37. " మహాదర్శనము "--ముప్పై ఏడవ భాగము -- సర్వజ్ఞ బీజము
37. ముప్పై ఏడవ భాగము-- సర్వజ్ఞ బీజము
యాజ్ఞవల్క్యుడు ఎప్పటివలె సూర్యోదయానికి ముందరి బ్రాహ్మీ ముహూర్తములో లేచి , తన స్నాన, సంధ్యా , అగ్ని కార్యములను ముగించుకొని జపములో కూర్చున్నాడు . అతడు జపములో ఉపాస్య దేవతను సాక్షాత్కరించుకొనడు . అయినా అతడికి జపము చేయునంతసేపూ ఎవరో తనవెంటనే ఉన్నట్టు ఉంటుంది . అతడి శోభ అదే , వెంట ఉన్నవారు ఎవరూ అనుదానిని చూడడు .
మాధ్యాహ్నికపు సమయము వరకూ జపములో ఉండి మధ్యాహ్నపు సమయము మరలా స్నానము చేసి అప్పటి కర్మలన్నిటినీ నెరవేర్చినాడు . ఆ దినము ఏదో విశేష కారణమని అతడిని ఋగ్వేదోపాధ్యాయులు గౌతములు భోజనమునకు రావలసినదిగా చెప్పియున్నారు . అక్కడ వైశ్వదేవము అయినది . అనంతరము వచ్చి , ఎప్పటివలె అతడు తన గుడిసెలో జపమగ్నుడయినాడు .
దారిలో వచ్చునపుడు , ఎలాగో ఏమిటో , బుడిలులు తరచూ చెప్పెడి సర్వజ్ఞుడగు ఆలోచన మనసులోకి వచ్చింది . ’ కానీలే , ఆదిత్యుని ప్రసాదము దొరికిన తరువాత ఆ ఆలోచన ’ అనుకొని , గుడిసెలో కూర్చున్నాడు .
జపమెందుకో బహుకాలము నడవలేదు . ఆహారములో దోషమేమైనా ఉందా అని తాను భుజించినదంతా సింహావలోకనము చేసుకొని చూచినాడు . లేదు , దానిలో దోషమేమీ ఉండలేదు . దేహములో ఏదైనా దోషము సంభవించినదా యని చూచుకున్నాడు . దేహము ఎప్పటివలె తేలికగానున్నది . దేహప్రకృతి స్వస్థముగా నుండినది .
ఇలాగెపుడైనా జపభంగమైతే వీణను తీసుకొని వాదనములో కూర్చోవడము అతడికి వాడుక. వీణను తీసుకొన్నా అక్కడ కూడా అతడి మనసు రమించలేదు . అయినా కొంతసేపు వాయించినాడు . అది కూడా బలవంతపు బ్రాహ్మణార్థమైనది . దానిని పక్కకు పెట్టినాడు . మనసుకు ఏదో జాడ్యము . అక్కడ ఇంటిలో తల్లిదండ్రులకు ఏవైనా అనారోగ్యాలు సంభవించి దానివలన మనసు ఇలాగయి ఉండవచ్చునా అని ఆలోచించినాడు . ఐనా , ఆశ్రమము మిథిలకు కేవలము ఒక అర్ధ దినపు దారి . అటులేమయినా అయినచో , వార్త వచ్చియుండవలెను , ఏమీ రాలేదు .
అగ్నిదేవుడినో , ప్రాణదేవుడినో సాక్షాత్కరించుకొని సంగతేమో అడుగుదామా అనిపించినది . ఆ ఆలోచన రాగానే నవ్వి , ’ దేవతలంటే ఏమి , దూడను కట్టివేయు గూటములా ? చీటికి మాటికీ వారిని అడుగుట అయితే , మనము ప్రత్యేకులము అనుకొనుట దేనికి ? వారికి సమర్పణ చేసుకొనుట అయినది కదా , సర్వగతులైన వారు తమ వస్తువులను కాపాడుకొనుటను బాగా తెలిసినవారు . కాబట్టి నేనేమీ అడగను " అని నిశ్చయించుకున్నాడు .
ఆచార్యుల వద్దకు వెళ్ళి ఈ మనో జాడ్యమును పరిహరించుకుందామా అంటే వారు కాశీ నుండీ ఇంకా తిరిగి రాలేదు . ఇక ఉన్న ఒకే గతి , ఆచార్యాణి . వారికి ఇప్పుడు ఏ సమయమో ఏమో ? ఏమైనా సరే , అక్కడికే వెళ్ళెదను , వారికి సమయముంటే ఒక్క ఘడియ అక్కడే ఉండి , మనో జాడ్యమును వారి వాక్యగంగలో కడుగుకొన వచ్చును " అని బయలుదేరినాడు .
ఆచార్యాణి యందు యాజ్ఞవల్క్యునికి బహుళ గౌరవము . వారు స్త్రీ సృష్టిలో పరాకాష్ఠ అని అతడి భావన. వారు రూపములో అంతటి విశిష్టత ఉన్నవారు కాదు . అలాగని గౌర వర్ణపు వారి ముఖములో గానీ శరీరాంగములలో గానీ ఏ లోపమూ లేదు . కన్నుముక్కు మొదలైనవన్నీ చక్కగా ఉన్నాయి . అయితే , అతడికి గోచరమగుచుండినది వారి రూప సంపత్తు కాదు . గుణ సంపత్తు . వారు ఆచార్యులకు ధర్మ పత్ని మాత్రమే కాదు , మోక్ష పత్ని కూడా ! ధర్మ పత్నియై , అతిథి పూజనము , దేవయజనము మొదలైనవాటిలో సహధర్మచారిణి యైనట్లే , వారు తమ విరామ కాలములో కూర్చొని ఆతనికి సమానముగా విచారములు చేయువారు . కావాలన్నప్పుడు ఆతనితోపాటు కావలసినంత సేపు సమాధిలో కూడా కూర్చోగలరు . యాజ్ఞవల్క్యుని దృష్టిలో ఆశ్రమపు నిర్వహణ ఆచార్యులకన్నా ఆచార్యాణికే ఎక్కువ అలవడింది. తనకు , పత్ని కాబోయే కాత్యాయని కూడా వీరి వలెనే అయితే ! అని ఒక కోరిక. వెంటనే సమాధానము కూడా . తాను మెచ్చినది రంభ, తాను మునిగినది గంగ అన్నట్లు , తనకు దొరికినదే తనకు పంచామృతము ! అని . మొత్తానికి ఆశ్రమములో ఎక్కడెక్కడ ఎంతెంత తిరిగి చూచినా వారి చేతి పనితనము కనిపిస్తుంది . వారి వద్దకు వెళ్ళి కూచుంటే గంగా సాగరపు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నట్లే ఒక పవిత్రమైన ప్రశాంత భావన.
ఆలాపినికి కూడా అంతే ! యాజ్ఞవల్క్యునిపై ఒక విచిత్రమైన వాత్సల్యము . మాతృ వాత్సల్యము వలెనే దృఢమైననూ , కొడుకన్న కోరికతో చూచియే తీరవలెనన్న చపలము లేదు . ఒక్కోసారి అతడిని ఒక వారము వరకూ చూడకుండానే ఉంటుంది . అప్పుడామెకు వాడు గుర్తే రాడు . ఆమె తానుగా వెళ్ళి వాడిని చూచుట అనునది లేనేలేదు . వాడే వస్తే , తనకు ఎంత పని ఉన్నా అన్నీ వదలి వాడితో కూర్చొని మాట్లాడతారు . ఆమె మాట , చేతలూ అన్నీ కర్మ బ్రహ్మ విచారములను వదలి ఇంకో వైపుకు తిరగవు . ఇద్దరికీ పరము పైన ఉన్న కాంక్ష ఇహము పైన అంతగా లేదు .
యాజ్ఞవల్క్యుడు వచ్చు వేళకు ఆలాపిని బట్టలను ఆరవేసి , దాని వలన కలిగిన కొంచము ఆయాసముతో కొద్దిపాటి విశ్రాంతి తీసుకొని , ఒక విరామాసనములో ఆనుకొని సౌకర్యముగా కూర్చున్నారు . మనసు తాత్కాలిక విషయము వైపుకు తిరిగి , ’ చూచితివా ? ఈ దేహము ఇంత దృఢముగా నున్నా ,ఈ కొంచము బడలికను సహించలేదు . ఈ క్షర పురుషుని స్వరూపమే ఇదియేమో ? కావాలన్నపుడు ఎంత ఆయాసమైనా సహించి కార్యపరులై తిరుగుచున్ననూ , దేహమునకు ఆయాసము మాత్రము తప్పదు కదా ? ఇదేనేమో మృత్యువంటే ? సరే , దీనిని దాటుట ఎట్లు ? ఈ క్షరము ఎప్పటికైనా మృత్యువు పాలే కదా ! బహుశః సర్వజ్ఞత్వము నైనా సాధించ వచ్చునేమో గానీ మరణ రాహిత్యమును సంపాదించుటకు వీలు కాదేమో . ఈ దేహము పుట్టినపుడే మృత్యువుకు నోటి ముద్దగా పుట్టియున్నపుడు , అమరత్వమన్నది ఎలా సాధ్యము ? యుగాంతరముల వరకూ ఉన్ననూ , చిరంజీవి యైననూ చివరికి నామ రూపములను వదలి తీరవలెను కదా ! " అని ఆమెకు ఏవేవో ఆలోచనలు .
యాజ్ఞవల్క్యుడు వచ్చి ప్రణామము చేసి వాకిట నిలుచున్నాడు . ఆలాపిని వాడిని చూసి పొంగివచ్చు హర్షముతో ," రావలెను , మహర్షులగు వారు దయచేయవలెను " అని ఒక కృష్ణాజినమును చూపించి , తాను లేచి కూర్చున్నది . యాజ్ఞవల్క్యుడు ఆ స్తుతిని గ్రహిస్తూ , " ఈ ఆశీర్వాదముల చేత నేను మహర్షిని కాకపోతే దానికి కారణము నా దోషమనే భావించ వలెను " అని వినయ ప్రసన్నముగా పలుకుతూ వచ్చి ఆసనములో కూర్చున్నాడు .
" యాజ్ఞ వల్క్యా , రాబోవు తరాలలో కాశీ , మద్ర , కురు పాంచాల మిథిలా నగరములకెల్లా కర్మ బ్రహ్మ విద్వాంసుడంటే నువ్వొక్కడవే అవుతావు . అంతటి శుభ దినమును చూడవలెనని నాకు ఎంతో ఆశ ! . అయితే , దానితో పాటు , అంటే , పరా , అపరా విద్యలతో పాటు లౌకిక విద్యలను చేర్చుకొని నువ్వు సర్వజ్ఞుడ వెందుకు కారాదు ? అని ఒక ప్రశ్న ! "
యాజ్ఞవల్క్యుడు ఆశ్చర్యపోయినాడు . " తల్లీ ! మీరేమి పర చిత్త దర్శకులా ? ఈ మధ్యాహ్నము గౌతముల ఇంటి నుండీ నా గుడిసెకు వెళ్ళునపుడు ఈ సర్వజ్ఞ బీజపు విచారము వచ్చినది , నిజము . అయితే , నేను దానిని పట్టి ముందుకు పోయి ఆలోచించలేదు . ఇప్పుడు తమరు కూడా అదే విషయమే చెపుతున్నారే ? " అన్నాడు .
ఆచార్యాణి అన్నది , " చూడు యాజ్ఞవల్క్యా , నువ్వు వచ్చుటకు ముందు , ఆయాసము పొందిన దేహము చిరంజీవి యగుట , లేదా దేహపు యోచనయే లేక సర్వజ్ఞుడగుట యను రెండు యోచనలూ వచ్చినాయి . నాశనము పొందు దేహమును అమరము చేయుటకన్నా , సర్వజ్ఞత్వమును సాధించుటయే సులభమేమో ? అని ఆలోచిస్తున్నాను . నీకు సమ్మతమైతే దాని గురించే మాట్లాడదాము . నీ అభిప్రాయమేమి ? "
యాజ్ఞవల్క్యుడు ఒప్పుకున్నాడు . " నేను మాట్లాడితే , ఆ శాస్త్రము ఇలా అంటుంది , ఈ శాస్త్రము అలా అంటుంది అని శాస్త్ర వచనములను పలుకుతూ వాటి ముసుగులో నా అభిప్రాయములను చెప్పవలెను . తమరయితే , శాస్త్ర వాక్కులను సూత్రములకు భాష్యము వ్రాసినట్లు , ప్రవచనము చెప్పునట్లు చిత్ర విచిత్రముగా విషయమును చెప్పగలరు . తమరి వాక్యసుధను శ్రవణము చేస్తే నాకు కలుగు ఆనందము అంతా ఇంతా కాదు . "
ఆ స్తుతి వలన ఆచార్యాణి తృప్తి పడి అన్నది , " చూడు యాజ్ఞవల్క్యా , నిధిని కాపాడుతూ చుట్టుకొని యున్న ఘట సర్పమునకు బంగారు వర్ణము వస్తుందట ! అలాగే శాస్త్ర నిధిపుడైన వాడికి వాక్సౌందర్యము లభిస్తే ఆశ్చర్యమేమి ? మొదట శాస్త్రములను కరగతములుగా చేసుకొనుట ఎలాగ అన్నది చెప్పి , తరువాత సర్వజ్ఞత్వమును గురించి చెబుతాను , విను .
ఒక్కొక్క శాస్త్రానికీ , సూత్రము , అభ్యాసము అని రెండు క్రమములున్నవి . సంగీతమునే తీసుకో ! నువ్వు దానిలో పండితుడవు కాబట్టి దానిని తీసుకుందాము . అన్ని రాగములూ సప్త స్వరములలోనే ఇమిడియున్నాయి . అలాగని అన్ని రాగములకూ సప్త స్వరములనే వాయిస్తుంటే అవుతుందా ? స్వరముల మృదు , తీవ్రతలను అర్థము చేసుకో వలెను . దానితో పాటు , ఏది అంశము , ఏది గ్రహము అన్నది తెలియవలెను . రాగ ప్రస్తారములో వాది , వివాది మొదలైనవాటిని ఎరిగియుండవలెను . అలాగే వర్జ్యావర్జ్యములు తెలిసి యుండవలెను . ఆయా రాగములలో అవరోహణ తానము ముఖ్యమా ? ఆరోహణ తానము ముఖ్యమా ? అనుదానిని అనుభవించి ఉండవలెను , కదా ? "
" ఔను "
" అనగా నేమి ? సంగీతము కేవలము శాస్త్రపు కలగూర కాదు . దానిలో మాంత్రికుడు మామిడి టెంక నుండీ మొక్కను చేయునట్లే , అభ్యాస బలముతో జీవకళను నింపవలెను . అపుడే దాని ఆనందము . అలాగే , ప్రతి శాస్త్రమునందూ ఒక నిష్ఠ యున్నది . దానిని పాటించి కొనసాగవలెను . అప్పుడేమవుతుందో తెలుసా ? శాస్త్రమనెడి అటకపైనున్న విషయము కరగతమై ఆనంద ప్రదమగును . దానికేమి చేయవలెను అంటావేమో ? అదీ విను . శిష్టాచార్యుల విషయము మొదట చెప్పి , మిగిలిన దానిని తరువాత చెప్పెదను . శిష్యుడు ఆచార్యుని నుండీ అనుష్ఠానమును నేర్చును . ఆచార్యుడు తాను చేపట్టిన అనుష్ఠానమును శిష్యునికి ఉపదేశించును . శిష్యుడు అనుష్ఠానము చేయును . ఇది అనుష్ఠాన తాదాత్మ్యత.
" అనుష్ఠానము వలన అనుభవము వచ్చును , ఆ అనుభవము ఆచార్యుడు పొందినదే కావలెను . శిష్యుడు ఆచార్యుడు పొందిన అనుభవమునే పొందవలెను . ఆచార్యుడు ’ స ’ అంటే శిష్యుడు ’ స ’ పలకవలెనే తప్ప ’ రి ’ కాకూడదు : లేదా , ’ ని ’ కాకూడదు . ’ స ’ అంటే ’ స ’ మాత్రమే రావలెను . అది అనుభవపు తాదాత్మ్యత.
" అనంతరము ఆ అనుభవము సుఖముగా ఉందా , దుఃఖముగా ఉందా అనునది మూడవ ఘట్టము . ఆ అనుభవము మొదట మొదట్లో సంగీతము నేర్చువారి పాట వలె శృతి కఠినమూ అయిఉండవచ్చు , దానిని మాలిమి చేసుకొని , కంఠమును వినుటకు ఇంపుగా చేసుకొని శృతి ప్రియమూ ఆనందమూ అగునట్లే , అనుష్ఠానము చేత పొందిన అనుభవము ఆనందమే యగునట్లు చేసుకోవలెను . అనగా , ఆచార్యుడు అనుభవించిన ఆనందము శిష్యునికీ లభించునట్లు కావలెను . అది ఆనంద తాదాత్మ్యత.
" చివరి ఘట్టము విచిత్రమైనది . ఒకడు సంగీతమును పాడి ఆనంద పడితే ఇంకొకడు విని అదే ఆనందమును అనుభవించును . ఈ ఇద్దరి ఆనందమూ వేరే వేరేనా , ఒకటేనా ? అక్కడి ఆనంద స్వరూపమును వెదకి చూడవలెను . పాడి ఆనంద పడిన వాడొకడు . విని ఆనంద పడిన వాడొకడు . ఈ ఇద్దరి ఆనందమూ ఒకటేనా ? వేరే వేరేనా ? ఇది ప్రశ్న . దీనికి ఉత్తరమేమిటో తెలుసా ? ఆనందపు ప్రమాణములో తారతమ్యము ఉండవచ్చును . అయితే , ఆనంద స్వరూపములో భేదములు లేవు . అలాగుంటే ఆనందములోనూ అనేక జాతులు ఏర్పడవలసి ఉంటుంది . అలాలేక , ఆనందము ఎక్కడెక్కడున్నా ఒకటే అయి ఉన్నందు వలన , తెలిసినవారు దానిని అఖండము , ఏకరసము , అన్నారు . ఇది శాస్త్రపు కొన కావలెను . ఈ ఘట్టమును చేరుటకు అఖండైకరస తాదాత్మ్యము అని పేరు . ఇలాగే నాలుగు మెట్లలో శాస్త్రమును సాధించవలెను . దీనితో పాటు , నీకు తెలిసిన ఇంకొక మాట . "
యాజ్ఞవల్క్యుడు వారి మాటలు వింటూ వింటూ తల్లీనమై పరవశమై యున్నవాడు , ’ నీకు తెలిసిన ఇంకొక మాట ’ అనుటతో జాగృతుడైన వాడివలె , మరలా బహిర్ముఖమునకు వచ్చినాడు . ఆలాపిని , కళ్ళు మూసుకొని కూర్చున్నవాడు కళ్ళు తెరచి , తనవైపుకు చూస్తూ ’ అదేమిటి , అనుజ్ఞ ఇవ్వవలెను ’ అని ప్రార్థన చేయు వైఖరి ని చూస్తూ ఒక ఘడియ అలాగే ఉంది . అనంతరము మరలా ఆరంభించినది .
" చూడు యాజ్ఞవల్క్యా , ఏదేమైననూ ఆచార్యుడు శిష్యుడికి కేవలము దిశా నిర్దేశకుడు మాత్రమే . కిశోర న్యాయము వలన శిష్యుడిని అనుగ్రహించి శాస్త్ర బీజమును కరుణించును . అది ఒక పాదము మాత్రము . ఇంకొక పాదమును తన సహ పాఠులతో చర్చ చేసి తెలుసుకో వలెను . మిగిలిన సగమును తన స్వంత ప్రయత్నము చేత , చింతన , తపస్సులచేత సాధించవలెను . ఇక్కడ లౌకిక విద్యకూ వైదిక విద్యకూ వ్యత్యాసమేమీ లేదు . వైదిక విద్యలో బీజము తప్పక కావలెను . లౌకిక విద్యలో బీజము అవసరము లేకున్ననూ , ప్రయత్నము , అభ్యాసము , చింతన , తపస్సులు కావలెను . ప్రయత్నము , అభ్యాసము , చింతన , తపస్సులను తెలిసిన నువ్వు , వైదిక విద్యలోనైతే , అగ్ని దేవ , ప్రాణ దేవుల కృప వలన విచక్షుణుడవైనావు . ఈ వైచక్షణమును లౌకిక విద్యలలో కూడా పొందితే నువ్వు సర్వజ్ఞుడవే కావలెను . దానిలో విశేషమేమీ లేదు . "
యాజ్ఞవల్క్యునికి వారి మాట పై పూర్ణమైన విశ్వాసము .
" సర్వజ్ఞత్వము అంత సులభమా ...అలాగయితే అందరూ సర్వజ్ఞులెందుకు అగుట లేదు ? " అని నోరు తెరచి అడిగినాడు . ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎవరు ఎక్కలేరు ? అన్నట్లే , ఇది వట్ఠి మాట యని అతడి నమ్మకము , అని అతడి గొంతు చెపుతోంది .
ఆలాపిని నవ్వి అన్నది , " నీ గొంతే నీకు నమ్మకము లేదు అని చెపుతోంది . కానిమ్ము , నమ్మకము లేనివారికి నమ్మకము పుట్టించుటకే కదా , శాస్త్రమున్నది ? కానిమ్ము , ఆ పని చేద్దాము . అయితే , ఒక సంగతి , యాజ్ఞవల్క్యా , ఆయుధముందని యుద్ధమునకు పోవుటకు అవుతుందా ? "
" లేదు , ఆయుధమును ప్రయోగించుటనూ , ఎదుటివాడు ప్రయోగించిన ఆయుధము నుండీ తప్పించుకొనుటనూ నేర్చితే ఆయుధము ఉపయోగమునకు వస్తుందే కానీ , కేవలము ఆయుధముందని యుద్ధమునకు పోవుటకు కాదు . "
" అలాగే శాస్త్రమున్నంత మాత్రాన , నమ్మకము లేని వారికి నమ్మకము పుట్టించుటకు సాధ్యము కాదు . పట్లు విడుపులు తెలిసిన జమాజట్టి మాత్రమే పైన పడుటకూ , పైన పడ్డ వాడిని తప్పించుకొనుటకూ శక్తుడగునట్లు , శాస్త్రమును సర్వాంగీణముగా తెలిసిన వాడు మాత్రమే ఇతరులకు నమ్మకమును పుట్టించ గలడు . శాస్త్రమును పట్టి నడచుట యంటే , గుడ్డివాడి వెనక పోవు గుడ్డి వాడి వలె కాకూడదు . శాస్త్రపు గుడ్డితనము తన తపస్సుచేత మాత్రమే పోతుంది అనుదానిని మరువరాదు . ప్రతి శాస్త్రమూ విష్ణు పదమునకు తీసుకొని పోవును అను ఆస్తికత తో వెడలి , విష్ణు పదమును చేరి , వెనుకకు తిరిగి వచ్చినవాడు చెప్పు శాస్త్రము వేరే , అలా కాక , శాస్త్రపు పంక్తులను వల్లెవేసి చెప్పు శాస్త్రము వేరే , ఔనా ? "
" ఔను "
" అలాగే ముందుకు వెళ్ళి, ఈ రీతులు వేరు వేరుగా ఉండుటకు కారణమేమో ఆలోచించు . "
" ఒకటి అంతర్ముఖము ( అనుభవము ) , ఇంకొకటి బహిర్ముఖము ( అధ్యయనము ) ."
" ఆ మాటను భద్రంగా పట్టుకో . ఇలాగ అంతర్ముఖుడగుట చేతనైన వాడికి సర్వజ్ఞత్వము ఏమి గొప్ప ? నీకు ఉపనయనములో ఉపదేశము చేసిన మంత్రపు అర్థమేమిటి ? మా వృత్తిని ప్రేరేపించు దేవుడి తేజస్సును ధ్యానించెదము అని కదా ? అంటే ఏమి ? వెనక్కు తిరిగి చూచుటను నేర్చుకో అని కదా ? దానిని ఇంకొంచము దూరము ఎందుకు లాగి చూడకూడదు ? పండును చూచి చెట్టును ఊహించి , చెట్టును చూచి బీజమును ఊహించి తెలుసుకొన్నట్లే , తన చేతిలో నున్న పండులోని బీజమూ , ఆ పండును మాత్రమే కాక చెట్టునే తనలో ఉంచుకొన్న బీజమూ ఒకటే యంటే తప్పుకాదు కదా ? "
" ఔను , తప్పు కాదు "
" అలాగే , ఈ ప్రపంచములోనున్న తానూ , ఈ ప్రపంచమునకు కారణమైయున్న వాడూ ఒకరే అయి ఉండ వలెనంటే తప్పు లేదు కదా ? "
యాజ్ఞ వల్క్యుడు గంభీరముగా అన్నాడు , " ఇక్కడ నాకు అర్థము కాలేదు , తల్లీ ! . ప్రపంచములోనున్న నేను చిన్నవాడిని . నాకన్నా ప్రపంచము ఎంతో పెద్దది . దానిని పుట్టించినవాడు దానికన్నా పెద్దవాడు . పురుష సూక్తములో " పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్య అమృతం దివి ’ సృష్టికి వచ్చినదంతా ఒక పాదమైతే , సృష్టికి రాకుండా ఉన్నది దీనికి మూడు పాదాలంత అమృతమై ద్యులోకములో కూర్చున్నది ’ అని ఉన్నది , ఇలాగైతే , అది నేనే అనుటెట్లు ? "
Janardhana Sharma