6, అక్టోబర్ 2024, ఆదివారం

బమ్మెఱవారి అచ్చతెనుగుముచ్చట్లు!

 శు భో ద యం🙏


బమ్మెఱవారి అచ్చతెనుగుముచ్చట్లు!


క:కరిఁదిరుచు మకరిసరసికి/

కరిదరికిని మకరిఁదిగుచు కరకరిఁబెరయన్/

కరికిమకరి మకరికిఁగరి/

భరమగుచును నతలఁగుతలభటులదరిపడన్.


ఆం:భాగవతము-గజేంద్రమోక్షము;

        పరమభక్తాగ్రేసరుడగు బమ్మెరపోతన గారి భాగవతంలో

ప్రసిధ్ధమైన ఘట్టం.గజేంద్రమోక్షం.ఆఘట్టంలో కరి-మకరుల పోరును చిత్రిస్తూ ఈకందాన్ని అతిరమ్యంగా విరచించారు.ఇది అచ్చతెనుగు పదాలముల్లె,"భరమగు"అనే ఒక్క సంస్కృతపదంతప్ప,యిందులో తక్కినవన్నీ తెనుగు పదాలే!

          కొందరు సంస్కృతాన్ని,మరికొందరు తెనుగును,ఇష్టపడుతూ ఉంటారు.అందుచేత నేను ఆయిరువర్గాలను తృప్తిపరచుటకు అక్కడక్కడ సంస్కృతపదభూయిష్ఠరచనమును, మరికొన్నిచోట్ల అచ్చతెనుగును వాడి వారియందరి మెప్పునందగలనని,పోతనభాగవతానతారికలోనుడివిన మాటలకు కార్యరూపమే ప్రస్తుతపద్యం.


అర్ధములు:-

కరి-ఏనుఁగు;మకరి-మొసలి;

తిగుచు-గుంజు;

సరసి:చెఱువు;

దరి-ఒడ్జు:;కరకరి-పట్టుదల;

భరము-భారము;

అతలము-అధోలోకము.

కుతలము-భూమి.


భావము:

    కరిన్ మకరి సరసికిన్ తిగుచున్(మొసలి యేనుగును సరస్సులోకి లాగుచున్నది.)

కరి మకరిన్ దరికి తిగుచున్(ఏనుగు మొసలిని ఒడ్జుకు లాగుచున్నది) ఈవిధంగా  పట్చుదలతో అటుఅధోలోకవాసులకు,ఇటుభూలోకవాసులకు భయదాయకముగా పోరాడుచున్నవని భావము.ఈవిధంగా,

       ఆకరిమకరుల గుంజులాటను ర కార యమకంతో మనకు మనోగోచరంచేశాడు.

      చిన్నకందంలో కొండంత భావాన్ని పొదిగిన పోతనమహాకవి కవితా మహత్తు నకిట్టిపద్యములు మచ్చుతునకలు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: