*❤️వివాహం ఓ శాశ్వత బంధం❤️*
మన సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. హైందవ సమాజంలో వివాహానికి ఉన్నంత పటిష్టత మరే సమాజంలోనూ కానరాదు.ఒక వ్యక్తి జీవితంలోనూ వివాహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోంటోంది. షోడశ సంస్కారాలలోనూ వివాహం ప్రత్యేకమైనది.
వివాహానికి ముందు
ఒక వ్యక్తి ఏకవచనం, వివాహానంతరం జీవితాంతం ఆ వ్యక్తి నిత్యబహువచనం. 'నేను' అన్న మాట మరుగై, 'మేము' అన్న భావన బయటకు వచ్చే విశిష్ట క్షణానికి శ్రీకారం చుట్టేది వివాహం.
'అథో అర్థో వా ఆత్మనః యత్పత్నీః' అని ఉంది. అంటే 'ఏ పురుషుడైనా తనంత తానుగా సగమే. రెండవ సగం అతని భార్య' అని అర్థం. జీవితంలో అంతటి ప్రధానమైన భార్యను వరునికి చేరువ చేసేది వివాహం.
'వేదాధ్యయనం పూర్తి చేసి బ్రహ్మచారి వేదోక్త కర్మానుష్ఠానం చెయ్యాలని, పరమేశ్వరుణ్ణి ఉపాసించాలని వంశ తంతువును అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని తలపోయటం సహజం. ఈ ధర్మాలన్నీ ధర్మపత్న్యధీనాలు. కాబట్టే, అతడు 'నాకు యోగ్యురాలైన భార్య కావాలి' అనుకుంటాడు' అని శతపథ బ్రాహ్మణం పేర్కొంటోంది. 'సంక్షేపంగా చెప్పాలంటే, అతిథిపూజ, దేవతా పూజ, సంతాన ప్రాప్తి, యథాశక్తిదానం, స్వాధ్యాయం అనేవి గృహస్థు ధర్మాలు. వీటిని శ్రద్ధగా ఆచరిస్తే జీవితం పునీతం అవుతుంది. అందుకోసమే వివాహం.
వివాహ ప్రక్రియలో సూత్రీయం, భట్టీయం అని సంప్రదాయాలే కాకుండా దేశ కులాచారాలను బట్టి అనేక ఇతర భేదాలు కూడా ఉంటాయి.
*వివాహంలో ప్రథమ ఘట్టం - గణపతి పూజ :*
అగ్నిసాక్షిగా జరగబోయే వివాహానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని గణపతిని ప్రార్థించడంతో వివాహ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మరొక విశేషం ఏమిటంటే, విఘ్నేశ్వరుడిని అగ్నికి ప్రతీకగా భావిస్తారు. అందుకే, వేదంలో అగ్నిని స్తుతించే 'గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమమ్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్' అన్న మంత్రంతోనే విఘ్నేశ్వరుడిని స్తుతించడం జరుగుతోంది.
ఆ తరువాత, పురాణ దంపతులైన లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణీహిరణ్యగర్భులు (సరస్వతీబ్రహ్మలు), శచీపురందరులు, అరుంధతీవశిష్ఠులు, సీతారాములను పూజిస్తారుతరువాత కలశపూజ. కలశపూజ తర్వాత, గణాధిపతిని ధ్యానవాహనాది షోడశోపచారాలతో అర్చిస్తారు.
*పుణ్యాహవాచనం :*
గణపతి పూజ, కలశ పూజల తర్వాత పుణ్యాహవాచనం.
శుభప్రదమైన వివాహం జరగబోయే గృహం, వేదిక, సత్రం, మండపం.. ఏదైనా కానీ, అది పవిత్రం కావటానికి దానితో బాటు సమస్త వాయుమండలం అంతా ఒక విశిష్టమైన పవిత్రతను సంతరించుకునేందుకు ఉద్దేశించిన పవిత్ర కర్మే పుణ్యాహవాచనం.
*స్నాతకం లేదా సమావర్తనం :*
ఇంతకాలం విద్యాభ్యాసం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించిన బ్రహ్మచారి, విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. ఇలా తిరిగి రావడాన్నే 'సమావర్తనం' అంటున్నారు. తిరిగి వచ్చిన వెంటనే అతనికి అంతక్రితం తను ఎరగని సుగంధ భరితమైన జలాలతో స్నానం చేయిస్తారు. ఈ స్నానాన్నే 'స్నాతకం' అంటారు. దీనితో అతను, తన బ్రహ్మచర్యానికి స్వస్తి పలుకుతూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి సర్వంసహా సిద్ధపడుతున్నాడన్నమాట.
ఈ స్నాతక సమయంలో పలికే మంత్రాలు చాలా శక్తిమంతమైనవి. వీటినే మనం నిత్యం దినవారీ పూజల్లో భాగంగా కూడా చేసే సంకల్పంలోనూ పఠిస్తాము.
'ఆపో హిష్ఠామయోభువః తాన ఉర్జే దధాతన మహేరణాయ చక్షసే
యోవ శ్శివోత్తమ రసః తస్యభాజయతేహనః ఉశతీరవ మాతరః
తస్మా అరంగమామవః యస్యక్షయాయ జిన్వథ ఆపో జన యథాచనః'
అంటే 'ఓ ఉదకములారా! మీరు మాకు సుఖములను కలుగ జేయుదురు. మీ అనుగ్రహము చేతనే మాకు అన్నము లభిస్తున్నది. మీనుంచి లభించిన శక్తితోనే జ్ఞానము కలుగుచున్నది. కన్నతల్లులు ఏ విధముగా అయితే, తమ పిల్లలను పోషిస్తారో మీరు ఆ విధముగానే మీ మంగళకరమైన రసముతో మమ్ము పోషింతురుగాక! నశ్వరమైన ఈ దేహాన్ని రక్షించే శక్తి మీలోని రసములకు ఉంది. కావుననే మేము వినయముగా మిమ్ములను వేడుకొనుచున్నాము. మమ్ములను సత్సంతానము గలవారిగా చేయుము' అని అర్థం.
*స్నానానంతరం*, ఆ బ్రహ్మచారి నూతన వస్త్రధారణ చేస్తాడు. తర్వాత అగ్నిని పూజిస్తాడు. అనంతరం కాటుకను అలంకరించుకుంటాడు. కానీ, అతనికి అప్పుడు ఈ అలంకరణలతో కొంత వైరాగ్యం కలిగి, ఈ అలంకరణలను చేసుకోవడంకన్నా మరింత ఉన్నత విద్యను అభ్యసించటం మంచిదనే భావన కలుగుతుంది. అందుకే మళ్లీ గొడుగు అందుకుని, పాంకోళ్లు ధరించి, ఉన్నత విద్యకై *కాశీకి ప్రయాణం* అవుతాడు. ఈ సమయంలో అతనికి వధువును ఇవ్వదలిచిన కుటుంబీకులలోని వధువు తమ్ముడు, ఇతర బంధువులు వచ్చి 'ఇక నీ బ్రహ్మచర్యానికి మంగళం పలుకుతూ, మా ఇంటి కన్యను భార్యగా స్వీకరించి, గృహస్థువు కమ్మ'ని కోరుతారు. వధువు తండ్రి మాటగా వరునికి ఇలా తెలియజేస్తారు:
*'సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజః*
*పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్ఛ స్వాగచ్ఛ మద్గృహమ్'*
'నీకు సర్వాలంకార భూషిత అయిన మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయిస్తాము. ఆమె చేతిని గ్రహించి, ధర్మపత్నీ సమేతుడవై, త్రేతాగ్నులతో వెళ్లగలవు. ఇప్పుడు మా ఇంటికి రాగోరుతున్నాం' అని అర్థం. ఈ వినతితో ఆ బ్రహ్మచారి, తన కాశీయాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టి వివాహానికి అంగీకరిస్తూ, కల్యాణమండపం వైపు అడుగులు వేస్తాడు.
*అంకురారోపణం :*
'అంకురం' అంటే మొలక అని అర్థం. ప్రారంభం అని కూడా మరో అర్థం చెప్పుకోవచ్చు. వివాహ శుభకార్యానికి ఇది ప్రారంభ కార్యక్రమం. వివాహ సుముహుర్తానికి ముందు రోజు రాత్రి వధూవరుల తల్లిదండ్రులు ఈ 'అంకురారోపణం' అనే కర్మను చేస్తారు. దీన్నే 'అంకురార్పణ' అనీ అంటున్నారు.
ప్రకృతిలో ఉండే ఓషధులపట్ల కృతజ్ఞతను ప్రకటించే కర్మమే ఇది. ఓషధులకు చంద్రుడు అధిపతి కాబట్టి ఈ కర్మను రాత్రి వేళల్లోనే చేయాలి.
మట్టితో చేసిన అయిదు పాలికలలో పుట్టమట్టి పోసి, ఆ మట్టిలోఓషధీబీజాలను వేసి, అవి మొలకెత్తేలా చేయటమే 'అంకురారోపణం'. పాలికల మూలాలలో దూర్వ (దూర్వార), రావి, మారేడు దళాలను ఉంచి, చుట్టూ తెల్లని దారంతో కడతారు. శుచి అయిన ప్రదేశాన్ని ఆవుపేడతో అలికి, ముగ్గుపెట్టి, దానిపైన ఈ పాలికలను ఉంచుతారు. తర్వాత, మంత్రాలు చదువుతూ, యజమాని ఆ పాలికలలో మట్టిని నింపుతారు. తర్వాత దొరికినంత వరకూ నువ్వులు, మినుములు వంటి ఏడు ఓషధులు (ఇవి గ్రామ్యాలు), వెదురుబియ్యం, నివ్వెరబియ్యం వంటి ఏడు ఓషధులు (ఇవి అరణ్యాలు)- వీటి అన్నింటినీ ఒక పాత్రలో పోసి, పాలతో తడిపి, ఓషధీసూక్తంతో అభిమంత్రిస్తారు. తర్వాత, ఈ ఓషధులను అయిదు పాలికలలో చల్లుతారు. పాలికలలో దేవతలను ఆహ్వానించి, పవమానసూక్తంతో నీళ్లు చల్లుతారు. తర్వాత, ఈ పాలికలను వివాహం అయ్యేంతవరకు భద్రపరచాలి. అంకురించిన ఓషధులకు శ్రద్ధగా నీరు పోస్తూ ఉండాలి.
*వధూగృహాగమనం :*
మరింత విద్యాభ్యాసానికై కాశీ వెళ్లాలని ఆశించిన వరుడు, ఆ ప్రయత్నం మానుకుని, వివాహానికి అంగీకారం తెలపటంతో కాశీయాత్ర వేడుక పూర్తి అవుతుంది. తర్వాత వరుడు మంగళస్నానం చేసి, నూతన వస్త్రధారణ చేసి, అలంకారాలు ధరించి, వధువు గృహానికి లేదా వివాహం జరిగే కల్యాణమండపానికి బయలుదేరుతాడు. ఈ సమయంలో శకునాలన్నీ మంగళప్రదంగానే ఉండాలని అనేక శకున మంత్రాలు పఠిస్తాడు.
*మధుపర్కం :*
అప్పటికి కన్యాదాత తమ గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణం పూర్తి చేసుకుని ఉంటారు. వధువు సైతం రక్షను ధరించి, గౌరీ పూజ చేసుకుని ఉంటుంది. ఈ సమయానికి వరుడు, వరుని బంధుమిత్రులు, కన్యాదాత గృహానికి చేరతారు. వధువు తండ్రి వరుడిని అన్వేషించటం లోకరీతి అయినా, వాస్తవానికి వధువును కోరడానికి వరుడు రావాలి. ఇలా తన కుమార్తెను కోరవచ్చిన వరుడిని వధువు తండ్రి సాదరంగా ఆహ్వానిస్తాడు. వరుడు కూర్చునేందుకు దర్భలతో కూడిన ఆసనం ఇస్తాడు. దానిపై వరుడు కూర్చున్న తర్వాత, అతని కుడికాలును, తర్వాత ఎడమకాలును కడుగుతాడు.
తనకన్నా వయసులో పెద్ద, కాబోయే మామగారు అయిన వధువు తండ్రి అలా చేయటం వల్ల వరుడి తేజం నష్టం అవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టుకోవడం కోసం వరుడు కొన్ని మంత్రాలు పఠిస్తాడు. తర్వాత, వధువు తండ్రి ఇచ్చే దధిమధుమిశ్రమాన్ని (తేనె, పెరుగు కలిపిన మిశ్రమం) మంత్రాలను చదువుతూ, స్వీకరిస్తాడు. ఈ *దధిమధు మిశ్రమాన్నే 'మధుపర్కం' అంటారు.*
*మహా సంకల్పం :*
మనం చేయబోయే ధర్మం ఏదైనా దాన్ని ఈశ్వరాజ్ఞగా భావిస్తూ పరమేశ్వరుని అనంతకాల స్వరూపాన్ని విస్మయావిష్టహృదయంతో గుర్తు చేసుకుంటూ, గోత్రనామాల్ని చెప్తూ, 'ఈ కర్మను నేను ఈశ్వరార్పణ బుద్దితో చేస్తున్నాను' అని సంకల్పిస్తాము. చేయబోయే ప్రతి పనికీ దైవానుగ్రహం ఉండాలని ఈశ్వరుడికి మన 'సంకల్పం' వివరించటమే ఇది.
కన్యాదానం వంటి ముఖ్య పుణ్యకార్యాలలో ఈ సంకల్పం నిత్యం చేసే సంకల్పం కన్నా పెద్దదిగా ఉంటుంది. దీన్నే 'మహా సంకల్పం' అంటారు.
వివాహ సమయంలో చెప్పే సంకల్పం సృష్టిక్రమవర్ణంతో ఆరంభం అవుతుంది.
'అస్య శ్రీమదాదినారాయణస్య ఆచింత్యాపరిమితశక్త్యా - ప్రకృతి మహదహంకార పృధివ్యప్తే జోవాయ్వాకాశాది..' అంటే, పరమేశ్వరుని అనంతర స్వరూపమైన భూమ్యాకాశ పర్యంతమైన విశ్వంలో ఒక చిన్న శకలమైన భూ ఖండంలో ఉన్న మనం మన సంకల్పాన్ని ఆ పరమ దైవం ముందు పెడుతున్నాం.
'సాలంకృత కన్యాదాన మహం కరిష్యే' అంటూ కన్యాదాత అనటంతో ఈ మహాసంకల్పం ముగుస్తుంది.
*గోత్రప్రవర :*
వివాహ వేడుకలో ఇదొక చక్కని ఘట్టం. వధూవరుల గురించి వారి పూర్వికుల ఘన చరిత్ర గురించి ఎలుగెత్తి చాటే సమయమిది. వధూవరుల నుంచి వెనుకకు మూడు తరాల గురించి వారి గోత్రనామాలు, వారి ఋషుల పేర్లు (ప్రవర) గట్టిగా చదివి వినిపిస్తారు. అలా చేయటం వల్ల వధూవరులలో 'ఇంత గొప్ప గోత్రంలో పుట్టాం. ఇందరు ఋషుల ఆశీస్సులను పొందగలుగుతున్నాం కనుక మనం ఈ మహాపురుషుల పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జీవించాలి' అన్న స్ఫూర్తి కలుగుతుంది.
*కన్యాదానం :*
కన్యాదానం అనేది ఒక గొప్ప అదృష్టం. మన ఇంటి అమ్మాయిని వేరొక ఇంటి వ్యాప్తికి పంపటం సామాన్యమైన విషయం కాదు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను నిస్వార్థంగా ఒక వరుడి చేతిలో పెట్టడానికి ఎంత ఔదార్యం కావాలి! ఆ వరునిపై ఎంత విశ్వాసం, ఎంత గౌరవం ఉండాలి!! అందుకే, దానాలన్నిటిలోకి కన్యాదానం బహు గొప్పదని అందరూ అంటారు.
నారికేళఫలపుష్పాక్షత హిరణ్య సహితమైన కన్య కుడి చేతిని ఆమె తల్లిదండ్రులు వరుని కుడిచేతిలో ఉదకపూర్వకంగా సమర్పిస్తారు. వరుడు తూర్పునకు, వధువు తండ్రి పశ్చిమానికి, తల్లి ఉత్తరానికి అనుకూలంగా కూర్చుని కన్యాదానం చేస్తారు. సాధారణంగా దానాన్ని ఇచ్చేటప్పడు 'తుభ్యమహం సంప్రదదేే న మమ' అంటారు. అంటే, 'ఇది నీకు ఇస్తున్నాను, ఇక నాకు దీనితో సంబంధం లేదు' అని అర్థం కానీ, కన్యాదాన సమయంలో మాత్రం వధువు తండ్రి 'తుభ్యమహం సంప్రదదే' అంటాడు. 'న మమ' (అంటే, 'ఇక నాకు సంబంధం లేదు) అని మాత్రం అనడు, అనకూడదు.
వరుడు కూడా ఆ దానం స్వీకరిస్తూ, కొన్ని ప్రతిగ్రహ మంత్రాలు చెప్తాడు. 'దేవస్య త్వా సవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి' అంటాడు. అంటే సూర్యభగవానుని అనుజ్ఞతో, అశ్వనీదేవతల బాహువులతో పూషన్ దేవత యొక్క హస్తాలతో స్వీకరిస్తున్నాను' అని అర్థం.
'స్వీకరిస్తున్నావు సరే, ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా!' అంటూ బాధ్యతను గుర్తు చేస్తూ వధువు తండ్రి 'ధర్మే చ అర్థే చ కామే చ నాతిచరితవ్యా' అంటాడు. అంటే 'ధర్మములో, అర్థములో, కామములో ఆమెతోనే కలిసి ఉండాలి. ఆమెను అతిక్రమించరాదు' అని అర్థం.
దీనికి సమ్మతిస్తూ వరుడు *'నాతి చరామి'* (అతిక్రమించను) అంటాడు. వధువు తండ్రి, వరుడు తమ తమ మాటలను మూడుసార్లు అంటారు.
*'త్రిషత్యా హి దేవాః' అని వేదవాక్యం.* అంటే ముమ్మారు అన్నది సత్యమని అర్థం. ఈ కారణంగానే మూడుసార్లు అనిపించటం!!
*సుముహూర్తం :*
వివాహానికి నిర్ణీతమైన ముహూర్తానికి ముందు పురోహితులు వివాహ మంగళ శ్లోకాలను చదువుతారు. వివిధ దేవతల ఆశీర్వాదాలు కాబోయే వధూవరుల మీద వర్షించాలనే ప్రార్థనలు ఇవి. దీని తర్వాత 'చూర్ణిక' అనే సంస్కృత గద్య పఠనం ఉంటుంది. ఇవి కూడా ప్రార్థనలే. తర్వాత సుమూహూర్తానికి ముందు *'సుముహూర్తో సావధాన* అంటూ అందరినీ సావధానులు కమ్మంటూ హెచ్చరికలు చేస్తారు. సుముహూర్త సమయంలో వధూవరులు తమ తమ శిరస్సులపై పరస్పరం జీలకర్ర, బెల్లములతో కలిపి చేసిన ముద్దను ఉంచుకుంటారు.
'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః, ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్' అంటూ పురోహితులు ఆశీర్వచనాలు పలుకుతారు.
*వధూసమీక్షణము :*
ఈ సమయంలో వధువును చూస్తూ, వరుడు కొన్ని మంత్రాలను పఠిస్తాడు. వధువు తనతో రావటం వల్ల వధువును తనకు ఇచ్చిన కుటుంబం పొందే వియోగం గురించిన ప్రస్తావన, దానికి ఓదార్పు వచనాలు ఈ మంత్రాలలో ఉంటాయి.
*వధువును అభిషేకించటం :*
దర్భలతో తయారు చేసి 'ఇణ్వము' అనే వలయాన్ని వధువు శిరస్సుపై ఉంచి, కాడి ఎడమ రంధ్రంలో బంగారం ఉంచి, ఆ రంధ్రం గుండా నీటిని వధువు తలపైన పడేలాగ వరుడు సమంత్రకంగా పోస్తాడు. ఈ విధంగా అభిషేకించడం వల్ల వధువు సూర్యునిలా నిత్యప్రకాశవంతం అవుతుందని భావన. దీనికి ఒక పురాణ గాధను ఆధారంగా చెప్తారు. ఈ అభిషేకం అయిన తర్వాత, వధువుపైన వరుడు ఒక నూతన వస్త్రాన్ని కప్పుతూ, ఒక మంత్రం పఠిస్తాడు.
*యోక్త్రబంధనం :*
వధువు నడుము చుట్టూ ఒక దర్భతాటిని గట్టిగా కట్టి, వరుడు ఒక మంత్రాన్ని పఠిస్తాడు. వివాహం ఒక శాశ్వత బంధం.
*మంగళ సూత్రధారణం :*
వివాహ సమయలో మరొక ముఖ్యఘట్టం - మంగళసూత్ర ధారణం. సమాజంలో స్త్రీకి సముచిత స్థానం ఇవ్వటానికీ, ఆమెకు వివాహం జరిగిందన్న దానికి సూచికగానూ మంగళ సూత్రం ఉపయుక్తంగా ఉంటోంది. ఈ సందర్భంగా, వివాహం అనేది వధూవరులైన స్త్రీ పురుషులు ఇద్దరికీ జరుగుతుండగా, కేవలం స్త్రీ మాత్రమే మంగళసూత్రం ధరించవలసిన అవసరం ఏమిటన్న వాదం ఉంది. నిజానికి వివాహ సమయంలో వరుడు కూడా తన బ్రహ్మచర్యం నాటి యజ్ఞోపవీతానికి అదనంగా మరొకటి, ఉపవస్త్రం స్థానే మరొకటి, మొత్తం ఉపవీతాలు మూడింటిని ధరిస్తాడు. కనుక ఈ విషయంలో స్త్రీపురుషుల వ్యత్యాసం ఏమీ లేదనే చెప్పాలి. మంగళసూత్రాన్ని వధువు మెడలో వేస్తున్నప్పుడు వరుడు సుప్రసిద్దమైన
*'మాంగల్యతంతునానేన మమ జీవనహేతునా,కంఠే బధ్నామి సుభగే* *త్వంజీవ శరదాం శతమ్'*
అనే శ్లోకాన్ని పఠిస్తాడు. అంటే 'నేను ఈ మంగళ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. ఇకపై నా జీవనం దీనిపైనే ఆధారపడి ఉంది. నీవు శతాయుర్దాయాన్ని పొందుము' అని అర్థం. మంగళసూత్రం వధువు సౌభాగ్యానికి హేతువు అని కూడా భావించడం కద్దు.
*అక్షతారోపణం :*
వివాహకార్యక్రమంలో ఈ ఆనంద వేడుకనే మనం 'తలంబ్రాలు', 'అక్షింతలు' అనీ అంటున్నాం. 'అక్షత' అంటే క్షతి లేనిదని, అంటే నాశనం లేనిదని అర్థం. 'అక్షతలు' అంటే అంతులేని శుభాలను కలుగజేసేవని అర్థం. తండులాలు (బియ్యం), ఘృతము (నెయ్యి), క్షీరము (పాలు) కలిపిన మంగళద్రవ్యాలను మనం 'అక్షతలు'గా భావిస్తున్నాం. వరుడు, వధువు చేతిలో కొద్దిగా పాలను రెండుసార్లు రాసి, తర్వాత రెండుసార్లు తండులాలను పోసి, మళ్లీ పాలతో రెండు సార్లు అభిఘారం చేస్తాడు. అప్పుడు వరుని చేతిలో కన్యాదాత లేదా పురోహితుడు అలాగే చేస్తాడు. అప్పుడు వధువు చేతులలో వరుని చేతులను ఉంచి వాటిలో కొంత బంగారం పెట్టి, ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉదకాన్ని పోస్తాడు.
'పుణ్యం వర్ధతాం.. శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, తిథికరణముహూర్తనక్షత్రసంపదస్తు' అంటూ మంత్రపఠనం చేస్తారు. మరికొన్ని మంత్రాల తర్వాత, వధూవరులు పరస్పరం అక్షతలను పోసుకుంటారు. వివాహమండపంలో ఇదొక సంబరం.
*మహదాశీర్వచనము:*
కొత్త దంపతులను వేద పండితులు ఆశీర్వదించడం ఇది. అనేక వేదోక్తమైన వచనాలతో నూతన వధూవరులు ఆశీర్వచనం అందుకుంటారు.
*ప్రధానహోమము :*
వధూవరుల వస్త్రాల కొంగులను సువర్ణ ఫల సహితంగా, అగ్నిని స్తుతించే మంత్ర సహితంగా ముడి వేస్తారు. దీనికి *'బ్రహ్మగ్రంధి'(బ్రహ్మముడి)* అని పేరు. తర్వాత, కొంగుముడులు వేసుకున్న కొత్త దంపతులు అగ్నిసాక్షిగా కొన్ని హోమాలు చేస్తారు. అగ్నిసాక్షిగా వివాహం అంటే ఇదే!ఇంత వరకూ 'ఎవరో' అయిన వధువు ఈ క్షణం నుంచి వరుని ఇల్లాలు అవుతుంది. ఇంత ప్రధానమైనది కాబట్టే దీనికి 'ప్రధాన హోమము' అని పేరు.
*పాణిగ్రహణము:*
వరుడు తన కుడి చేతితో వధువు చేతిని పట్టుకోవడమే 'పాణిగ్రహణము'.
'గృహ్ణామి తే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరదష్టిర్యథా సః భగో అర్యమా సవితా పురంధిర్మహ్యం త్వాదుర్గార్‌హపత్యాయ దేవాః'
అన్న మంత్రాన్ని పఠిస్తూ వరుడు 'నేను నీ చేతిని గ్రహిస్తున్నాను, ఇకపై నీ బాధ్యత నాది' అంటూ వధువుకు వాగ్దానం చేస్తాడు. 'చేతిలో చెయ్యేసి చెప్పడం' ఇదే!!
*సప్తపది :*
మాంగల్యధారణ జరిగిన తర్వాత, అగ్నిసాక్షిగా ఆ నూతన వధూవరులు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఏడడుగులు కలిసి నడుస్తారు. ఇదే 'సప్తపది'. అంటే ఏడు అడుగులు కలిసి నడవటం అన్నమాట. వాస్తవానికి ఈ సమయంలో వధువు నడుముపై వరుడు చెయ్యి వేసి, దగ్గరగా తీసుకుని, అగ్నిహోత్రానికి దక్షిణవైపున నిలబడి ఏడడుగులు నడవాలి. ఒక్కో అడుగుకు ఒక్కొక్క మంత్రాన్ని పురోహితులు చెప్తారు.
మొదటి అడుగుకు: 'ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు' అనేది మంత్రం. అంటే, 'ఈ తొలి అడుగుతో విష్ణువు మనలను ఒక్కటి చేయుగాక!' అని అర్థం.
రెండో అడుగుకు: 'ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు' అన్నది మంత్రం. అంటే, 'ఈ రెండవ అడుగుతో విష్ణువు మనకు శక్తిని కలుగజేయుగాక!' అని అర్థం.
మూడవ అడుగు మంత్రం: 'త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు' అంటే, 'ఈ మూడవ అడుగుతో వివాహవ్రత సిద్ధికి విష్ణువు మనలను కరుణించుగాక!' అని అర్థం.
నాలుగో అడుగుకు మంత్రం: 'చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు'. అంటే, 'ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందం కలుగజేయుగాక' అని అర్థం.
ఐదవ అడుగుకు 'పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు' అనేది మంత్రం. అంటే 'ఈ ఐదవ అడుగుతో మనకు పశుసంపదను విష్ణువు కలిగించుగాక!' అని అర్థం.
ఆరవ అడుగుకు 'షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు' అన్న మంత్రపఠనం జరుగుతుంది. అంటే 'ఈ ఆరవ అడుగుతో మనకు ఆరు ఋతువులూ సుఖమునే కలిగించుగాక!' అని అర్థం.
ఏడవ అడుగుతో 'సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు' అన్న మంత్రం చదువుతారు. అంటే 'ఈ ఏడవ అడుగుతో గృహస్థాశ్రమ ధర్మనిర్వహణను మనకు విష్ణువు అనుగ్రహించుగాక' అని అర్థం.
అదే సమయంలో వరుడు 'సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదాబభూవ! సఖ్యం తే గమేయగ్‌ం సఖ్యాత్! తేమాయోషం సఖ్యాన్మే మాయోష్ఠాగ్‌ం సమాయవః సంప్రియౌ రోచిష్ణూ సుమన స్యమానౌ, ఇష మూర్జమభినంవసానౌ నం నౌమనాగ్‌ంసి సంవ్రతా సమచిత్తన్యాకరమ్' అంటాడు. అంటే, 'ఏడడుగులతో నాకు మిత్రమైన ఓ సఖీ! నీవు నా స్నేహాన్ని వీడకు, మంచి ప్రేమగలవారమై, మంచి మనసుతో కలిసి జీవిద్దాం, సమాలోచనలతో ఒకే అభిప్రాయంతో కలిసి ఉందాం!' అంటాడు.
దానికి జవాబుగా ఆ వధువు
'పాత్వమసి అమూహం! అమూహమస్మి! సా త్వం ద్వౌ, అహం పృథివీ! త్వం రేతో అహం రేతోభృత్! త్వం మనో అహమస్మి వాక్! సామాహమస్మి, ఋక్తం సా మాం అనువ్రతాభవ!'
అంటుంది. అంటే 'ఓ మిత్రమా! నీవు ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండు. నేను కూడా ఏ తప్పులూ చేయను! నీవు ఆకాశమైతే నేను భూమిలా కలిసి ఉందాం. నీవు శుక్రమైతే నేను శ్రోణితాన్ని! నీవు మనసైతే నేను వాక్కును! నేను సామ(వేదగాన)మైతే నీవు ఋక్కువై కలిసి ఉందాం!!' అని అర్థం.
అప్పుడు వరుడు, వధువును ఇలా వేడుకుంటాడు:
'పుంసే త్రాయ వేత్తవేశ్రియై ఉత్తరయ వేత్తావయేహి సూనృతే!' అంటాడు. అంటే 'మన వంశాభివృద్ధి కోసం, ఉత్తరకాలంలో ఉత్తమ లోకాల ప్రాప్తి కోసం, ధైర్యవంతుడైన, సత్యవాక్ పరిపాలకుడైన వంశాభివృద్ధి చేయగల పుత్రులను నాకు ప్రసాదించు!' అని అర్థం.
వివాహ మహోత్సవంలో ఇదొక అద్భుత ఘట్టం. ఈ ఘట్టంతో వధువు గోత్రం మారుతుంది. ఆమె వరుని సతీమణి అయి, అతని గోత్రవతి అవుతుంది.
*అశ్మారోహణము :*
అగ్నికి ఉత్తరంగా సన్నికల్లు మీద వధువు కుడికాలును ఉంచి, వరుడు ఒక మంత్రం పఠిస్తాడు. భార్యభర్తల మధ్య బంధం శిలాసదృశమని దీని సూచన. ఒకప్పుడు సన్నికల్లుకు ఇంట్లో ఎంతో ప్రాముఖ్యం ఉండేది. ఇంటిలోనివారికి కావాల్సిన ధాన్యాన్ని దంచటం అంటే, ఇంటిలోని వారందరి యోగక్షేమాలు చూడటమన్నమాట. అది గృహాధిపత్యానికి సూచన. వధువు తన కుడికాలును అంత శక్తిమంతమైన సన్నికల్లు మీద ఉంచిందీ అంటే, గృహాధిపత్యం తనదేనని చెప్పటం అనుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోని వారికోసం బియ్యం దంచటమనే ప్రసక్తి లేకపోయినా, ఆ అధికార గ్రహణ సూచనలు కొనసాగుతూనే వస్తున్నాయి.
*లాజహోమము :*
'లాజలు' అంటే పేలాలు. వధువు చేతిలో ఆమె సోదరుడు పేలాలను పోసి, వాటిని నెయ్యితో అభిఘరించి, వాటితో మంత్రపూర్వకంగా వరుడు వామపార్శ్వహోమం చేయిస్తాడు. తర్వాత, వధూవరులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
*యోక్త్ర విమోచనము :*
యోక్త్రబంధన సమయంలో వధువు నడుము చుట్టూ కట్టిన బంధాన్ని వరుడు సమంత్రకంగా విప్పటమే ఈ సంస్కారం.
*వధువు వరుని ఇంటికి వెళ్లటం :*
వివాహానంతరం వధువు, వరుని ఇంటికి వెళ్లటం ఆనవాయితీ. ఈ సమయంలో వరుడు ఆమెను తన (తమ) ఇంటికి తీసుకు వెడుతూ కొన్ని మంత్రాలు పఠిస్తాడు. వాటిలో ఒక మంత్రంలో 'మూర్ధానాం పత్యురారోహ' అంటాడు. అంటే 'నీవు నా శిరసును అధిష్టించుము' అని అర్థం. అంటే, 'ఇకపై నా మీద అన్ని అధికారాలూ నీవే!'నని చెప్పటమన్నమాట. అలాగే, ఇంటిలో ఉండే అత్తామామలు, ఆడబడుచులు, మరుదుల మీద నీదే అధికారమని అనేక మంత్రాలలో చెప్తాడు. వరుని ఇంటికి వెళ్లే మార్గాన్ని ఇలా అధిగమించాక, వరుని ఇంటి వద్దకు వచ్చిన ఆమెకు స్వాగతం పలుకుతూ మరికొన్ని మంత్రాల పఠనం జరుగుతుంది. అయితే, *ఇప్పుడు సమయాభావం చేత, కాకుంటే వరుని గృహం దూరం, పోయి రావటం భారం కావటంతో, ఈ వేడుకలన్నీ క్షణాల మీద పెళ్లి పందిట్లోనే జరిగిపోతున్నాయి.*
*ప్రవేశ హోమము :*
గృహప్రవేశం అనంతరం, వధూవరులు సంకల్పం చేసుకుని, వైవాహికాగ్నిని ప్రతిష్ఠించి, ప్రవేశహోమాన్ని నిర్వహిస్తారు. తన ఇంటికి వచ్చిన నూతన వధువుకు స్వాగతం చెప్తూ, ఇంటి బాధ్యతలను అప్పగిస్తూ, వరుడు పలు మంత్రాలు చదువుతాడు. అలాగే, తమ బంధుమిత్రులందర్నీ తమకు ఆశీస్సులు అందజేయమని కోరతాడు.
*నక్షత్ర దర్శనము :*
సాయంత్రం నక్షత్రోదయం అయ్యాక, పురోహితులు నూతన వధూవరులకు నక్షత్ర దర్శనం చేయిస్తారు. తూర్పు లేదా ఉత్తర దిక్కుకు కొంత దూరం నడిచిన పిమ్మట, ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ, వరుడు ఆ నక్షత్రంనుంచి ఆశీస్సులు కోరతాడు. ఆకాశంలో స్థిరమైన ధ్రువ నక్షత్రం లాగానే తమ దాంపత్యం సుస్థిరంగా ఉండాలనే ఆకాంక్షను ఆ దంపతులు వ్యక్తం చేస్తారు. ధ్రువమండలంలోని పరబ్రహ్మను ఉపాసించటం వల్ల అపమృత్యుభయం తొలగిపోతుందనీ, సమస్త సంపదలు లభిస్తాయని విశ్వాసం. ఆ తర్వాత, పురోహితులు ఆ నవ దంపతులకు సప్తర్షి మండలాన్ని, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. ఏడుగురు మహాఋషుల తర్వాత స్థానం పొందాలని వరునికీ, సప్తర్షు భార్యలలో ఏడవది అయిన అరుంధతి తర్వాత స్థానం పొందాలని వధువుకు సూచించడం ఇది. ఇదే సమయంలో వధూవరులు ఆ నక్షత్రాలకు అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో పఠించే మంత్రం ఇది:
'సప్త ఋషయా ప్రథమం కృత్తికానాం - అరుంధతీం యద్ ధ్రువత్వం హనిన్యుః
షట్ కృత్తికా ముఖ్యయోగం వహన్తి ఇయమ్ - అస్మాకం ఇధతు అష్టమి'
'సప్తర్షులను, కృత్తికలలో మొదటిదైన అరుంధతిని ప్రార్థిస్తున్న ఈ వధూవరులకు నిత్యత్వం లభించుగాక. ఈ వధువుకు అరుంధతి తోడుగా గల ఇతర ఆరుగురు పతివ్రతల (సప్తర్షుల సతీమణుల) తర్వాత ఎనిమిదవ స్థానం లభించుగాక!' అని అర్థం.
*ఆగ్నేయ స్థాలీపాకము :*
దీన్నే మనం సంక్షిప్తంగా 'స్థాలీపాకం' అంటున్నాం. అగ్నిని ఉపాసించి, జీవనానికి శ్రీకారం చుట్టాలని చేసే కర్మనే 'ఆగ్నేయ స్థాలీపాకం' అంటారు.
వధువు ఒక గిన్నెలో బియ్యం పోసి, నీళ్లు పోసి, అగ్నిహోత్రంలో వండి హోమం కోసం సిద్ధం చేస్తుంది. ఈ హోమద్రవ్యాన్ని 'చరువు' అంటారు. దీన్ని కొద్దికొద్దిగా చేతితో హోమసాధనమైన దర్విలోకి తీసుకుని, ఆజ్యంతో అభిఘారం చేసి రెండుసార్లు వరుడు సమత్రంకంగా హోమంలో వేస్తాడు. చరువు చేయటంతో భార్య తన విధిని నిర్వహిస్తూ, భర్తకు తోడ్పడుతూ ఉంటుంది. హోమం చేయగా మిగిలిన చరువును వధూవరులు యజ్ఞప్రసాదంగా స్వీకరిస్తారు.
*శేషహోమము :*
వివాహంలో ఇదే చివరి హోమం. ఇందుకే దీనికి 'శేష హోమము' అని పేరు. ఈ హోమ సమయంలో వరుడు అగ్నితో బాటు వాయువు, ఆదిత్యుడు, ప్రజాపతులతోబాటు ద్వాదశమాసాధిపతులనూ ప్రార్థిస్తూ, హోమం చేస్తాడు. ఈ హోమ సమయంలో వధువు, వరుడిని వీక్షిస్తుంది.
*నాకబలి :*
దీన్ని ఇప్పుడు 'నాగవల్లి' అనటం జరుగుతోంది. వాస్తవానికి అది 'నాకబలి' మాత్రమే! దేవతలకు చేసే పూజను 'నాకబలి' అంటారు. ఇంటి మధ్యలో చతురస్రాకారంలో మట్టిని అలికి, అయిదు రకాల రంగులతో, పిండితో పద్మాకారాన్ని చిత్రిస్తారు. ఉత్తర దక్షిణ దిక్కులలో రెండు ఏనుగుల బొమ్మలను చిత్రించి, పద్మ మధ్యంలో గౌరీదేవి బొమ్మను ప్రతిష్ఠిస్తారు తూర్పున రెండు కలశాలను, నాలుగు దిక్కులలో మట్టితో చేసిన 33 నాకబలి పాత్రలను ఉంచుతారు. చుట్టూ దారం కట్టి, పుష్పాక్షతలతో అలంకరిస్తారు. ఇద్దరు ముతైదువలు పళ్లాలలో 33 దీపాల్ని పట్టుకుంటారు. ఈ 33 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉందని కొందరి భావన. 27 నక్షత్రాలు, త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు) ముగ్గురు, వారి సతీమణులు (సరస్వతి, లక్ష్మి, పార్వతి) ముగ్గురు- మొత్తం కలిసి 33.
వీరందరినీ ఉపాసించటం కోసమే ఈ 33 పాత్రలు, 33 దీపాలు. దీపాలను వెలిగించి తెచ్చిన ముత్తయిదువులతో కలిసి, వరుడు- అతని చేయి పట్టుకుని వధువు, పురోహితుడితో సహా అందరూ కలిసి ఆ అలంకృత ప్రదేశం చుటూముమ్మారు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో 'మమాగ్నేవర్చః' అన్న మంత్రాలను పఠిస్తారు. చుట్టూ దీపాల్ని అలంకరిస్తారు. నాకదేవతలకు 33 అన్నకబళాలను నైవేద్యంగా పెడతారు. తర్వాత, పడమర దిక్కులోని దారాన్ని చాకుతో తెంచి, లోపలకు ప్రవేశించి, గౌరీదేవిని, ఇంద్రాణీ దేవిని షోడశోపచారాలతో వధూవరులు పూజిస్తారు. వరుడు, వధువు కంఠంలో నీలమణి సూత్రం(నల్లపూసల) గొలుసును అలంకరిస్తాడు. అప్పుడు వరుడు 'నేను నీ పట్ల ప్రేమానురాగాలతో ఉండగలనని' చెప్పే ఒక మంత్రాన్ని పఠిస్తాడు.
నాకబలి సందర్భంలోనే వరుడు, వధువు కాళ్లకు మట్టెలు పెట్టటం ఉంది. వధువు సన్నికల్లుమీద తన కాలును ఉంచుతుంది. అప్పుడు వరుడు, ఆమెకు కాలివేళ్లలో బొటనవేళ్ల తర్వాత ఉండే రెండో వేలుకు మట్టెలు తొడుగుతాడు.
కాలి రెండో వేలుకు మట్టెలు వేయటం వెనుక ఒక శాస్త్రీయమైన కారణం 'ఆక్యుప్రెషర్' వైద్యవిధానం ప్రకారం కాలి రెండో వేలు దగ్గర ఉండే నరం, వధువు ఉదరభాగానికి సంబంధించినదనీ, అక్కడ ఒత్తిడిని కలిగిస్తే, వధువు గర్భసంచికి మేలు కలుగుతుందనీ అంటారు.
*సన్నికల్లు* అనేది మన నూరుడు బల్లలాగ ఉంటుంది. 'కల్' అనేది ప్రస్తుతం తమిళపదం అయినా, గతంలో మనకూ ఆ పదం ఉండేది. 'ఓరుగల్లు' (ఒకే రాయి, ఏక శిల), 'ఉర్వకల్లు' (ఒకే రాయి) అన్న పేర్లు దీనికి సాక్షి. ఈ పదానికి రాయి అన్న అర్థం ఉంది.
ఏవిధంగా అయితే రాయి ఎండకూ వానకూ కూడా ప్రతిస్పందించదో, అలాగే నేనుకూడా సుఖదుఃఖాలకు ప్రతిస్పందించను అన్న భావాన్ని వధువు వ్యక్తం చేయటమే సన్నికల్లును తొక్కటం అంటారు.
అలాగే, ఉత్తమ పతివ్రతగా అరుంధతిని చూడటమూ ఉంది. అరుంధతీ నక్షత్ర దర్శనం వెనుక ఉన్న కథా ఇదే!!
వివాహ సంస్కారంలో ప్రధానమైన ఘట్టాలు ఇవే అయినా, దేశాచారాలను బట్టి, దంపతి పూజ, అప్పగింతలు వంటి ఇతర వేడుకలు ఉంటాయి.
వివాహ బంధం విశిష్టతను వివరించే ఒక శ్లోకం మహాభారతంలోని అష్టక-యయాతి సంవాదంలో ఉంది. దీన్ని 'గృహోపనిషత్' అంటారు. ఆ శ్లోకం ఇది:
'ధర్మాగతం ప్రాప్యధనం యజేత
దద్యాత్సదైవాతిధీన్ భోజయేచ్ఛ
అనాధదానశ్చ పరైరదత్తం
సైషాగృహస్థోపనిషత్ పురాణీ!!'
అంటే, 'ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి. సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి. ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు. ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు. ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి.' అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్ ఇదే!
ఒక మనిషి జీవితంలో వివాహ సంస్కారానికి గల ప్రాముఖ్యం అంత గొప్పది! ఈ గొప్పదనమే ఈ వివాహ వ్యవస్థను హైందవ జీవనంలో సుస్థిరం చేసింది, తరతరాలకు మార్గదర్శనం చేస్తోంది.