6, అక్టోబర్ 2024, ఆదివారం

విజయవాడ కనకదుర్గ* *ఆలయ చరిత్ర*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

     *విజయవాడ కనకదుర్గ*

        *ఆలయ చరిత్ర*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శరన్నవరాత్రుల సందర్భంగా "అమ్మలగన్న అమ్మ మము కన్నతల్లి మాతల్లి దుర్గమ్మ" అని తెలుగు ప్రజలంతా నోరారా పిలుచుకునే కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారు? అమ్మవారు వెలసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.


కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. 


విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శ్రీ దేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గా మాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.


ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది?


దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్ర కీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 


పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవ వర్మ తన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడిచేటట్లుగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖశాంతులతో ఉండేవారు. ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజ భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు రాకుమారుని రథ చక్రాల కిందపడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు. బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై తమకు న్యాయం చేయాలని రాజును ఆశ్రయిస్తారు. అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవ వర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణ దండన విధిస్తారు.


అంతట రాజు యొక్క ధర్మనిరతి మెచ్చిన అమ్మవారు ఆ బాలుని బతికించడమే కాకుండా విజయవాటిక పురమునందు కొన్ని ఘడియల పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గా దేవిగా పూజించడం మొదలు పెట్టారు. 


శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం కూడా చేస్తారు. 


ఇంద్రకీలాద్రి అనే పేరు ఇలా వచ్చింది?


కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్ర కీలాద్రిగా మారింది. ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది.


పరవశింపజేసే అమ్మవారి విగ్రహం:~


ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో వెలసిన మహిషాసురమర్ధిని తల్లి కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. 


శ్రీచక్ర ప్రతిష్ఠ చేసిన ఆదిశంకరులు:~


శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలసిందని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనల్లో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ కనక దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా పండుగల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనము ఇస్తారు. ఈ నవరాత్రుల్లో వచ్చే సప్తమి తిథి, మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతి దేవి అలంకరణ చేస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. అంతేకాదు ఆరోజున అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. 


ఉత్సవాలు వేడుకలు:~


దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు జరుగుతాయి. ఇక చివరి రోజైన విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో భక్తులను అలరిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. భవాని దీక్షలు

కనకదుర్గమ్మ వారి భక్తులు భవాని దీక్ష పేరుతో మండలం పాటు దీక్ష వహించి అమ్మవారి సన్నిధిలో దీక్షలను విరమిస్తారు. 


కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తల్లిని దర్శించి తమ పిల్ల పాపలను చల్లగా కాపాడు తల్లీ అని వేడుకుంటారు. ఆ తల్లి కూడా అందరికీ చిరునవ్వుతో దర్శనమిచ్చి వరాలను ప్రసాదిస్తుంది. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకుందాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. 


ఓం శ్రీ మాత్రే నమః

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: