*శ్రీ ఆది శంకరాచార్య చరితము 35 వ భాగము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
అంతలో ఉన్మత్త భైరవుడు శ్రీశంకరులతోమాటాడతలంచాడు.
*ఉన్మత్త భైరవుడు:*
కాపాలికుల దురవస్థ చూచాడు. తన మతమును నిలువ బెట్టుకొను నుద్దేశం కలిగి ఉన్మత్త భైరవుడు మెల్లగ శ్రీ శంకరా చార్యస్వామిని సమీపించి,"యతి వరా! నా మాటలు తామువినాలి. విన కుండ నన్ను కాదని గెంటివేయ కండి! తాము అంగీకరించినా తమ శిష్యులు అంగీకరించక పోవచ్చు. అందుకు నా కభయమిస్తే నాగోడు పూర్తిగా వినిపించెదను. అప్పుడాలకించెదరు గాక !” అని చెప్పగా శ్రీ శంకరాచార్య స్వామి వల్లె యని భైరవుని పలుక మన్నారు. అంతటాతడు, "యతీ శ్వరా! లోకంలో మా మతమే నీచమైతే మరి యే మతమునకు గొప్పతనమున్నది? ఇతర మతములలో ఫలితముంది అనెదరా?బ్రాహ్మణమతం చాల గొప్పదని కొందరు తలంచి వాళ్ళ మతం విడచిపెట్టి నాశనం కాలేదా! బాహ్మణ జాతి యనగా మంచిదని భావించకండి. అందుమాకేమి లాభం కన్పించడం లేదు. శరీరములన్నీ పంచ భూతములతో తయారు కాబడ్డవే. బ్రాహ్మణ శరీరములు ప్రత్యేకం బంగారంతో తయారు కాలేదే! పక్షపాత బుద్ధితో జాతులు లేవదీసినాడెవడో! ఏనాడూ లోకంలో ఇన్ని జాతులు లేవు. రెండే రెండు జాతులున్నవి. పురుషులని, స్త్రీలని అంతే. ఇవి ఎందుకొర కేర్పడ్డవి? ఆనందము ను అనుభవించుటకు మాత్రమే ఏర్పడినవి. స్త్రీపురుషులసంయోగ క్రీడలో ఆనందం ఉద్భవిస్తుంది. అందులో స్త్రీలకు ప్రత్యేకప్రాధాన్య ము ఏర్పడింది. ఈ విషయం ఔనా కాదా యని తర్కించనవసరం లేదు. స్త్రీ పురుషులకు విధి నిషేధము లుండ కూడదు. ఉంటే స్వేచ్ఛకు భంగమే కదా! స్వేచ్ఛ తీసివేసి ప్రతి బంధకములు సృష్టిస్తే మేమందులకు అంగీక రించము. స్వేచ్ఛ లేనినాడు ఆనందము ననుభవించుటకు అంతరాయమే కదా! ఇందు తప్పుపట్టుకొను టకు ఏమున్నది? కావలసినది ఆనందా నుభవం. అట్టి ఆనందమును అనుభవించ చడమే మోక్షమను చున్నారము. ఈ శరీరం విడచిన వెంటనే కాలభైరవుణ్ని కలిసి కొనుచున్నాము. అదే పూర్తి మోక్షం, ఇందులో అంతా సత్యమే' అని వివరించాడు.
ఉన్మత్తభైరవుడు ఆడిన మాటలు శ్రీ శంకరా చార్యులు విని,
'భైరవా! ఆడతగ్గ మాటలు ఆడితివి. నిజం చెప్పెదను ఆల కించుము. ఆడవాళ్ళ ను గురించి ఏవేవో నోటికి వచ్చినట్లెల్ల పేలావు. మీ అమ్మ ఎవరికి పుట్టింది' అని ప్రశ్నించారు. 'మా తల్లి దీక్షితుని కూతురు.' భైరవుడన్నాడు.
'సరే! మీతండ్రికి దీక్షిత్వం ఎట్లావచ్చింది? శంకరుల ప్రశ్న.
'మాతండ్రికి మద్యము అనగా చాలా ప్రీతి. తనంతట తానుగ తాగడు. మంచిరకం తాటికల్లు తెచ్చి అమ్ము చుండును. అట్టి తాటి కల్లు అమ్ముచుండును కనుక దీక్షితుడన్నారు. అతని కూతురే మా తల్లి. మా మతంలో మద్య పానానికి దోషం లేదు. సోమ యాగం చేస్తే సోమయాజి అయినట్లు మద్యపానం చేసే వానిని దీక్షితుడని యందురు. ఇదేమీ తప్పుగాదు. ఎవరికి వప్పచెప్పినను వారిని అందరిని ఆనంద సాగరంలో ముంచెత్తి స్తుంది మాయమ్మ. ఇవి తప్పుగా భావించరు. నా పేరు ఉన్మత్త భైరవుడు. మాతండ్రి సురాకరుడు. ఆయనకు గొప్ప పేరు గలదు.
మా తండ్రి కడకు జ్ఞానులు వచ్చుచుందురు. మద్యం వాసన వాళ్ళకేమీ అసహ్య ముండదు. మద్యపాన మనగా మిక్కిలి ప్రీతి గల కులములో పుట్టితిని. మీకు పూజనీయుడను. ఇందు ఇసు మంతైనా సంశయం లేదు.' అని తన గొప్పను వెల్లడించాడు.
శ్రీశంకరాచార్యులు ఉన్మత్త భైరవుని కథను అంతా విని, 'ఉన్మత్త భైరవా! నీవిచట నుండతగవు! నీవంటి వారలకు ఉపదేశము చేయరాదు. నీ యిచ్ఛ చొప్పున సంచరించు! బయటకు పొమ్ము!' అని చెప్పి పంపించారు.
*చార్వాకుడు:*
చార్వాకుడొకడు తన దారిని పోతూండగా శ్రీ శంకరాచార్యులు ప్రక్క గ్రామంలో నున్నటుల దెలిసి ఈ క్రింది విధముగ తలపోసాడు.
'ప్రత్యక్షముగ కనుపిం చునవి దేహము, ఇంద్రియములు. వీటి కంటె అతీతమైనది ఏదో గలదని, పైగా అది కనబడదని, దానిని గురించి ఏవేవో ఉపన్యాసము లిచ్చు వారు కొల్లలుగ బయలు దేరుచున్నారు. అట్టి వాళ్ళ వలలో మూఢులు చిక్కుకొని పోవు చున్నారు.చూడగ మాకు కొంప మునిగే పరిస్థితి దాపురించునా యేమి? ఇక్కడెవరో యతి యున్నాడట! అతడేమైన తెలివిగల వాడేమొ చవి చూచి కాస్సేపచ్చట ఉండి మాటాడెదను. అతడు తెలివిలేని వాడైన నాదారి నాదియే.' అట్లు తలపోయుచు శ్రీశంకర పాదులున్న నిండు సభలో ప్రవేశించాడు.
ఒకించుకసేపైన తరువాత లేచి శ్రీశంకరపాదులను సమీపించి, నమస్క రించి, మాటాడుట కనుమతి పొంది, ‘యతీశ్వరా! నిజమైన తత్త్వమేదైన యున్నచో నాకు తెల్పెదరా? ముక్తి యన నేమియో వివరించుడు. అదెట్లుండునో, ఎట్లు దొరుకునో వివరంగా చెప్పెదరా? మొదట నేను తెలుపునది వినుడు ఆపైని తాము చెప్పునది చెప్పెదరు గాక!' చార్వాకుడు ఉపస్యసించుటకు అనుమతి పొంది ఇలా అంటాడు.
'శంకరా! మొదట ఈ శరీరము పుట్టినది. జీవుడుకూడ ఆరూపములోనే యున్నాడు. ఇంత కన్న జీవుడు వేరుగ లేడు గదా! ఇది పరమ ప్రత్యక్షమైనది. ఇట్టి ప్రత్యక్షప్రమాణము గల దానిని విడనాడి కనబడనిదానిని పట్టు కొని ప్రాకులాడడం తెలివి తక్కువ గదా! జీవుడు దేహ రూపము లోనే ఉండి లయ మొందడమే మోక్షమనినారు. మరి యొకటి ఎన్నటికి కాదు,లేదు, నదులన్ని యు పోయి సముద్ర ములో కలియుచున్నవి. తిరిగి వచ్చుచున్నవా? ఎన్నటికి రావు. రాబోవు.
అట్లే చచ్చి పోయిన జీవుడు తిరిగి రావడం కల్ల.
చావు అనగనే ముక్తి. ఈ రహస్యం మూఢులు తెలిసికొనజాల కున్నారు. చచ్చిన వాళ్ళకు శ్రాద్ధాలు ఆచరించడం, తద్దినాలు పెట్టడం ఎంత బుద్ధిహీనతగా నున్నదో యోచించుడు! నిజంగా చచ్చిన వాళ్ళు వచ్చి తింటారా? ఇదంతా వ్యయ ప్రయాసలుగాక మరే మున్నది? వాళ్ల పేరు చెప్పి తినడమే యగుచున్నది. చచ్చిన వాళ్ళకు నరకమను చున్నారు లేదా స్వర్గ మనుచున్నారు. నరకం భయమట! స్వర్గం సుఖమట! ఆ రెండింటి ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఆయా లోకాలనుండి మరలి వచ్చి మానవులై పుట్టెదరట! ఇదంతా కండ్లార గాంచిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇదంతా వెర్రి గాక మరేమున్నది! ఈశరీరముండగనే సుఖమైనను కష్ట మైనను అనుభవించేది. ఆ రెండింటినే స్వర్గ నరకములని అనవలెను. అంతే గాని కనుపించని స్వర్గనరక లోకములు ఉన్నవనిన మూఢులు నమ్మాలి. అట్టిలోకములు ఉన్న వనుట కేవలం కల్పితమే.ఈశరీరం నశించిన మిగులునదే మున్నది? వట్టి బూడిద మాత్రమే మిగిలి యుండును. అదైనా నీటిలో కలిసి పోవునదే. ఈలాటి కల్పితలోకము లకు వెళ్ళేది ఎవరు? ఎట్లా? ఇంక శరీరంవేరు, జీవుడు వేరు కాదందురా? కుండ బ్రద్దలైంది. అందున్న గాలి ఎక్కడికైనా పోయినదా? అక్కడే యున్నది. అట్లనే శరీరంపోతే జీవుడక్కడే ఉంటాడు. కనుక 'దేహమే ఆత్మ' అనేది ధర్మం, మేమనేది అదే.' అని చార్వాకుడు తన మతమును గురించి ఉపన్యసించాడు.
చార్వాకుని ధోరణి పూర్తిగా విన్నారు. తత్త్వ రహస్యము నొకించుక బోధింప దలచి,
'చార్వాకుడా! ఈశరీరం చనిపోయిన తరువాత వేరొక శరీరం లభించును. మరణించ గనే జీవుడు ప్రేత శరీరమును పొందు చున్నాడు. ఆ ప్రేతత్వం విడచి పుణ్యలోకము లకు పోవలెనన్న కుమారుడు మొదలయి నవారు వాని నిమిత్తం శ్రాద్ధకర్మ లాచ రించాలి. గయ మొదలగు పుణ్యక్షేత్రములలో పిండ ప్రదానములు మొదలగు పెక్కు దానములు చేసి అందుకు ఏర్పడిన కర్మలు యథావిధిగా చేయాలి. అప్పుడు జీవుడు ప్రేత శరీర మును విడనాడి తాజేసి కొనిన పుణ్య పాపకర్మల నను సరించి ఆయా పరలోకములను పొందు చున్నాడు. అంతే గాని శరీరం నశించడంతో పాటు జీవుడు నశించడు. ఇదంతా ధర్మశాస్త్ర ములలో చెప్పబడి యున్నది. నీవన్నది యావత్తు శుద్ధ అబద్ధము. నీకు వివేక మన్నది సున్న.' అని వ్యక్తంచేశారు.
శ్రీశంకరాచార్యస్వామి నిర్వచించిన దంతము విని సిగ్గుపడి తానాచరించే దంతయు వట్టి బూటకమని చార్వాకుడు గ్రహించి శ్రీశంకరపాదులపాదము లపైబడి శరణు కోరాడు. శ్రీ శంకరులు కరుణ కలిగి వానిని విడువక గ్రంధములను మోయుటకు నియోగిం చి తమ శిష్యునిగా జేసికొన్నారు.
*పీనకాయుడు:*
పీనకాయుడను పేరుగల సౌగత మతస్థుడు తన మతమును గురించి చెప్పుకొన దలచి సభలో నుండి లేచి శ్రీ శంకరపాదుల కడకు వెళ్ళి, 'శంకరాచార్య వర్యా!నమస్కారములు. నిజాన్ని గ్రహించలేక కర్మలాచరిస్తున్నారు. ఈ శరీరమునకు స్నానము ప్రాయశ్చిత్తము మొదలైన అనేక కర్మలు చేసినను మలంతో కూడిన ఈ శరీరం ఎప్పటికైనా పరిశుద్ధ మగునా? శరీరం మలంతో కూడి యున్న ను జీవుడు మాత్రం సదా నిర్మలంగానే యుంటున్నాడు గదా! ఇది అటుండ నిండు. చనిపోయిన పిమ్మట వాసనా ప్రభావంతో జీవుడు మరల పుట్టుచున్నాడని అంటున్నారు. వాడు చేసికొనిన పుణ్యకర్మ ననుసరించి ధనవంతు డగుచున్నాడని పలుకు దురు. చచ్చిపోవు సమయమునకు ఋణము గాని, కర్మ శేషము గాని యుండదు. అప్పు చేసియైనను మృష్టాన్న భోజనములు చేస్తూ శరీరములను చక్కగ పోషించు కొనుచున్నారు. అట్లాచరించిన మోక్షము వస్తుంది!' అని వెల్లడి చేశాడు.
పీనకాయుడాడిన మాటలు శ్రీశంకరా చార్యస్వామి విని 'పీనకాయా! నీవన్నది వట్టి బూటకం! కర్మ ఫలమును అనుభవిం చుటకు పరలోకప్రాప్తి కలుగునని శ్రుతుల లోను, స్మృతులలోను పురాణముల యందును చెప్పబడియున్నది. కర్మశేషమును మాత్రం అనుభవించుటకు మరల జన్మ ఎత్తాలని కూడ చెప్పబడినది. కావున అజ్ఞానం విడనాడి మంచి మార్గమును అవలంబిం చుము!' అని తెలియ జెప్పారు. అంతట పీనకాయుడు, 'స్వామీ! మరొక్క విషయమును జెప్పెద నాల కించుడు. సుగతుడనే ముని యొకడు లోక మంతయు తిరిగి తిరిగి ఆశ్చర్యము నొందెను. అప్పుడాతని కొక ఆలోచన తట్టినది. మానవుడు తరించ వలెనన్న ప్రాణులనే ఉపాసించ వలెను' అని. ఆతడట్లుగనే చేసి యున్నాడు. అతడు నాకు పదేశించి నప్పుడు ఒక్క విషయాన్ని మరువవద్దని నొక్కి చెప్పాడు ‘జీవహింస చేయరాదు' అన్నదే పరమ ధర్మ మన్నాడు. నన్ను కూడ జీవులనే ఉపాసించమని శాసించాడు. అట్లు ఆచరించిన కపాల మోక్షము వస్తుంది అన్నాడు. అప్పటి నుండి ఆ మహాను భావుని ఉపదేశము లను మనసార నమ్మి ఆ ప్రకారము ఆచరిస్తున్నవాడను. యతివరా! కనుక ఆలాటి పరమధర్మం లోకమందెచ్చటను కానరాకున్నది. ఇది అందరూ ఆచరిం చుటకు యోగ్యమై యున్నది.' అని తన మతమును వివరించాడు.
శ్రీ శంకరాచార్యస్వామి సౌగతుడు తెలిపిన మతవిధానమునంతా విని, 'సౌగతుడా! నీవన్న ధర్మము నొక్క దానినే పట్టుకొని ప్రాకు లాడిన లాభం లేదు. మానవు డింకను అనేక ధర్మము లాచరించ తగియున్నవి. వేదార్థం తెలిసినచో నీ వట్లని యుండవు. యజ్ఞము లో జంతువును బలి ఇమ్మని ఒక ధర్మము ఉన్నది. అట్టి యజ్ఞము వేదవిహీన కర్మల నాచరించు వారే చేయుదురు. దానివలన స్వర్గాది పుణ్యలోకవాసము ప్రాప్తించును. ఇందులకు పాషండు లిష్టపడరు.
*"వేదనిందా పరాయేతా సదాచార వివర్జితా:*
*తే సర్వే నరకం యాతి యద్యపి బ్రహ్మవీర్యజా:*
సదాచారమును విడిచిపెట్టిన వాడు, వేదాలను నిందించు వాడు బ్రాహ్మణ కులమందు జన్మించిన వాడైనను సరే నరక లోకమును పొందు చున్నాడు, అని మనువు సెలవిచ్చి యున్నాడు. కావున బాహ్మణులు మొదలైన కులముల వారందరికి వేదములో చెప్పబడిన ధర్మములు పరమ మాన్యములై వెలయు చున్నవి.' అని తెలియజేశారు.
అంతట చెప్పుకొన దగినది గానక సౌగతుడు శ్రీ ఆచార్య స్వామివారి పాదము లపై బడి శరణు వేడుకొనియెను. అప్పుడు వానిని పద్మపాదాది శిష్యుల పాదుకలు మోయుటకు నియమించిరి. అంతట నుండి ఆతడాప్రకారం జేయుచు వారి ఉచ్ఛిష్టాన్నమును భుజించుచు మహా భక్తుడై వెలయు చుండెను.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 35 వ భాగము సమాప్తము*
🌹🌹🌹🌺🌺🌺🌼🌼🌼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి