద్రుడు కూడ శ్రీ స్వామి వారిని సేవించుకొనినట్లు పురాణాల వల్ల తెలుస్తోంది.

దేవేరులతో శ్రీనివాసుని కళ్యాణ మూర్తి

ఈ దేవాలయానికి ఉత్తర వాహిని యై పంపానది ప్రవహిస్తోంది. దాన్నే నేడు ఎర్రకాలువ అని పిలుస్తున్నారు.
ఆలయ దర్శనం.:::----- స్వామి వారి సన్నిధికి కుడివైపున ఉపాలయాల్లో అలివేలు మంగతాయారు. ఆండాళ్ అమ్మవార్లు దర్శనమిస్తారు. అంటే ఈ రెండు ఆలయాలు తూర్పు ముఖం గా ఉంటాయి. ధ్వజ స్థంభం వద్ద స్వామివారికి అబిముఖం గా భక్తాంజనేయ, గరుడాళ్వార్లు కొలువు తీరి ఉన్నారు.

శ్రీ స్వామి వారి దివ్యరూపం
ఆలయము చుట్టు పన్నిద్దరాళ్వారులు వేరువేరు ఆలయాల లో వేంచేసియున్నారు. ఆలయ ప్రాకారము లోపల నాలుగు మూలలా నాలుగు మండపాలు మనకు కన్పిస్తాయి. వీటిని మూలమండపాలు అని పిలుస్తారు.

అమ్మవారి దివ్య మంగళ విగ్రహం

ఈ మండపాలలో శ్రీ స్వామి వారి నిత్యోత్సవ, వారోత్సవ ,పక్షోత్సవ, మాసోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఈశాన్య దిశలో ఉన్న మండపం లో పౌర్ణమి, అమావాస్య, సంక్రమణ సమయాల్లో స్వామివారు కొలువు తీరుతారు.అలాగే మిగిలిన మూడుమండపాల్లో శుక్రవారం సేవ నైరుతిదిశలో ఉన్న శుక్రవారం మండపం లోను, శనివారపు ఉత్సవము ఆగ్నేయ మండపం లోను, శ్రవణానక్షత్రం, ఏకాదశి, పునర్వసు సేవలువాయవ్య మండ పం లోను నిర్వహించబడతాయి.

అమ్మవారి ఆలయం ప్రక్కనే కన్పించే రజిత తాపిత కుడ్యశిల్పం
ఆలయ ప్రాకారానికి నాలుగువైపులా నాలుగు ఎత్తైన గాలి గోపురాలు రాజఠీవితో నిలిచి, స్వామివారి కీర్తిని దిగంతాలకు చాటుతూ, స్వామి ని సేవించుకోవడానికి వచ్చే దేవతాగణాన్ని సాభిమానంగా ఆహ్వానిస్తున్నట్లు కన్పిస్తాయి. వీనిలో దక్షిణ వైపు గాలిగోపురం ఐదు అంతస్తులతో అతి పెద్దదిగా కన్పిస్తుంది. ప్రతి గాలి గోపురం మీద తీర్చిదిద్దబడిన పురాణ గాథలను గుర్తుకు తెచ్చే వివిధ దేవతా శిల్పాలు అందంగా కొలువు తీరి చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి.

ఈశాన్య మండపం

శ్రీ పాదుకా మండపం

ఆలయం తొలిమెట్టు వద్ద పాదుకా మండపము భక్తులకు దర్శనమిస్తుంది. ఇచ్చట భక్తులు స్వామి వారి పాద పద్మాలను కనులార దర్శించి, స్పృశించి , సేవించుకొని భక్తి పరవశులౌతారు. పాదుకామండపానికి దక్షిణంగా కళ్యాణ మండపం కన్పిస్తుంది.

పాదుకా మండపం లో శ్రీవారి దివ్యపాదాలు

ఇవి కాక గ్రామం లోపల విలాసమండపం, క్షీరాబ్ధిమండపం, ఉగాది మండపం, దసరామండపం, సంక్రాంతి మండపాలు ఉన్నాయి. ఆయా పర్వదినములలో స్వామి తిరువీధి సేవ జరిగినప్పుడు ఆయామండపములపై స్వామి వారి ని వేంచేపు చేసి, అర్చన ,ఆరగింపు , ప్రసాద వినియోగము చేస్తారు.

సుదర్శన పుష్కరిణి

దీనినే నరసింహ సాగరమని కూడ పిలుస్తారు. ఇది గ్రామానికి పశ్చిమం గా ఉంది. ఇందలి పాషాణములపై సుదర్శన చిహ్నములుండుటచే దీనిని సుదర్శనపుష్కరిణి అని పిలుస్తున్నారు. పూర్వము దీని లోని నీటినే స్వామిపూజకు వినియోగించేవారు. ఈ పుష్కరిణి మధ్య లో 1999 వ సంవత్సరం లో ఒక మండపము నిర్మించబడినది. ఈ పుష్కరిణి యందు ఫ్రతి సం.రము క్షీరాబ్ధి ద్వాదశి ( కార్తీక శుద్ద ద్వాదశి ) నాడు శ్రీ స్వామి వారికి తెప్పోత్సవము కనుల పండువుగా నిర్వహించబడుతుంది.

ఆలయ ప్రవేశం వద్ద ధ్వజ స్థంభము

నారాయణ వనము

శ్రీ స్వామి వారి ఆలయమునకు వెనుక నొక అందమైన పూలతోట ఉంది. దీనినే నారాయణ వనమని పిలుస్తారు. ప్రతిరోజు స్వామివారి పూజకు కావలసిన పుష్పాలు, తులసి దళాలు ఈ వనము నుండే వినియోగించబడుతున్నాయి.

శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ ప్రవేశ ద్వారము
క్షేత్రపాలకుడు

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారు ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈఆలయానికి ఎగువన వాయవ్య దిశ లో ఉంది.ఆది శేషుని ప్రార్ధనను మన్నించి ,శంకరుడు ఫణాగ్రాన కొలువు తీరాడు.
శ్రీమల్లేశ్వర స్వామి వారు
ఈ ఆలయములో శ్రీ మల్లేశ్వర స్వామి వారి తో పాటు శ్రీ గణపతి, శ్రీ భ్రమరాంబాదేవి వారి ఉపాలయాలను, నవగ్రహ మండపమును కూడ మనం దర్శించవచ్చు. శ్రీమల్లేశ్వర స్వామి వారికి ప్రతి నెల మాసశివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకాలు, ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవము జరిపించడుతోంది. ఇక్కడ కూడ శివోద్యానము అనే సుందర ఉద్యాన వనాన్ని మనం చూడవచ్చు.

శ్రీ భ్రమరాంబికా దేవి చారిత్రక ప్రాథాన్యం

ఆంధ్ర శాతవాహన బ్రాహ్మణులు క్రీ.పూ 3 వశతాబ్దం నుండి సుమారు 465 సంవత్సరాలు తిరుమలేశుని అర్చించినట్లు, అనంతరం ఇక్ష్వాకులు, బృహల్పలాయనులనుండి రెడ్డిరాజులు, విజయనగర రాజుల వరకు శ్రీ స్వామిని సేవించి తరించి నట్లు పుస్తకాల్లో వ్రాస్తున్నారే తప్పితే చారిత్రకాధాలేవీ లభించడం లేదు. శ్రీ ధర్మాఅప్పారాయ బహద్దరు వారు(1762 -1827 ) ఈ ఆలయ ,గోపుర , ప్రాకార ,మండపాలను పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది.

మైలవరం జమీందారులు సూరానేని వంశీయులు” శ్రీ రాజా సురానేని శ్రీకృష్ణ రావు బహద్దూర్ జమీందారు వారు “ దేవాలయపునర్నిర్మాణ కార్యక్రమాలు చేయించినట్లుగా దక్షిణ గాలిగోపురం మీద కన్పించే శిలాశాసనం వలన మనకుతెలుస్తోంది. వీరి వంశీయులే వేయించిన మరొక శిలాఫలకం వేంచేపుమండపం గోడమీద కన్పిస్తోంది.

ఇది స్వామి వారికి భక్తులు సమర్పించే బంగారు,వెండి ఆభరణములను,వస్తువులను దేవస్థానం ఆఫీసులో సమర్పించి రసీదు పొందమని తెలియజేస్తోంది. అలాగే పసిపిల్లలు ఆలయం లో మూత్ర, పురీషములు చేయకుండా సంబంధీకులు జాగ్రత్తపడాలని, లేనిచో సంప్రోక్షణ నిమిత్తము ( ఆలయమును శుద్ధి చేయుటకు ) మూత్ర విసర్జన అపరాధ సుంకము 0.40 పై.లు గాను, తరువాత ( ? ) దానికి 0.80 పై.లు అపరాధ సుంకము వసూలు చేయబడుతుందని కూడ ఇందులో ఫర్మానా వ్రాయబడింది. ఇది ఆలయ పవిత్రతా సంరక్షణ లో ఆనాటి ధర్మకర్త ల బాధ్యతాయుత పాత్రకు మచ్చుతునక.

శ్రీ స్వామి వారి ప్రతిరూపం
గోశాల

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ పర్యవేక్షణ లో వదాన్యుల విరాళాలతో 300 పై చిలుకు గో సంపద తో గోశాల సకల వసతులతో నిర్వహించ బడుతోంది. శ్రీ స్వామి వారి ఉత్సవ సేవలో రాజలాంఛనముగా పాల్గొనుట కొరకు ఒక గజరాజును కూడ దేవస్థానము పోషించుచున్నది.

ఆలయ విహంగ వీక్షణం
అంతేకాకుండా ఆలయ ప్రత్యక్ష పర్యవేక్షణ లో ఎన్నో దేవాలయాలు ,విద్యాలయాలు నిర్వహించబడుతున్నాయి.అత్యంత ప్రసిద్ధి పొందిన వైఖానసాగమ పాఠశాల కూడ వానిలో ఒకటి.

వైఖానసాగమ పాఠశాల విద్యార్ధులు

ఆలయ సమయాలు

శ్రీ వేంకటేశ్వర ఆలయం లో ప్రాత కాలం లో 4 గం.లకు సుప్రభాత సేవతో ఆలయ కవాటాలు తెరుచుకుంటే రాత్రి 9 గం.లకు ఏకాంత సేవతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి.మధ్యాహ్నం 1గం .లనుండి 3. గం ల వరకు దేవాలయ విరామం పాటించబడుతుంది.
ప్రత్యేక ఉత్సవాలు.

చైత్రమాసం లో ఉగాది సేవ, శ్రీరామనవమి కళ్యాణం, వైశాఖ మాసం లో స్వయం వ్యక్త మూర్తి కి తిరుక్కళ్యాణ మహోత్సవము, శ్రావణ మాసం లో పవిత్రోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి వేడుకలు, ఆ శ్వయుజ మాసం లో ప్రతిష్టితస్వామి కి తిరుక్కళ్యాణోత్సవము, కార్తీక మాసం లో తెప్పోత్సవము, కృత్తికా దీపోత్సవము, మార్గశిర మాసం లో ధనస్సు,అధ్యయనోత్సవాలు, పుష్యమాసం లో గోదా కళ్యాణము, మాఘ మాసం లో రథసప్తమి తిరువీథి సేవ, ఫాల్గుణ మాసం లో డోలాపూర్ణిమ తిరువీథి సేవ శ్రీ స్వామి వారికి జరిగే ప్రత్యేక ఉత్సవాలు.

ఘాటు రోడ్డు ప్రారంభం లో దర్శనమిచ్చే గరుడాళ్వారు
రవాణా వసతి సౌకర్యాలు. శ్రీ ద్వారకా తిరుమల క్షేత్రం మద్రాసు- కలకత్తా మార్గంలో భీమడోలు నుండి 15 కి. మీ దూరం లో ఉంది. ప్రతి రోజు ఈ క్షేత్రానికి రాష్ట్రం లోని అన్నిప్రముఖ బస్ డిపోల నుండి సర్వీసులు నడపబడుతున్నాయి. ఏలూరు , తాడేపల్లిగూడేం ష్టేషన్లలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. ఏలూరు నుండి 41 కి.మీ, తాడేపల్లి గూడెం నుండి 47 కి.మీ దూరం లో ద్వారకా తిరుమల ఉంది. బస చేయడానికి దేవస్థానం వారి వసతి గృహాలు (ఏ.సి/నాన్ఏ.సి) అనేకం ఉన్నాయి.
గాలిగోపురం పై కన్చించే రమణీయ శిల్పసంపద

కొండపైకి విశాలమైన ఘూటు రోడ్డు సౌకర్యం ఉంది. కొండమీదకు వెళ్లి ,రావడానికి, పరిసర దేవాలయాల సందర్శన కోసం దేవస్థానం వారి ఉచిత బస్సు సౌకర్యం కలదు. దేవస్థానం వారిచే ఆలయ ప్రాంగణం లోని అన్నదాన భవనం లో ప్రతిరోజు యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యం కల్గించబడుతోంది.

“ వినా వేంకటేశం ననాథో న నాథ: సదావేంకటేశం స్మరామి స్మరామి !!”


*ఓం నమో వేంకటేశాయ*
*****************

కామెంట్‌లు లేవు: